ఏపీకి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గుడ్ బై! జగన్ సర్కార్ పై విశాఖ వాసుల ఫైర్..
posted on Jun 16, 2021 @ 10:45AM
మూడు నిర్ణయాల... ఆరు కేసులు.. తొమ్మిది కొట్టివేతలు... అన్నట్లుగా సాగుతోంది ఏపీ పాలన. జగన్ రెడ్డి పాలనలో అంతా రివర్స్ గా ఉందనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ అనాలోచిత, అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. గత రెండేండ్లలో ఏపీకి కొత్తగా ప్రాజెక్టులు రాలేవు. వ్యాపారవేత్తలు పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. వైసీపీ నేతల తీరుతో గతంలో కంపెనీలు పెట్టిన వారు.. ఏపీ నుంచి పరారవుతున్నారు. తాజాగా మరో ప్రతిష్టాత్మక కంపెనీ ఏపీకి గుడ్ బై చెప్పేసింది.
జగన్ రెడ్డి సర్కార్ విధానాలతో విసిగిపోయి... ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఒకటైన ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏపీకి బైబై చెప్పేసింది. విశాఖపట్నంలో తమ కార్యాలయాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చి గత ప్రభుత్వ హయాంలో ఒప్పందం కూడా చేసుకుంది ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ . ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో విశాఖపట్నానికి వచ్చేది లేదని ప్రకటించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గోల చేసింది వైసీపీ. అధికారంలోకి వచ్చాకా కూడా అలాగే వ్యవహరించింది.
ప్రపంచంలోని 500 గొప్ప కంపెనీల్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఒకటి. అందుకే అప్పటి సీఎం చంద్రబాబు... ఆ సంస్థను ఏపీకి తీసుకొచ్చేందుకు శ్రమించారు. ప్రత్యేక చొరవ తీసుకుని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌తో మాట్లాడి విశాఖకు వచ్చేందుకు ఒప్పించారు. సంస్థ సీఈవో జెన్నీ జాన్సన్ స్వయంగా వచ్చి... విశాఖపట్నంలో కార్యాలయం నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నారు. భూమిపూజ కూడా చేశారు. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ రాక ఎంత కీలకమో... నవ్యాంధ్రలో విశాఖకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంత ముఖ్యమని అప్పట్లో భావించారు. మరిన్ని ఐటీ, ఇతర అనుబంధ కంపెనీల రాకకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని ఆశించారు. ఈ సంస్థకు విశాఖలోని మధురవాడ ఐటీ హిల్స్‌పై దీనికి స్థలం కేటాయించారు.
అయితే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రాకపై అప్పట్లో విపక్షంలో ఉన్న వైసీపీ అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. ఎంతో విలువైన 40 ఎకరాల భూమి ఎందుకిచ్చారని నిలదీసింది. ఆ తర్వాత వైసీపీయే అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయిన రెండు నెలల్లోనే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సీఈవో రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వంతో మాట్లాడారు. ‘40 ఎకరాలు ఇవ్వం, పాతిక ఎకరాలే ఇస్తాం! గత ప్రభుత్వం కేటాయించిన ట్లుగా రూ.32 లక్షలకు కేటాయించం. ఎకరాకు 64 లక్షలు ఇవ్వాలి’ అంటూ కొత్త ప్రభుత్వం కొత్త లెక్కలు చెప్పింది. దీంతో ప్రభుత్వ పెద్దల వైఖరి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌కు నచ్చలేదని సమాచారం. ఆ తర్వాత ఆ రు కంపెనీ ప్రాముఖ్యతను గుర్తించారో ఏమో, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి లేఖ వెళ్లింది. ‘మా రాష్ట్రానికి రండి. విశాఖలో మీ క్యాంపస్ పెట్టండి’ అని అందులో ఆహ్వానించారు. అయితే, సదరు కంపెనీ ఆంధ్రప్రదేశ్‌కు రాకూడదనే నిర్ణయం తీసుకుంది. విశాఖలో క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటూ తాజాగా ఆ కంపెనీ టౌన్‌హాల్ సమావేశంలో ప్రకటించినట్లు తెలిసింది.