డీజీపీ సభలో మాస్క్ లేకుండా మంత్రి.. చట్టాలు కొందరికి చుట్టమా?
posted on Jun 17, 2021 @ 2:32PM
తెలంగాణ మంత్రుల్లో ఆయన స్పెషల్. కొవిడ్ టైమ్ లో ఆయన మరింత స్పెషల్. వైరస్ మహమ్మారి భయానికి రోడ్లపైకి వచ్చే జనాలంతా మాస్కులు పెట్టుకున్నారు. కొవిడ్ రూల్స్ పాటిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారు. కాని ఆ మంత్రి మాత్రం ఏనాడు మాస్కు ధరించిన పాపాన పోలేదు. మాస్కు లేకుండా ఆయన ఇంట్లోనే ఉన్నారా అంటే అదీ లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. పార్టీ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కార్యకర్తలను, జనాలను కలుస్తూనే ఉన్నారు. అయినా ఆ మంత్రి మాత్రం ఎప్పుడు మాస్క్ ధరించలేదు.
ప్రభుత్వం మాత్రం మాస్క్ లేకుండా బయటికి వస్తే ఫైన్ వేస్తామని ప్రకటించింది. మాస్కు పెట్టుకోకుంటే వెయ్యి రూపాయల ఫైన్ అంటూ జీవో జారీ చేసింది.ఇంటి గడప దాటి బైటకు వచ్చిన ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాల్సిందేనని, లేకుంటే స్పాట్ ఫైన్ విధిస్తున్నామని, ఎపిడమిక్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేస్తున్నామని స్వయంగా డీజీపీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. లక్షలాది మందిపై కేసులు నమోదు చేసి కోట్లాది రూపాయల ఫైన్ వసూలు చేశారు. కానీ మంత్రి తలసాని మాత్రం మాస్కు పెట్టుకోకుండా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. ఏకంగా పోలీసు బాస్ పాల్గొన్న కార్యక్రమానికే మాస్క్ లేకుండా హాజరయ్యారు.
హైదరాబాద్ నగరంలోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాస్కు పెట్టుకోలేదు. ఆ సభకు డీజీపీ మహేందర్ రెడ్డి, నగర సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్క్ లేకుండా పక్కనే ఉన్న డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ఈ విషయాన్ని చూసీ చూడనట్లు ఉండిపోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది.లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేస్తున్నామని చెప్తున్న నగర పోలీసు కమిషనర్ .. మాస్క్ లేకుండా తిరిగిన మంత్రిపై కేసు నమోదు చేయలేదన్నది ప్రశ్నగా మారింది. ప్రజలకు వర్తించే చట్టాలు, లాక్‌డౌన్ నిబంధనలకు మంత్రికి వర్తించవా? అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి తలసాని తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అదే సమయంలో పోలీసులు ఎందుకు ఫైన్ వేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు.