రఘురామను వెంటాడుతున్న సీఐడీ.. సంచలనం జరగబోతుందా?
posted on Jun 17, 2021 @ 3:59PM
ముందు లడ్డూలా దొరికాడనుకున్నారు. కసి తీర్చుకున్నారు. కట్ చేస్తే..కథ అడ్డం తిరిగింది. విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అంతే రబ్బర్ బ్యాండ్ జారి వెనక్కి జాడించి ఎలా కొడుతుందో..అలా తగిలింది దెబ్బ ఏపీ సీఐడీ అధికారులకు. అప్పటి దాకా ఎంపీ రఘురామను ఏ సెక్షన్ లో పెట్టి ఏ రేంజ్ లో పిండాలా అని తెగ ఉత్సాహపడినవాళ్లు.. రఘురామ పెట్టిన కంప్లయింట్ల దెబ్బకు కరెంట్ షాక్ కొట్టిన కాకిలా మారిపోయారు. ఇప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి... ఎంపీని ఎలా చిక్కించుకోవాలి అనేదే వారి టార్గెట్ గా అయిపోయింది.
నిను వీడని నీడను నేనే అన్నట్లు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు వెంటాడుతున్నారు. చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడని తెగ బాధపడిపోతున్నట్లే అనిపిస్తోంది. అందుకే కేవలం సంతకం పెట్టలేదన్న ఒక్కకారణంతో మళ్లీ జైలుకు తీసుకుపోవాలని చూస్తున్నారంటే...వారి ఆత్రం, తాపత్రయం అర్ధమైపోతున్నాయి. బెయిల్ వచ్చాక.. ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిపోయి ఢిల్లీకి వెళ్లిపోయారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఆయన లాయర్లు నివేదికలు కోర్టుకు సమర్పించారు.
అయితే బెయిల్ అధికారికంగా రావాలంటే..సుప్రీం ఉత్తర్వుల ప్రకారం రఘురామకృష్ణరాజు గుంటూరు వచ్చి సంతకం చేయాలని.. అలా చేయలేదని కోర్టులో చెప్పడం.. కోర్టు రిమాండ్ పొడిగించడం చకచకా అయిపోయాయి. కనీసం కళ్ల ముందు జరుగుతున్నదానిని కూడా పట్టించుకోకుండా కేవలం కాగితాల ఆధారంగా కథ నడిచిపోయింది. ఇప్పుడు ఏపీ సీఐడీ లెక్క ప్రకారం రఘురామకృష్ణ రిమాండ్ లో ఉన్నట్లే లెక్క..రిమాండ్ లో లేడంటే పారిపోయినట్లు లెక్క.. సో మళ్లీ ఆయనను పట్టుకుని జైల్లో పెట్టాలి.. ఆయన మళ్లీ బయటకు రావాలంటే కోర్టులో అప్పీల్ చేసుకోవాలి.. అదీ ఇప్పుడు కొత్త స్కెచ్,.ఇంత రచ్చ జరిగాక కూడా.. ఈ విధంగా చేస్తున్నారంటే... ఢిల్లీలో రఘురామను సస్పెండ్ చేయించే ప్రయత్నాలు సక్సెస్ కాలేదా అనే అనుమానాలు వస్తున్నాయి. పైకి వైసీపీ నేతలు ఈసారి రఘురామను సస్పెండ్ చేయటం ఖాయమని.. పైన అన్నీ మాట్లాడేశామని చెబుతున్నారు. కాని అలాంటిదేమీ లేదేమో..అందుకే ఈ రూటులో వస్తున్నారేమో అనే డౌట్స్ పెరుగుతున్నాయి.
మరోవైపు రఘురామకృష్ణరాజు స్పీకర్, హోంమంత్రి.. ఇలా అందరికీ తనకు జరిగిన అన్యాయమిది అంటూ ఏకరువు పెట్టేసుకున్నారు. పార్లమెంట్ లో అయితే ఈసారి ఈ ఎపిసోడ్ పై చర్చ జరగడం ఖాయం.ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లకు చెందిన ఎంపీలు రఘురామ ఎపిసోడ్ ను ఖండించడమే కాక..తాము పార్లమంట్ లో లేవనెత్తుతామని ఓపెన్ గా ప్రకటించారు. అప్పటి నుంచి వైసీపీ శిబిరంలో మరింత కలవరం మొదలైంది. పార్లమెంట్ లో చర్చ అనేది ఎక్కడిదాకా పోతుందో అనే ఆందోళన అయితే వైసీపీ నేతల్లో కనపడుతోంది.అందుకే వారు పట్టుదలగా రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయించాల్సిందేనని పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సీఐడీ అధికారులు..ఇంకా ఏదో చేయాలని తపన పడుతున్నారు. అందుకే అవకాశాలు వెతికి మరీ..కారణాలు సృష్టించుకుని మరీ రఘురామకృష్ణను పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొననీయకుండా అరెస్టు చేయాలని చూస్తున్నారు. సుప్రీంకోర్టు దృష్టిలో కేసు ఉన్నప్పటికీ.. ఏపీ సర్కార్ పెద్దలు ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా..తామనుకున్నది తాము చేసుకోవడానికే తెగించి ముందుకు పోతున్నట్లు కనపడుతోంది.