మంత్రి హరీశ్ రావు కారుకు ప్రమాదం.. తప్పిన ముప్పు 

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు‌ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హరీష్ రావు వాహనం భారీగా ధ్వంసం అయింది.  డ్రైవర్, గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. మంత్రి  హరీశ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం సిద్దిపేటలో జరిగిన సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొన్న హరీష్ రావు.. సిద్దిపేట నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దుద్దెడ సమీపంలో హరీష్ రావు కారు అడవి పంది అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో హరీశ్ కారు కాన్వాయ్‌లోని మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, గన్‌మెన్‌కు గాయాలు కాగా...  వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మంత్రి హరీశ్ రావు క్షేమంగా బయటపడగా.. మరో కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.హరీశ్‌కు ప్రమాదం తప్పడంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. 

సీఎం కేసీఆర్  పిసిరిగొట్టా.. నరసింహన్ ఎందుకలా అన్నారు? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను భోళా శంకరుడు అంటుంటారు. ఎవరూ ఏ సాయం అడిగినా చేస్తారని  చెబుతారు. ముఖ్యమంత్రిగా కూడా ఆయన భారీ వ్యయాలతో కూడిన ప్రాజెక్టులకే డిజైన్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ భారీ బడ్జెట్ పథకాలే. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకానికి కూడా ఏటా 15 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు భారీగా కనిపిస్తున్నా... ఆయన పిసిరోడట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి, తెలంగాణ, ఏపీ ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అట. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే  చెప్పారు.  సిద్దిపేట, కామారెడ్డిలో పర్యటించిన కేసీఆర్.. కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో నిర్వహించిన సభలో సుదీర్ఘంగా మాట్లాడిన కేసీఆర్.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన గురించి కూడా ఇప్పటివరకు ఎవరికీ తెలియన రహస్యాలు చెప్పారు. అందులో ఒకటి మాజీ గవర్నర్ నరసింహన్ తనను పిసిరిగొట్టు అన్నారన్న విషయాన్ని చెప్పి అందరిలో నవ్వులు పూయించారు గులాబీ బాస్. తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కేసీఆర్. అప్పడు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ ఉన్నారు. సీఎం కాగానే కేసీఆర్ కు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రికి ఉన్న కాన్వాయ్ వచ్చిందట. అయితే ఆ కాన్వాయ్ లోని వాహనాలన్ని బ్లాక్ కలర్ లో ఉండేవి. కేసీఆర్ కు ఆ కలర్ నచ్చలేదట. ఇదే విషయాన్ని అప్పటి సీఎంవో పోలీస్ అధికారి, ప్రస్తుత రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కు చెప్పారట కేసీఆర్. అప్పుడు మహేష్ భగవత్ కొత్త కార్లు తీసుకుందామని సలహా ఇచ్చారట. అయితే రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటుందో తెల్వదు... ఇలాంటి సమయంలో అడ్డగోలుగా ఖర్చు చేయకూడదని కేసీఆర్ చెప్పారట. ఆయనే మహేష్ భగవత్ కు ఓ ఐడియా కూడా ఇచ్చారట. అది ఏమిటంటే... కాన్వాయ్ లోని కార్లకు ఉన్న బ్లాక్ కలర్ పై వైట్ కలర్ వేయించమని చెప్పారట. సీఎం కేసీఆర్ చెప్పినట్లే బ్లాక్ కార్లకు కలర్ మార్చి వైట్ కాన్వాయ్ గా మార్చేశారట. ఆ కాన్వాయ్ లోనే ఐదు నెలల పాటు తిరిగానని కామారెడ్డి సభలో కేసీఆర్ చెప్పారు.  ఈ విషయాన్ని ఏదో సమయంలో మహేష్ భగవత్ .. గవర్నర్ నరసింహన్ కు చెప్పారట. కొన్ని రోజుల తర్వాత తనను కలిసిన సీఎం కేసీఆర్ దగ్గర కార్ల విషయాన్ని ప్రస్తావించారట గవర్నర్. కేసీఆర్ కార్ల కలరు మార్చుకుని తిరుగుతున్నావా.. నువ్వెంత పిసిరిగోట్టువయ్యా అని అన్నారట. అది కాదు సార్.. రాష్ట్ర ఖజానా ఎలా ఉంటుందో ఇంకా అంచనాకు రాలేదు కదా.. అందుకే ఖర్చు పెట్టడానికి వెనుకాడానని గవర్నర్ కు చెప్పారట కేసీఆర్.  కొన్ని రోజుల తర్వాత పరిస్థితి పూర్తిగా అవగాహనకు వచ్చాకా కొత్త కాన్వాయ్ తీసుకున్నారట ముఖ్యమంత్రి కోసం.  కామారెడ్డి సభలో కేసీఆర్ చెప్పిన ఈ విషయాలను విని అంతా అశ్చర్యానికి లోనయ్యారు. 

కేసీఆర్ కు కరోనా ఎలా వచ్చిందో తెలుసా..!

కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయ తాండవం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభించింది. తెలంగాణలో మొదటి వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ బీభత్సం స్పష్టించింది. లక్షలాది మందికి సోకింది. హాస్పిటల్ లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సామాన్యులు, పేదలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరిని చుట్టేసింది మహమ్మారి. ఎక్కువగా బయటికి రాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా కరోనా సోకింది.  కేసీఆర్ కు కరోనా పాజిటివ్ రావడంతో  చాలామంది ఆశ్చర్యపోయారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆయనకు ఎలా వచ్చిందని అనుకున్నారు. అయితే ఆదివారం సిద్ధిపేటలో  పర్యటించిన కేసీఆర్.. అక్కడ జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా  ప్రసంగించారు. రాష్ట్ర పథకాలు, అభివృద్ధి గురించి వివరిస్తూనే కరోనాపైనా మాట్లాడారు. ఈ సందర్భంగా  తనకు కరోనా ఎలా సోకిందో కామెడీగా వివరించారు కేసీఆర్.  "ఇటీవల ఓ పెళ్లికి వెళ్లాను, అక్కడ పెళ్లి కొడుకు మాస్కు తీసేయాలని కోరాడు. మాస్కు తీయడం ఎందుకని అడిగితే, మీరు మళ్లీ మాకు దొరకరు కదా సార్, అందుకే ఫొటో తీసుకుందామని మాస్కు తీయమన్నాం సార్ అని ఆ పెళ్లికొడుకు చెప్పాడు. నేను నీకు దొరకడం ఏమో కానీ, మాస్కు తీసేస్తే కరోనాకు నేను దొరుకుతా అని చెప్పా. ఆ విధంగా నా మాస్కును వాడు లాగి, వీడు లాగి చివరికి నాక్కూడా కరోనా వచ్చింది" అని అందరిలోనూ నవ్వులు పూయించారు.

కేసీఆర్ కాళ్లు మొక్కిన కలెక్టర్! విపక్షాల ఫైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ వీడారు. విపక్షాలు విమర్శలో, జనం ఆగ్రహం తెలిసొచ్చిందో తెలియదు కాని చాలా కాలం తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. తన సొంత గడ్డ సిద్దిపేట నుంచే జిల్లాల పర్యటన ప్రారంభించారు కేసీఆర్. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు పోలీస్ కమిషనరేట్, జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ షాకింగ్ ఘటన జరిగింది,  జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత కలెక్టర్ ఛాంబర్‌లోకి వచ్చారు సీఎం. కలెక్టర్ కుర్చీలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని కూర్చో బెట్టారు. అయితే తన కుర్చీలో ఆసీనులైన కలెక్టర్ వెంటనే లేచి..  సీఎం కేసీఆర్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. తన కుటుంబ సభ్యులను సీఎంకి పరిచయం చేశారు. ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారి సీఎం కాళ్లు మొక్కడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కలెక్టర్ అయి ఉండి సీఎం కాళ్లు మొక్కడంపై పలువురు ఐఏఎస్ అధికారులు, పలువురు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. గతంలోనూ నూతన జిల్లా ఏర్పాటు సమయంలోను సీఎం కాళ్లు మొక్కి విమర్శల పాలయ్యారు వెంకట్రామిరెడ్డి. తాజా మరోసారి అదే పని చేశారు.  సిద్దిపేట జిల్లా కలెక్టర్… ఓ అధికారియా… లేక రాజకీయ నాయకుడా.. అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదే కలెక్టర్ ను గతంలో సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే అని సంభోదించారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ దుబ్బాక టికెట్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆయన ఆ వార్తను ఖండించలేదు. కాగా ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయ ఓపెనింగ్‌లో రాజకీయ నాయకునిలా సీఎం కాళ్లపై పడటంతో జిల్లా కలెక్టర్ రాజకీయాల్లోకి రావాలనుకొంటున్నాడా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.   

