పెద్దిరెడ్డి పయనమెటు?
posted on Jun 15, 2021 @ 5:15PM
ఎన్ని పార్టీలు మారినా, తెలుగు దేశం నేతగానే గుర్తుండిపోయే, ప్రస్తుత బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదుపరి పయనం ఎటు, అన్నది ఇప్పుడు, రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా హుజురాబాద్’ అసెంబ్లీ నియోజక వర్గంలో చర్చనీయాంశంగా మారింది.పెద్దిరెడ్డి ఎప్పటి నుంచో హుజురాబాద్ సీటు మీద కన్నేసి ఉంచారు. అయితే, అనూహ్య రాజకీయ పరిణామాల నేపధ్యంలో, ఆ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్, తెరాసకు, శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో, పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్, ‘ఎదర బతుకంతా చిందరవందర’ అన్నట్లుగా మారింది.ఏమి చేయడమో పాలుపోక కావచ్చు.
ఈటల బీజేపీ ఎంట్రీని పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా నేతలను సంప్రదించకుండా, రాష్ట్ర నాయకత్వం, ఈటలను ఎలా పార్టీలో చేర్చుకుంటుందని గర్జించారు.అలాగే, భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కుంటున్న, మాజీ మంత్రిని పార్టీలోకి తీసుకుని ఎలాంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని పార్టీ పెద్దలను నిలదీసినంత పనిచేశారు. ఆ విధంగా పెద్దిరెడ్డి ఆదిలోనే ఈటల ఎంట్రీని అడ్డుకునే గట్టి ప్రయత్నం చేశారు. అయితే, అయన ఆవేదన, ఆక్రందనలను పార్టీ అస్సలు పట్టించుకోలేదు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేదా ఇతర రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ, ఆయన వ్యాఖ్యలను పట్టించుకోలేదు. ఎవరూ రియాక్ట్ కాలేదు.
అదలా ఉంటే, ఇక అక్కడి నుంచి మౌనంగా ఉండిపోయిన పెద్దిరెడ్డి మళ్ళీ తెరమీదకు వస్తున్నారు. ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లి కలువ పూల కాషాయ కండువా కప్పుకుని వచ్చిన నేపధ్యంలో, పెద్ది రెడ్డి బుధవారం హుజురాబాద్ వెళుతున్నారు. కార్యకర్తలతో సమావేసమవుతున్నారు. పార్టీ మారే ముందు సహజంగా నాయకులు వేసే మొదటి అడుగు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం. కార్యకర్తల మనోభావాలను తెలుసు కోవడం... ఆ తర్వాత కార్యకర్తల బుజాల మీద తుపాకీ తమ మనోగతాన్ని బయట పెట్టడం ... ఆ తర్వాత కథ అందరికీ తెలిసింది. నిన్నగాక మొన్న ఈటల రాజేందర్ చేసిందీ ఇదే .. రేపు పెద్ది రెడ్డి .. మరో రావు చేసేది కూడా అదే.
ఈటల బీజేపీలో చేరడంతో, ఇక పెద్ది రెడ్డి హుజురాబాద్ మీద పెట్టుకున్న ఆశలను వదులుకోక తప్పదు. ఒక వేళ రేపటి ఉపఎన్నికల్లో ఏ కారణం చేతనైనా ఈటల పోటీ చేయక పోయినా, వారి శ్రీమతి జమున రెడీగా ఉన్నారు. అంతే కాకుండా,బీజేపీలో చేరిన సందర్భంగా సోమవరం ఢిల్లీలో, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఈటల, “ హుజురాబాద్’ ఉప ఎన్నికలో పోటీ చేస్తాం ... గెలుస్తాం” అని బల్ల గుద్దారు. సరే, గెలుస్తారా లేదా అన్నది పక్కన పెడితే, నియోజక వర్గాన్ని వదులుకునే ప్రశ్నే లేదన్న విషయం అయితే ఈటల మరోమారు స్పష్టం చేశారు. సో.. పెద్ది రెడ్డికి హుజురాబాద్ బీజేపీ తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయి.. ఇక ప్రత్యాన్మాయం చూసుకోవడం ఒక్కటే, ఆయన ముందున్న మార్గం. తెరాసలో ‘నో వేకెన్సీ’ , కేసీఆర్ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణకు ఆహ్వానం పంపారు కానీ, పెద్ది రెడ్డిని పట్టించుకోలేదు. కాంగ్రెస్’లోనూ అదే పరిస్థితి. గత ఎన్నికల్లో ఈటల పై పోటీచేసిన కౌశిక్ రెడ్డి, ప్రస్తుతానికి అయితే పార్టీలోనే ఉన్నారు. అంతే కాదు, ఆయన పార్టీ మారుతున్నట్లు,అధికార తెరాసలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు.
గత ఎన్నికల్లో స్ట్రెయిట్ ఫైట్ లో 60 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున కౌశిక్ రెడ్డి, ఈసారి ముక్కోణపు పోటీలో విజయం సాధించే అవకాశలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో ఆయన కారెక్కుతారా లేదా అనేది ఇప్పుడే తేలే విషయం కాదు. అప్పటివరకు అయితే, కాంగ్రెస్ పార్టీలో కూడా, ‘నో వేకెన్సీ’నే..పెద్ది రెడ్డి గతంలో ఆ పార్టీ ఈ పార్టీ తరిగి చివరకు సొంత గూటికి (టీడీపీ) చేరారు. మళ్ళీ మరో సారి .. ట్రస్ట్ భవన్ మెట్లు ఎక్కుతారా... లేక ఉన్న చోటనే ఉంది పోతారా .. ..లేక ...ఇంకా ... ఏదైనా నిర్ణయం తీసుకుంటారా, తెలియాలంటే మరి కొన్ని గంటలు అగవల్సిందే..