భార్య ఆ విషయాన్నీ దాచింది.. భర్తకు తెలిసింది చివరికి అదే జరిగింది.. 

కొంచెం జరగరా నాకు కొంచం స్పేస్ కావాలి. ఈ డైలాగ్ విని ఉంటారు. ఈ మాట తరుచు మనం ప్రయాణం చేసేటప్పుడు, లేదంటే జనం బాగా రద్దీగా ఉన్న చోట వింటుంటాం. అయితే అలాంటి టైం లో ఇలాంటి మాటలు సహజం కానీ.. పెళ్లి  అయి రెండు నెలలు గడుస్తున్నా.. భార్య, తన భర్త స్పేస్ కావాలని చెప్పడం ఎక్కడైనా చూశారా.. ? అలా తన భార్య అన్న మాటకు ఆ భర్తకు అనుమానం వస్తే.. ఏం జరుగుతుంది ? ఆ తర్వాత భార్య ఎందుకు ఇలా చేస్తుందని ఆరా తీస్తే.. అప్పుడు ఇన్ని రోజులు భార్య దాచిన విషయం  భర్తకు తెలిస్తే.. ఆ  నిజం తెలిసిన భర్త ఎలా ఫీల్ అవుతాడు.  ఆ నిజం భర్త జీర్ణించుకోకుంటాడు. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం ముందుకు పదండి తెలుసుకుందాం.  కాన్పూర్ నగర నివాసి అయిన యువకుడు శాస్త్రినగర్ లోని పంకి ప్రాంతానికి చెందిన యువతిని ఏప్రిల్ 28వతేదీన వివాహమాడారు. వివాహం అనంతరం వరుడు వధువుతో శారీరక సంబంధం ఏర్పరచుకోలేక పోయాడు. పెళ్లి చేసుకున్నాక భార్య భర్తల మధ్య శారీరక సంబంధం సాధారణం. కానీ ఓ భర్త పెళ్లై రెండు నెలలు అవుతున్నా భర్తను దగ్గరికి రానివ్వడం లేదు, భార్య అలా అనడం వెనక ఏదో కారణం ఉంటుందని ఆ భర్త కూడా భార్యతో శారీరక సంబంధం ఏర్పరచుకోలేకపోయాడు. కొన్ని నెలలు వెయిట్ చేశాడు. ఆ తర్వాత సహనం కోల్పోయిన భర్త ఆమెను పరీక్షల నిమిత్తం డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. దీంతో భార్యను పరీక్షించిన డాక్టర్ ఆమె హిజ్రా అని తెలిపింది. దీంతో షాక్ తిన్న భర్త.. భార్య తరపు బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లింగమార్పిడి చేసి అమ్మాయి అని చెప్పి తనతో వివాహం జరిపించారని, మోసం చేసిన అత్తమామలపై కేసు పెట్టాలని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తమామలతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఇన్ స్పెక్టర్ చెప్పారు. తన భార్య లింగమార్పిడి చేయించుకుందని, ఆమె జననాంగాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని గుర్తించి ఆమెను వైద్య పరీక్ష కోసం గైనకాలజిస్టు వద్దకు తీసుకువెళ్లాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో వెలుగుచూసింది.

స్కూళ్లు తెరిస్తే డేంజర్ అన్న నీతి ఆయోగ్.. ప్రాణాలంటే లెక్కలేని జగన్ సర్కార్! 

కొవిడ్ సెకండ్ వేవ్ ఇప్పుడుప్పుడే తగ్గుతోంది. పాజిటివ్ కేసులు తగ్గడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు సడలించాయి. లాక్ డౌన్ ను క్రమంగా అన్ లాక్ చేస్తున్నాయి. విడతల వారీగా సడలింపులు ఇస్తూ సాధారణ పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నాయి. అందులో ఏపీ ప్రభుత్వం టాప్ లో ఉంది. ఏపీలో ప్రస్తుతం  రోజుకు నాలుగు వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. పాజిటివిటి రేటు ఐదు శాతానికి పైగానే  ఉంటోంది. పాజిటివిటి రేటు ఐదు శాతం ఉందంటే కొవిడ్ ప్రభావం తీవ్రంగానే ఉన్నట్లుగా భావించారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాని  జగన్ రెడ్డి సర్కార్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతోంది.  పరీక్షలు వద్దని విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా.. నిపుణులు చెబుతున్నా , విపక్షాలు డిమాండ్ చేస్తున్నా జగన్ రెడ్డి సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు. పరీక్షలపై పంతానికి పోతోంది. నిజానికి దేశంలోని 21 రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. విద్యార్థులకు నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తమ పరిధిలో ఉన్న సీబీఎస్ఈ పదకొండు, పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేసింది. మరికొన్ని ఎగ్జామ్స్ ను కూడా క్యాన్సిల్ చేసింది. ఏపీ సర్కార్ మాత్రం మొండి వైఖరితోనే ముందుకు వెళుతోంది. దీంతో విద్యార్థుల ప్రాణాలతో ఏపీ సర్కార్ చెలగాటమాడుతుందనే ఆందోళం వ్యక్తమవుతోంది. తాజాగా స్కూళ్లు తెరవడంపై నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌  కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదని చెప్పారు . ఈ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని, ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. 'పాఠశాల అంటే టీచర్‌, హెల్పర్‌, విద్యార్థులు ఉంటారు. అందరూ ఒకేచోట కూర్చోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందువల్ల మనకు ఉత్తమమైన రక్షణ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి చర్యలు తీసుకోవాలి. ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించి రక్షణ కల్పించినప్పుడో.. వైరస్‌ చాలావరకు తగ్గిపోయినప్పుడో మాత్రమే అలా చేయడం మంచిది. ఇదివరకు స్కూళ్లు తెరిచినప్పుడు వైరస్‌ విజృంభించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు వైరస్‌ తగ్గినట్టు కనిపించడానికి కారణం.. చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో పాటు, ప్రజలు క్రమశిక్షణతో ఉండటమే. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేయడంతో పాటు, పాఠశాలలు కూడా మొదలుపెడితే వైరస్‌కు మళ్లీ అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈమేరకు ఎప్పుడు స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం పరిశీలనలో ఉంటుంది. ఇందులో రెండు మూడు మంత్రిత్వశాఖలు భాగస్వాములవుతాయి. ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను అనుసరించి చాలా అప్రమత్తతతో ఈ నిర్ణయం తీసుకోవాలి' అని వీకే పాల్ సూచించారుు. బోర్డు పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరుపై మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం  సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఏపీ నుంచి స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  ఇన్ని రోజులైనా అఫిడవిట్‌ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణపై రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని ధర్మాసనం నిలదీసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఆగ్రహం, నీతి ఆయోగ్ సూచనలతోనైనా పరీక్షల నిర్వహణపై జగన్ రెడ్డి సర్కార్ పంతం వీడుతుందో లేదా చూడాలి మరీ.. 

ఓయూ విద్యార్థి నేతపై హత్యాయత్నం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం..? 

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఉస్మానియా యూనివర్శిటి విద్యార్థి నాయకుడు జటంగి సురేష్ యాదవ్ పై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. సుర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఆతనిపై మంగళవారం రాత్రి అగంతకులు దాడి చేశారు. పిడుగుద్దులు గుద్దారు. దుండుగుల దాడిలో సురేష్ యాదవ్ కు తీవ్ర గాయలయ్యాయి. అక్కడే పడిపోయిన సురేష్ ను అతని అనుచరులు సుర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం సురేష్ సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది.  సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్ల పహాడ్‌(సురేష్ స్వస్థలం)లో 20మంది టీఆర్ఎస్ నాయకులు.. తనను చంపేందుకు ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.. ఆధారాలు చూపిస్తున్నాడు. ఈ సంఘటనలో తనతో పాటు అడ్డొచ్చిన సోదరుడు మహేష్‌, గ్రామస్తులకు తీవ్రంగా గాయాలు అయినట్టు చెబుతున్నాడు.పాతర్ల పహాడ్‌ గ్రామంలో జరుగుతున్న జాతరను చూసేందుకు వస్తే.. పథకం వేసి టీఆర్ఎస్ నాయకులు తనపై దాడి చేశారన్నాడు. ఈ దాడిలో నూతన్‌కల్ ప్రస్తుత పీఏసీఎస్ చైర్మన్ కనగంటి వెంకన్నతో సహా మరో 20 మంది ఉన్నట్టు తెలిపాడు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ డైరెక్షన్ లోనే సురేష్ యాదవ్ పై దాడి జరిగిందని.. అతని అనుచరులు ఆరోపిస్తున్నారు. దాడిలో పాల్గొన్న వారంతా ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితంగా ఉండేవారని చెబుతున్నారు.  ఓయూ విద్యార్థి నాయకుడు జటంగి సురేష్‌ యాదవ్‌పై అధికార పార్టీ నాయకుల దాడి సూర్యాపేట జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. గతంలో ఓయూలోనూ ఓసారి సురేష్ యాదవ్ పై దాడి జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడన్న కారణంతో బాల్క సుమన్ అనుచరులు దాడి చేసినట్టు అప్పుడు సురేష్ మీడియా ముందు ఆరోపించారు.తాజాగా మరోసారి అతనిపై దాడి జరగడంతో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు సురేష్ యాదవ్. తెలంగాణ విద్యార్థి పరిషత్ లోనూ కీలక నేతగా ఉన్న సురేష్ యాదవ్.. బీజేపీకి అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఈటల వెంట ఢిల్లీకి వెళ్లిన బృందంలో సురేష్ యాదవ్ కూడా ఉన్నారు. ఈటలకు మద్దతుగా ఇటీవల కాలంలో ఓయూ జేఏసీ  పేరుతో ప్రెస్ మీట్లు పెడుతూ కేసీఆర్ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు సురేష్. సూర్యాపేట జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డిపైనా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రికి దగ్గరగా ఉండే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రోదల్బంతోనే సురేష్ యాదవ్ పై దాడి జరిగిందని.. అతని అనుచరులు ఆరోపిస్తున్నారు.  జటంగి సురేష్‌ యాదవ్‌‌కు ఈటల రాజేందర్ ఫోన్ చేసి పరామర్శించారు. గత కొన్ని రోజుల క్రితం జటంగి సురేష్.. ఈటల రాజేందర్‌, జర్నలిస్టు రఘును కలిసి వారికి మద్దతు తెలిపాడు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనపై దాడి సంచలనం రేపుతోంది.బీజేపీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ నేతల తీరు మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు.   

