ఏపీ సీఎం, మంత్రుల కోసం టీడీపీ సీనియర్ నేత పూజలు..
posted on Jun 15, 2021 @ 7:37PM
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య వార్ సాగుతోంది. ప్రతి విషయంలోనూ ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల కాలంలో రెండు పార్టీల మధ్య వార్ తారా స్థాయిలో జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఏపీ ముఖ్యమంత్రితో పాటు మంత్రుల కోసం ఓ టీడీపీ సీనియర్ నేత పూజలు చేశారు.. అవును మీరు చదివింది నిజమే... ఏపీ ముఖ్యమంత్రితో పాటు మంత్రుల కోసం కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు.. పైడి తల్లి అమ్మవారికి పూజలు చేశారు.
అయితే అశోక గజపతి రాజు పూజలు చేసింది వాళ్లకు మంచి ప్రసాదించాలని. సీఎం జగన్ తో సహా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు జ్ఞానం ప్రసాదించాలని.. అప్పుడే ప్రజలందరికీ మంచి జరుగుతుంది అంటూ పైడితల్లి అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు అశోక్ గజపతి రాజు.విజయనగరంలోని పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న ఆయన.. వైసీపీ నేతల గురించి మొక్కుకున్నారు. మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం ఛైర్‌పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదంటూ సోమవారం హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అలాగే అశోక్ గజపతి రాజును తిరిగి చైర్మన్ గా నియమించాలని స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన అశోక గజపతి రాజు.. ఆలయానికి వెళ్లి పైడి తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్నో అలజడులు సృష్టించారని.. తనపై కక్ష గట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం గోశాలలో గోవులను హింసించి చంపేయడం తీవ్రంగా కలచివేసిందన్నారు. మాన్సాస్ సంస్థను అనేక రకాలుగా నష్టపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రస్టు ఆధ్వర్యంలోని 105 ఆలయాల్లో ఏమేం జరిగాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు గజపతి రాజు.
గతంలో రామతీర్థం, పైడితల్లి అమ్మవారు దేవ స్థానం అనువంశక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును జగన్ప్ర భుత్వం తప్పించింది. రామతీర్థం కొండపైనున్న విగ్రహాల ధ్వంసం సందర్భంలో గొడవలను బూచిగా చూపి ఆయనపై వేటు వేసింది. ఆ జీఓను సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు కోర్టుకు వెళ్లారు. కొద్ది నెలల్లోనే జీఓను కోర్టు కొట్టి వేసింది. తిరిగి అశోక్ గజపతిరాజునే అనువంశక ధర్మకర్తగా నియమించాలని ఆదేశించింది. ఇపుడు సింహాచల దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు వంతు వచ్చింది. గతేడాది మార్చి5 ముందురోజు రాత్రి విడుదలైన జీఓను హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అశోక్ గజపతిరాజునే చైర్మన్‌గా కొనసాగించాలని సూచించింది.