వివేకా కుటుంబ సభ్యులకు బెదిరింపులు? భద్రత కల్పించాలన్న సునీతా రెడ్డి...
posted on Jun 16, 2021 @ 9:39AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. హత్య కేసుపై విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు... గత వారం రోజులుగా పులివెందులలోనే ఉన్నారు. పలువురిని ప్రశ్నించారు. అనుమానాస్పదంగా ఉన్న కాన్వాయ్ పై సీబీఐ ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. సీబీఐ విచారణ సాగుతున్న సమయంలోనే వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
తన తండ్రి హత్య కేసులో నిందితులు ఎవరో తేల్చాలని పోరాడుతున్న తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ ఆరోపించారు వైఎస్ సునీతా రెడ్డి. తాజాగా ఆమె కడప జిల్లా ఎస్పీని కలిశారు. పులివెందులలో తనకు భద్రత కల్పించాలని కోరారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ముప్పు ఉందని భావిస్తున్నామని పోలీసులకు తెలిపారు. తన ఇంటి వద్ద భద్రత ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ కేసు దర్యాప్తు నేపథ్యంలో ఆమె ఈ వినతి చేశారు. సునీతా ఎస్పీని కలిసి భద్రత కోరడంతో.. సొంత కుటుంబ సభ్యులకు భద్రత లేకుంటే ఏపీ లో పరిస్థితి ఏంటో జగనే చెప్పాలనే వాదన వస్తోంది.
2019 మార్చి 15న వివేకాను పులివెందులలోని ఆయన నివాసంలోనే కిరాతకంగా హత్య చేశారు. సీఎంగా ఉన్న వ్యక్తి బాబాయ్ హత్య కేసులో నిందితులు ఎవరో ఏండ్లు గడుస్తున్నా తేలకపోవడం మిస్టరీగా మారింది. వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా కేసును సీబీఐకి అప్పగించాలని కోరి, ఎన్నికల అనంతరం సీబీఐకి ఇవ్వద్దు అని పిటిషను ఉపసంహరించుకోవడంతో అసలు ఈ హత్యపై అప్పటి నుంచి ప్రజలకు అనుమానాలు బలపడ్డాయి. ఆ తర్వాత కూతురు సీబీఐకి ఇవ్వాలని కోరడం, అనుమానితుల పేర్లు బయటపెట్టడం సంచలనమైంది. తన తండ్రి హత్యపై న్యాయం కావాలని, హంతకులను త్వరగా పట్టుకోవాలని వివేకా కూతరు డాక్టరు సునీత పోరాడుతున్నారు.