తెలుగోడు తోప్.. నాదెళ్ల టాప్.. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా సత్య..
posted on Jun 17, 2021 @ 12:03PM
ఎక్కడ పుట్టామన్నది కాదు. ఎక్కడ చదువుకున్నామన్నదీ కాదు. మనలో ఎంత టాలెంట్ ఉందనేదే ముఖ్యం. మనం ఎంత కష్టపడ్డామన్నది మరీ ముఖ్యం. ప్రతిభ ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చు. ఆ కోవకు చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజమే సత్యనాదెళ్ల. తెలుగు నేలపై పుట్టి.. ప్రపంచంలోకే అత్యుత్తమ టెక్ కంపెనీకి సీఈవోగా ఎదిగారు. తాజాగా, ఆయన ఏకంగా మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ అయ్యారు. సత్యనాదెళ్లను వరించిన ఆ పదవి.. తెలుగువారందరికీ గర్వకారణం. తెలుగు ప్రతిభకు నిదర్శనం.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు మరిన్ని కీలక అధికారాలు కట్టబెట్టింది కంపెనీ. మైక్రోసాఫ్ట్ బోర్డు ఛైర్మన్‌గా సత్యనాదెళ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఛైర్మన్‌గా బోర్డు అజెండాను నిర్ణయించే అధికారం ఇక నాదెళ్లదే. ‘‘వ్యూహాత్మక అవకాశాలను దక్కించుకొనేందుకు, కీలక ఇబ్బందులను గుర్తించేందుకు ఆయనకు వ్యాపారంపై ఉన్న అవగాహన బాగా ఉపయోగపడుతుంది’’ అని మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న జాన్ థామ్సన్ ఇకపై స్వతంత్ర డైరెక్టర్‌గా ఉంటారు.
2014లో స్టీవ్ బామర్ నుంచి సత్య నాదెళ్ల సీఈవో బాధ్యతలను స్వీకరించారు. ఆయన వచ్చాక మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు చోటు చేసుకొన్నాయి. కొత్తతరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు. అంతేకాకుండా క్లౌడ్ కంప్యూటింగ్‌నపై ఫోకస్ పెంచింది. గతంలో పర్సనల్ కంప్యూటర్ల సాఫ్ట్‌వేర్ ప్యాకేజీల సేవలేపైనే ప్రధానంగా పని చేయగా.. సత్య నాదెళ్ల సీఈవో అయ్యాక మొబైల్ రంగం వైపు మైక్రోసాఫ్ట్‌ను పరుగులు పెట్టించారు.
సత్యనారాయణ నాదెళ్ల అలియాస్ సత్య నాదెళ్ల. తండ్రి నాదెళ్ల యుగంధర్ 1962 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. స్వస్థలం అనంతపురం జిల్లా, ఎల్లనూరు మండలం, బుక్కాపురం గ్రామం అయినా.. ఉద్యోగరిత్యా హైదరాబాద్‌లోనే సెటిల్ అయింది వారి ఫ్యామిలీ. సత్య నాదెళ్ల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివారు. 1988లో మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ కంప్లీట్ చేశారు. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు.
అమెరికా పౌరసత్వం తీసుకుని అక్కడే స్థిరపడ్డారు. కొంతకాలం సన్ మైక్రో సిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరారు. 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. తాజాగా, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఎంపికవడం విశేషం.
సత్య నాదెళ్లకు క్రికెట్ అంటే మహా ఇష్టం. స్కూల్ క్రికెట్ జట్టులో సభ్యుడు. క్రికెట్ ఆడటం వల్లే.. బృందంతో సమన్వయంగా వ్యవహరించడం, నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నానని చెబుతుంటారు. మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్యవహారాలతో క్షణం తీరిక లేకున్నా ఉన్నా కూడా.. క్రికెట్ మ్యాచ్‌లు ఉంటే మధ్య మధ్యలో స్కోర్ తెలుసుకుంటారట. వన్డేల కన్నా టెస్టు మ్యాచ్‌లపైనే ఆసక్తిఅట. కవితలన్నా నాదెళ్లకు అంతే ఇష్టం. కవితలు రహస్య సంకేతాల్లా అనిపిస్తాయని ఆయన ఓ సందర్భంలో చెప్పారు. ప్రపంచాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే అద్భుతమైన సాధనాలను మైక్రోసాఫ్ట్ అందిస్తోందని, అందుకే ఆ కంపెనీలో చేరాననేది సత్య నాదెళ్ల చెప్పే మాట. ఆయన మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ స్థాయికి ఎదగడం.. భారతీయులకు అందులోనూ ప్రత్యేకించి తెలుగుజాతికి గౌరవం.