హుజూరాబాద్ కు నిధుల వరద.. కేసీఆర్ ను ఈటల తట్టుకునేనా?
posted on Jun 17, 2021 @ 2:49PM
ఇంకా నోటిఫికేషన్ రానే లేదు. ఎన్నికల హడావుడి అసలే లేదు. జస్ట్ రాజీనామా చేశారంతే. అంతే ఇక రంగంలోకి దిగిపోయారు గులాబీ నేతలు. రేపో మాపో పోలింగ్ అన్నట్లే హల్ చల్ చేస్తున్నారు. ఇన్నాళ్లు హుజూరాబాద్ ఏమైందో తెలియదు గాని..ఇక అది మరో హైదరాబాద్ అయిపోతుందన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్ అయితే ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. కొన్ని రోజుల్లోనే హుజూరాబాద్ డెవలప్ అయిపోతుంది అంటూ ప్రామిస్ చేసేస్తున్నారు.
ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ ఇప్పటిదాకా ఓ లెక్క.. ఇక నుంచి ఓ లెక్క. ఆయన రాజీనామా చేసి బరిలోకి దిగుతున్నాడు. తమని ఇన్నిమాటలన్నవాడు గెలిస్తే ఎలా.. మన పరువేం కావాలి? పోటీ చేసేది బిజెపి తరపున అయినా సరే..బలంగా ఢీకొట్టి పిండి చేసేయాలన్నంత కసిగా కదులుతున్నారు టీఆర్ఎస్ నేతలు. మంత్రి గంగుల కమలాకర్ అయితే అసలు ఇన్నాళ్లు హుజూరాబాద్ లో అభివృద్ధే జరగలేదు..ఎందుకు చేయలేదు ఈటల రాజేందర్...మేం వచ్చాం ఇక చూడండి అభివృద్ధి ఎలా చేస్తామో? ఎన్ని నిధులు ఇస్తామో చూడండి అంటున్నారు.అంటే ఇప్పటిదాకా ఈటల హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.. ఇక ఇప్పుడు జరుగుతుందంట. అదేమంటే ఈటల కేసీఆర్ ని నిధులు అడగలేదంట..పట్టించుకోలేదంట.. ఇప్పుడు చూడు అంటూ గంగుల గర్జిస్తున్నారు. ఈటల అనుచరులైతే హుజూరాబాద్ కరీంనగర్ జిల్లాలో లేదా..తెలంగాణలో లేదా..కేసీఆర్ దానిని పట్టించుకోరా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
టీఆర్ఎస్ మాత్రం హూజూరాబాద్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే కనపడుతుంది. నోటిఫికేషన్ వచ్చాక నిధులు ఇవ్వలేరు కాబట్టి... దాని కంటే ముందే అభివృద్ధి కార్యక్రమాల పేరుతో హడావుడి చేయాలని చూస్తోంది. దాని కోసం ఎన్నినిధులైనా ఇవ్వటానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చేలోపు... ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలో టార్గెట్లు కూడా పెట్టుకున్నారంట.
ఇక ఎలక్షన్ ఇంజనీరింగ్ లో టీఆర్ఎస్ ఎటూ ఆరితేరిపోయింది. అందుకే ఇప్పటి నుంచే కీలక మైన నేతల ఐడెంటిఫికేషన్ మొదలైపోయింది. వారు ఏ పార్టీ అయినా సరే..కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు..అన్ని పార్టీలలో కొన్నిఓట్లను అయినా వేయించగలిగేవారైతే చాలు...వారిని గుర్తించి..వారికేం కావాలో అవి ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు కాబోతుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వాళ్లకు ఫోన్లు వస్తున్నాయనే టాక్ ఉంది.
అలా అటు ప్రభుత్వం నుంచి నిధులు... ఇటు పార్టీ నుంచి పైసలు రెండూ కుమ్మరించి హుజూరాబాద్ ను నిలబెట్టుకోవాలని..ఈటల రాజేందర్ కి షాక్ ఇవ్వాలని కేసీఆర్ గట్టి పట్టు మీదున్నట్లు కనపడుతోంది. అభ్యర్ధి విషయంలో కూడా చాలా లెక్కలు వేసుకుంటున్నారు. ఎల్ రమణను టీఆర్ఎస్ లో చేర్చుకుని టిక్కెట్ ఇస్తారని..ప్రచారం జరిగింది. తర్వాత పెద్దిరెడ్డి పేరు వచ్చింది. అప్పటికే కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి పేరు కూడా వినపడింది. ఇప్పుడు తాజాగా వారందరినీ కాదని ముద్దసాని దామోదర రెడ్డి తమ్ముడు ముద్దసాని పురుషోత్తమ్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆరు నూరైనా.. గెలవాలనే పట్టుదలలో టీఆర్ఎస్ ఉంది. మొత్తం మీద ఎవరు పుణ్యం చేసుకున్నాగాని... హుజూరాబాద్ దశ అయితే మారబోతుందనే అనిపిస్తోంది. నోటిఫికేషన్ కాస్త ఆలస్యంగా వస్తేనే బెటర్.. నియోజకవర్గం డెవలప్ మెంట్ అయిపోతుంది.