బాలికపై దొంగ బాబా అత్యాచారం.. 

భారత దేశంలోప్రాణాలు పొసే డాక్టర్స్  కంటే..  ప్రజా సంక్షేమం కోసం ఏదైనా కనుకునే సైన్ టిస్ట్ కంటే బాబాలను నమ్ముతారు. వీరి దగ్గర ఉన్నది వారికి సమర్పించుకోవడంలో ఏ మాత్రం వెనకాడరు చాలా మంది ప్రజలు. అలాగే ప్రజల అమాయకత్వాన్ని, మరికొందరి బలహీనతలను ఆధారంగా చేసుకుని బాబాలు కూడా భక్తి ముసుగులో, దేవుడి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. అక్కడితో ఆగక కాషాయం కట్టి, సన్యాసి అవతారం ఎత్తి చివరికి ఆడవాళ్లపై కూడా దారుణాలకు పాలుపడుతున్నారు దొంగ బాబాలు. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బాబా ముసుగులో ఓ దుర్మార్గుడు .. మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. నేరడిగొండ మండలం రాజూరలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. జిల్లాలోని నేరడిగొండ మండలం రాజూర సమీపంలో కొండపై శివాలయం ఉంది. అక్కడే కొండపై ఏడేళ్ల నుంచి ఆత్మారాం మహరాజ్‌ పేరు చెప్పుకుంటూ ఓ దొంగ బాబా నివాసముంటున్నాడు. అప్పటికే భక్తి బోరు కొట్టిన బాబా.. ఇదే క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న ఓ మైనర్ బాలికపై కన్నేసిన ఆ దుర్మార్గుడు.. పదును చూసి కరెంట్ షాక్ కొట్టినట్లు, దొంగ బాబా అదును చూసి, ఆ అమ్మాయిని కాటు వాయలనుకున్నడు. చివరికి ఆ అమ్మాయి పై కోరిక తీర్చుకున్నాడు. ఆ తరువాత బండారం బయటి పడింది. పోలీసులు రంగంలోకి దిగి  బాబా భరతం పట్టే పనిలో పడ్డారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు. బాబాను దేవుడిగా భావించింది ఆ అమాయకపు బాలిక. ఈ క్రమంలోనే బాబాకు పూజలు చేసి పండ్లు ఇచ్చేందుకు రాజురా సమీప గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక వెళ్లింది. ఈనెల 16న రాత్రి 8 గంటలకు ఆత్మారాం మహరాజ్ వద్దకు వెళ్లి తిరిగిరాకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. రాత్రంతా ఎదురుచూసి ఉదయం వెళ్లి చూడటంతో ఆత్మారాం ఆలయంలో స్పహ కోల్పోయి కనిపించింది. ఆమెను చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో బాబా అసలు బండారం బయటపడింది. కాగా, జరిగిన వ్యవహారానికి సంబంధించి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మరాం మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

జ‌గ‌న్ గ‌జ‌దొంగ‌.. వైఎస్సార్ నీటిదొంగ‌.. ముదిరిన వాట‌ర్ వార్‌..

జ‌గ‌న్ గ‌జ‌దొంగ అంటూ ఏపీ సీఎంపై తెలంగాణ మంత్రి తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు. అందులోనూ ఆ మంత్రి సీఎం కేసీఆర్‌కు బాగా స‌న్నిహితుడ‌నే పేరుంది. ఆ మినిస్ట‌ర్ అలా అన్నాడంటే.. కేసీఆరే అలా అనిపించి ఉంటాడ‌ని అంటున్నారు. జ‌గ‌న్‌రెడ్డిని తెలంగాణ మంత్రి వ్యక్తిగ‌తంగా విమ‌ర్శించాడంటే.. ఇక ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య‌ సంబంధాలు బాగా దెబ్బ‌తిన్నాయ‌ని చెబుతున్నారు. దీంతో రెండు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం ముందుముందు ఏలాంటి ట‌ర్న్ తీసుకుంటుందోన‌నే ఆందోళ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి జల వివాదం త‌లెత్తింది. ఇరు రాష్ట్రాల మంత్రులు ప్రాజెక్టుల విష‌యంలో మాట‌ల యుద్ధానికి దిగుతున్నారు. ఏపీ మంత్రులు కాస్త నెమ్మ‌దిగానే మాట్లాడుతున్నా.. తెలంగాణ మినిస్ట‌ర్స్ మాత్రం తెగ రెచ్చిపోతున్నారు. మా వాటా మేం వాడుకుంటే త‌ప్పేంటంటూ ఏపీ మంత్రి అనిల్‌కుమార్ ప్ర‌శ్నిస్తే.. అందుకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. తాజాగా, మ‌రో మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఏకంగా ఏపీ సీఎం జ‌గ‌న్‌పైనే డైలాగ్‌ గ‌న్ ఎక్కుపెట్టారు. జ‌గ‌న్‌రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నీటిదొంగ అయితే.. నేటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గజదొంగలా మారాడంటూ కామెంట్స్ చేయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఏపీ స‌ర్కారు పోతిరెడ్డిపాడు- రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కం నిర్మాణంలో దూకుడు పెంచింది. ఆ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లంగా మారింది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆనాడు పొతిరెడ్డి పాడు ద్వార నీటిని దొంగతనంగా తరలించుకుపోయి నీటి దొంగగా మారడని.. ప్రస్థుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం అనుమతి లేని ప్రాజెక్టులను నిర్మిస్తూ.. గజదొంగగా మారడని మండిపడ్డారు ప్ర‌శాంత్‌రెడ్డి.  తెలంగాణలోని మహబుబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలను ఎండగట్టాలని ప్ర‌శాంత్‌రెడ్డి పిలుపిచ్చారు. ఏపీ పాల‌కులు అనుమతి లేని ప్రాజెక్టులను దొంగతనంగా నిర్మిస్తున్నారని.. అందుకు సంబంధించిన సాక్ష్యాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తెప్పించారని త్వరలో గ్రీన్ ట్రిబ్యునల్‌తో పాటు ప్ర‌ధాని మోదీకి సైతం ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రాజెక్టులను వెంట‌నే ఆపకపోతే పోరాటం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రా ప్రజలందరు తెలంగాణకు వ్యతిరేకులని, లంకలో పుట్టిన వారంతా రాక్షసులేనని విధ్వేషాలు రెచ్చ‌గొట్టేలా మాట్లాడారు మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి.  మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రా ప్రజలను మంత్రి లంక వాసులతో పోల్చడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడో జరగాల్సిన ఆర్‌డీఎస్ కుడి కాలువ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణ, గోదావరి ట్రిబ్యునల్ నుండి ఇష్టం వచ్చినట్టి నీటిని చౌర్యానికి పాల్పడుతుందని  కర్నూలు టీడీపీ నేతలు ఆరోపించారు. తమకు రావాల్సిన 4 టీఎంసీల నీటి వాటా ప్రకారం టెండర్ వేసి కుడి కాలువ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇంత జ‌రుగుతున్నా.. తెలంగాణ మంత్రులు అంతేసి మాట‌లు మాట్లాడుతున్నా.. వైసీపీ నేత‌లు మౌనం వ‌హిస్తుండ‌టంపై మండిప‌డుతున్నారు ఏపీ ప్ర‌జ‌లు. మ‌రోవైపు.. మాట‌ల‌తో పాటు చేత‌ల‌తోనూ ఏపీపై అటాక్ చేస్తోంది తెలంగాణ స‌ర్కారు. తాజాగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై ఫిర్యాదు చేసింది. ఎన్జీటీ స్టే విధించినా పనులు కొనసాగుతున్నాయని, కృష్ణా బోర్డు వాటిని అడ్డుకోలేకపోయిందని తెలంగాణ ప్రభుత్వం కంప్లైంట్ చేసింది. డీపీఆర్ కోసం సన్నాహకాలంటూ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా పంపలేకపోయిందని లేఖలో త‌ప్పుబ‌ట్టింది. ఏపీ చర్యలతో తెలంగాణలో కృష్ణా బేసిన్‌లో ఉన్న కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు, హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని తెలంగాణ కేబినెట్ అభిప్రాయ‌ప‌డిన విష‌యాన్ని లేఖ‌లో తెలిపింది. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణమే ఆపాలని లేఖ‌లో కోరింది తెలంగాణ స‌ర్కారు. ఇలా, వ‌రుస ప‌రిణామాలు, తూటాల్లాంటి మాట‌లు చూస్తుంటే.. రెండు రాష్ట్రాల మ‌ధ్య వాట‌ర్ వార్ మ‌ళ్లీ మొద‌లైన‌ట్టే ఉంది. ఏపీ నుంచి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో.. అది ఏ ప‌రిణామాల‌కు దారి తీస్తుందోన‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

ఈట‌ల మీటింగ్ ఆడియో లీక్‌.. ! తమ్ముడే చేశాడా..?  