జస్టిస్ కనగరాజ్ కు ఎట్టకేలకు పదవి.. ఏ పోస్టో తెలుసా? 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమించబడి.. హైకోర్టు ఆదేశాలతో తొలగించబడిన జస్టిస్ కనగరాజ్ కు ఎట్టకేలకు పదవి దక్కింది. ఏపీ పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజ్‌ను ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులపై ఫిర్యాదులను విచారించే పోలీస్ కంప్లైంట్ అథారిటీకి చైర్మన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయిన, సకాలంలో న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు.  పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.ఇందులో భాగంగానే  ఏపీ పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీని ఏర్పాటు చేసిన జగన్ సర్కార్.. ఛైర్మెన్ గా జస్టిస్ కనగరాజ్ ను అపాయింట్ చేసింది. పీసీఏలో రిటైర్డ్‌ ఐఏఎస్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌లతో పాటు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యులుగా ఉంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. పీసీఏ  సిఫారసులను ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి ఆయన స్థానంలో ఏపీ ఎస్‌ఈసీగా జస్టిస్ కనగరాజ్ గత ఏడాది ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే ఊహించని పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో ఆ పదవిని వదులు కోవాల్సి వచ్చింది. తర్వాత నిమ్మగడ పదవి కాలం ముగిసినా.. కనగ్ రాజ్ కు కాకుండా నీలం సాహ్నీని నియమించింది ఏపీ ప్రభుత్లం. దీంతో సీఎం జగన్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జస్టిస్ కనగరాజ్ ను ఆయన బలి పశువు చేశారనే ఆరోపణలు వచ్చాయి. రూల్స్ ను బ్రేక్ చేస్తూ నిమ్మగడ్డను తొలగించి హడావుడిగా జస్టిస్ కనగరాజ్ ను నియమించిన జగన్ సర్కార్...  నిమ్మగడ్డ పదవి విరమణ తర్వాత ఎందుకు నియమించలేదని పలువురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ కనగరాజ్ కు సముచిత గౌరవం కల్పించాలని భావించిన సీఎం  జగన్.. ఆయన్ను పోలీస్ కంప్లైంట్ అథారిటీ బాధ్యతలు అప్పగించారు.

జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా? ఢిల్లీలో అమిత్ షా కార్యాచరణ..

జమ్మూ కశ్మీర్  విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించినట్లుగానే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించనున్నట్లుగా సమాచారం. ఈ దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో హోంశాఖ మంత్రి అమిత్ షా... జాతియ భద్రత సలహాదారు అజిత్ దోవల్, అజిత్ ధోవల్, హోంసెక్రటరీ, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, RAW చీఫ్, CRPF జనరల్, కశ్మీర్ DGPలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇందులో జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పించడంపైనే చర్చించారని తెలుస్తోంది. త్వరలోనూ రాష్ట్ర హోదా కల్పిస్తూ కేంద్రం అధికారిక నిర్ణయం ప్రకటిస్తుందని ఢిల్లీ వర్గాల సమాచారం..  ఆగష్టు 5, 2019 న జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, మరియు లడఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది. పూర్వపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించబడిన ఆర్టికల్ 370ని అదే రోజు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.అయితే జమ్మూ కశ్మీర్‌పై ఫిబ్రవరి 13, 2020న లోక్ సభలో హోం మంత్రి అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. సరైన సమయంలో కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని కాదని తెలిపిన అమిత్ షా.. రాష్ట్ర హోదా ఇవ్వబోమని బిల్లులో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో అధికార పంపిణీ జరుగుతోందన్నారు అమిత్ షా. పంచాయతీలకు పరిపాలన, ఆర్థికపరమైన అధికారాలు కల్పించినట్టు వెల్లడించారు. కశ్మీర్‌పై ప్రతి అంశానికీ వివరణ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో అధికార పంపిణీ, అధికార వికేంద్రీకరణ జరిగిందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో 51 శాతానికి పైగా పోలింగ్‌ జరిగిందని గుర్తు చేశారు. ‘మా ప్రత్యర్థులు కూడా ఎత్తిచూపని విధంగా ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్ సభలో అమిత్ షా ప్రకటన తర్వాత నుంచే జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తారనే ప్రచారం జరిగింది. అయితే కొవిడ్ కల్లోలంతో అది పక్కక పోయింది. ప్రస్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ కట్టడిలోకి రావడంతో కేంద్ర సర్కార్ జమ్మూ కశ్మీర్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గతంలో అమిత్ షా చెప్పినట్లుగానే ప్రత్యేక రాష్ట్ర హోదా కట్టబెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తుందని తెలుస్తోంది. గతంలోనే జమ్మూ కశ్మీర్, లఢక్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఏ పౌరుడైనా అక్కడ భూములు కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేసింది.  జమ్మూ కశ్మీర్ లో భారత దేశానికి చెందిన ఏ పౌరుడైనా అక్కడ భూములను కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ నివాసం ఉండే అవకాశాన్ని సైతం అందరికీ ప్రభుత్వం కల్పించింది. వ్యవసాయ భూములను ఇందులో నుంచి మినహాయించింది.  జమ్మూ కశ్మీర్ పునర్వ్యవ్యస్థీకరణ చట్టం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. 

28 గంటల్లో 10 అంతస్తుల భవనం.. చైనీయుల మరో రికార్డ్ 

చైనీయులు మరో రికార్డు సాధించారు. 28 గంటల్లోనే 10 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ పరిజ్ఞానంతో శరవేగంగా నిర్మించిన భవనానికి భూకంపాలను తట్టుకునే దృఢత్వం ఉంది.  వెయ్యేళ్ల జీవితకాలం దాని ప్రత్యేకతలు. అవసరమైతే ఆ భవనం అంతస్తులన్నీ విడగొట్టి.. వేరే చోటుకు తరలించే వెసులుబాటు కూడా ఉంది. సాధారణంగా నిర్మించే భవంతికి అయ్యే ఖర్చులో   5 వంతులు తక్కువ బడ్జెట్‌లోనే ఈ అద్బుత భవనం కట్టారు చైనీయులు.  కాలంతో పరుగెత్తుతున్నారా అన్నట్లుగా కార్మికులు కదిలారు. సిబ్బంది, కార్మికులు కలిసికట్టుగా కదులుతూ చకచకా పనులన్నీ చక్కబెట్టారు. నిర్మాణ పనుల్లో వెయ్యి మందికిపైగా వివిధ విభాగాల సిబ్బంది పాల్గొనగా, 3 భారీ క్రేన్లను వినియోగించారు. కేవలం 28 గంటల 45 నిమిషాల స్వల్ప వ్యవధిలోనే 10 అంతస్తుల భవంతిని నిర్మించేశారు. నిర్మాణరంగంలో కొత్త పోకడలకు చిరునామాగా నిలిచే చైనాకు చెందిన స్థిరాస్తి కంపెనీ ‘బ్రాడ్‌ గ్రూప్‌’ ఈ సరికొత్త రికార్డును లిఖించింది. ఈ నిర్మాణ పనుల వీడియోను బ్రాడ్‌ గ్రూప్‌ యూట్యూబ్‌లో షేర్‌ చేయగా వైరల్‌గా మారింది ఇంతవేగంగా భవనాన్ని నిర్మించేందుకు ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ నిర్మాణ పరిజ్ఞానాన్ని వినియోగించారు. భవనంలో ఉండాల్సిన గదులు, ఇతరత్రా వసతుల మాడ్యూల్‌లను ముందస్తుగా ఫ్యాక్టరీల్లో తయారు చేయించి ట్రక్కుల్లో సైట్‌కు తెప్పించుకొని.. నేరుగా ఎక్కడికక్కడ నట్లు, బోల్టులతో బిగించారు. దీంతో ఎంతో సమయం ఆదా అయిం ది. ఒక్కో మాడ్యూల్‌ను స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో.. 12 మీటర్ల పొడవు, 2.44 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తుతో రూపుదిద్దారు. భూకంపాలను తట్టుకొని నిలబడేంత దృఢంగా దీన్ని నిర్మించామని, ఈ భవంతి జీవితకాలం వెయ్యేళ్లని బ్రాడ్‌ గ్రూప్‌ తెలిపింది. అవసరమైతే ఈ భవనాన్ని ఏ అంతస్తుకు ఆ అంతస్తుగా విడగొట్టి వాహనాల్లో తరలించి, మరో ప్రదేశంలో ఏర్పాటు చేసుకునే సౌలభ్యమూ ఉంటుందని ‘బ్రాడ్‌ గ్రూప్‌ తెలిపింది. ఇన్ని వెసులుబాట్ల దృష్ట్యా దీన్ని ‘లివింగ్‌ బిల్డింగ్‌’ గా పిలుస్తున్నట్లు కంపెనీ వివరించింది. ఇందులో విద్యుత్‌ వినియోగ ఆదా 20 శాతం మేర పెరుగుతుందని వెల్లడించింది.   

కరోనా మృతులకు పరిహారం ఇవ్వలేం.. సుప్రీంకు తేల్చి చెప్పిన కేంద్రం

కరోనా మహమ్మారి సోకి చనిపోయిన మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం  ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గతంలో కేంద్రం ఖండించింది. తాజాగా మరోసారి కరోనా మృతులకు పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కరోనాతో చనిపోయిన వారందరికీ పరిహారం చెల్లించలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. అలా చేస్తే విపత్తు ఉపశమన నిధులూ సరిపోవని పేర్కొంది. కొవిడ్ కల్లోల ఉపశమనానికి కనీస ప్రమాణాలు పాటించాలని, కరోనాతో మరణించిన వారికి పరిహారం చెల్లించాలని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది. దీనిపై ప్రభుత్వ వివరణ కోరగా.. అఫిడవిట్ ను దాఖలు చేసింది. ‘‘కొవిడ్ తో చనిపోయినవారికి రూ.4 లక్షల పరిహారాన్ని చెల్లించలేం. భూకంపాలు, వరదలు ఇతర ప్రకృతి విపత్తుల వల్ల నష్టం సంభవిస్తేనే పరిహారం చెల్లించాలని విపత్తు నిర్వహణ చట్టంలో స్పష్టంగా ఉంది’’ అని పేర్కొంది. కరోనాతో మరణించిన ప్రతి ఒక్కరికీ రూ.4 లక్షల చొప్పున ఇస్తూ పోతే విపత్తు నిధులు మొత్తం దీనికే పోతాయని, అవీ చాలవని తెలిపింది. రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులను మొత్తం దానికే ఖర్చు చేస్తే.. రాష్ట్రాల్లో కొవిడ్ నియంత్రణ ఏర్పాట్లకు నిధులుండవని చెప్పింది. అంతేగాకుండా తుఫాన్లు, వరదల వంటివి వచ్చినప్పుడు వాటి కోసమూ నిధులు కావాల్సి ఉంటుందని కోర్టుకు చెప్పింది. కాబట్టి.. కరోనాతో మరణించిన ప్రతి ఒక్కరికీ పరిహారం ఇవ్వాలంటే.. రాష్ట్రాల ఖజానాకు మించిన భారమవుతుందని కేంద్రం తన అఫిడవిట్ లో తెలిపింది.  బాధితుల బీమా చెల్లింపులకు సంబంధించి జిల్లా కలెక్టర్లు దరఖాస్తులను ఇన్సూరెన్స్ సంస్థలకు పంపించారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే బీమా సంస్థలకు రూ.442.4 కోట్ల నిధులను విడుదల చేశామంది. 2019–2020లోనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.1,113.2 కోట్ల అదనపు నిధులను విడుదల చేశామని వివరించింది. మొత్తంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్స్ ప్రిపేర్డ్ నెస్ ప్యాకేజ్ కింద ఇప్పటిదాకా రూ.8,257.89 కోట్ల నిధులను ఇచ్చామని సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కార్ వెల్లడించింది.

జగన్ మూర్ఖ వైఖరితో ఏపీకి నష్టం! కేసీఆర్ సంచలనం..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. గత రెండేండ్లు ఇద్దరు సఖ్యతగానే ఉంటూ వచ్చారు. జగన్ కు తనకు అత్యంత సన్నిహితుడని తెలంగాణ సీఎం కేసీఆర్ ఓపెన్ గానే చెప్పారు. కేసీఆర్ హీరో అంటూ ఏపీ అసెంబ్లీలోనే పొగిడారు జగన్నోహన్ రెడ్డి. అలాంటిది ప్రస్తుతం ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. ఏపీ సీఎం జగన్ తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ సర్కార్ వ్యవహారంపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. తాజాగా మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో.. ఏపీతో యుద్ధానికి ఆయన సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కేబినెట్ సమావేశంలో జగన్ ను ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారని సమాచారం.  అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకతారం కేబినెట్ భేటీలో జగన్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. జగన్‌ మూర్ఖుడిలా వ్యవహరిస్తున్నారని ….మూర్ఖత్వంలో జగన్‌ తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డిని మించిపోయారని కేసీఆర్ అన్నట్టు సమాచారం . కృష్ణా బేసిన్‌లో ఏపీ సర్కారు అక్రమ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా కేసీఆర్ ఈ విధంగా విమర్శలు గుప్పించారట. నిబంధనలకు విరుద్ధంగా జగన్ సర్కార్ పలు అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని, ఒక రాష్ట్ర సీఎంగా జగన్‌కు చట్టాలపై ఏమాత్రం గౌరవం లేదని కేసీఆర్ అన్నట్టు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని, ఇందుకోసం అవసరమైతే కోర్టులకు వెళదామని, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలందరితో ఢిల్లీలో ధర్నా చేయాలని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. జగన్ కు చెక్ పెట్టేందుకు తెలంగానలోనూ ఏడెనిమిది ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని కూడా కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీతో తాడోపేడో తేల్చుకుంటామని కూడా కేసీఆర్ చెప్పారట. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని  కేబినెట్ అభిప్రాయపడింది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను తెలంగాణ కేబినెట్ తీవ్రంగా నిరసించింది. ఏపీ  ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీంకోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ  కేబినెట్ కు తెలిపింది. ఎన్ జీ టీ తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేస్తుందని తెలంగాణ కేబినెట్ ఆరోపించింది.  ఇప్పటివరకు ఏపీ సీఎం జగన్ మోనార్క్ అని ….ఎవరు చెప్పినా వినరని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ది తుగ్లక్ పాలన అని…ఆయన తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల, మూర్ఘపు చర్యల వల్ల ఏపీ అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోతోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. విపక్షాలు కాబట్టి విమర్శించాయిలే అని వైసీపీ నేతలు సర్ది చెప్పుకుంటున్న తరుణంలో సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం ఆసక్తిగా మారింది. అంతేకాదు జగన్ తీరుతో ఏపీకి నష్టం జరుగుతుందనే చర్చ జరుగుతోంది. జగన్ తీరుతో కృష్ణా నదిపై కేసీఆర్ కొత్త ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే ఎగువ నుంచి శ్రీశైలానికి నీరు రావడం కష్టం. ఏపీకి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇవేమి ఆలోచించకుండానే.. సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ది పొందాలనే ఉద్దేశ్యంతో జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల నుంచి కూడా వస్తోంది.   

