కేసీఆర్, ఈటల ఒకటేనా! రాజకీయ డ్రామా చేస్తున్నారా?
posted on Jun 16, 2021 @ 2:29PM
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రంగానే తెలంగాణ రాజకీయాలు సాగుతున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల ఏం చేస్తారన్నది జనాలు ఆసక్తిగా గమనించారు. కేసీఆర్ టార్గెట్ గా తెలంగాణ ఉద్యమకారులందరిని రాజేందర్ ఏకం చేస్తారని ఎక్కువ మంది భావించారు. కొత్త పార్టీ దిశగానే ఈటల కూడా సంకేతాలిచ్చారు. కాని చివరికి ఆయన సొంత దుకాణం తన వల్ల కాదంటూ కమలం గూటికి చేరారు. ఈటల బీజేపీలో చేరడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కమ్యూనిస్టు భావజాలంతో ఎదిగిన ఈటల రాజేందర్... రైటిస్ట్ పార్టీలో చేరడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనపై పలు సంఘాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి.
తాజాగా ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై మావోయిస్టు పార్టీ కూడా స్పందించింది. ఈటలకు సంబంధించి తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఘాటు లేఖ విడుదల చేశారు. ఈటల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను తెలంగాణ మావోయిస్టు పార్టీ ఖండించింది. ఈటల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ చేసిన ప్రకటనను జగన్ తప్పుబట్టారు. కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని ఈటల ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన అనంతరం హిందూత్వ పార్టీ అయినా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని జగన్ విమర్శించారు. ఇది సీఎం కేసీఆర్‌కు ఈటలకు మధ్య జరుగుతున్న పోరాటమని.. దీనితో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదన్నారు.
కేసీఆర్, ఈటల ఒకే గూటి పక్షులని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్, ఈటల రాజేందర్ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారన్నారు. వీరి పాలన ప్రజా వ్యతిరేకమైనదన్నారు. మొన్నటి వరకూ కేసీఆర్ పక్కనే ఉండి అధికారాన్ని అనుభవించిన ఈటల తన ఆస్తుల పెంపుదలకు యత్నించారని జగన్ విమర్శించారు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించారన్నారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరారని జగన్ తన లేఖలో మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరడాన్ని తెలంగాణ ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారన్నారు. మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని తప్పుపడుతూ మావోయిస్టుులు విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. ఈటల అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వామపక్ష భావజాలం ఉన్న ఈటలకు మొదటి నుంచి ఉద్యమ సంఘాలే మద్దతుగా నిలిచాయి. ప్రజా సంఘాలు అండగా నిలిచాయి. ఈటలను కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించినప్పుడు కూడా ఉద్యమకారులు, ప్రజా సంఘాలే ఆయనకు మద్దతుగా కేసీఆర్ ప పై విరుచుకుపడ్డాయి. అయితే ఈటల బీజేపీలో చేరడంతో... ఈ సంఘాలన్నిఆయనకు దూరం అయ్యాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.