తెలంగాణ రాజకీయాలన్ని హుజురాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగనుండటంతో అన్ని పార్టీలు నియోజకవర్గంపై ఫోకస్ చేశాయి. ఈటల రాజేందర్ గ్రామాల్లో పర్యటిస్తుండగా.. అధికార పార్టీ నేతలు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ప్రస్తుతానికి సైలెంటుగానే ఉన్న .. త్వరలోనే పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. దీంతో  హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. రాజకీయ సమీకరణలతో పాటు  రోజుకో ట్విస్ట్ హుజురాబాద్ నియోజకవర్గంలో వెలుగు చూస్తోంది. ఎవరు ఎవరి కోసం పని చేస్తున్నారో, ఎవరు ఎటువైపు వెళ్తున్నారో తెలియడం లేదు.ముఖ్యంగా ఈటల రాజేందర్ శిబిరంలో గందరగోళ  పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే కొంత మంది సన్నిహితులు ఈటలకు దూరమయ్యారని తెలుస్తోంది. తాజాగా వెలుగులోనికి వచ్చిన మరో ఘటన ఈటలకు ఉక్కిరిబిక్కిరి చేస్తోందని సమాచారం. ఇటీవల ఈటల సోదరుడు ఈటల భద్రయ్య తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసిన ఈటల, నాయకుల మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  మంత్రివర్గం నుంచి తనను కేసీఆర్  బర్తరఫ్ చేసిన తర్వాత.. ఈటల రాజేందర్ గత నెల మే 27న శామీర్ పేటలోని తన నివాసంలో కమలాపూర్ మండల సీనియర్ నాయకులు, యువతతో సమావేశమయ్యారు. ఆ భేటీలో ఈటల స్థానిక మండలంలోని నాయకుల తీరును, రాజకీయ సమీకరణాలపై చర్చ చేస్తుండగా భేటీలో ఉన్న ఈటల సోదరుడు భద్రయ్య తన సెల్‌ఫోన్‌లో ఆ భేటీకి సంబంధించిన మాట‌ల‌ను రికార్డు చేసిన‌ట్లు స‌మాచారం. అందులో మండల నాయకులు మాట్లాడిన మాటలు కూడా రికార్డయ్యాయి.  అయితే, ఇటీవ‌ల ఆ వాయిస్ రికార్డు భద్రయ్య ఫోన్ నుంచి ‘ఈటల అండ’ అనే ఒక వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేయబడింది. ఆ తర్వాత ఒక‌రి నుంచి ఒకరికి ఫార్వార్డ్ అయి వైరల్ గా మారింది. ఈటల రాజేందర్ మీటింగ్ ఆడియో లీక్ కావడం ఇప్పుడు రచ్చగా మారింది.  ఆడియోను ఎవరు లీక్ చేశారా.. కావాలనే లీక్ చేశారా లేక పొరపాటున జరిగిందా అన్న చర్చ ఈటల రాజేందర్ శిబిరంలో జరుగుతుందట. అసలు  ఈ వాయిస్ రికార్డు ఈటల తమ్ముడు భద్రయ్య ఎందుకోసం రికార్డ్ చేయవలసి వచ్చింది అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఎవరికైనా  పంపించడం కోసమే ఈటల తమ్ముడు భద్రత్త మీటింగులో నేతలు మాట్లాడిన మాటలనురికార్డ్ చేశారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఈటల రాజేందర్ సీక్రెటుగా నిర్వహించిన సమావేశానికి సంబంధించిన ఆడియో లీక్ కావడం.. అది కూడా ఈటల తమ్ముడి ఫోన్ నుంచే బయటికి రావడం మరింత కలకలం రేపుతోంది. తాజా ఘటనతో ఈటల శిబిరంలో ఇంటి దొంగలు ఎక్కువగా ఉన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆడియో లీక్ వైరల్ కావడంపై రాజేందర్ కూడా అసహనంగా ఉన్నారని చెబుతున్నారు. చూడాలి మరీ ముందు ముందు ఇది ఎక్కడికి దారి తీస్తుందో.. 

జగన్ కు రఘురామ మరో షాక్! హైకోర్టులో పిటిషన్ తో కాక.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పోరాటం సాగిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ రాజు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలు, జగన్ ఎన్నికల హామీలపై రోజుకో లేఖ రాస్తూ కాక రేపుతున్న రఘురామ.. తాజాగా జగన్ రెడ్డి వ్యాపారాలపై ఫోకస్ చేసినట్లు  కనిపిస్తోంది. సీఎం జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్‌ లీజు పొడిగింపుని సవాల్‌ చేస్తూ ఆయన  పిటిషన్‌ వేశారు.  సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్ లీజ్‌లో అక్రమాలు జరిగాయని గతంలో  సీబీఐ నిర్ధారించిందని తన పిటిషన్ లో చెప్పారు ఎంపీ రఘురామ.  సీబీఐ కేసును ప్రస్తావించకుండా హైకోర్టులో లీజ్ పొడిగింపునకు అనుమతి పొందడాన్ని  రఘురామ పాయింట్ చేశారు. సీబీఐ కేసు దాఖలు చేసిన కంపెనీకి లీజు ఎలా పొడిగిస్తారని రఘురా తన  పిటిషన్‌లో ప్రశ్నించారు. జగన్ సొంత కంపెనీ కావటంతో అధికారులు నిబంధనలు ఉల్లఘించి అనుమతులు ఇచ్చారని  పేర్కొన్నారు.  సరస్వతి కంపెనీ, పరిశ్రమలశాఖ, మైనింగ్ శాఖ, ఏపీ పొల్యూషన్ బోర్డులను తన వ్యాజ్యంలో ప్రతివాదులుగా  చేర్చారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. రఘురామ పిటిషన్ పై త్వరలోనే హైకోర్టులో విచారణ జరగనుంది.  ‘గ్రంధి ఈశ్వరరావు 1999లో సరస్వతి కంపెనీని ఏర్పాటు చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతిరెడ్డి, మరో ఇద్దరు ఆ కంపెనీ షేర్లను కొనుగోలు చేశారు. తర్వాత ఒరిజినల్‌ ప్రమోటర్లు కంపెనీని విడిచిపెట్టారు. గుంటూరు జిల్లాలో 266 హెక్టార్లు లైమ్‌స్టోన్‌ ప్రాస్పెక్టింగ్‌ లీజుకోసం 2008 మార్చి, ఏప్రిల్‌లలో కంపెనీ దరఖాస్తు చేసింది. మైనింగ్‌ లీజు కోసం దరఖాస్తు చేసుకున్నాక మెమోరాండం ఆఫ్‌ అసోసియేషన్‌ను కంపెనీ సవరించింది. మైనింగ్‌ లీజు దరఖాస్తును అధికారులు స్వీకరించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రభుత్వం  మైనింగ్‌ లీజును మంజూరు చేసింది. ఆ కంపెనీ ముఖ్యమంత్రి కుమారుడు, కోడలు, భార్యది కావడంతో అధికారులు అనుమతులిచ్చారు.మైనింగ్‌ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో 2014లో అప్పటి ప్రభుత్వం యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. కంపెనీ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని అధికారులు.. మైనింగ్‌ లీజు మురిగిపోయినట్లుగా (ల్యాప్స్‌) ప్రకటిస్తూ అక్టోబరు 9న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ కంపెనీ అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యం వేసింది. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్‌మోహన్‌రెడ్డి క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారంటూ సీబీఐ దర్యాప్తు నిర్వహించింది. జగన్‌మోహన్‌రెడ్డి సంపద రూ.11 లక్షల నుంచి రూ.45వేల కోట్లకు పెరిగిందని కనుగొంది. ఈ వ్యవహారంలో 2012-14 సంవత్సరాల్లో సీబీఐ.. జగన్‌మోహన్‌రెడ్డిపై 11 అభియోగ పత్రాలను దాఖలు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 6 ఛార్జిషీట్లు వేసింది. అవి న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయి. దర్యాప్తులో భాగంగా మైనింగ్‌ లీజు మంజూరులో అక్రమాలు జరిగాయని సీబీఐ కనుగొంది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, లీజు కాలపరిమితి ముగిసినదిగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని సీబీఐ కోరింది. మైనింగ్‌ లీజు కాలపరిమితి ముగిసినట్లుగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో 2019 సెప్టెంబరు 30న ప్రభుత్వం తూతూ మంత్రంగా కౌంటర్‌ వేసింది. సీబీఐ విచారణలో వెల్లడైన వివరాల్ని కోర్టు ముందు ఉంచలేదు. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు ఏజీ.. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారు. కోర్టును తప్పుదోవ పట్టించారు. ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి.. రిట్‌ను అనుమతించారు. లీజు కాలపరిమితి ముగిసినట్లు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు. మైనింగ్‌ లీజును పునరుద్ధరించాలని ఆదేశించారు. సరస్వతి కంపెనీకి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మోసపూరితంగా వ్యవహరించినప్పుడు.. ఆ విషయాన్ని పౌరుడిగా న్యాయస్థానం దృష్టికి తేవాల్సి ఉంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకుని సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయండి’ అని రఘురామ తన పిటిషన్ లో కోరారు.

జ‌గ‌న్‌రెడ్డిపై డైరెక్ట్ అటాక్‌.. జూన్ 29న డేట్ ఫిక్స్‌..

