మాన్సస్ ట్రస్టుపై విజయసాయి కొత్త స్క్రీన్ ప్లే
posted on Jun 17, 2021 @ 2:11PM
అలా హైకోర్టు తీర్పు వచ్చింది. ఇలా వారు పెట్టిన బొమ్మ పదవి పోయింది. అలా మళ్లీ రాజుగారు రంగంలోకి దిగారు. అంతే రెడ్డిగారు కొత్త కథ మొదలెట్టేశారు. యమర్జెంటుగా ఇప్పుడే గుర్తొచ్చినట్లు కహానీ చెప్పేస్తున్నారు. రాజుగారి సంస్థానాన్ని కాపాడాల్సిన గురుతర బాధ్యత ఆయన భుజాల మీదే ఉన్నట్లుగా తెగ ఫీలైపోతూ.. అయ్యగారు చెప్పింది వింటే .. ఆయన మనసులో ఏముందో.. ఎంత కడుపుమంట పుడుతుందో ఎవరికైనా ఈజీగా అర్ధమైపోతుంది.
మాన్సస్ ట్రస్టు విజయనగరం గజపతిరాజుల ఆధీనంలో ఉంది. దానిని స్వాధీనం చేసుకోవడానికి ఒక బొమ్మ సంచయితను తీసుకొచ్చి.. ఆ ట్రస్టు కింద ఉన్న ఆస్తులను కొల్లగొటేయాలనుకున్నారు. కాని ఇప్పుడు హైకోర్టు ఆ ఆటలు ఆడొద్దని చెప్పడంతో... కొత్త ఆట మొదలెట్టారు. మాన్సస్ ట్రస్టులో అక్రమాలు జరిగాయంట..వాటిపై విచారణ చేయాలంట... దేవాదాయశాఖ నిర్ణయించిందంట... ఆ విషయాన్ని దేవాదాయశాఖతో ఏ సంబంధమూ లేని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పడమే హైలెట్. పక్కన బొమ్మలా ఉన్నా మంత్రి వెల్లంపల్లి ..ఏ బొమ్మో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వ్యవహారమంతా ఎంపీగారే నడిపించారు.
మాన్సస్ ట్రస్టులో అక్రమాలు జరిగితే...ఇన్ని రోజులు సంచయిత ఉండి ఏం చేసినట్లు... దేవాదాయశాఖ ఏం చేసినట్లు.. మంత్రి వెల్లంపల్లి ఏం చేసినట్లు.. ఇప్పుడు అశోక్ గజపతిరాజు మళ్లీ ఛైర్మన్ కావడంతోనే అన్నీ గుర్తొచ్చేశాయని అనుకోవాలా. అంటే అశోక్ గజపతిరాజును తప్పిస్తే అన్నీమన చేతికే అనుకున్నారు.. కాని అది ఇప్పుడు సాధ్యం కాకపోవడంతో.. ఇంకో రూటులో వెళుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
వ్యవస్ధలను అధికారం అడ్డుపెట్టుకుని ఏ రేంజ్ లో వాడుకుంటున్నారో.. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తేనే అర్ధమవుతుంది. అప్పటికప్పుడు ఛైర్మన్ ను మార్చేయడం. ఏ అవగాహన లేని సంచయితను తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి.. వెనక నుంచి ఆట అంతా విజయసాయిరెడ్డి ఆడటం.. మాన్సస్ కింద ఉన్న భూములను వేలం వేయాలని..లీజులకు ఇవ్వాలని..అది కూడా ప్రభుత్వం మొదట స్వాధీనం చేసుకుని..దాని ద్వారా వేరేవారికి ఇచ్చేలా..వారి నుంచి వీరు బెనిఫిట్ పొందేలా ప్లాన్లు రూపొందించారనే ఆరోపణలు వచ్చాయి.
లేటుగా అయినా హైకోర్టు వీరి రాచక్రీడ జీవోలను కొట్టేయడంతో.. కథ మొదటికి వచ్చేసింది. అందుకనే ఈసారి స్క్రీన్ ప్లే మార్చి...కొత్త కథతో మళ్లీ మాన్సస్ ఆస్తులను కొట్టేసే ప్లాన్లు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.