ఉపఎన్నిక కోసమే లాక్ డౌన్ ఎత్తేశారా? సాగర్ లా కల్లోలమేనా.. 

తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తేసింది. అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది.జూలై 1 నుంచి స్కూల్స్ కూడా ప్రారంభించాలని ఆదేశించింది. శనివారమే లాక్ డౌన్ సడలింపులపై కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు ఇచ్చింది. లాక్ డౌన్ సడలింపుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఒకేసారి కాకుండా విడతల వారీగా లాక్ డౌన్ సడలింపులు ఉండాలని చెప్పింది. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం  సంపూర్ణంగా లాక్ డౌన్ ను ఎత్తేసింది. కేసీఆర్ సర్కార్ నిర్ణయంపై జనాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కొవిడ్ థర్డ్ వేవ్ తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండగా... లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి.  రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత ఇంకా ఉంది. ఇప్పుడు కూడా రోజు 14 వందలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కల కంటే ఎక్కువగానే కేసులు వస్తున్నాయని చెబుతున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలో ప్రమాదకరంగానే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.  యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో దాదాపు 80 వరకు పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఆ గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వచ్చంద లాక్‌డౌన్ విధించుకుంది. అది పూర్తయ్యేలోపే రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం మగ్దుంపల్లి గ్రామంలో శనివారం ఒక్క రోజే 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు వీరంతా యువకులే. ఇంకా గ్రామంలో పాజిటివ్ కేసులు మరో రెండు మూడు రోజుల్లో బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి గ్రామాలు ఇంకా చాలానే ఉన్నాయంటున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎలా ఎత్తివేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి.  ఎన్నికల కోసమే ఎత్తేశారా? తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఆరు సీట్లు ఖాళీ అయ్యాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ అసెంబ్లీ ఖాళీగా ఉంది. దీంతో  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకోవడం కోసమో.. హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమో లాక్‌డౌన్ ఎత్తేశారా..? అన్న సందేహాలూ వెల్లువెత్తుతున్నాయి.  ఈ సమయంలో హుజూరాబాద్ ఉపఎన్నికలను నిర్వహిస్తే.. కరోనా మళ్లీ విజృంభించడం ఖాయమంటున్నారు. రానున్న రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడమనేది సాహసమే. గత ఏప్రిల్ లో జరిగిన నాగార్జునసాగర్ ఉన్నిక నేపథ్యంలో కరోనా విలయ తాండవం చేసింది. సాగర్ లో విజయం సాధించేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలతో పాటు ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరీ ప్రచారం చేశారు. టీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారి కేడర్, నేతలంతా సాగర్ నియోజకవర్గంలో దింపింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. భారీ సమావేశాలు, సభలు పెట్టి పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీంతో కరోనా వైరస్ సాగర్ నియోజకవర్గంలో విలయతాండవం చేసింది. పదుల సంఖ్యలో కరోనా కారణంగా ప్రాణాలొదిలారు. సాగర్ ఉపఎన్నిక ప్రక్రియ ముగిసి దాదాపు రెండు నెలలు కావొస్తున్నా.. దాని ప్రభావం మాత్రం ఇంకా పోనేలేదు.  నాగార్జున సాగర్ పరిస్థితి కనిపిస్తున్నా..  కేసీఆర్  ప్రభుత్వం మాత్రం మరో ఉపఎన్నిక కోసం సిద్ధమవుతుందనే టాక్ వస్తోంది. ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్ కు ఉపఎన్నిక నిర్వహణను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహణ కోసం సంపూర్ణ లాక్‌డౌన్ ఎత్తేస్తున్నట్టు రాష్ట్ర కేబినేట్ నిర్ణయం తీసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. విపక్షాలు, జనాలు అనుమానిస్టున్నట్లు హుజురాబాద్ ఎన్నిక కోసమే లాక్ డౌన్ ఎత్తివేస్తే మాత్రం.. అది తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే టీఆర్ఎస్ మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండిస్తోంది. ఎమ్మెల్సీ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదని చెబుతోంది. 

నాన్నకు ప్రేమతో.. ఫాదర్స్ డే ఎలా వచ్చిందో తెలుసా.. 

నాన్న.. రెండు అక్షరాల అందమైన పదం.. ప్రతిమకు ప్రతిబింబం.. అబద్ధపు నిజం.. వెలుగు కింద దీపం నాన్న..నాన్నెందుకో వెనకబడ్డాడని సినీ కవి తనికెళ్ల భరణి ఎందుకన్నారోగానీ నాన్న ఎప్పుడూ ముందే ఉన్నాడు. మరీ అందరి కంటే ముందు వరుసలోనే ఉంటాడు. బిడ్డలకు కడుపు నింపడానికి నాన్న పస్తులుంటాడు. పండుగ వేళ కొత్త దుస్తులు కుట్టించి తను మాత్రం ముడతలు పట్టిన పాత బట్టలే వేసుకుంటాడు. పిల్లలు చేసిన తప్పులకు తాను నిందలు భరిస్తాడు. వారిని బాగా చదివించడానికి, గొప్పింటి సంబంధం కుదుర్చడానికి స్థాయిని మించి అప్పులు చేస్తాడు. నాన్న ఎప్పుడూ ముందే ఉంటాడు. అందుకే నాన్నను అందుకోవడం నా వల్ల కాదు., నాన్నకు నేను దొరకడం అంతకన్నా కాదు...  నాన్న మొదట జన్మనిచ్చిన వాడే అయినా పిల్లలు పెరుగుతుంటే వారితో పాటు తను పాత్రను మార్చుకుంటూ నడక సాగిస్తాడు. బాల్యంలో తండ్రిగా, ఐదేళ్లు దాటిన తర్వాత గురువుగా, పదేళ్ల నుంచి గైడ్, యుక్త వయస్సు తర్వాత స్నేహితుడిగా ఇలా తండ్రి అన్ని పాత్రలు పోషిస్తుంటాడు. బిడ్డకు మొదటి మిత్రుడు నాన్న. ఆ మాటకొస్తే తల్లి జన్మనిస్తే తండ్రి సమాజాన్ని పరిచయం చేస్తాడు. వీళ్లు నా బిడ్డలు అని చెప్పుకునే స్థాయి నుంచి నేను వాళ్ల తండ్రిని అని గర్వపడేందుకు తీవ్రంగా శ్రమించే వాడే నాన్న.  ఓర్పునకు, సహనానికి మారుపేరు నాన్న. అతడంటే నమ్మకం, ధైర్యం. పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ఆయుధం. ఓడినప్పుడు ప్రపంచమంతా మనల్ని అదోలా చూస్తున్నా, వ్యతిరేకిస్తున్నా నేనున్నాను, నీకేం కాదు అంటూ భరోసా నింపే ఒకే ఒక్కడు నాన్న. తల్లి చూపులు, చేతల్లో ప్రేమ కనిపిస్తుంది.., కానీ నాన్న మాటలో ఆర్థ్రతతో కూడిన కఠినత్వం కనిపిస్తుంది. బిడ్డల పట్ల ప్రేమగా ఉన్నా, అదే సమయంలో కోపంతో కూడిన బాధ్యత కూడా ఉంటుంది. భూమి మీదకు రావడానికి కారణమైన నాన్నను ఈ ఒక్క రోజుతో గుర్తు చేసుకుని, మరచిపోవడం పితృదినోత్సవ ముఖ్య ఉద్దేశం కాదు. ముమ్మాటికీ నాన్న గొప్పతనం చెప్పడానికి ఈ ఒక్కరోజు సరిపోదు. కానీ ఓ సందర్భం. ప్రతీ రోజు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ, వారికి జన్మంతా రుణపడి ఉండడానికి ప్రయత్నించడమే మనం వారికిచ్చే కానుక.. ఫాదర్స్ డే ఎప్పుడంటే..  ప్రతి సంవత్సరం జూన్ నెల మూడో ఆదివారం ఫాదర్స్ డే జరుపుకుంటారు. సుమారు 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. నాన్నంటే బాధ్యతకు మారుపేరుగా భావించి ఆ రోజును కేటాయించాలని యూఎస్ కు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను జరుపుకున్నారు. తరువాత నాన్నల వందన దినోత్సవానికి ఆదరణ పెరిగింది. 1972 నుంచీ ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని ఫాదర్స్ డే ప్రకటించి జరుపుకుంటున్నారు.సాంప్రదాయకంగా, ఫాదర్స్ డే 2021 మార్చి 19 న పోర్చుగల్‌లోని స్పెయిన్‌లో, ఆగస్టు 8 న తైవాన్‌లో, డిసెంబర్ 5 న థాయ్‌లాండ్‌లో జరుగుతుంది. ఈ సంవత్సరం భారతదేశంలో ఫాదర్స్ డే జూన్ 20 న జరుపుకుంటారు. ఫాదర్స్ డే వేడుక ఎలా ప్రారంభమైంది? ఫాదర్స్ డే 2021 జరుపుకోవడం వెనుక భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించిందనే నమ్మకం కూడా ఉంది. మదర్స్ డేకి సమానంగా అధికారికంగా ఫాదర్స్ డే కూడా జరపాలి అనేది ఆమె ఉద్దేశం. జూన్ 20, 1910 న, వాషింగ్టన్ సిటీ మేయర్ ఈ రోజును ఫాదర్స్ డేగా ప్రకటించారు. కాని మే 1, 1972 న, అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఫాదర్స్ డేను జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. మొదటి అధికారిక ఫాదర్స్ డే కార్యక్రమం జూన్ 18, 1972 న జరుపుకున్నారు. కోవిడ్ -19 కి సంబంధించిన ఆంక్షలు క్రమంగా సడలించడం ప్రారంభించాయి, కాబట్టి మీరు ఈ రోజును మీ తండ్రితో ప్రత్యేక మార్గంలో గడపవచ్చు.

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారా? అయితే వెంటనే మీరు ఇలా చేయండి.. 

దేశంలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయి. కొవిడ్ లాక్ డౌన్ లో ఈ కేసులు మరింత పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయలకులకు వల వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. దేశంలో పెద్ద సమస్యగా మారిన సైబర్ క్రైమ్ పై కేంద్ర హోంశాఖ ఫోకస్ చేసింది. ఫిర్యాదు కోసం దేశ వ్యాప్తంగా ఒక నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సైబర్ నేరగాళ్ల  చేతిలో మోసపోయిన వారు.. వెంటనే ఆ నెంబర్ కు ఫోన్ చేస్తే.. డబ్బు బదిలీని అడ్డుకోవచ్చు.   సైబర్‌ నేరగాళ్లు వివిధ పద్దత్తుల్లో తమ పని కానిచ్చేస్తున్నారు.  మాయమాటలతో జనాలను బుట్టలో వేసుకుంటున్నారు. వాళ్లను  నమ్మి సొమ్ము బదిలీ చేస్తున్నారు. ఓటీపీలు,క్రెడిట్‌కార్డుల వివరాలు చెప్పేస్తున్నారు. సామాన్య జనాలే కాదు ఉన్నత విద్యావంతులు, ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి వ్యక్తులు కూడా సైబర్ వలలో చిక్కుకుంటున్నారంటే కేటుగాళ్లు ఎంతలా స్కెచ్ వేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగా మీరు సైబర్‌క్రైమ్‌ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసే లోపే నేరగాళ్లు డబ్బును తమ ఖాతాల నుంచి ఉపసంహరించేసు కుంటారు.   ఇలాంటి మోసాలను ఆపి నేరగాళ్ల అకౌంట్లను స్తంభింపజేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక వ్యవస్థను రూపొందించింది. మోసాన్ని గుర్తించి (మీ అకౌంట్ల నుంచి డబ్బు పోయినట్లు గుర్తించగానే) వెంటనే ఫిర్యాదు చేసేందుకు కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 155260 అమల్లోకి తెచ్చింది.ఏప్రిల్‌లో ఈ నంబర్‌ను ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో కొచ్చింది.  ఆర్‌బీఐ సహా అన్ని ప్రధాన బ్యాంకులు,పేమెంట్‌ బ్యాంకులు,వ్యాలెట్లు, ఆన్‌లైన్‌ వాణిజ్య సంస్థ సహకారంతో ఈ హెల్ప్‌లైన్‌ను హోంశాఖ ఆధ్వర్యంలోని ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సి) నిర్వహిస్తోంది. ఈ మేరకు సిటిజెన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్,మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది.       ఏడు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో (ఛత్తీస్‌గఢ్,ఢిల్లీ, మధ్యప్రదేశ్,రాజస్తాన్, తెలంగాణ,ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌) హెల్ప్‌లైన్‌ అమల్లో ఉంది. డబ్బును ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేసిన తర్వాత త్వరగా ఫిర్యాదు చేస్తే వెనక్కి రప్పించడానికి ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సదరు డబ్బు డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ నుంచి బయటకు వెళ్లక ముందే అప్రమత్తమైతే చాలా వరకు వెనక్కి వస్తుందని అంటున్నారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును సైబర్‌ నేరస్తులు ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు..ఇలా ఐదు బ్యాంకుల ఖాతాల్లోకి మార్చినప్పటికీ సిటిజెన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్,మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా అధికారులు వెనక్కి రప్పించ గలిగారు.సో. అందరూ కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన ఈ నెంబర్ ను ఫోన్ లో సేవ్ చేసి పెట్టుకోండి... 

జగన్ రెడ్డికి కేసీఆర్ షాక్.. ఇక సమరమే! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన జిగ్రీ దోస్తీ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఊహించని షాక్ ఇచ్చారు. జగన్ రెడ్డి సర్కార్ పై సమరనాదం మోగించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఏపీతో తాడోపేడో తేల్చుకుంటామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్ డిఎస్) కుడి కాల్వ నిర్మాణాలను తెలంగాణ కేబినెట్ తీవ్రంగా నిరసించింది. ఏపీ  ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించిందని, సుప్రీంకోర్టులో కేసులు వేసిందనీ నీటిపారుదల శాఖ  కేబినెట్ కు తెలిపింది. ఎన్ జీ టీ తో పాటు కేంద్రం కూడా ఆదేశించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలను బేఖాతరు చేస్తుందని తెలంగాణ కేబినెట్ ఆరోపించింది. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని  కేబినెట్ అభిప్రాయ పడింది.  ఏపీ ప్రభుత్వం తలపెట్టిన  ప్రాజెక్టుల వలన.. పాలమూరు, నలగొండ,ఖమ్మం,వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు.. హైద్రాబాద్ కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరగనున్ననేపథ్యంలో.. న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నీటి వాటాను దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళతామని కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కొత్తగా పలు ప్రాజెక్టులు చేపడట్టాలని తీర్మానించారు. జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య కృష్ణా నదిపై అలంపూర్ వద్ద.. గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో.. బారేజీ (జోగులాంబ) ని నిర్మించి 60-70 టిఎంసీల వరద నీటిని పైపు లైను ద్వారా తరలించాలని కేసీఆర్ కేబినెట్ నిర్ణయించింది.  దీంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్బాగమయిన ఏదుల రిజర్వాయర్ కు ఎత్తిపోసి, పాలమూరు కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని కేబినెట్ నిర్ణయించింది. పులిచింతల ఎడమ కాల్వను నిర్మాణం చేసి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. సుంకేశుల రిజర్వాయర్ నుంచి మరొక ఎత్తిపోథల పథకం ద్వారా నడిగడ్డ ప్రాంతానికి మరో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించింది. కృష్ణా ఉపనది అయిన భీమా నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించే ప్రాంతమైన కృష్ణ మండలంలోని కుసుమర్తి గ్రామం వద్ద.. భీమా వరద కాల్వను నిర్మించాలని నిర్ణయించింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాశయాల నిల్వ సామర్ధ్యాన్ని 20 టిఎంసీలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. నాగార్జున సాగర్ టేల్ పాండ్ నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు, సాగునీటి సౌకర్యం కల్పించాలనే ఆలోచన చేసింది.  తెలంగాణకు కృష్ణా జలాలపై  హక్కులను పరిరక్షించుకొని తెలంగాణ రైతులను, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి కార్యాచరణ నిర్ణయించింది కేసీఆర్ సర్కార్. ఈ విషయంలో ప్రధాన మంత్రిని, కేంద్ర జల శక్తి మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించి.. ఏపీ ప్రాజెక్టులను ఆపించే విధంగా చూడాలని నిర్ణయించింది.  ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానాలతో రపాటు రాబోయే వర్షకాల పార్లమెంటు సమావేశాల్లో గళం విప్పి.. జాతికి వివరించాలని అభిప్రాయం వ్యక్తమైంది. ఆంధ్ర ప్రదేశ్  ప్రాజెక్టుల పర్యవసానంగా కృష్ణా బేసిన్ ప్రాంతాలకు సాగునీటి రంగంలో జరిగబోయే తీవ్ర నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయించింది.  

