కొత్తగా గ్రీన్ ఫంగస్.. మరో డేంజర్ బెల్.. హెలికాప్టర్‌లో పేషెంట్ తరలింపు..
posted on Jun 16, 2021 @ 1:26PM
బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్.. ఉన్నవి చాలవన్నట్టు.. కొత్తగా గ్రీన్ ఫంగస్ దడపుట్టిస్తోంది. కరోనా కారణంగా పాత రోగాలు కొత్తగా విజృంభిస్తున్నాయి. కొవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్స్‌ను బ్లాక్ ఫంగస్ తీవ్రంగా వేధిస్తోంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతూ బెంబేలెత్తిస్తోంది. ముక్కు, గొంతు, తల.. ఇలా శరీర భాగాలను తీవ్రంగా డ్యామేజ్ చేస్తోంది. బ్లాక్ ఫంగస్‌కు పోటీగా అక్కడక్కడా వైట్, ఎల్లో ఫంగస్‌లు కూడా విజృంభిస్తూ కలవరానికి గురి చేస్తున్నాయి. ఇవి చికిత్సకూ లొంగకుండా.. మొండిజబ్బులుగా మారి.. ప్రాణాలు తోడేస్తున్నాయి.
బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ కేసులే ఇప్పటి వరకు మనం చూస్తూ వస్తున్నాం. లేటెస్ట్‌గా.. ఇండియాలో తొలిసారిగా గ్రీన్ ఫంగస్ కేసు నమోదవడం ఆందోళనకరంగా మారింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఈ ఫంగస్ వెలుగుచూసింది. కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తిలో గ్రీన్ ఫంగస్‌ను గుర్తించారు వైద్యులు. దీంతో ఆ పేషెంట్‌ని హుటాహుటిన ఇండోర్ నుంచి ముంబైకి.. ఎయిర్ అంబులెన్సులో తరలించారు.
ఇండోర్‌లోని శ్రీ అరబిందో ఇస్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ఛాతీ వ్యాధుల విభాగంలో ఈ వ్యాధి బయటపడింది. తొలుత బాధితుడికి బ్లాక్ ఫంగస్ సోకిందని డాక్టర్లు అనుమానించారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించగా.. సైనస్, లంగ్స్, బ్లడ్‌లో గ్రీన్ ఫంగస్ డెవలప్ చెందినట్టు గుర్తించారు. ఇండోర్ ఆసుపత్రిలో గ్రీన్ ఫంగస్‌కు చికిత్స అందుబాటులో లేకపోవడంతో ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైలోని హిందుజా ఆసుపత్రికి తరలించారు.
గ్రీన్ ఫంగస్ బాధితుడు ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాడు, కొద్ది రోజుల తర్వాత ముక్కు నుంచి రక్తం కారడం, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయి. బరువు తగ్గి, చాలా బలహీనంగా మారాడు. ఇవన్నీ గ్రీన్ ఫంగస్ లక్షణాలుగా భావిస్తున్నారు. దీనిపై మరింత రీసెర్చ్ జరగాల్సి ఉందంటున్నారు వైద్యులు.