పిట్టకు షాక్.. మోదీ మార్క్ పాలి..ట్రిక్స్!
posted on Jun 16, 2021 @ 11:43AM
కుక్కను చంపాలంటే దానిపై పిచ్చిదనే ముద్ర వేయాలి. విమర్శకుల నోళ్లు నొక్కాలంటే వాళ్లపై దేశద్రోహులు, అర్బన్ నక్సల్స్ అనే ముద్ర వేయాలి. మరి, సోషల్ మీడియా నోళ్లు నొక్కాలంటే..? కొత్త ఐటీ రూల్స్ తీసుకురావాలి. అచ్చం ఇలానే చేసింది కేంద్రం. తనకు వ్యతిరేకంగా పోస్టులు పెరుగుతుండటం.. హాష్‌ట్యాగ్‌లు వెల్లువెత్తుతుండటంతో.. పిట్ట గొంతు నొక్కే నిబంధనలు తీసుకొచ్చింది. రిజైన్ మోదీ, అమిత్‌షా మిస్సింగ్‌లలాంటి హాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ కావడం.. కంగనా రనౌత్‌లాంటి సపోర్టర్స్ అకౌంట్లు రద్దు అవడం.. దేశవ్యాప్తంగా మోదీ వైఫల్యాలపై కామెంట్లు హోరెత్తుతుండటంతో.. కొరడా కాస్త గట్టిగానే ఝలిపిస్తోంది. అసలే, అసలైన ప్రజాస్వామ్య దేశమైన అమెరికాకు చెందిన సంస్థ కావడం, ట్రంప్‌లాంటి మొండిఘటాన్నే ఎదిరించిన చరిత్ర ఉండటంతో.. ట్విటర్ చివరాఖరి వరకూ కేంద్రంతో గట్టిగానే ఫైట్ చేసింది. కానీ, రాజ్యం పవర్ ముందు.. ట్విటర్ స్టామినా సరిపోలేదు. కోర్టుకు వెళ్లినా.. ఇంకా కేసు తేలకపోవడం.. ఈలోగా కేంద్రం మరింత ఉచ్చు బిగించడంతో.. పాపం పిట్ట.. విలవిల్లాడుతోంది.
తాజాగా, ట్విటర్‌కు మరో ఝలక్ ఇచ్చింది కేంద్రం. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇన్మర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను పాటించకపోవడంతో ట్విటర్‌కు చట్టపరమైన రక్షణను తొలగించింది. ఇకపై ట్విటర్.. తటస్థ, మధ్యవర్తిత్వ వేదిక కాదని, ఇది డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌గా ఉంటుందని తెలిపింది. దీంతో యూజర్ల అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విటర్ కూడా క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణకు గానూ కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. వినియోగదారుల సంఖ్య 50 లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని, నోడల్ అధికారిని, అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్‌లో నివసిస్తూ ఉండాలి. అయితే ఇతర సోషల్‌మీడియా సంస్థలు ఈ నిబంధనలు పాటించినప్పటికీ ట్విటర్ మాత్రం ఈ రూల్స్‌ను పాటించలేదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై జూన్ మెదటివారంలోనే తుది నోటీసులు జారీ చేసింది. తాజాగా, ట్విటర్ లీగల్ ఇండెమ్నిటీని రద్దు చేసింది కేంద్రం. తటస్థ, మధ్యవర్తిత్వ వేదిక హోదాను కోల్పోవడం వల్ల అభ్యంతరకరమైన కంటెంట్ పోస్ట్ అయితే, దానికి పోస్ట్ చేసిన వారితో పాటు ట్విటర్ కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.
అయితే, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇలా హోదా రద్దు అయిందో లేదో.. అలా యూపీలో ట్విటర్‌పై కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది. జూన్ 5న ముస్లిం వ్యక్తిపై దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఘాజియాబాద్ పోలీసులు కొందరు జర్నలిస్టులతో పాటు ట్విటర్‌పైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అభ్యంతరకర, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సామాజిక మాధ్యమం నుంచి తొలగించనందుకు గానూ ట్విటర్‌పై ఈ కేసు నమోదవడం.. ట్విటర్‌ను వార్నింగ్ ఇచ్చేందుకేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
అయితే భారత్‌లో అధికారులను నియమించినట్లు ట్విటర్ వెల్లడించింది. ట్వీట్ల పరంగా తమకు వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు సంధానకర్తగా ఓ అధికారిని నియమించినట్లు తెలిపింది. ఈ వివరాలను ఐటీ మంత్రిత్వశాఖకు త్వరలో తెలియజేస్తామని తెలిపింది. అంతలోనే ‘మధ్యవర్తి హోదా’ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో.. పిట్ట.. కుయ్యో మొర్రో అంటోంది. మోదీనా మజాకా....