విశ్వమంతా యోగా జపం .. టీటీడీలో మౌనవ్రతం! జగన్ రెడ్డికి పట్టదా.. ?
తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) హిందూ ధార్మిక సంస్థ. హిందూ ధర్మాన్ని, భారతీయ సంప్రదాయాలు విలువలు,ఆచార వ్యవహారాలను పరిరక్షించడం సంస్థ ప్రధాన కర్తవ్యం. టీటీడీ సభ్యులు, సిబ్బంది హిందూ ధార్మిక విలువలను, భారతీయ సంప్రదాయాలను తూ.చతప్పక పాటించే వారై ఉంటారని, ఉండాలని హిందూ సమాజం కోరుకుంటుంది. అది సహజం. ఎందుకంటే, ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతి పైసా, వివిధ రూపాల్లో భక్తులు స్వామి వారికి సమర్పించుకున్నకానుకల ద్వారా వచ్చిన సొమ్ములే. నిజానికి, టీటీడీకి ప్రభుత్వం నుంచి పైసా నిధులు రావు. ప్రభుత్వమే దేవస్థానం నిధులను, ప్రజా ప్రయోజనాలు, సంక్షేమం పేరున దారి మళ్ళించి, అన్య మత ప్రచారకులకు సైతం వినియోగిస్తున్నారనే, పాస్టర్లకు పందారం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ వ్యవహారాల్లో అన్యమత జోక్యం అధికం అవుతోందన్న ఆరోపణలున్నాయి.
టీటీడీ పరిధిలోని, సప్తగిరి పత్రిక, శ్రీ వెంకటేశ్వరభక్తి చానల్ ఇతర ధార్మిక ప్రచార సంస్థలు తరచూ వార్తలో తేలుతున్నాయి. అయితే, అలా వార్తలకెక్కిన ప్రతి సందర్భం, హిందువులు తల వంచుకునేలా చేస్తోంది హిందూ ధర్మ ప్రచారం కోసం నడుపుతున్న సప్తగిరి పత్రికలో, అలవాటుగానో , గ్రహపాటుగానో హిందూ ధర్మ వ్యతిరేక ప్రచారం జరిగిన ఆరోపణలున్నాయి. అలాగే క్రైస్తవ మత ప్రచారం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. క్రైస్తవ గీతాలు ప్రచిరించడం, సప్తగిరి పత్రికకు అనుబంధంగా క్రైస్తవ ప్రచార బుక్ లెట్’ను జత చేయడం వంటి అపచారాలు అనేకం వెలుగు చూశాయి. అలాగే అయోధ్య రామాలయం భూమిపూజ కార్యక్రమాన్ని దేశంలోని ప్రైవేటు టీవీ చానల్స్ సహా అన్ని చానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయి. కానీ, టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తీ చానల్, ఎస్వీబీసీ చానల్ మాత్రం ప్రసారం చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే, ఇలాంటి అపచారలు అనేక జరుగుతూనే ఉన్నాయి.
ఇప్పడు ఇదే కోవకుచెందిన మరో దురాగతం, ప్రపంచం అంతటా జరుపుకున్న ప్రపంచ యో దినోత్సవాన్ని టీటీడీ పూర్తిగా విస్మరించింది.యోగా దినోత్సవం హిందూ ధార్మిక వేడుక కాదు,కానీ, హిందూ ధర్మంతో, భారతీయతతో ముడిపడిన,ప్రతి భారతీయడు, ప్రత్యేకించి ప్రతి హిందువు గర్వించే కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాన్ని ఉపేక్షించడం క్షతవ్యం కాదని, యోగా సంస్థలు అక్షేపిస్తున్నాయి. అంతే కాదు, ఇదేదో పొరపాటున జరిగింది కాదు. ఉద్దేశ పూర్వకంగానే జరిగిందని, వ్యవహారం పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తినేసింది’ అన్నట్లుగా టీటీడీ వ్యవహారం ఉందని ధార్మిక సంస్థలు మరో మారు అక్షేపిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా సోమవారం యోగ దినోత్సవాన్ని నిర్వహించినా, టీటీడీలో మాత్రం ఆ ఊసే కనిపించలేదు. టిటిడి విద్యాసంస్థలలో కూడా యోగా దినోత్సవం జరిపిన దాఖలాలు లేవు. గతంలో టీటీడీ ఆధ్వర్యంలో యోగా నేర్పించే విద్యా సంస్థ ఉండేది. డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను నిర్వహించి ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు ఇచ్చేవారు. నిత్యం యోగ సాధన చేసే వారి కోసం పాత మెటర్నిటీలో హాల్‌ను కూడా కేటాయించేవారు. అనంతరం టీటీడీ విద్యాశాఖ పరిధిలోని యోగా సంస్థను ఆయుర్వేద కళాశాల పరిధిలోకి తెచ్చింది. రెండేళ్ల కిందటి వరకు సంస్కృత విద్యాపీఠంతో కలిసి టీటీడీ యోగా దినోత్సవాన్ని ఓ ఉత్సవంలా నిర్వహించేది. కావచ్చును, కొవిడ్ కారణంగా, గతంలో లాగా కార్యక్రమాన్ని నిర్వహించక పోవడాన్ని అర్ధం చేసుకోవచ్చును,కానీ, ఈ విధంగా పూర్తిగా విస్మరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గత రెండేళ్లుగా యోగా దినోత్సవాన్ని టీటీడీ నిర్లక్ష్యం చేసింది. సనాతన ధర్మంలో ఎంతో కీలకమైన యోగాను టీటీడీ లాంటి ధార్మికసంస్థ పట్టించుకోక పోవటం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,పాలనలో టిటిడిలో అన్యమతస్థుల ప్రాబల్యం పెరుగుతున్నదని ఆరోపణలకు తోడు,తరచూ చోటు చేసుకుంటున్న ఇలాంటి దురగాలు, టీటీడీలో జరుగతున్న హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రభుత్వ మద్దతు ప్రోత్సం ఉందనే అనుమానాలను మరింత బలోపేతం చేస్తున్నాయి. టిటిడిలో పనిచేస్తున్న అన్యమతాలకు చెందిన ఉద్యోగులను తొలగించడం పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. ఇటువంటి సమయంలో యోగా దినోత్సవంను పట్టించుకొనక పోవడం ప్రభుత్వ ధోరణిని వెల్లడి చేస్తున్నది.