ఆ జిల్లా పేరు మారనుందా? వివాదం కానుందా? 

తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 10 జిల్లాలు మాత్రమే ఉండగా.. కేసీఆర్ సర్కార్ 10 జిల్లాలను విభజించి 33 జిల్లాలు చేసింది. గతంలో ఉమ్మడిగా ఉన్న కొన్ని జిల్లాలు ఐదు ముక్కులు ,కొన్ని నాలుగు ముక్కలు , కొన్ని మూడు ముక్కలు అయ్యాయి. మరికొన్ని ఉమ్మడి జిల్లాలను రెండుగా విభజించారు. కొన్ని జిల్లాలకు దేవతల పేర్లు కూడా పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, జోగులాంబ గద్వాల ఆ కోవలోనివే. జయశంకర్, కొమరం భీమ్ పేర్లు కూడా జిల్లాలకు పెట్టారు. అయితే తాజాగా ప్రస్తుతం ఉన్న ఒక జిల్లా పేరు మార్చబోతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయంపై అక్కడి ప్రజలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది. కొత్త వివాదం అవుతుంగా.. అంతా సాఫీగానే సాగుతుందా అన్న చర్చ కూడా మొదలైంది.  ఈనెల 21న సీఎం కేసీఆర్ వరంగల్‌లో పర్యటించనున్నారు. సెంట్రల్ జైలు స్థానంలో నిర్మించ తలపెట్టిన సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు.కేసీఆర్ కాళోజీ హెల్త్ వర్సిటీ, కొత్త కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల విభజనలో వరంగల్ ఐదు ముక్కలైంది. భూపాలపల్లి, జనగామ, ములుగుతో పాటు వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయితే వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ పేర్లను మార్చాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు ఎర్రబెల్లి. వరంగల్ రూరల్ జిల్లాకు వరంగల్ పేరు ఖరారు చేస్తూ.. వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండగా సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.  మంత్రి ఎర్రబెల్లి ప్రకటన వరంగల్ లో చర్చనీయాంశంగా మారింది. జిల్లాల విభజన సమయంలోనే వరంగల్ రూరల్, అర్బన్ పేర్లపై అసంతృప్తి వ్యక్తమైంది. హన్మకొండ పేరు పెట్టాలనే డిమాండ్ వచ్చింది. వరంగల్ రూరల్ కేంద్రంగా నర్సంపేటను ప్రకటించాలని కొందరు ఆందోళన చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. తాజాగా జిల్లాల పేర్లు మార్పు తెరపైకి రావడంతో జనాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్, హన్మకొండ పేర్ల పెడితే ఎక్కువ మంది జనాలు సంతృప్తి వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ పేర్లు కాకుండా వరంగల్ తో సంబంధం లేని పేర్లు పెడితే మాత్రం జనాల నుంచి వ్యతిరేకత రావొచ్చని చెబుతున్నారు. మరీ ముఖ్యమంత్రి పర్యటనలో ఏం ప్రకటిస్తారో చూడాలి మరీ.. 

ఇక ప్రెస్ కాన్ఫరెన్సులకు A’ సర్టిఫికేట్ ..? ఏపీలో బూతు మంత్రుల జోరు? 

నోరు మంచిదైతే ... ఊరు మంచిదవుతుందని, సామెత. అయితే ఈ మధ్య కాలంలో రాజకీయనాయకులు ఎంతగా నోరు పారేసుకుంటే అంతగా పాపులారిటీ పెరిగిపోతుందని అనుకుంటున్నారో ఏమో కానీ, అశుద్ధంతో సమానమైన, అంతకంటే నీచమైన భాషను నోటి ద్వారా విసర్జిస్తున్నారు. నిజమే, రాజకీయలలో ఉన్నప్పుడు, కొన్ని సందర్భాలలో మాటకు మాట, తూటాకు తూటా అన్న రీతిలో సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కానీ, తెలుగునాట, ముఖ్యంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికార పార్టీలో అందరూ కాకపోయినా, కొందరు, ముఖ్యంగా ‘బూతుల మంత్రి’గా పేరొందిన గౌరవ మంత్రి గారు మరో కొందరు అసహ్యంగా, అసభ్యంగానే కాదు, ఆ స్థాయి జనాలు కూడా ఛీ’ అని చీదరించుకునే స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. అందుకే అధికార పార్టీ, బూతులను అధికార భాషగా ఎంచుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  కర్నూల్ జిల్లా పెసరవాయిలో జరిగిన టీడీపీ నాయకులు జంట హత్యలకు సంబందిచి, టీడీపీ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహజంగానే కొంత తీవ్రంగా స్పందించారు.  ఈ హత్యలపై  సీబీఐ విచారణ  డిమాండ్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే లోకేష్ వ్యాఖ్యలపై  స్పందించిన మంత్రి కొడాలి నానీ వాడిన భాష, చాలా చాలా ఛండాలంగా, అసభ్యంగా ఉందని, సీనియర్ విలేకరులు చీదరించుకుంటున్నారు. “గతంలోనూ ఇటు చట్టసభల్లో అటు మీడియా సమావేశాలు, ఇతర వేదికల నుంచి మంత్రులు, ఇతర నాయకులు  తమ రాజాకీయ ప్రత్యర్ధులను దూషించడం, దుర్భాషలాడడం చూశాం, కానీ, మంత్రులు ఈస్థాయిలో దిగజారిన సందర్భాలు లేవు” అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక విధంగా బాధను వ్యక్త పరిచారు.  ఒక్క కొడాలి నాని మాత్రమే కాదు, వైసీపీలో ఇలాంటి దిగజారుడు భాషను ప్రయోగించే వారు ఇంకా ఉన్నారు.గతంలో అనేక సందర్భాలలో మఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా అనేక మంది వైసీపీ నాయకులు సభ లోపలా వెలుపలా ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు,చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, ప్రతిపక్ష నేతను సంభోదించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. అయితే, దున్నపోతు మీద జడివాన లాగా వాటిని తుడిచేసుకుని,  ముఖ్యమంత్రి ప్రాబల్యం కోసం కొందరు, పై వారి ఆదేశాల మేరకు కొందరు పోటీపడి దిగజారిన బూతు భాషను, అచ్చోసిన ... లా యధేచ్చగా వాడిన  సందర్భాలు  అనేకం ఉన్నాయి.నిజమే, ఒక్క వైసీపీ మాత్రమే దిగజారిందని, ప్రతిపక్ష పార్టీలు ఎక్కడా గీత దాటలేదని కాదు. విపక్షాలు, ముఖ్యంగా తెలుగు దేశంపార్టీ నాయకులు కొందరు, కొన్ని కొన్ని సందర్భాలలో ప్రెస్ కాంఫెరేన్సులలో,మీడియా చర్చల్లో నోరు జారిన సందర్భాలున్నాయి. అయితే, అలాంటి సందర్భాలలో పార్టీ నాయకత్వం వారిని మందలించడం, క్షమాపణ చెప్పించడం ఉండేది. కొన్ని కొన్ని సందర్భాలలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా క్షమాపణలు చెప్పారు. కానీ, జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహర్సితున్నారని, అయన వ్యవహార శైలిని దగ్గరగా చూస్తున్న పాత్రికేయులు అంటున్నారు.   చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు చివరకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా కొన్ని సందర్భాలలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. అలాగే  క్షమాపణలు కూడా చెప్పారు. కానీ, ఆయన కుమారుడే అయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో అలాంటి లక్షణాలు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదని, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ప్రతిపక్ష  నాయకులను దూషించడం, దుర్భాషలాడడంలో ఆయన ఒక విధమైన ఆనందం పొందుతున్నారని సీనియర్ పాత్రికేయులు అంటున్నారు. ఒక విధంగా చూస్తే, ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు అన్నట్లుగా , ‘జగన్ రెడ్డిలో శాడిజం ఛాయలు చాలా బలంగా ఉన్నాయని పిస్తుందని, అందుకే అయన మెప్పు కోసం కొందరు వైసీపీ నాయకులు తమ స్థాయిని దిగాజార్చుకుని, బజారు బాషకంటే దిగజారుడు భాషలో మాట్లాడుతున్నారని’ సీనియర్ పాత్రికేయుడు ఒకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.  వైసీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలోనూ చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2 ముద్దాయి విజయసాయి రెడ్డి, పెద్దల సభ సభ్యుడిని అనే విషయం మరిచి పోయి చేస్తున్న వ్యాఖ్యలను నెట్’ జనులు కామెంట్ల రూపంలో అసహ్యించుకుంటున్నారు.అలాగే, విజయ సాయి మీడియా సమావేశాలో, ట్వీట్స్ లో వాడే భాష పట్ల కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా దాతృత్వానికి మారు పేరుగా నిలిచిన గజపతుల వంశంలో పుట్టిన అశోక గజపతి రాజును ‘దొంగ’ అని సంభోదించడం,ఆయన భూములు కాజేశారని ఆరోపించడం, జైలుకు వెళ్తారని చెప్పడం నెట్జనులే కాదు అందరూ తప్పుపడుతున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా, అందులో నిజానిజాలు ఎలాఉన్నా, భాష విషయంలో జాగ్రత్త పడక పోతే, ఇప్పటికే అసహ్యించుకుంటున్న ప్రజలు రేపు ఇంకో అడుగు ముందుకేస్తారని హెచ్చరిస్తున్నారు. ఈపరిస్థితులను గమనిస్తే, ఇక ముందు కొందరు నేతల ప్రెస్ కాన్ఫరెన్సులకు, ఏ(అడల్ట్స్ఓన్లీ)సర్టిఫికేట్ అవసరం అవుతుందేమో ..

