పది, ఇంటర్ పరీక్షలు రద్దు.. దిగొచ్చిన జగన్‌రెడ్డి సర్కారు..
posted on Jun 24, 2021 @ 7:56PM
నారా లోకేశ్ పోరాటం ఫలించింది. సుప్రీంకోర్టు ఆగ్రహంతో జగన్‌రెడ్డి సర్కారు దిగొచ్చింది. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం. టెన్త్, ఇంటర్ పరీక్షలపై సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. హైపవర్ కమిటీ నివేదిక తర్వాత మార్కులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇతర బోర్డు పరీక్షలు రద్దుతో ఏపీ విద్యార్థులకు నష్టం జరగదన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోగా పరీక్షల నిర్వహణ అసాధ్యమని తెలిపారు. జులై 31లోగా ఫలితాలు ప్రకటించడం సాధ్యంకాదని మంత్రి సురేశ్ స్పష్టం చేశారు.
కరోనా కల్లోల సమయంలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించ వద్దంటూ, వెంటనే ఎగ్జామ్స్ రద్దు చేయాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నెల రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. నిత్యం ఆన్‌లైన్లో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. పేరెంట్స్, స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్స్ వద్దంటూ ముక్తకంఠంతో కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహిస్తే.. విద్యార్థుల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని అంతా ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, సీబీఎస్ఈ సైతం పరీక్షలను క్యాన్సిల్ చేసింది. ఏపీ, కేరళ మినహా 21 రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినా.. జగమొండి జగన్ సర్కారు మాత్రం ఎగ్జామ్స్ నిర్వహణపై పట్టుదలకు పోయింది. పరీక్షలు రద్దు చేసే ప్రసక్తేలేదంటూ మొండిగా వ్యవహరించింది. పరీక్షలను పలుమార్లు వాయిదా వేస్తూ.. జూలై ఆఖరిన నిర్వహిస్తామంటూ పంతానికి పోయింది. ప్రభుత్వం తీరుతో అంతా విసుగెత్తిపోయారు. మరోవైపు, విషయం సుప్రీంకోర్టుకు చేరడం.. కోర్టు ఏపీ సర్కారుకు మొట్టి కాయలు వేయడంతో.. ఇక విధిలేని పరిస్థితుల్లో.. ఎట్టకేలకు పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు ఏపీ సర్కారును తీవ్ర స్థాయిలో మందలించింది. పరీక్షల కారణంగా ఒక్కరు చనిపోయినా.. ఒక్కొక్కరికీ కోటి రూపాయలు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కరోనా కల్లోల పరిస్థితుల్లో ఒక్కో గదిలో 15 నుంచి 20 మంది విద్యార్థులను పరీక్షలకు కూర్చోబెట్టడం సమంజసమా? ప్రభుత్వ లెక్కల ప్రకారమే 28వేల గదులు అవసరం అవుతాయి? అది సాధ్యమా? రెండో దశ తీవ్రత చూశాక కూడా.. ఇంకా పలు వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నా కూడా.. ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది.. పరీక్షల సమయంలో మూడో వేవ్ వస్తే ఏం చేస్తారు? అంటూ సుప్రీంకోర్టు ఏపీ సర్కారును తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది. ఏ ఒక్క విద్యార్థి మృతి చెందినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని గతంలోనే హెచ్చరించింది సుప్రీంకోర్టు. తాజాగా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. పరీక్షల సమయంలో కోవిడ్ ఉధృతి పెరిగితే దానిపై కూడా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మార్కుల ఎవల్యూషన్‌పై కూడా తాము నిపుణులతో మాట్లాడి ఒక చార్ట్ ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. సాయంత్రంలోగా ఏపీ ప్రభుత్వ నిర్ణయం వెల్లడించాలని సుప్రీం ఆదేశించడంతో.. జగన్‌రెడ్డి సర్కారు తలవంచక తప్పలేదు. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు.