ఆర్టీసీ సమ్మెకు ఈటల సాయం! కేసీఆర్‌పై కుట్ర? బాంబు పేల్చిన బాల్క సుమన్..
posted on Jun 24, 2021 @ 10:21PM
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె. రెండేళ్ల క్రితం.. దాదాపు రెండు నెలల పాటు ఉధృతంగా జరిగిన పోరు. సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు పట్టుబట్టారు. సమ్మెకు దిగారు. ప్రభుత్వం పంతానికి పోయింది. ముందు సమ్మె విరమించాలంది. కార్మికులు మొండికేశారు. సర్కారు సైతం జగమొండిగా వ్యవహరించింది. హైకోర్టు సైతం జోక్యం చేసుకుంది. ప్రభుత్వాన్ని మెట్టుదిగాలంటూ ఆదేశించింది. అయినా, సీఎం కేసీఆర్ ఏమాత్రం తగ్గలేదు. కార్మికులూ వెనకడుగు వేయలేదు. నలుగురు ఆర్టీసీ సిబ్బంది ఆత్మహత్యకూ దారి తీసింది. బతుకమ్మ, దసరా పండగల సమయంలో బస్సుల బంద్‌తో జనాలు సైతం తీవ్ర ఇబ్బంది పడ్డారు. చివరాఖరికి ఆర్టీసీ కార్మికులు దిగిరావడంతో సమ్మె సుఖాంతమైంది. ఇదీ జరిగింది.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే...
ఇటు ఆర్టీసీ కార్మికులు, అటు కేసీఆర్ సర్కారు.. మరోవైపు ప్రజలు.. అప్పట్లో కొన్ని వారాల పాటు తెలంగాణలో రచ్చ రచ్చ నడిచింది. ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సర్కారు మొండివైఖరితో సీఎం కేసీఆర్ బాగా బద్నామ్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ ఇమేజ్‌ను అంతగా డ్యామేజ్ చేసిన ఆర్టీసీ సమ్మె వెనుక ఇంటి దొంగల హస్తం ఉందంటూ తాజాగా టీఆర్ఎస్ కీలక నేత ఆరోపించారు. ఆ ఇంటి దొంగ మరెవరో కాదు ఈటల రాజేందరే అంటూ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ బాంబు పేల్చడం కలకలం రేపుతోంది.
అవును, ఈటల రాజేందరే ఆర్టీసీ సమ్మె వెనుకున్న అదృశ్య శక్తి అంటూ బాల్క సుమన్ ఆరోపించడం సంచలనంగా మారింది. అప్పటి ఆర్టీసీ జేఏసీ లీడర్ అశ్వత్ధామరెడ్డితో కలిసి ఈటల రాజేందర్ కుట్ర చేశారని అన్నారు. ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ సమావేశం చర్చల సారాంశాన్ని ఈటల రాజేందర్ లీక్ చేశారని బాల్క సుమన్ ఆరోపించారు. సమ్మె సమయంలో అశ్వత్థామరెడ్డితో ఈటల గంటల తరబడి మాట్లాడే వారని అన్నారు. తాజాగా, హుజురాబాద్‌లో పర్యటించిన ఎంపీ బాల్క సుమన్.. మాజీ టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్‌పై ఇలాంటి ఆరోపణ చేయడం రాజకీయంగా ఆసక్తిగా మారింది.
ఎంపీ బాల్క సుమన్.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రైట్‌హ్యాండ్ లీడర్. కేటీఆర్‌కు తెలిసిన ప్రతీ విషయం దాదాపు బాల్క సుమన్‌కు తెలిసే ఉంటుంది. ఇక కేసీఆర్ కొడుకుగా కేటీఆర్ దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీ సమాచారం అందుబాటులో ఉంటుందని అంటారు. అలా, ఆర్టీసీ సమ్మెకు ఈటల రాజేందర్ పరోక్షంగా సహకరించడం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డిని డైరెక్ట్ చేయడం.. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సర్కారుకు తెలిసి ఉంటుంది. అదే విషయం ఇప్పుడు హుజురాబాద్‌లో బాల్క సుమన్ వెల్లడించారని అంటున్నారు. అయితే, ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. అప్పటి ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డి.. ఇటీవల ఈటల రాజేందర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరడం విశేషం. సో.. బాల్క సుమన్ ఆరోపణల్లో నిజం ఉండే ఉంటుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
వరుసగా తెలుస్తున్న వివరాల ప్రకారం.. సీఎం కేసీఆర్‌తో ఈటలకు కొన్నేళ్లుగా కోల్డ్‌వార్ నడుస్తున్నట్టే ఉంది. సర్కారుకు వ్యతిరేకంగా ఈటల కుట్ర చేస్తున్నారని పక్కా సమాచారం మేరకే.. రాజేందర్‌ను కేబినెట్ నుంచి మెడబట్టి గెంటేసి ఉంటారని అంటున్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలు నచ్చకే.. ఈటల సైతం కేసీఆర్ వ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహించి ఉంటారని అనుకోవచ్చు అంటున్నారు. ఇలా, ఆ ఇద్దరు నేతల మధ్య బాగానే గ్యాప్ వచ్చిందని.. అది ఈటల పార్టీ వీడే వరకూ దారి తీసిందని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే హుజురాబాద్‌లో ఎలక్షన్ వేడి రాజుకుంది. ఇక ముందుముందు మరెన్ని రహస్యాలు వినాల్సి వస్తుందో చూడాలి....