విజయసాయికి వైవీతో చెక్? జగన్ రెడ్డితో అక్కడే చెడిందా?
posted on Jun 24, 2021 @ 7:27PM
విజయసాయి రెడ్డికి చెక్ పడినట్టేనా? ఆ నేతను ఢిల్లీ పంపబోతోంది అందుకేనా? ఇదే చర్చ వైసీపీతో పాటు ఏపీ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి.. వైసీపీలో నెంబర్ టూ స్థానంలో ఉన్నారని చెబుతారు. ఏపీ నుంచి వైసీపీ గెలిచిన తొలి రాజ్యసీటును విజయసాయికి ఇచ్చారంటే ఆతనికి జగన్ రెడ్డి.. ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఊహించవచ్చు. ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు, కేంద్రం పెద్దలతో డీలింగ్స్ అన్ని ఆయనే చూస్తారని చెబుతారు. కాని ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది. కొంత కాలంగా జగన్.. విజయసాయి రెడ్డిని దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ జగన్ వెనుక ఉండే సాయిరెడ్డి.. ఇటీవల తాడేపల్లికి రాకపోవడంతో ఈ అనుమాలకు బలం చేకూరుతోంది. విశాఖలోనూ గతంలో ఉన్నంతగా సాయిరెడ్డికి ప్రస్తుతం పట్టు లేదంటున్నారు.
సీఎం జగన్ తనను దూరం పెట్టడం వల్లే విజయసాయి రెడ్డి ఇటీవల రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారనే టాక్ ఉంది. టీడీపీ నేతలను టార్గెట్ చేసి మళ్లీ జగన్ కు దగ్గర కావాలని సాయిరెడ్డి చూస్తున్నారని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. అయితే ఇటీవల జరిగిన మాన్సాస్ ట్రస్ట్ విషయంలో విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనలు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును దొంగ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజుపై సాయిరెడ్డి చేసిన కామెంట్లపై వైసీపీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమైందట. సాయిరెడ్డి వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చిందని కొందరు మంత్రులు అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. విజయసాయి రెడ్డి తీరుపై జగన్ కూడా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయనకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. అందుకోసమే ఆయనకు చెక్ పెట్టేలా మరో నేతను ఢిల్లీకి పంపించబోతున్నారని చెబుతున్నారు.
ఢిల్లీలో రాష్ట్ర వ్యవహారాలు చక్కబెట్టేందుకు బలమైన వ్యక్తిని నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ బాధ్యతను వైసీపీ పార్లెమంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి చూడగా.. ఆయన ప్లేస్ లో మరొకరిని నియమించబోతున్నారని చెబుతున్నారు. తన సొంతబాబాయి వైవీ సుబ్బారెడ్డిని ఢిల్లీకి పంపాలని జగన్ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ ఛైర్మన్ గా ఉన్న ఆయన పదవీ కాలం ఇటీవలే ముగిసింది. పాలకమండలి స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీని కూడా ప్రభుత్వం నియమించింది. తొలుత వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ స్పెసిఫైడ్ అథారిటీ ప్రకటనతో.. వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభ పదవిని కట్టబెట్టి ఢిల్లీకి పంపడం ఖాయమని తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా గెలిచిన వైవీ సుబ్బారెడ్డి.. 2019 ఎన్నికల్లో తన సీటును వదులుకున్నారు. జగనే ఆయనను పక్కన పెట్టి.. కొత్తగా పార్టీలో చేరిన మాగుంటకు టికెట్ ఇచ్చారని అంటారు. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనిని వైవీకి.. వైసీపీ విజయం సాధించిన తర్వాత టీటీడీ ఛైర్మన్ గా నియమించారని చెబుతారు. ఇటీవలే ఆయన పదవి కాలం ముగిసింది. సీఎం జగన్ తనకు మరోసారి అవకాశమిస్తే పనిచేస్తానని.. లేదంటే లేదని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే విజయసాయి రెడ్డికి చెక్ పెట్టాలని భావిస్తున్న జగన్.. వైవీని రాజ్యసభకు పంపాలని దాదాపుగా నిర్ణయించారని సమాచారం. వైవీకే వైసీపీ పార్లమెంటరీ పార్టీ పగ్గాలు అప్పగించి.. విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్రకే పరిమితం చేయాలని జగన్ చూస్తున్నారట. జగన్ జైలుకు పోతే సీఎం కావాలనే ఎత్తులు వేస్తున్నారని ప్రచారం ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో విజయసాయి రెడి టచ్ లో ఉన్నారన్న విషయం కూడా జగన్ .. అతన్ని దూరం పెట్టడానికే కారణమనే వాదన కూడా వినిపిస్తోంది.
మరోవైపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రతిసారి గందరగోళంగానే మారుతోంది. ఆయన ఢిల్లీ వెళ్లడం వరకు అంతా బాగానే సాగుతున్నా.. కేంద్ర పెద్దలతో అపాయింట్ మెంట్ విషయంలో క్లారిటీ ఉండటం లేదు. గతంలో ఓసారి ఢిల్లీ వెళ్లిన సమయంలో చివరి నిముషం వరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు లేదు. హస్తినలో వైసీపీ వ్యవహారాలు చూస్తున్న ఎంపీలు బలమైన లాబీయింగ్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తుందనే భావనలో కూడా వైసీపీ పెద్దలు ఉన్నారంటున్నారు. వైవీ సుబ్బారెడ్డితో ఈ సమస్య కూడా గాడిన పడవచ్చని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.