రెండు మామిడి చెట్లకు.. ముగ్గురు  గార్డులు, 9 కుక్కలు కాపల..

ముగ్గురు గార్డులు, 9 కుక్కలు అంతా సెక్యూరిటీ అంటే  ఎంఎల్ఏ సెక్యూరిటీనో , మంత్రి కోసం, లేదంటే సెలబ్రెటీ కోసమో కాదు, బంగారం షాప్ ముందు అంతకన్నా కాదు.. మామిడి కాయల కోసం ముగ్గురు గార్డులు, 9 కుక్కలను కాపలాపెట్టారు.  అదేంటి మామిడి కాయల కోసం అంతా సెక్యూరిటీ ఏంటని అనుకుంటున్నారా..? అది అంతే మార్కెట్ లో ఆ మామిడి కాయల ధర అలా పలుకుతుంది.. అందుకే అంతా సెక్యూరిటీ ని పెట్టారు. అంతక ముందు కూడా మీరు ఈ వార్త చదివే ఉంటారు తాజాగా అక్కడ సెక్యూరిటీ ని ఆరెంజ్ చేశారు.  అంతే కాదు. ఆ మామిడి కాయలను పసిపిల్లవాడిలా కాపాడుతున్నారు. ఆ మామిడి కాలయాలకు ఎండ నుండి కాపాడ్డానికి కవర్ కట్టారు. నిజంగా మనుషులకంటే ఎక్కువ మామిడికాయలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం చూస్తే .. డబ్బులు ఉంటేనే మనుషులకు విలువ అని మరో సారి రుజువైంది. మధ్యప్రదేశ్‌‌లోని జబల్‌పూర్‌కు చెందిన సంకల్ప్, రాణి పరిహార్ అనే జంట మామిడి చెట్ల కోసం ముగ్గురు గార్డులను, తొమ్మిది కుక్కలను కాపాలాగా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆ చెట్లకు కాసే మామిడి పండ్ల విలువ అలాంటిది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన మియాజకీ మామిడి పండ్లను అతడు పండిస్తున్నాడు. జపాన్ జాతికి చెందిన ఈ మామిడి పండ్లు మార్కెట్లో కిలో సుమారు మూడు లక్షల వరకు ఉంటుంది. ముదురు ఎరుపు రంగులో ఉండే ఈ పండ్ల రుచి, నాణ్యత అద్భుతంగా ఉంటుందట. ప్రస్తుతం ఆ తోటలోని 2 మామిడి చెట్లకు 7 పండ్లు కాస్తున్నాయి. గతేడాది కొందరు సంకల్ప్ తోటలోకి ప్రవేశించి పండ్లను ఎత్తుకెళ్లిపోయారు. దీంతో ఈ సారి వాటి కాపాలా కోసం ముగ్గురు గార్డులను, 9 కుక్కలను ఏర్పాటు చేశాడు.  

ఆరు లక్షల ఉద్యోగాలెక్కడ జగన్ రెడ్డి! ఆర్టీసీలో కొత్తగా ఇచ్చినవెన్ని? 

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ఉద్యోగ విప్లవం తీసుకొచ్చిందా? రెండేండ్లలోనే ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించిందా ? ఉద్యోగ కల్పనపై ఇటీవల ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటన ఇప్పుడు చర్చగా మారింది. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్నది ఆసక్తిగా మారింది. ప్రభుత్వం చెబుతున్నట్టు రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా  ఉపాధి లభించిందా అన్న ప్రశ్నకు కాదనే జవాబే వస్తుంది. ప్రభుత్వ లెక్కలన్ని తప్పుడు తడకని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం చెప్పిన లెక్కలను  పరిశీలించినప్పుడు వాటిలో తాత్కాలిక సచివాలయ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగులతో పాటు ఆర్టీసీ ఉద్యోగులను కలిపి చూపించినట్లు అర్థమవుతోంది.   ఉద్యోగాల కల్పనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన సందర్భంగా.. గత రెండేళ్లలో ఆరు లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. అందులో సుమారు రెండు లక్షలు శాశ్వత ఉద్యోగాలని చెప్పింది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ భద్రతనిచ్చామని అంటోంది. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన గతంలో ఎప్పుడూ జరగలేదని గొప్పగా ప్రకటించుకుంది. రెండేళ్లలోనే జగన్ హయంలో 6,03,756 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చింది. అంతేకాదు అవినీతి, ఆశ్రిత పక్షపాతం, లంచాలకు కూడా తావు లేకుండా ఈ నియామకాలు చేసినట్టు తెలిపింది.అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియమాకాలు కూడా అవినీతి లేకుండా చేశామని చెబుతోంది. దళారీల బెడద లేకుండా వారికి ప్రతీనెలా 1వ తేదీనే వేతనాలు వచ్చేలా ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని చెబుతోంది. ఏటా రూ.3,600 కోట్లు భారం పడుతున్నా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా 51,387 మందికి ఉద్యోగ భద్రత కల్పించామని ఘనంగా ప్రకటించింది జగన్ రెడ్డి ప్రభుత్వం.  అయితే ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగాల లెక్కలపై లోతుగా పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు వాస్తవాలకు పొంతనలేదని తేలింది. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత 2019 ఆగస్టు నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. వాటి పరిధిలో రాష్ట్రవ్యాప్తగా 1,21,518 మందికి ఉద్యోగాలు కల్పించారు.  ఇవన్నీ శాశ్వత ఉద్యోగాలని సర్కార్ చెబుతోంది. కానీ  ఇప్పటి వరకూ సచివాలయ ఉద్యోగులకు సర్వీస్ రిజిస్ట్రర్‌లో నమోదు ప్రక్రియ పూర్తికాలేదు. వారికి కేవలం ప్రొబేషనరీ పిరియడ్ పేరుతో ప్రస్తుతం నెలకు రూ. 15 వేలు వేతనం మాత్రమే ఇస్తున్నారు. పీఎఫ్ సహా ఇతర సదుపాయాలేమీ అందడం లేదు.దీంతో వీరంతా సర్కార్ ఉద్యోగులు ఎలా అవుతారన్నది ప్రశ్న.  అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 2,59,565 మందికి వాలంటీర్లుగా ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.  వారికి అప్కోస్ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నా, ఇతర ప్రయోజనాలు మాత్రం లేవు. మొదట కేవలం నెలకు రూ. 5 వేలు మాత్రమే జీతంగా ఇవ్వడంతో వాలంటీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సీఎం జగన్ వాలంటీర్లకు లేఖలు  రాశారు. ఫిబ్రవరి 16న రాసిన లేఖలో వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, కేవలం వాలంటీర్లు మాత్రమేననే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పారు. ముఖ్యమంత్రే వాలంటీర్లు ఉద్యోగులు కాదని చెప్పగా.. తాజా ప్రకటనలో మాత్రం వారిని ప్రభుత్వ ఉద్యోగాల జాబితాలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా పేర్కొనడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో ఆప్కోస్ ద్వారా 95,212 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు పేర్కొన్నారు. కానీ, వాస్తవానికి గతం నుంచి పనిచేస్తున్న సిబ్బందిని కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పరిధిలోకి తీసుకువచ్చారని తేలింది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది అందరినీ రెగ్యులర్ చేస్తామని, ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేసిన జగన్ ఇప్పుడు దానికి భిన్నంగా... గతం నుంచి పనిచేస్తున్న సిబ్బందిని కార్పొరేషన్ ఉద్యోగులుగా చూపించడం విడ్డూరంగా ఉందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఇక రవాణా, రోడ్లు భవనాల శాఖ పేరుతో ఆర్టీసీ ఉద్యోగులు 51,387 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు ప్రభుత్వ ప్రకటనలో ఉంది. కానీ వారంతా ఏపీఎస్ఆర్టీసీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులే. ప్రభుత్వరంగ సంస్థ కార్పోరేషన్‌లో కూడా వారంతా శాశ్వత ప్రాతిపదికన ఉపాధి పొందుతున్న వారే. ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి నేరుగా ప్రభుత్వ పరం కావడంతో వారు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. కానీ  దానిని కూడా ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం ప్రస్తావించింది. 6 లక్షల ఉద్యోగాల్లో ప్రభుత్వం 50 వేల మంది ఆర్టీసీ సిబ్బందిని కూడా కలిపేసింది. ఆర్టీసీ సిబ్బందిని కూడా కొత్త ఉద్యోగాల కల్పనలో చూపించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పకుండా.. ఈ దొంగ లెక్కలు ఎందుకని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  మరోవైపు కొవిడ్ సేవల కోసం తాత్కాలిక ప్రాతిపదికన 26,325 మందిని నియమించినట్టు ప్రభుత్వం చెబుతోంది. అయినా అత్యవసర సేవల కోసం తాత్కాలిక ప్రాతిపదికన నియమించిన ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో భాగంగా చూపించారు. గత ఏడాది కరోనా ఉధృతి సమయంలో తీసుకున్న ఉద్యోగులను ఆ తర్వాత తొలగించారు.సెకండ్ వేవ్ సందర్భంగా అదనంగా వైద్యులు సహా అనేక విభాగాల్లో నియామకాలు చేశారు. వీళ్లను ఎంత కాలం కొనసాగిస్తారో తెలియదు. అయినా వీళ్లందరిని కూడా  కొత్త ఉద్యోగుల జాబితాలో జగన్ రెడ్డి ప్రభుత్వం చూపించింది.  

అనంత జిల్లాలో డబుల్ మర్డర్.. మళ్లీ ఫ్యాక్షన్ పడగలో సీమ? 

మొన్న కడప... నిన్న కర్నూల్.. ఇవాళ అనంతపురం జిల్లా... రాయలసీమలో దారుణ హత్యలు జరుగుతున్నాయి. మూడు జిల్లాల్లో ఆరుగురు హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. రాయలసీమలో ఫ్యాక్షన్‌ మళ్లీ పడగ విప్పిందా అన్న ఆందోళన నెలకొంది.అనంతపురం జిల్లాలో మరోసారి వర్గ కక్షలు భగ్గుమన్నాయి.  శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం అచ్యుతాపురంలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను ప్రత్యర్థులు దారుణ హత్య చేశారు. భూ వివాదంపై తాహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అచ్యుతాపురం, వేటాపురం గ్రామాల మధ్య రాజగోపాల్, నారాయణప్పలను దారుణంగా హత్య చేశారు. ప్రత్యర్థుల దాడిలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. దేవాలయ భూముల ఆక్రమణ విషయంలో గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య విభేదాలు ఉన్నట్లు చెబుతున్నారు. చాలా కాలంగా సమయం కోసం ఎదురు చూస్తున్న  ప్రత్యర్థులు మాటు వేసి ఇద్దరిని హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన ఇద్దరు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులని గ్రామస్తులు చెబుతున్నారు.జంట హత్యలతో గ్రామంలో పరిస్థితి నివురు గప్పినా నిప్పులా మారింది.  పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.  కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో టీడీపీ నాయకులు వడ్డు ప్రతాప్‌రెడ్డి, వడ్డు నాగేశ్వర్‌రెడ్డిని ప్రత్యర్థులు రెండు రోజుల క్రితం దారుణంగా చంపేశారు. మొత్తం 13 మంది మూకుమ్మడిగా దాడి చేసి, హత్యలు చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతాప్‌రెడ్డి భార్య వడ్డు లక్ష్మీదేవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి, రాజారెడ్డితో పాటు మరో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 147, 148 324, 307, 302 (రెడ్‌విత్‌ 149) కింద కేసు నమోదు చేశారు. ఇటీవలే కడప జిల్లాలోనూ ఇద్దరు దారుణ హత్యకు గురయ్యారు.   

గ్రీన్ జోన్‌గా తిరుమల.. అలిపిరి వరకు  గరుడ వారధి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలను గ్రీన్ జోన్‌గా  ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో తిరుమలకు కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని టీటీడీ ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. శనివారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగిస్తామన్నారు  వైవీ సుబ్బారెడ్డి. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లోటీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  సెప్టెంబర్ నెలలోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీని ఏర్పాటు చేశామని వైవీ చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ మత్స్యకార కాలనీల్లో రాబోయే ఏడాది కాలంలో 500 ఆలయాలను నిర్మిస్తామని చెప్పారు. ధర్మప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలను నిర్మిస్తున్నామన్నారు. జమ్మూలో 62 ఎకరాల్లో నిర్మిస్తున్న టీటీడీ శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. త్వరలోనే ముంబై, వారణాసిలో కూడా ఆలయాల నిర్మాణం చేపడతామని చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 100 ఆలయాలకు గోవులను అందించామని చెప్పారు.  వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం, వాకిలికి వెండి తాపడం చేయిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గోవిందుడికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతోనే నైవేధ్యం సమర్పిస్తున్నామని చెప్పారు. గత రెండు నెలల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. హనుమంతుడి జన్మస్థలం తిరుమలగా తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఆకాశగంగ ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. గరుడ వారధిని అలిపిరి వరకు నిర్మిస్తామని చెప్పారు. తిరుమలలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేసిన విషయాన్ని టీటీడీ ఛైర్మెన్  గుర్తు చేశారు.