చంద్ర‌బాబు స‌మ‌ర‌శంఖం పూరించారు. ఇక త‌గ్గేదే లే అంటూ ప్ర‌జాపోరాటానికి పిలుపిచ్చారు. అందుకు జూన్ 29న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ రోజున ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల‌ ప‌క్షాన టీడీపీ ఆందోళ‌నకు దిగ‌నుంది. ఇన్నాళ్లూ ఆన్‌లైన్ పోరాటాల‌తో ప్ర‌జ‌ల్లో చైత‌న్యం ర‌గిలించిన చంద్ర‌బాబు.. ఈసారి కేడ‌ర్‌ను ప్ర‌జాక్షేత్రంలో ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌కు సిద్ధం చేస్తున్నారు. జగన్‌రెడ్డి అవినీతిపై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తామన్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు.   కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్‌లో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు చంద్రబాబు. వారం రోజులు టీకాలు వేయకుండా ఆపేసి.. ఒక్కరోజు మాత్రమే టీకాలు వేసి గొప్ప‌గా ప్రచారం చేసుకుంటున్నారని మండిప‌డ్డారు. ఏపీలో కరోనా మరణాలు ప్రభుత్వ లెక్కలకంటే 14 రెట్లు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని అన్నారు.  జాబ్ కేలండ‌ర్‌నూ టీడీపీ అధినేత దుయ్య‌బ‌ట్టారు. జాబ్ కేలండర్ పై నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో రాష్ట్ర పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులో సమర్థులైన, నోబుల్ గ్రహీతలైన వారిని సలహాదారులగా పెట్టుకుంటే... ఏపీలో మాత్రం అసమర్థులను సలహాదారులుగా పెట్టుకున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏపీలో ఎక్కడ చూసినా రేప్‌లు, సెటిల్మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు, గంజాయి స్మగ్లింగ్రా జ్యమేలుతున్నాయని మండిప‌డ్డారు. జగన్‌రెడ్డి ఇంటి సమీపంలోనే యువతిపై దారుణ అత్యాచారం జరగడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని ఆగ్ర‌మం వ్య‌క్తం చేశారు టీడీపీ అధినేత‌.  ఏపీలో చేయూత పేరుతో మోసం జరుగుతోందని.. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. ఏడాదికి రూ.36వేలు చొప్పున ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ.1,80,000 చెల్లించాల్సి ఉండగా లబ్ధిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున కోత విధించారన్నారు. చేయూత‌ను 4 ఏళ్లకు మాత్రమే పరిమితం చేసి.. కొంతమందికి మాత్రమే ఏడాదికి రూ.18వేలు చెల్లింపు జరుగుతోందని, ఇలా ఒక్కో మహిళకు రూ.లక్షా 5వేలు ఎగనామం పెట్టి వంచించారని మండిప‌డ్డారు. డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చేస్తానని జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు చంద్ర‌బాబు. సంక్షేమం పేరుతో ఏపీ సీఎం ప్రజలను మోసగిస్తున్నారని.. ప్రజలకు జగన్ సర్కారు ఇచ్చింది గోరంత.. దోచింది కొండంత అని టీడీపి ఆధినేత విమర్శించారు. ఇక, వ్యవసాయం పరిస్థితి చూస్తే రైతులకు ఏపీ సర్కారు ధాన్యం బకాయిలు చెల్లించలేదని, పంటలకు గిట్టుబాటు ధర లేదని చంద్రబాబు మండిపడ్డారు.  ఇలా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌న్నిటిపై నిర‌స‌న తెలిపేలా.. జ‌గ‌న్‌రెడ్డి అరాచ‌క పాల‌న‌ను నిల‌దీసేలా.. జూన్ 29న.. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళ‌న చేప‌ట్టాల‌ని పిలుపిచ్చారు పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు. ముందుముందు సీఎం జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌కు వ్య‌తిరేకంగా జ‌ర‌గ‌బోయే ప్ర‌జా ఉద్య‌మాల‌కు ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంతో అంకురార్ప‌ణ జ‌ర‌గ‌నుంది.   

జ‌గ‌న్‌కు అన్న‌య్య జేజేలు.. మ‌రి, త‌మ్ముడి ప‌రిస్థితేంటి?

మెగాస్టార్ చిరంజీవి. సినిమాల్లో ఫుల్ బిజీ. పాలిటిక్స్‌తో ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టు ఉన్నారు. గ‌త చేదు గాయాలు ఆయ‌న్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఒక‌ప్పుడు సొంత‌ పార్టీతో ఉద‌యిస్తున్న సూర్యుడిలా ఎదిగారు. అంత‌లోనే హ‌స్తం పార్టీలో అస్త‌మించారు. కేంద్ర మంత్రిగా ముచ్చ‌ట తీర్చుకున్నారు. ఇప్పుడు ఎంచ‌క్కా మ‌ళ్లీ సినిమాలు చేసుకుంటున్నారు. అన్న‌య్య మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తారా? అనే ప్ర‌శ్నే ఇప్పుడు వినిపించ‌డం లేదు. అంత‌గా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అప్ప‌ట్లో చేతులు కాల్చుకున్నాక‌.. మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే ఆకులు ప‌ట్టుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీకి ప‌రోక్షంగా స‌పోర్ట్ చేస్తునే.. జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వానికి బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ఇస్తుండ‌టం ఆస‌క్తిక‌రం. ఆచార్య మైండ్‌గేమ్ ఏంట‌నేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  లేటెస్ట్‌గా సోష‌ల్ మీడియాలో ఓ పొలిటిక‌ల్ రూమ‌ర్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. చిరంజీవిని సీఎం జ‌గ‌న్ రాజ్య‌స‌భ‌కు పంపిస్తారంటూ ప్ర‌చారం హోరెత్తుతోంది. జ‌గ‌న్ ఏంటి.. చిరును ఎంపీ చేయ‌డ‌మేంటి అనే లాజిక్కులు అవ‌స‌రం లేదు. ఎందుకంటే, రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. అయితే, ఆ పొగ రావ‌డానికి కార‌ణ‌మైన నిప్పు ఏంట‌నేదే తేలాల్సింది.  జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. ఇటీవ‌ల చిరంజీవి ఏపీ విష‌యాల్లో బాగా స్పందిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌కు ప‌దే ప‌దే మ‌ద్ద‌తు పలుకుతున్నారు. గ‌తంలో ఓసారి సినీ రంగానికి తోడ్పాటు అందించాలంటూ టాలీవుడ్ ప్ర‌తినిధిగా జ‌గ‌న్‌ను క‌లిసి రిక్వెస్ట్ చేశారు మెగాస్టార్. అయితే, వైజాగ్‌లో స్టూడియో క‌ట్ట‌డానికి భూముల కోస‌మంటూ రూమ‌ర్స్ వ‌చ్చాయ‌నుకోండి అది వేరే విష‌యం. ఆ త‌ర్వాత కూడా సంద‌ర్భానుసారం జ‌గ‌న్ ప‌నితీరును ప్ర‌శంసిస్తూ ఉండ‌టం విశేషం. ఇటీవ‌ల కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారాడ్డి ఎయిర్ పోర్టుగా నామకరణం చేసినప్పుడు ప్రభుత్వాన్ని అభినందించారు. తాజాగా, ఏపీలో జ‌రిగిన‌ మెగా వ్యాక్సినేష‌న్‌పైనా జ‌గ‌న్‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు. అంత‌కుముందు విశాఖ స్టీల్ ఫ్యాక్ట‌రీ ప్రైవేటీక‌ర‌ణ‌పైనా అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ చిరంజీవి స్పందించారు. ఇటు జ‌గ‌న్‌కు ప్ర‌శంస‌లు.. అటు ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌తిస్పంద‌న‌లు.. ఇలా మెగాస్టార్ మ‌ళ్లీ ఏపీ పాలిటిక్స్‌కి ట‌చ్‌లోకి వ‌స్తున్నారు.  సీఎం జ‌గ‌న్ సైతం మెగా అండ‌తో మ‌రోసారి అసెంబ్లీ స‌మ‌రానికి సిద్ధ‌మ‌వ్వాల‌ని స్కెచ్ వేసిన‌ట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల సమయానికి అన్ని సామాజిక వర్గాలను తనవైపు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎంత కాద‌న్నా.. చిరంజీవిని, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను కాపు వ‌ర్గం నేత‌లుగానే ప్ర‌జ‌లు భావిస్తారు. వాళ్లు పిలుపిస్తే పోలోమంటూ ముందుండేది కాపు కార్య‌క‌ర్త‌లే. ప్ర‌స్తుతం ఆ వ‌ర్గమంతా ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా జ‌న‌సేన వెంట ఉన్నారు. బీజేపీకి స‌పోర్ట‌ర్స్‌గా మారారు. ఇటు పీకే, అటు సోము వీర్రాజులాంటి నేత‌ల వ‌ల్ల కాపులంతా జ‌న‌సేన‌-బీజేపీల‌కు కాపు కాస్తున్నారు. ఆ ఫెవికాల్ బాండ్‌ను బ్రేక్ చేయడం మెగాస్టార్ వ‌ల్లే అవుతుంద‌నేది జ‌గ‌న్ లెక్క‌. లెక్క‌లేనంత తిక్క ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు సైతం అన్న‌య్య‌తోనే చెక్ పెట్టాల‌నేది వైసీపీ వ్యూహం. అందుకే అంద‌రివాడైన చిరంజీవిని త‌మ వాడు చేసుకునేందుకు జ‌గ‌న్‌రెడ్డి సై అంటున్నార‌ని తెలుస్తోంది.  ఇప్ప‌టికే రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకు వైసీపీకి ఫుల్ స‌పోర్ట్‌గా ఉంది. నామినేటెడ్ ప‌ద‌వులు, ప్ర‌భుత్వ తాయిలాల‌తో టీడీపీకి బ‌ల‌మైన‌ బీసీల‌నూ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక జ‌గ‌న్‌రెడ్డికి కొర‌క‌రాని కొయ్య‌గా మారింది కాపు సామాజిక వ‌ర్గ‌మే. అందుకే, ఆ వ‌ర్గానికి ప్ర‌తినిధిగా చిరంజీవిని వైసీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు పంపాల‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ట సీఎం జ‌గ‌న్‌. గ‌తంలో వైఎస్సార్ మ‌ద్ద‌తుతో చిరంజీవి పార్ల‌మెంట్‌లో అడుగుపెడితే.. ఇప్పుడు వైఎస్సార్ త‌న‌యుడు జ‌గ‌న్ ద‌య‌తో మెగాస్టార్ మ‌రోసారి రాజ్య‌స‌భ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉందంటున్నారు. ఆ మేర‌కు జ‌గ‌న్ నుంచి వ‌చ్చిన హింట్‌తోనే చిరంజీవి ఈమ‌ధ్య కాస్త యాక్టివ్ అయ్యార‌ని అంటున్నారు. అయితే.. త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను నొప్పించ‌కుండా జ‌గ‌న్‌తో ఎలా జ‌త‌క‌ట్టాల‌నేదే చిరంజీవి ముందున్న అస‌లు స‌వాల్‌.

