హుజురాబాద్ పై లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్!
posted on Jun 24, 2021 @ 9:19PM
తెలంగాణ రాజకీయాలన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కేంద్రంగానే సాగుతోంది. తన మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ తొలగించడం.. తర్వాత గులాబీ పార్టీకి ఈటల గుడ్ బై చెప్పడం జరిగిపోయాయి. అంతేకాదు బీజేపీలో చేరిన ఈటల.. హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. తనపై కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరించారని , కుట్రలు చేశారని ఆరోపిస్తున్న రాజేందర్.. అసెంబ్లీ ఉప ఎన్నికలో తన సత్తా చాటి గులాబీ బాస్ కు షాకివ్వాలని భావిస్తున్నారు. అందుకే ఆయన నియోజకవర్గంలోని గ్రామాలన్ని తిరుగుతున్నారు. తన మద్దతుదారులతో కలిసి బలప్రదర్శన చేస్తున్నారు. అటు కేసీఆర్ కూడా హుజురాబాద్ పైనే ఫోకస్ చేశారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈటలకు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇక తమకు పట్టున్న ప్రాంతంలో పట్టు నిలుపుకుని తామే ప్రత్యామ్నాయని చాటే యోచనలో కాంగ్రెస్ నేతలున్నారు.
జూన్ లో రాజేందర్ రాజీనామా చేశారు కాబట్టి... నవంబర్ వరకు భర్తీ చేయాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ తో పాటు పలు రాష్ట్రాల్లో కొన్ని లోక్ సభ, అసెంబ్లీ సీట్లు ఖాళీగా ఉండటంతో వాటికి సెప్టెంబర్ లో ఎన్నికలు జరపాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే హుజూరాబాద్ నియోజకవర్గానికి సెప్టెంబరు నెలలో ఉప ఎన్నిక రావొచ్చని అంచనా వేస్తున్నారు. కరోనా మూడో వేవ్ విరుచుకుపడితే మాత్రం కొంత సమయం వాయిదా పడవచ్చు. అయితే ఉప ఎన్నికకు ఇంకా చాలా సమయం ఉన్నా హుజురాబాద్ లో అప్పుడే రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు హుజురాబాద్ పైనే పడటంతో... నియోజకవర్గంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరిగితే ఎవరూ గెలుస్తారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలోనూ ఈటల నియోజకవర్గంపై ఆసక్తి పెరిగిందని తెలుస్తోంది.
తెలంగాణలో అత్యంత కీలకం కాబోతున్న హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల ఎవరూ గెలుస్తారన్న దానిపై సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. హుజూరాబాద్ లో ప్రస్తుతం ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది?
ఎవరు గెలుస్తారు? జనాల మైండ్ సెట్ ఎలా ఉంది? ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాన్ని తెలుసుకునేందుకు విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ అనే సర్వే సంస్థ హుజూరాబాద్ నియోజకవర్గంలో సర్వే చేసింది. ఈటల రాజీనామా, బీజేపీలో చేరిన తర్వాతే నిర్వహించిన సర్వే రిపోర్ట్ ను విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ గురువారం రిలీజ్ చేసింది. సర్వే రిపోర్టులో షాకింగ్ విషయాలు తెలిశాయి.
హుజురాబాద్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,05,182 ఉండగా ఇందులో పోలయ్యే ఓట్లు లక్షా ఎనభై వేలకు పైనే ఉంటాయని సర్వే సంస్థ అంచనా వేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లక్షా 87 వేల 25 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ కు 1,04,840 ఓట్లు, కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు రాగా.. రాజేందర్ 47,803 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్ చేరికతో బలపడిన బీజేపీకి 35 శాతం ఓట్లు వస్తాయని తేలింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థికి కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈటల చేరికతో అది 35 శాతానికి చేరిందని విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేలింది. కాంగ్రెస్ కు గతంలో కంటే భాగా తగ్గి 20 శాతం ఓట్లు వస్తాయని వెల్లడైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ లో కాంగ్రెస్ కు దాదాపు 35 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే హుజురాబాద్ లో మళ్లీ అధికార పార్టీనే గెలుస్తుందని సర్వేలో స్పష్టమైంది. టీఆర్ఎస్ కు 40 శాతం ఓట్లు రానున్నాయి. అంటే బీజేపీ కంటే ఐదు శాతం ఓట్ల ఆధిక్యంలో ఉంది గులాబీ పార్టీ. ఇతరులకు ఐదు శాతం ఓట్లు వస్తాయని విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేలింది.
టిఆర్ఎస్ కు అంతగా ఆదరణ ఎందుకు ఉందని సర్వేలో అడిగిన ప్రశ్నలకు ప్రజల నుంచి వచ్చిన జవాబు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలేనని తేలింది. బీజేపీకి వచ్చేసరికి ఈటల రాజేందర్ బలమైన బీసీ నేత గా ఉండడంతోపాటు టిఆర్ఎస్ నుంచి గెంటివేయబడడం వల్ల ప్రజల్లో సానుభూతి ఉందని తేల్చింది. అయితే అవినీతి ఆరోపణలు రావడం, ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉండటం ఆయనకు వ్యక్తిగతంగా మైనస్ గా కనిపిస్తున్నాయని సర్వే సంస్థ విన్ పొలిటికల్ కన్సల్టెన్సీ వెల్లడించింది. కాంగ్రెస్ కి వచ్చేసరికి పాడి కౌశిక్ రెడ్డి పై కొద్ది వరకు ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పరిస్థితి ఆయనకు మైనస్ గా కనిపిస్తున్నది అని పేర్కొంది. ఈటల రాజేందర్ కు తన సొంత మండలం అయిన కమలాపూర్ లో భారీ మద్దతు ఉండగా పాడి కౌశిక్ రెడ్డి కి తన సొంత మండలం అయిన వీణవంక లో కొద్ది వరకు ప్రజా బలాన్ని కూడగట్టుకోగలిగారు.
ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి కనుక టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తే టిఆర్ఎస్ పార్టీకి, కౌశిక్ రెడ్డికి బాగా కలిసి రానుందని తెలిపింది. అప్పుడు పోటీ కేవలం టిఆర్ఎస్ బిజెపి ల మధ్య ఉండనుందని, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోసం కష్టపడాల్సిన పరిస్థితులు ఉంటాయని పొలిటికల్ కన్సల్టెన్సీ సర్వేలో తేటతెల్లమయింది.