30 మంది ఎమ్మెల్యేలు జంప్?
posted on Jun 15, 2021 @ 9:10PM
కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే.. దేశంలో రాజకీయ వేడి కూడా అదే స్థాయిలో ఉంటోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత... దేశ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరుగుతున్నాయి. రాజకీయ నేతల వలసలు ఊపందుకున్నాయి. ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఉంది. యూపీ కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద కమలం గూటికి చేరడం సంచలనమైంది. తెలంగాణలోనూ కేసీఆర్ కేబినెట్ లో సీనియర్ అయిన ఈటల రాజేందర్ కాషాయ కండువా కప్పుకోవడం కీలకమైంది.
పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి జంప్ అయిన నాయకులు ఇప్పుడు తిరిగి టీఎంసీ తీర్థం తీసుకోవడానికి క్యూ కడుతున్నారు. మమతతో విభేదించి బీజేపీ లో చేరిన సీనియర్ నేత ముకుల్ రాయ్ ... తిరిగి సొంత గూటికి చేరారు. తాజాగా బెంగాల్ లో 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీ వైపు చూస్తున్నారనే వార్తలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, ఎప్పుడైనా వాళ్లు దీదీని కలిసే ఛాన్స్ ఉందని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు శుభేందు అధికారి బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ జగదీప్ ధంఖర్ ను కలిశారు. అయితే గవర్నర్ భేటీరి 24 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో జంపింగ్ వార్తలకు బలం చేకూరుతోంది. గవర్నర్ సమావేశానికి హాజరుకాని ఎమ్మెల్యేలంతా తృణమూల్ లో చేరవచ్చనే చర్చ జరుగుతోంది.
బీజేపీ నుంచి వలసలు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే మొదలయ్యాయి. సుబేంగు నాయకత్వంలో పనిచేసేందుకు చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. పార్టీ ఎంపీ శంతనుడు ఠాకూర్, ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఏర్పాటు చేసిన సమావేశంలో హాజరు కాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బెంగాల్‌లో సిఎఎ చట్టాన్ని అమలు చేయాలన్న బీజేపీ వైఖరిపై ఎంపి శాంతను ఠాకూర్ అసంతృప్తితో ఉన్నారు. వీరితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు బిస్వాజిత్ దాస్, అశోక్ కీర్తానియా , సుబ్రతా ఠాకూర్ కూడా ఎంపి శాంతను ఠాకూర్ తో పాటు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపధ్యంలో వీళ్లు కూడా టీఎంసీ గూటికి చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది.
గత ఏప్రిల్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లోని 294 సీట్లలో 213 టీఎంసీ గెలిచింది. 77 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు 50 మందికి పైగా తృణమూల్ నాయకులు బిజెపిలో చేరారు. అందులో 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడా నాయకులంతా సొంత గూటికి రావాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనాలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.