పీఆర్సీ ఇచ్చినా ఉద్యోగులకు పాత వేతనాలే! 

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి. ఎంతో  కాలం సాగదీస్తూ ఎట్టకేలకు గత కేబినెట్ సమావేశంలో పీఆర్సీ పెంపునకు ఆమోదం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. 30 శాతం కొత్త పీఆర్సీ ఇచ్చింది. అయినా ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనాలు ఊరిస్తూనే ఉన్నాయి. పెరిగిన వేతనాలు జూన్ నెల సాలరీతో వచ్చే అవకాశాలు  లేకుండా పోయాయి. పాత స్కేళ్ల ప్రకారమే ఈనెల వేతనాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల పీఆర్సీ పెంపునకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కానందునే సమస్య వచ్చిందంటున్నారు. దీంతో పాత స్కేల్ ప్రకారమే బిల్లులు చేసి ట్రెజరీలకు పంపిస్తున్నారట.  ఉద్యోగులకు  30%  ఫిట్‌మెంట్‌ ఇస్తామంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం ప్రకటించి నెలలు గడిచినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత ఫిట్‌మెంట్‌ జీవోలు జారీ కావడంతో జూన్‌ నెలకు సంబంధించి పెరిగిన వేతనం జూలై ఒకటో తేదీన తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని ఉద్యోగులు భావించారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈసారి కూడా పాత వేతనాలే అందనున్నాయి. ఈ మేరకు ఆయా ప్రభుత్వ శాఖ లు పాత స్కేళ్ల ప్రకారమే బిల్లులు చేస్తున్నాయి. ఇప్పటికే చాలా శాఖల్లో వేతనాల కసరత్తు పూర్తయింది. జిల్లాల్లో సబ్‌ట్రెజరీ ఆఫీసులు, జంట నగరాల్లో పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసులకు బిల్లులను సమర్పిస్తున్నారు. అయితే కొత్త వేతనాల వ్యత్యాస సొమ్ము మాత్రం జూలై 10 లోపు అందనుంది. ఈ మేరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌.. ఆయా శాఖ ల ఉన్నతాధికారులకు అంతర్గత ఆదేశాలిచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మొదటి పీఆర్సీ కాలంలో అందాల్సిన డీఏల మొత్తం 30.392 శాతాన్ని వారి మూలవేతనంలో సర్కారు విలీనం చేసింది. దీనికి 30 శాతం ఫిట్‌మెంట్‌ను కలిపి కొత్త స్కేళ్లను నిర్ధారించాల్సి ఉంది. ఈ వేతనాలను ఎలా నిర్ధారించాలో వివరిస్తూ రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ మార్గదర్శక జీవోలను కూడా జారీ చేసింది. దీనిప్రకారం డ్రాయింగ్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ అధికారులు(డీడీవో)లు వేతనాలను లెక్కగట్టాలి. కానీ, సచివాలయం నుంచి కేంద్రీకృతంగా ఉండే సెంట్రల్‌ సర్వర్‌లో ఆయా శాఖల వారిగా కొత్త వేతనాలను అప్‌డేట్‌ చేయలేదు. దీనికి ఇంకా సమయం పట్టేలా ఉందని ట్రెజరీ వర్గాలంటున్నాయి. జిల్లాల్లోని డీడీవోలు ప్రతి నెలా 15 నుంచి 25వ తేదీలోపు సబ్‌ ట్రెజరీ ఆఫీసు(ఎ్‌సటీవో)లకు తమ కింద గల ఉద్యోగుల వేతన బిల్లులను సమర్పిస్తుంటారు. అదే జంట నగరాలకు సంబంధించి విభాగాధిపతులు ప్రతి నెలా 22వ తేదీలోపు పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసులకు బిల్లులను సమర్పిస్తారు.  ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంటుంది. హార్డ్‌ కాపీలను ఆయా ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ కార్యాలయాల్లో సమర్పిస్తారు. ఆ బిల్లులను పరిశీలించి, రిజర్వు బ్యాంకుకు చెందిన ఈ-కుబేర్‌కు బదిలీ చేస్తారు. ఆ బిల్లుల ఆధారంగా ‘నేషనల్‌ ఎలకా్ట్రనిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(ఎన్‌ఈఎ్‌ఫటీ)’ పద్ధతిన ఈ-కుబేర్‌ నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ అవుతుంటాయి. కాని వేతనాల సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయకపోవడంతో కొత్త వేతనాలు ఒకటో తేదీన అందే పరిస్థితి లేదు. అందుకే పాత వేతనాల ప్రకారమే బిల్లులు చేసి పంపిస్తున్నారు.

ఒక్క విద్యార్థి మరణించినా ప్రభుత్వానిదే బాధ్యత! ఏపీకి సుప్రీంకోర్టు..

అందరిది ఒక దారి ఐతే ఉలిపి కట్టెది ఇంకొక దారట .. అందరూ  ఒక పద్ధతిలో నడుస్తూ వుంటే ఒక్కడు మాత్రం నాకీ పద్ధతి వద్దు.  నేను వేరే దారినే పోతా అనేవాడి గురించి చెప్పటానికి ఈ సామెతను వాడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా ఇప్పుడు సేమ్ ఇలానే ఉంది. కరోనా మహమ్మారి ప్రభావానికి స్కూళ్లు, కాలేజీలు మూత పడ్డాయి. విద్యార్థుల ఆరోగ్యాలను ఫణంగా పెట్టలేమంటూ చాలా రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. విద్యార్థులను నేరుగా పై తరగతులకు ప్రమోట్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తమ పరిధిలోని సీబీఎస్ఈ పన్నెండో తరగతి పరీక్షలను రద్దు చేసింది. కాని ఏపీలో జగన్ రెడ్డి సర్కార్ మాత్రం పరీక్షలపై పంతానికి పోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పరీక్షలు నిర్వహించి తీరుతామని చెబుతోంది. దేశంలో ఇప్పటివరకు 21 రాష్ట్రాలు బోర్డు ప‌రీక్షల‌ను రద్దు చేశాయి.అయినా ఏపీ మాత్రం తన నిర్ణయం మార్చుకోవడం లేదు. విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు, విపక్షాలు, ప్రజా సంఘాల ఎంతగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా పరీక్షలపై ఏపీ సర్కార్ అనుసరిస్తున్న మొండి వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. రాష్ట్రాల బోర్డు ప‌రీక్షల రద్దు పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో గతంలోనే ఏపీ వైఖరి చెప్పాలంటూ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కాని అన్ని రాష్ట్రాలు అఫిడవిట్లు ఇచ్చినా ఏపీ సర్కార్ మాత్రం ఇంకా స్పందించలేదు. దీంతో కేసు విచారణసందర్భంగా పరీక్షల రద్దుపై అఫిడవిట్ రెండు రోజుల్లో సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.  అన్ని రాష్టాలు పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఏపీకి ఎందుకు అనిశ్చితి నెలకొందని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పరీక్షలకు వెళ్లాలనుకుంటే పూర్తి వివరాలను అఫిడవిట్‌లో తెలపాలని సూచించింది. పరీక్షల నిర్వహణతో ఒక్క మరణం సంభవించినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ధర్మాసనం పేర్కొంది. తాజాగా ప‌రీక్షల ర‌ద్దుకు సిద్ధంగా ఉన్నట్టు అసోం, పంజాబ్‌, త్రిపుర బోర్డులు సుప్రీంకోర్టు వెల్లడించాయి.  11వ తరగతి పరీక్షలు సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం తెలిపింది. ఇకనైనా ఏపీ సర్కార్ నిర్ణయం మార్చుకుంటుందో లేక పంతానికే పోతుందో చూడాలి మరీ.. 

