మంత్రి పదవి ప్లీజ్.. జగన్ కు సీనియర్ల డిమాండ్
posted on Jun 25, 2021 @ 12:08PM
రాజకీయాలలో ఉన్నవారికి పదవీ వ్యామోహం ఉండడం సహజం. అందులోనూ దశాబ్దాల తరబడి రాజకీయాలలో ఉన్నవారికి వయసు పెరిగే కొద్దీ కోరికలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఎమ్మెల్యే అయిన వారికి మంత్రి కావాలని ఉంటుంది, మంత్రి అయిన వారికీ ముఖ్యమంత్రి ... అలా.. అలా .. ఆశలు పైమెట్లకు నిచ్చెనలు వేస్తూనే ఉంటాయి. అయితే అందరి కోరికలు తీరవు. కొందరి కోరికలు కొంతవరకు తీరి ..ఇక ఆపైన కదలవు. కొందరికి పదవులు వస్తూనే ఉంటాయి కానీ, ఆశించిన పదవి అందని ద్రాక్షగానే మిగిలి పోతుంది .
ప్రణబ్ ముఖర్జీ విషయాన్నే తీసుకుంటే, ప్రధాని పీఠంలో కూర్చోవాలన్నఆయన కోరిక తీరలేదు. చివరకు రాష్ట్ర పతి పదవి దక్కినా.. అన్ని అర్హతలు ఉన్నా ప్రధాని కాలేక పోయాననే బాధ మాత్రం ఆయన్ని వెంటాడింది. ఆ బాధను అయన దాచుకోలేదు. ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పుస్తకంలో అందరితో పంచుకున్నారు. అందులో ఆయన ఇందుకు సంబంధించి ప్రస్తావించిన అంశాలను గమనిస్తే, రాష్ట్రపతి పదవిని అలకరించడం గర్వకారణంగా భావించినా, ఆయన దాన్నొక కన్సొలేషన్ బహుమతిగానే తీసుకున్నారా అనిపిస్తుంది.
ప్రధాని పదవిని ఆశించి భంగపడిన వారు ఒక్క ప్రణబ్ దాదా మాత్రమే కాదు. ఇంకా ఉన్నారు. బీజేపీ అగ్ర నేత ఎల్కే అద్వానీ, అలాగే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, కామ్రేడ్ జ్యోతి బసు ఇలా ఎందరినో ప్రధాని పదవి ఇలా ఊరించి, అలా చేజారి పోయింది. 2004 లో సోనియా గాంధీ ఆల్మోస్ట్ చివరి మెట్టువరకు వరకు వెళ్లారు. మద్దతు ఇస్తున్న ఎంపీలు, పార్టీల లేఖలు పట్టుకుని, రాష్ట్రపతి భవన్’ మెట్లేక్కారు బట్, అక్కడ ఏమైందో ఏమో,సీన్ మారిపోయింది. ఆమె నిరాశగా వెనక్కి వచ్చారు. అదృష్తం మన్మోహన్ సింగ్’ ను వరిచింది. అయితే, ఆమె ప్రధాని కాలేక పోయినా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న పదేళ్ళు ఆమె ‘సూపర్ పీఎం’ గా చక్రం తిప్పారు. అంతకు చాలా ముందే, యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్నరోజుల్లో జ్యోతిబసుకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. అయితే ఆయన పార్టీనే అడ్డుపుల్ల వేసింది. అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాతి కాలంలో జ్యోతిబసు, అప్పటి పార్టీ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించారు. బాధపడ్డారు. అద్వానీ విషయానికి వస్తే పార్టీ రెండు సార్లు ఆయన్ని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినా, ప్రజలు అవకాశం ఇవ్వలేదు. చివరకు ప్రజలు అవకాశం ఇచ్చే సమయానికి, మోడీ వచ్చి కర్చీఫ్ వేశారు. ఆయనకు కూడా ప్రణబ్ ముఖర్జీలా రాష్టపతి గౌరవం అన్నా దక్కుతుందని ఆశించినా అదీ అందని ద్రాక్షగానే మిగిలి పోయింది.
ఆం ధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అంతెత్తు పెద్ద కుర్చీ (స్పీకర్ చైర్) మీద ముఖం మొత్తింది.ఇప్పటికే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు మరోసారి మంత్రిగా చేయాలని ఆయన చాలా ఆశపడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్, తమ తొలి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన సమయంలో రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి వర్గాన్ని సమూలంగా మార్చి కొత్త టీమ్’ కు అవకాశం ఇస్తామని ఇచ్చిన హామీ ఆధారంగా చాలా మంది, ముఖ్యంగా ఫస్ట్ టీమ్’ లో బెర్త్ దక్కని సీనియర్లు సెకండ్ హాఫ్ టీంమ్ పై ఆశలు పెంచుకుంటున్నారు. అందులో తమ్మినేని కూడా ఉన్నారు. అందుకోసం ఆయన భారీ ప్రయత్నాలే చేస్తున్నారని వినికిడి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దని భావిస్తున్న తమ్మినేని,చివరిసారిగా ఆ మంత్రి హోదాను అనుభవించి వెళ్లాలని అనుకుంటున్నట్టు వైసీపీ అధిష్టానానికి విన్నవించుకుంటున్నారట.
2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జగన్ రెడ్డి, ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని ఓటర్లను వేడుకుంటే, తమ్మినేని ఇదే నా చివరి ఎన్నిక, ఇకపై పోటీ చేయని, గెలిపించండి ప్లీజ్’ అని ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. అలాగే, గెలిస్తే తాను మంత్రి కావడం ఖాయమని నియోజకవర్గానికి కావాల్సిన పనులు చేసి పెట్టి వెళ్తానంటూ ఓటర్లకు విజ్ఞప్తులు చేశారు. అనుకున్నట్టే ఎమ్మెల్యేగా గెలిచారు కానీ.. జగన్ ఆయనకు అసెంబ్లీ స్పీకర్ పదవి కట్టబెట్టారు. అయితే అంతకుముందే రెండున్నరేళ్లే పదవుల్లో కొనసాగుతారని జగన్ స్పష్టం చేయడంతో ఆయన నిర్ణయాన్ని కాదనలేకపోయారు. ఇప్పుడు సమయం దగ్గరపడుతుండటంతో ఎలాగైనా మంత్రి కావాలని తమ్మినేని అనుకుంటున్నారట.ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన తమ్మినేని పార్టీలు మారి, ఇంచు మించుగా 15 ఏళ్లకు పైగానే మంత్రి పదవికి దూరమయ్యారు. దీంతో ఈసారి ఎలాగైనా ఒక్కసారి ఆ మంత్రి పదవిని అనుభవించి వెళ్లాలని గాఢంగా కోరుకుంటున్నారట.
తమ్మినేని స్టొరీ ఇలా ఉంటే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ మంత్రివర్గాల్లో అంతకు ముందు తర్వాత కూడా మంత్రులగా పనిచేసిన ధర్మాన, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి మాజీ మంత్రులు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియాలో క్రియాశీలంగా కనిపించిన, అంబటి రాంబాబు, రోజా, భూమ కరుణాకర రెడ్డి లాంటి అనేక మంది తమ్మినేనిలానే, గెలిస్తే మంత్రి పదవి గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారు. అయినా, జగన్ రెడ్డి హోల్సేల్ గా అందరికీ మొండి చేయి చూపించారు. అలంటి వారంతా ఇప్పుడు, ముఖ్యమంత్రి గారు మంత్రి పదవి ప్లీజ్ అని వేడుకుంటున్నారట ... అంతా .. ఆ దేవుని దయ.