వాలంటీర్లపై వేటు.. అసలెందుకీ సిస్టమ్? ఏమిటి ప్రయోజనం?
posted on Jun 17, 2021 @ 1:16PM
గ్రామ వాలంటీర్లు. ఏపీలో వీళ్లదే హవా. పని తక్కువ.. ఓవరాక్షన్ ఎక్కువ. గ్రామాల్లో పెత్తనమంతా వాళ్లదే. ఒకరకంగా సమాంతర పాలన కొనసాగిస్తున్నారనే ఆరోపణలు. వైసీపీ కార్యకర్తలకు ఉపాధిహామీ పోస్టులంటూ విపక్షం విమర్శిస్తున్నా.. అసలు ఆ పదవి ఎందుకంటూ కోర్టులు ప్రశ్నిస్తున్నా.. సర్కారు మాత్రం వారికే ప్రాధాన్యం ఇస్తోంది. యధారాజా.. తధా వాలంటీర్ అన్నట్టు.. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిలానే వీళ్లు సైతం అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్పంచ్‌లను, సచివాలయ సిబ్బందిని డమ్మీ చేసి.. గ్రామ వాలంటీర్లు అరాచకాలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 33 మంది గ్రామ వాలంటీర్లను తొలగించడమే ఇందుకు నిదర్శనం.
కరోనా ఫీవర్ సర్వేలో జ్వరం లేని వారికి కూడా ఉన్నట్టుగా ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేశారనే ఆరోపణలతో 23మంది గ్రామ వాలంటీర్లపై వేటు వేశారు జిల్లా కలెక్టర్. వీరిని విధుల నుంచి తొలగిస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తి ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, రాజమండ్రి అర్బన్, తుని, రాజోలు, అమలాపురం, మామిడికుదురు ప్రాంతాలకు చెందిన గ్రామ వాలంటీర్లు ఇలా కలెక్టర్ ఆగ్రహానికి గురయ్యారు. ఒక్క జిల్లాలోనే ఇంత మంది ఉంటే.. ఇక మిగతా జిల్లా కలెక్టర్లు సైతం కఠినంగా వ్యవహరిస్తే.. ఏపీలో సగం మంది గ్రామ వాలంటీర్ల పోస్టులు ఊస్ట్ అవుతాయని ప్రజలు అంటున్నారు.
గ్రామ వాలంటీర్లను ఎందుకు నియమించారో.. వారితో ఎంత ఉపయోగం ఉందో.. సీఎం జగన్‌రెడ్డికే తెలియాలి. గత ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్‌గా పని చేసిన వారిలో చాలా మందికి ఈ పోస్టులు కట్టబెట్టారనేది టీడీపీ ఆరోపణ. ఓ మీటింగ్‌లో స్వయానా విజయసాయిరెడ్డే ఆ మాట అంటూ వీడియోలో అడ్డంగా బుక్కయ్యారని గుర్తు చేస్తున్నారు. గ్రామ వాలంటీర్లు.. గ్రామ సేవకులుగా కాకుండా.. వైసీపీ ఉద్యోగులుగా పని చేస్తున్నారనే ఆరోపణలు అంతటా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. అదనంగా వాలంటీర్ల సేవలతో పనేముందనేది కొందరి ప్రశ్న.
50 ఇళ్లకో వాలంటీర్ చొప్పున లక్షల మందిని నియమించింది ఏపీ సర్కారు. ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించడం, లబ్దిదారుల ఎంపికను వారికి అప్పగించింది. వాళ్లు రోజూ చేసే పని ఏముంటుంది? 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్ రోజూ ఏ సేవలు అందిస్తారు? ఎప్పుడో ఓసారి పని.. మిగతా అంతా రాజకీయం! వారికి జీతాల రూపంలో కోట్ల రూపాయలు దార పోయడం.. అంత మందికి ఉద్యోగాలు కల్పించామంటూ గొప్పగా లెక్కలు చూపించుకోవడానికి మినహా.. గ్రామ వాలంటీర్ల వ్యవస్థతో పెద్దగా ఉపయోగం లేదనేది అనుభవంలోకి వచ్చిన విషయం అంటున్నారు. పైగా రాజకీయ విధ్వేషాలకు వాలంటీర్ వ్యవస్థ కారణమవుతోందనే విమర్శ కూడా ఉంది.
ఇక్కడ మరో అంశం ఏంటంటే.. అవి ఎలాగూ ప్రభుత్వ ఉద్యోగాలు కావు.. గట్టిగా తుమ్మితే ఊడిపోయే జాబులు.. వచ్చే జీతమూ అంతంత మాత్రమే.. ఆ అనుభవమూ మరే ఉద్యోగానికీ పనికిరాదు.. అయినా.. గ్రామంలో ఫోజులు కొట్టొచ్చనే ఏకైక కారణంతో గ్రామ వాలంటీర్లుగా చేరి తమ భవిష్యత్తును యువత వృధా చేసుకుంటున్నారని అంటున్నారు. చదువుకున్న వారు సైతం వాలంటీర్లుగా చేరి.. తమ చదువుతో ఎలాంటి సంబంధంలేని చిన్నాచితక పనులు చేస్తూ.. చాలీచాలని వేతనంతో అవస్థలు పడుతూ.. యువత రాజకీయ క్రీడలో పావుగా మారుతోందని కొందరు అంటున్నారు. రాజకీయ ఉద్యోగులుగా గ్రామ వాలంటీర్లు తయారయ్యారు కాబట్టే.. తూర్పు గోదావరి జిల్లాలో అంత మందిపై వేటు పడిందని చెబుతున్నారు.