మాన్సాస్‌లో రాచక్రీడ!.. పావుగా సంచయిత..!
posted on Jun 17, 2021 @ 6:05PM
సంచయిత. మూన్నాళ్ల ముచ్చట. ఏడాది క్రితమే సడెన్‌గా వినిపించిన పేరు. ఏడాది గడిచేలోగా మాన్సాస్ చరిత్రలో కలిసిపోయిన పేరు. పే..ద్ద బొట్టు, వదిలేసిన కురులతో ఆమె రూపం విచిత్రం. ఆమె చేష్టలూ అంతే విచిత్రం. గూగుల్‌లో ఆమె పాత ఫోటోలు చూస్తే కంపరం. పదవి రాగానే ఓవర్‌నైట్ అటిట్యూడ్ మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని రెచ్చిపోయారు. అది తనపై గౌరవం కాదు.. అశోక్ గజపతిరాజుపై శత్రుత్వం అనే విషయం మరిచారు. అన్నేళ్లూ అంతా తనను మరిచి.. సడెన్‌గా ఎక్కడినుంచో తీసుకొచ్చి మాన్సాస్ పీఠంపై కూర్చోబెట్టడం వెనుక మర్మం పసిగట్టలేకపోయారు. ఇటు మాన్సాస్‌లోనూ, అటు సింహాచలం దేవస్థానం బోర్డులోనూ రచ్చ రంబోలా చేశారు. పైడితల్లి అమ్మవారి జాతరలో ఆనందగజపతిరాజు కుటుంబాన్ని అవమానింత తీరు అత్యంత దారుణం. నడిమంత్రపు సిరి బాగా తలకెక్కినట్టుంది.. అందుకే తలబిరుసుతనంతో తైతక్కలాడిందంటూ విమర్శల పాలయ్యారు సంచయిత.
కట్ చేస్తే.. హైకోర్టు తీర్పుతో ఆమె పోస్ట్ ఊస్ట్. రాత్రికి రాత్రే ఆమె మాజీ అయిపోయారు. ఆ మర్నాడే అశోకుడు మాన్సాస్ పీఠం అధిరోహించారు. అప్పుడే ఆయనపై కక్ష్యసాధింపు చర్యలు స్టార్ట్ అయ్యాయి. మాన్సాస్ ట్రస్ట్‌లో అశోక్ హయాంలో అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ అవసరమంటూ వైసీపీ నేతలు, మంత్రులు కుట్రలు స్టార్ట్ చేసేశారు. సర్కారు సంగతి పక్కనబెడితే.. ఈ ఏడాది కాలంలో అసలు మాన్సాస్‌లో ఏం జరిగిందనే విషయంపై అశోక్ గజపతిరాజు సంచలన విషయాలు బయటపెట్టారు.
సంచయిత ఛైర్‌పర్సన్ అయ్యాక.. మాన్సాస్ ట్రస్టు సిబ్బందికి జీతాలే చెల్లించలేదనే విషయం బయటకు వచ్చింది. మరి, ఎందుకు జీతాలు ఇవ్వలేదు? డబ్బులు లేకనా? కావలసినంత ఉంది? కావాలనే సాలరీస్ ఇవ్వకుండా అలా వేధించారు. పిల్ల చేష్టలు కాక మరేంటి?
దశాబ్దాలుగా మాన్సాస్ ట్రస్ట్ కార్యాలయం విజయనగరం రాజావారి కోటలోనే ఉండేది. దాన్ని ఉన్నపళంగా విశాఖ జిల్లాకు తరలించడం తుగ్లక్ చేష్టలని తప్పుబడుతున్నారు. ఇక, సింహాచలం బోర్డు వ్యవహారాల్లోనూ తన మనిషిని జొప్పించి.. ఓవరాక్షన్ చేశారనే విమర్శలూ ఉన్నాయి. సింహాచలం దేవాస్థానానికి చెందిన ఐదు గ్రామాల భూముల్లో వివాదం సృష్టించి.. పెద్దది చేసి.. వాటిని స్వాహా చేసే ప్రయత్నమూ వైసీపీ నేతల కనుసన్నల్లో జరిగిందనే ఆరోపణలూ వచ్చాయి.
తాజాగా, సంచయిత హయాంలో ట్రస్ట్ వ్యవహారాలపై ఆడిట్ కూడా జరపలేదని తెలిసింది. ఆ విషయం తెలిసి అశోక్‌గజపతిరాజే ఆశ్చర్యపోయారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని.. మరి వారు ఎందుకలా వదిలేశారని ప్రశ్నించారు. ట్రస్ట్‌లో ఏదో గూడుపుఠాని జరిగుంటుందని.. తన హయాంలో దోపిడీ దారులకు మాన్సాస్‌లో స్థానం లేదని తేల్చి చెప్పారు.
ఇక, ట్రస్ట్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన వెంటనే అశోక్ గజపతిరాజు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లీజు గడువు పూర్తయిన ట్రస్టు భూములను వేలం వేయాలని ఆదేశించారు. మాన్సాస్ ట్రస్ట్ కార్యాకలాపాల వివరాలు, పదేళ్లుగా ఆడిటింగ్‌కు చెల్లించిన ఫీజు వివరాలు ఈనెల 21లోగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు, సంచయిత తీరుపై అశోక్ కూతురు అదితి గజపతిరాజు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రస్ట్‌కు చైర్‌పర్సన్ చేస్తే.. కోటకే మహారాణీలా ఫీల్ అయిందంటూ సెటైర్లు వేశారు. అధికారం తలకెక్కిన సంచయిత సొంత కుటుంబసభ్యులను సైతం గౌరవించకుండా ప్రవర్తించారన్నారు. గతేడాది పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా ఆనందగజపతి భార్య సుధాగజపతి, కుమార్తె ఊర్మిళా గజపతి కోట బురుజుపై కూర్చోగా సంచయిత వారిని ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తం చేసిన అదితి.. సంచయితను అమ్మవారే శిక్షించారన్నట్టుగా మాట్లాడారు. మాన్సాస్‌కు చైర్‌పర్సన్‌గా వచ్చి విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించకుండా చేశారని మండిపడ్డారు. మాన్సాస్ బోర్డులో ఎంపీ, ఎమ్మెల్యే కూడా సభ్యులుగా ఉన్నారని, వారి దృష్టికి తీసుకెళ్లే సంచయిత నిర్ణయాలు తీసుకున్నారా? లేక సొంత నిర్ణయాలా? అన్నది కూడా పరిశీలిస్తామన్నారు అదితి గజపతిరాజు.
ఇలా.. ఏడాదికి పైగా మాన్సాస్‌లో మహారాణిలా ఓ వెలుగు వెలిగిన సంచయిత.. కోర్టు తీర్పుతో ఆమె ప్రభ ఒక్కసారిగా మసకబారిపోయింది. వైసీపీ ఆడిన రాచక్రీడలో బలిపశువుగా మారి.. రాజ కుటుంబం ముందు దోషిగా, ద్రోహిగా నిలబడాల్సిన దుస్థితి సంచయితది.