జులైలో ఫిక్స్!.. పరీక్షలకు పరీక్షాసమయం.. ప్రాణాలతో చెలగాటం!
posted on Jun 15, 2021 @ 6:43PM
మే.. జూన్.. జులై.. నెలలు అయితే వెనక్కి జరుపుతున్నారు కానీ.. పరీక్షల విషయంలో వెనకడుగు మాత్రం వేసేది లేదంటోంది జగన్‌రెడ్డి సర్కారు. ఎవరెంత మొత్తుకున్నా.. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా.. ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉన్నా.. పరీక్షల విషయంలో తగ్గేదే లే అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో జులై నెలలో పది, ఇంటర్ ఎగ్జామ్స్ జరిపి తీరుతామని ప్రకటించేస్తున్నారు.
కేంద్రం ప్రభుత్వం పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసింది. తెలంగాణ సైతం క్యాన్సిల్ అనేసింది. అనేక రాష్ట్రాలు సైతం నో ఎగ్జామ్స్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేశాయి. ఒక్క ఏపీ మాత్రమే ఎగ్జామ్స్ విషయంలో మొండిపట్టుదలకు పోతోంది. నారా లోకేశ్ మీద కోపమో.. లేక విద్యార్థులంటే చిన్నచూపో.. కారణం ఏదైనా కానీ, విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు జరిపి తీరుతామని ప్రకటిస్తోంది. ఆ విద్యార్థులే తమకు ఎగ్జామ్స్ వద్దు బాబోయ్ అంటున్నా.. పిల్లల భవిష్యత్ కాంక్షించే పేరెంట్స్ భయపడుతున్నా.. ఏపీ సర్కారు మాత్రం ఎగ్జామ్స్ నిర్వహించే నెలలను మారుస్తుందే కానీ, మనసు మాత్రం మార్చుకోవడం లేదు.
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జులైలో పరీక్షలు నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. వచ్చేనెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. జులై చివరి వారంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. సీఎం జగన్‌తో చర్చించి పరీక్షల ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే పరీక్షలు నిర్వహణ అని తెలిపారు.
ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారు. పరీక్షల నిర్వహణకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటించాలి. ఈ నెల 20 వరకూ కర్ఫ్యూ ఉంది. ఆ తర్వాత వైద్యశాఖ అధికారుల సూచనలతో పరీక్షల సమయాన్ని ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జులైలో ఇంటర్ పరీక్షలు పూర్త చేసి.. ఆగస్టులో ఇంజినీరింగ్, ఫార్మసీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ఏపీ సర్కారు. మరి, ఎగ్జామ్స్ సందర్బంగా విద్యార్థులు కరోనా బారిన పడితే ఎవరు బాధ్యులు అనే ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.