మహిళలకు వడ్డించిన సీఎం కేసీఆర్.. వాసలమర్రికి వరాల జల్లు.. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో తన దత్తత గ్రామమైన తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తమ  గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రికి మహిళలు మంగళహారతులతో స్వాగతం చెప్పారు. తొలుత గ్రామసభ వేదికపైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు కేసీఆర్. ఆ తర్వాత గ్రామస్తులందరితో కలిసి భోజనశాలకు చేరుకున్నారు. అక్కడ టేబుళ్లపై కూర్చున్న గ్రామస్తుల దగ్గరికి వెళ్లి, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, భోజనం చేయాల్సిందిగా కోరారు. తమను ముఖ్యమంత్రి స్వయంగా పలకరించడంతో కొందరు గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు తమ సమస్యలను సీఎం కేసీఆర్ కు చెప్పుకున్నారు. ఈ సమస్యలన్నింటినీ నోట్ చేసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామస్తులు భోజనం చేస్తున్న సమయంలో చాలాసేపు కలియదిరిగి, వారిని పలకరించిన తర్వాత సీఎం కేసీఆర్ వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తన పక్కన కూర్చున్న గ్రామ మహిళలకు సీఎం స్వయంగా వంటకాలను వడ్డించారు.  వాసాలమర్రిలో నిర్వహించిన  గ్రామ సభలో  సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊరికి కేవలం ట్రాక్టర్లు ఇచ్చి వెళ్లిపోతే సరిపోదన్నారు. వాసాలమర్రిలో ఒక ప్రత్యేకమైన పని జరగాలని చెప్పారు. వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తానని వ్యాఖ్యానించారు. వాసాలమర్రిలో కేవలం నలుగురే తనకు పరిచయమయ్యారన్నారు. ఈ గ్రామం ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలని సూచించారు.ఊరిలో పోలీసు కేసులు ఉండకుండా చేయాలని, సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. వాసాలమర్రి రూపురేఖలు మారాలని పేర్కొన్నారు. ఊరిలో ఒకరంటే మరొకరికి ప్రేమ ఉండాలన్నారు. గ్రామస్తుల మధ్య ఐకమత్యం ఉండాలని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి జరగాలని సూచించారు. అంకాపూర్‌లో గ్రామ అభివృద్ధి కమిటీ ఉందన్నారు. సాక్ష్యాత్తు గ్రామ సర్పంచ్‌కి కూడా ఫైన్‌ వేశారని గుర్తు చేశారు. గ్రామంలో ప్రతి దళితవాడకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటానని కేసీఆర్‌ తెలిపారు.  

కేసీఆర్ ట్రాప్‌లో జ‌గ‌న్‌!.. ఇంకా ఎద‌గాలి బాస్‌!

కేసీఆర్-జ‌గ‌న్‌. రెండేళ్ల క్రితం మంచి మిత్రులు. ఇప్పుడు వారి రిలేష‌న్‌పై సందేహాలు. స్నేహ‌మా? వైర‌మా? అనే క‌న్ఫ్యూజ‌న్‌. ప‌రిస్థితులు అలా మారిపోయాయి మ‌రి. ఆనాడు వాళ్లిద్ద‌రు చెట్టాప‌ట్టాలు వేసుకొని తిరిగారు. ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారానికి కేసీఆర్ హాజ‌ర‌య్యారు. తాడేప‌ల్లి ప్యాలేజ్‌లో విందుభోజ‌నం చేశారు. నీటి చ‌ర్చ‌ల కోసం జ‌గ‌న్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ విచ్చేశారు. కేసీఆర్ ఆతిథ్యం స్వీక‌రించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వంలోనూ త‌ళుక్కున మెరిశారు. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటుండ‌గానే.. వారి మ‌ధ్య మ‌ళ్లీ  గ్యాప్ పెరిగిన‌ట్టే క‌నిపిస్తోంది. ఏడాదిన్న‌ర‌గా ఓ హాయ్ లేదు.. బాయ్ లేదు.  ఓ ఫోన్ కాల్ లేదు.. ఓ మీటింగ్ లేదు.. ఆ ఇద్ద‌రూ క‌లిసి కనీసం కాఫీ కూడా తాగ‌లేదు. ఒకే టేబుల్ మీద క‌లిసి భోజ‌నం చేసి ఎన్నాళ్లైందో. అస‌లు ఏమై ఉంటుంది? వారి మ‌ధ్య ఏం జ‌రిగుంటుంది? కేసీఆర్‌, జ‌గ‌న్‌ల దోస్తీ.. కుస్తీగా ఎందుకు మారింది? అంటే ఆస‌క్తిక‌ర కార‌ణాలే క‌నిపిస్తున్నాయి.  అస‌లు కేసీఆర్‌.. జ‌గ‌న్‌తో ఏనాడూ దోస్తీ చేయ‌నేలేద‌ని.. స్నేహం ముసుగులో స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌య‌త్నించార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. పాపం, రాజ‌కీయ అనుభ‌వం లేని జ‌గ‌న్‌.. కేసీఆర్ ట్రాప్‌లో చిక్కుకుపోయార‌ని అంటున్నారు. అయితే, జ‌గ‌మొండి జ‌గ‌న్ అంత‌లోనే కేసీఆర్ దుర్బుద్ధి గ్ర‌హించార‌ని.. అందుకే పొరుగు రాష్ట్ర‌ సీఎంకు దూర‌మ‌య్యార‌ని చెబుతున్నారు. ఇప్పుడిక తానేంటో.. త‌న త‌ఢాఖా ఏంటో కేసీఆర్‌కు రుచి చూపించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. అందుకే, నీటి ప్రాజెక్టుల విష‌యంలో తెలంగాణ‌ను ఇర‌కాటంలో ప‌డేసేలా.. పోతిరెడ్డిపాడు స్పీడు పెంచార‌ని అంటున్నారు. ఇప్పుడు వారిద్ద‌రి ఉద్దేశ్యం.. త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే... అన్న‌ట్టుగానే ఉంది. కేసీఆర్‌కు, జ‌గ‌న్‌కు ఫుల్ క్లారిటీ వ‌చ్చేసింది. అందుకే, స్నేహం ముసుగులు తీసేసి.. జ‌ల జ‌గ‌డానికి ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు సిద్ధ‌మవుతున్నార‌ని స‌మాచారం.  ఇక‌, జ‌గ‌న్‌ను కేసీఆర్ ట్రాప్ చేసిన విధానం ఆస‌క్తిక‌రంగా ఉందంటున్నారు. జ‌గ‌నే అమాయ‌కంగా కేసీఆర్‌ను న‌మ్మార‌ని చెబుతున్నారు. గ‌తాన్ని త‌వ్వి.. అప్ప‌ట్లో అస‌లేం జ‌రిగింద‌నేది విశ్లేషిస్తున్నారు.  కేసీఆర్‌-జ‌గ‌న్‌. ఒక‌ప్పుడు బ‌ద్ద శ‌త్రువులు. ఉద్య‌మ స‌మ‌యంలో జ‌గ‌న్‌ను రాళ్ల‌తో త‌రిమిన వైరం. ఆ దెబ్బ‌కి స‌మైక్యాంధ్ర‌నే ముద్దంటూ ఏపీకి పారిపోయి వ‌చ్చారు జ‌గ‌న్‌. కేసీఆర్ అండ్ కో లో విజ‌య‌గ‌ర్వం. జ‌గ‌న్ మ‌న‌సులో ప‌రాభ‌వ భారం. ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చేసింది. కాల చ‌క్రం గిర్రున తిరిగింది. ఏళ్ల పాటు వారిద్ద‌రి మ‌ధ్య వైరం మాత్రం అలానే ఉండిపోయింది. శ‌త్రువు శ‌త్రువు మిత్రుడు అన్న‌ట్టు.. వారిద్ద‌రిని ఏకం చేసిన ఫ‌లం మాత్రం చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది. 2018లో అసెంబ్లీని ర‌ద్దు చేసి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌గా.. దొర‌ను ఓడించేందుకు తెలంగాణ‌లోని విప‌క్షాల‌న్నీ ఏక‌మ‌య్యాయి. అనూహ్య రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ‌కు అది వేదికైంది. కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు క‌లిపింది. వారికి ప్రజాసంఘాలు మ‌ద్ద‌తు ప‌లికాయి. రాహుల్‌గాంధీ, చంద్ర‌బాబు, కోదండ‌రాం, గ‌ద్ద‌ర్‌.. ఒకే డ‌యాస్ పంచుకున్నారు. అదో సంచ‌ల‌నం.. అదో రాజ‌కీయ‌ అద్భుతం... వారి క‌ల‌యిక చూసి ఓ ద‌శ‌లో కేసీఆర్ సైతం ద‌డుసుకున్నారు. అంత‌లోనే తేరుకొని.. చంద్ర‌బాబు వ‌స్తే మ‌ళ్లీ ఆంధ్ర పాల‌నంటూ దుమ్మెత్తిపోశాడు. బాబును దోషిగా చూపించి.. ఓట్లు దండుకున్నాడు. ఎన్నిక‌ల్లో గ‌ట్టేక్కాడు. గెలిచాక విజ‌య‌గ‌ర్వంతో చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ స‌వాల్ చేశారు. అలా, ఏపీలో చంద్ర‌బాబును దెబ్బ తీసేందుకు.. కేసీఆర్ బ్యాచ్‌ జ‌గ‌న్‌తో చేతులు క‌లిపింది. అంతేకానీ, జ‌గ‌న్‌పై ప్రేమ కాదు.. ఏపీపై మ‌మ‌కారం అంత‌క‌న్నా కాదు.  ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. లోట‌స్‌పాండ్ వెళ్లి మ‌రీ జ‌గ‌న్‌తో మంత‌నాలు జ‌రిపారు. జ‌గ‌న్‌కి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. వైసీపీతో క‌లిసి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు మీద కోపంతో ఆ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీకి ప‌రోక్షంగా ఫుల్ స‌పోర్ట్ చేశారంటారు. హైద‌రాబాద్‌లో ఉన్న ఆస్తుల‌ను అడ్డుపెట్టుకొని.. టీడీపీ అభ్య‌ర్థుల‌ను బెదిరింపుల‌కు గురి చేశార‌ని బాధితులే స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డం అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. కేసీఆర్.. జ‌గ‌న్‌కు వెయ్యి కోట్ల డ‌బ్బు పంపించారంటూ ప్ర‌చార స‌మ‌యంలో చంద్ర‌బాబు ఆరోపించారు. అలా, కేసీఆర్‌, జ‌గ‌న్‌లు క‌లిసి చంద్ర‌బాబును ఓడించారు.  జ‌గ‌న్ సీఎం అయ్యాక కూడా ఆ బంధం కొన్నాళ్ల పాటు కొన‌సాగింది. ఈసారి కేసీఆర్ క‌న్ను నీళ్ల‌పై ప‌డింది. కృష్ణా-గోదావ‌రి అనుసంధానం అంటూ.. ఉమ్మ‌డి ప్రాజెక్టులంటూ క‌హానీలు చెప్పారు. అనుభ‌వ‌రాహిత్యంతో జ‌గ‌న్ వాటిని న‌మ్మారు. కేసీఆర్ ఇచ్చిన విందు భోజ‌నం అరిగాక‌.. తాడేప‌ల్లి తిరిగొచ్చాక.. తీరిగ్గా ఆలోచిస్తే తెలిసొచ్చింది.. అది అసాధ్య‌మ‌ని. అందులో ఉమ్మ‌డి ప్ర‌యోజ‌నాల‌కంటే తెలంగాణకు లాభ‌మే ఎక్కువ‌గా ఉంద‌నే త‌త్వం అధికారులు చెప్పాక ఆల‌స్యంగా జ‌గ‌న్‌కు బోధ‌ప‌డింది. కేసీఆర్‌పై మాయ‌ల మ‌రాఠీ అనే ముద్ర ఉంది. తెలంగాణ ప్ర‌జ‌లే ఆయ‌న్ను ఓ ప‌ట్టాన న‌మ్మ‌రు. అలాంటిది.. జ‌గ‌న్‌రెడ్డి మాత్రం త‌గ‌దున‌మ్మా అంటూ ఎగేసుకుపోయి.. నీళ్ల‌లో నిండా మునిగి వ‌చ్చారు. వెంట‌నే కాదంటే ఎక్క‌డ త‌న ప‌రువు పోతుందోన‌ని భావించి.. కొన్నాళ్ల పాటు మౌనంగా వేచిచూసి.. ఇప్పుడిక మా నీళ్లు.. మా ప్రాజెక్టులంటూ కేసీఆర్‌కు ఝ‌ల‌క్ ఇవ్వ‌డం స్టార్ట్ చేశారు జ‌గ‌న్‌. ఈ ప‌ని చంద్ర‌బాబు ఎప్పుడో చేశారు. కేసీఆర్ గురించి చంద్ర‌బాబుకు బాగా తెలుసు కాబ‌ట్టే.. ఏపీ వాటాను దోచుకోవాల‌నే తెలంగాణ ప్ర‌య‌త్నాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెడుతూ వ‌చ్చారు. చంద్ర‌బాబు ఉంటే.. కృష్ణా వాట‌ర్‌లో త‌మ ప‌ప్పులు ఉడ‌క‌వ‌నే అక్క‌సుతోనే.. జ‌గ‌న్‌కు ఫ్రెండ్‌షిప్ బిస్కెట్ వేసి.. నీటి వాటాలో లాభం పొందాల‌ని చూశారు. ఆ విష‌యం ఇంత‌కాలానికి జ‌గ‌న్‌కు తెలిసొచ్చింది. తెలుగురాష్ట్రాల మ‌ధ్య మ‌ళ్లీ జ‌ల జ‌గ‌డం మొద‌లైంది. 

