ఏపీ ప్రభుత్వానికో దండం.. భూములను తిరిగిచ్చేసిన రిలయన్స్
posted on Jun 25, 2021 @ 12:08PM
ఆంధ్రప్రదేశ్ నుంచి మరో దిగ్గజ సంస్థ తప్పుకుంది. ఇప్పటికే పలు విదేశీ కంపెనీలు తాము పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాయి. గతంలో సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చిన కొందరు పారిశ్రామిక వేత్తలు వెనక్కి తగ్గారు. ఏపీలో కాకుండా మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఎంవోయూలు కుదుర్చుకున్న సంస్థలు సైతం ఇప్పుడు పత్తా లేకుండా పోయాయి. ఇందుకు కారణం ప్రస్తుత వైసీపీ సర్కార్ తీరే కారణమంటున్నారు. భూములు అప్పగించకపోవడం, కొత్తకా కొర్రీలు పెట్టడంతో పాటు అధికార పార్టీ లీడర్లు వాటాలు డిమాండ్ చేయడం కూడా కారణమనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ ఏపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
రిలయన్స్ సంస్థకు ఏపీ ప్రభుత్వం తిరుపతి సమీపంలో భూములు ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం గత టీడీపీ సర్కారు 136 ఎకరాలను కేటాయించగా, వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అందులో 75 ఎకరాలను అప్పగించింది. అయితే, రిలయన్స్‌కు కేటాయించిన భూములకు సంబంధించిన 15 మంది రైతులు పలు కారణాలతో కోర్టులో కేసులు వేశారు. ఈ కేసులు పరిష్కారం అయ్యే వరకు యూనిట్ ఏర్పాటు చేయటానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో తమకు అప్పగించిన భూములను తిరిగి రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(ఏపీఐఐసీ)కు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో సెట్‌టాప్ బాక్సులు, ఇంటర్నెట్ వినియోగానికి అవసరమైన డాంగిల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది.
రిలయన్స్ తప్పుకున్న విషయాన్ని తిరుపతి ఏపీఐఐసీ జోనల్ కార్యాలయ ఉన్నతాధికారులు ధ్రువీకరించారు. ఆ భూముల కోసం రిలయన్స్ డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చే విషయంపై చర్చిస్తున్నట్లు చెప్పారు. తిరుపతి సమీపంలో భూములకు బదులుగా వడమాలపేట మండలం పాడిరేడు అరణ్యం దగ్గర ఎలాంటి వివాదాలు లేని భూములను కేటాయిస్తామని ఏపీఐఐసీ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రిలయన్స్ అధికారులు అంగీకరించలేదని తెలుస్తోంది. తమకు భూములు అప్పగించాలని ఎన్నిసార్లు కోరినా అధికారులు స్పందించకపోవడం, కోర్టులో కేసులు వేసిన రైతులతో మాట్లాడాలని చూసినా సాధ్యం కాకపోవడంతో రిలయన్స్ అధికారులు విసిగిపోయారని చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ పెట్టుబడి వెనక్కి పోయిందనే విమర్శలు విపక్షాల నుంచి వస్తున్నాయి. కొత్త పెట్టుబడులు తేవడంలో విఫలం కావడంతో పాటు గతంలో ఎంవోయూలు చేసుకున్న కంపెనీలు బెదిరించి పంపిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.