ఇద్దరు ఉన్నతాధికారులకు ఏడు రోజుల జైలు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు ఉన్నతాధికారులకు ఏడు రోజుల జైలు శిక్ష విధించింది. ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరిలకు వారం రోజుల పాటు జైలు శిక్షను విధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ గత ఏప్రిల్ లో తాము ఇచ్చిన ఆదేశాలను వీరు అమలు చేయకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు అమలు చేయాలంటూ పలుమార్లు ఆదేశించినప్పటికీ బేఖాతరు చేయడంతో ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరికి కోర్టు వారం రోజులపాటు జైలు శిక్ష విధించింది.  ఆ 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను అమలుచేయాలంటూ హైకోర్టు పలుమార్లు ఆదేశించింది. అయినప్పటికీ, ఆ ఆదేశాలను ఐఏఎస్ అధికారి గిరిజా శంకర్, ఐఎఫ్ఎస్ అధికారి చిరంజీవి చౌదరి బేఖాతరు చేశారు. ఈ క్రమంలోనే వారిద్దరూ నేడు కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఆ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తామిచ్చిన ఉత్తర్వులను పెడచెవిన పెట్టినందుకుగాను ఇద్దరికీ చెరో వారం రోజులు జైలు శిక్ష విధించింది ఏపీ హైకోర్టు. ఏపీలో కొద్ది నెలల క్రితం ముగిసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల సందర్భంగా ఐఏఎస్ అధికారి, నాటి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పై బదిలీ వేటు పడింది.  అప్పటి  పంచాయ‌తీశాఖ కార్య‌ద‌ర్శి గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ లతో భేటీ అయ్యేందుకు మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ప్రయత్నించగా వారు హాజరు కాలేదు. దీంతో గోపాల కృష్ణ‌ ద్వివేదీ, గిరిజా శంక‌ర్‌ల‌ను బదిలీ చేయాలని నిమ్మగడ్డ ఆదేశించారు. దీంతో, వారి స్థానంలో మరో ఇద్దరిని నియమించారు. ఆ తర్వాత గిరిజా శంకర్, ద్వివేదీలపై ప్రొసీడింగ్స్ జారీ చేయ‌డం, సర్వీసు రిజిస్టర్ లో రిమార్క్ రాయడం, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాథ్ దాస్‌కు సిఫార‌సు చేయ‌డం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. 

వామ్మో.. టీఆర్ఎస్ ఆస్తులు ఎంతో తెలుసా? 

తెలంగాణ రాష్ట్ర సమితి.. 2001లో ఉద్యమ పార్టీగా పురుడుపోసుకుంది. ప్రస్తుతం అధికార పార్టీగా... తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ .. తన ఆస్తులను భారీగా పెంచుకుంది. ఎన్నికల కమిషన్  కు టీఆర్ఎస్ సమర్పించిన ఆస్తుల లెక్క చూస్తే షాక్ అవాల్సిందే..  టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న మొత్తం ఆస్తుల విలువ సుమారు 301.47 కోట్ల రూపాయలు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో ఆ పార్టీ తమ ఆస్తుల విలువను చెప్పింది. 2018–19లో రూ.188.73 కోట్లుగా ఉన్న టీఆర్‌ఎస్‌ నిధులు, ఆస్తుల విలువ ఏడాది కాలంలో రూ.301.47 కోట్లకు చేరింది.  తమ పార్టీ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన 2019–20 ఆడిట్‌ నివేదికను గత ఫిబ్రవరి 15న టీఆర్‌ఎస్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాలకు సంబంధించిన వార్షిక నివేదికను సీఈసీ ఇటీవల తన వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత ఆస్తిలో జనరల్‌ ఫండ్‌ రూపంలో 292.30 కోట్లు, కార్పస్‌ ఫండ్‌ రూపంలో రూ.4.76 కోట్లు, ఇతర రూపంలో రూ.4.41 కోట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి తెలిపింది టీఆర్ఎస్.  పార్టీ పేరిట ఉన్న భవనాలు, వస్తు సామగ్రి విలువ రూ.21.27 కోట్లుగా ఉంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జిల్లా కార్యాలయాల స్థలం, భూముల విలువ సుమారు రూ.16.50 కోట్లుగా ఉంటుందని లెక్కలు వేసింది గులాబీ పార్టీ. 2019–20లో స్థిరాస్తుల కొనుగోలు, షెడ్యూలు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ తదితరాల రూపంలో రూ.101 కోట్లు సమకూరాయని  లెక్కలు చెప్పింది. 2019–20 ఆర్ధిక సంవత్సరంలో టీఆర్‌ఎస్‌కు వి విధ మార్గాల్లో 130.46 కోట్లు సమకూరితే.. అందులో విరాళాల రూపంలో అత్యధికంగా 89.55 కోట్లు అందాయి. పార్టీ సభ్యత్వ నమోదు, పార్లమెంటరీ, లెజిస్లేటివ్‌ పార్టీ, టీఆర్‌ఎస్‌వీ విభాగాల నుంచి కలుపుకుని 22.79 కోట్లు, బ్యాంకుల్లో సెక్యూరిటీ డిపాజిట్లు, సేవింగ్‌ ఖాతా లపై వడ్డీ తదితరాల రూపంలో మరో రూ.18.10 కోట్లు సమకూరాయి. విరాళాల్లో ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో రూ.89.15 కోట్లు, వ్యక్తిగత దాతల నుంచి రూ.37.42 లక్షలు వచ్చాయని ఆ పార్టీ ప్రకటిచింది. ప్రకటనల కు 2.69 కోట్లు, ప్రచారానికి రూ.4.94 కోట్లు కలుపుకుని మొత్తంగా ఎన్నికల కోసం 7.64 కోట్లు ఖర్చు చేసినట్టు అఫిడవిట్ లో పేర్కొంది. పార్టీ కార్యా లయాల్లో ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులు కలుపుకుని ఏడాది కాలంలో 21.18 కోట్లు పార్టీ అవసరాల కోసం ఖర్చు చేసినట్టు తన నివేదికలో తెలంగాణ రాష్ట్ర సమితి వెల్లడించింది.  ఏడాదిలోనే టీఆర్ఎస్ ఇంత ఆదాయం పెరగడంతో ఇతర రాజకీయ పార్టీలు షాకవుతున్నాయి. అయితే ఇది కేవలం అధికారిక లెక్కలు మాత్రమే.. అనధికారికంగా ఇంకా ఎంత ఆస్థి ఉంది అన్నది కూడా చర్చగా మారింది. 

నోరు జారిన దేవెగౌడ.. రూ.2 కోట్లు జరిమానా 

కాలు జారినా ఓకే, నోరు జారితే అంతే... ఎంతకాలం అయినా అదలా వెంటాడుతూనే ఉంటుంది. మాజీ ప్రధాని దేవే గౌడ విషయమే తీసుకోండి, ఎప్పుడో పదేళ్ళ నాడు, ఆయన ఓ నిర్మాణ సంస్థను ఉద్దేశించి, ఓ అనరాని మాట అనేశారు. ఆ సదరు సంస్థ అప్పుడే అయన మీద ఓ పది కోట్ల రూపాయలకు పరవు నష్టం దావా వేసింది. ఇప్పుడా కేసు విచారణ పూర్తయింది. సదరు సంస్థకు ఓ రెండు కోట్ల రూపాయలు పరువు నష్టం చెల్లించాలని, దేవెగోడను ఆదేశిస్తూ న్యాయస్థానం తీర్పు నిచ్చింది.  కేసు వివరాల లోకి వెళితే, 2011జూన్28 తేదీన ఒకకనడ టీవీ చానల్ , ‘గౌడ గర్జన’ పేరిట దేవెగౌడ ఇంటర్వ్యూ ప్రసారం చేసింది.ఈ ఇంటర్వ్యూ లో దేవెగౌడ, నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజ్ (నైస్) అనే సంస్థపై అభ్యంతరకర  వ్యాఖ్యలు చేశారు. సంస్థ ప్రతినిధులు, తమ పరువుకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ అదనపు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సదరు సంస్థకు పరువు నష్టం కింద రూ.2 కోట్ల చెల్లించాలని సివిల్ కోర్ట్ న్యాయమూర్తి మల్లన గౌడ ఆదేశించారు.  గతంలో ట్రయల్ కోర్టు ఆదేశాలపై అసంతృప్తి చెందిన దేవగౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్‌ను ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. తమకు రూ.10కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నైస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో దేవగౌడ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడం వల్ల తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పరువు నష్టం చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో పాటుగా, న్యాయస్థానం పెద్దాయన పరవు తీసే విధంగా వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఎన్ఐసీఈ (నైస్) ప్రాజెక్ట్’ను  గతంలో కర్ణాటక హై కోర్టు, సుప్రీం కోర్టు  సమర్ధించాయని న్యాయస్థానం గుర్తు చేసింది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ అని పేర్కొంది. అల్లాంటి ప్రాజెక్ట్ విషయంలో పరవు నష్టం కలిగించే వ్యాఖ్యలను అనుమతిస్తే ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ నిర్మాణం దెబ్బతింటుందని పేర్కొంది

వసతులు లేకుండానే ప్రారంభోత్సవాలా! కలెక్టరేట్ల పేరుతో కేసీఆర్ షో చేస్తున్నారా..? 

తెలంగాణ ముఖ్యమంత్రిని ఫామ్ హౌజ్ ముఖ్యమంత్రి అంటూ విపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. గత రెండున్నర ఏండ్లుగా  ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌజ్ లో ఉండటం తప్ప ప్రజల్లోకి కేసీఆర్ రాలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే జనాగ్రహం తెలిసొచ్చిందో... ఈటల రాజేందర్ భయమో తెలియదు కాని.. సడెన్ గా రూటు మార్చారు కేసీఆర్. జిల్లాల పర్యటనలతో ప్రజల్లోకి  వెళుతున్నారు. రోజంతా  జిల్లాల్లోనే గడుపుతున్నారు. కేసీఆర్ లో ఒక్కసారిగా వచ్చిన మార్పును చూసి రాజకీయ వర్గాలే ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్ జనాల్లోకి వెళ్లడం బాగానే ఉన్నా... అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఆయన చేస్తున్న హడావుడిపైనే విమర్శలు వస్తున్నాయి. పనులు పూర్తి కాకుండానే ప్రారంభిస్తూ.. సీఎం షో  చేస్తున్నారనే ఆరోపణలను విపక్షాలు చేస్తున్నాయి. ఆదివారం సిద్దిపేట, కామారెడ్డిలో పర్యటించిన కేసీఆర్.. కొత్తగా కట్టిన సమీకృత కలెక్టరేట్లను ప్రారంభించారు. ఆదివారం వరంగల్ లో నిర్మించిన కొత్త కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. భవనాల ప్రారంభం తర్వాత జరిగిన సభల్లో సుదీర్ఘంగా ప్రసగించారు కేసీఆర్. అద్బుతమైన భవనాలు కట్టుకున్నామని చెప్పారు. కాని బయటి నుంచి చూస్తే గొప్పగా కనిపిస్తున్న కొత్త కలెక్టరేట్ల లోపల మాత్రం అంతా ఖాళీగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. భవనాలైతే కట్టారు కాని మౌలిక వసతుల కల్పన మాత్రం ఇంకా జరగలేదట. ముఖ్యంగా కలెక్టరేట్ లో ఉన్నతాధికారులకు ప్రత్యేక చాంబర్లు, శాఖల వారీగా ప్రత్యేక గదులు నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదట. ఉద్యోగుల కోసం పార్టిషన్ చేయాల్సి  ఉంటుంది. ఆ పనులు కూడా మొదలే కాలేదట. ఫర్నీచర్ గురించి చెప్పుకోవడానికి అక్కడ ఏమి లేదంటున్నారు. టాయిలెట్ గదుల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదంటున్నారు. ఉద్యోగులు పని చేయడానికి వీలుగా ఉండే పార్టిషన్ పనులతో పాటు పార్కింగ్ ఏర్పాట్లు కూడా జరగలేదంటున్నారు.  నిజానికి నాలుగేండ్ల క్రితం కలెక్టరేట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. మొదటి టర్మ్ పాలన పూర్తయ్యేనాటికే సిద్దం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. రెండోసారి అధికారం చేపట్టి రెండున్నర ఏండ్లు పూర్తైనా భవనాలను పూర్తి చేయలేకపోయారు. సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ అర్బన్ లో భవంతుల వరకు పూర్తి కావడంతో.. వాటినే ప్రారంభించారు కేసీఆర్. చాలా జిల్లాల్లో సగం పనులు కూడా జరగలేదంటున్నారు. కలెక్టరేట్ లో ఇంటీరియల్ వర్క్, పార్టిషన్ పనులే కీలకం అంటున్నారు. అవి పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని చెబుతున్నారు. అయినా కేసీఆర్ ప్రారంభోత్సవాలు చేస్తూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం నిర్మాణం పూర్తి కాలేదు కాబట్టే.. మీడియాను కొత్త కలెక్టరేట్లలోకి అనుమతి ఇవ్వడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ తలపెట్టిన సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలు మొదటి నుంచి వివాదాస్పదమయ్యాయి. కలెక్టరేట్ల పేరుతో టీఆర్ఎస్ లీడర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు రియల్ ఎస్టేట్ దందాలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ముందుగానే అక్కడ భూములు కొని.. తర్వాత తమ భూముల పక్కనే కలెక్టరేట్ నిర్మాణం జరిగేలా గులాబీ లీడర్లు స్కెచ్ వేశారనే ప్రచారం జరిగింది. సూర్యాపేట జిల్లాలో ఈ ఆరోపణలతోనే కొందరు కోర్టుకు వెళ్లడంతో చాలా కాలం పాటు అక్కడ పనులు నిలిచిపోయాయి. తమ స్వార్థం కోసం కొందరు నేతలు జనాలకు అందుబాటులో లేకుండా ఉండే ప్రాంతాల్లో, ఎక్కడో మూలన కలెక్టరేట్ల నిర్మాణాలు చేప్టటారనే ఆరోపణలు కూడా ప్రజల నుంచి వచ్చాయి. జిల్లా ప్రజలందరూ ఈజీగా చేరుకునేలా ఉండే ప్రాంతంలో కాకుండా తమకు కాసులు కురిపించేలా ఉన్న స్థానంలో కలెక్టరేట్ల నిర్మాణం జరిగిందని పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. 

పవార్ హీరోగా పీకే  థర్డ్ ఫ్రంట్! రాహుల్ పరిస్థితి ఏంటో..? 

‘బీజేపీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి’ ఇదొక్కటే సింగిల్ పాయింట్ ప్రోగ్రాంగా పెట్టుకున్న, బీజేపీ ప్రత్యర్ధి పార్టీలకు, నాయకులకు, తమ వ్యూహరచనతో రాష్ట్రాల స్థాయిలో బీజేపీని మట్టికరిపిస్తున్న ప్రశాంత్ కిశోర్ సహజంగానే ఒక ఆశా కిరణంగా కనిపిస్తున్నారు. మరోవంక, కారణాలు ఏవైనా, ప్రశాంత్ కిశోర్ కూడా, అదే కోరుకుంటున్నారు. బీజేపీని  ఓడించడం ఒక్కటే తన ముందున్న కర్తవ్యంగా ఆయన భావిస్తున్నారు. బెంగాల్ విజయం తర్వాత ఎన్నికల వ్యూహ రచన వ్యాపకం నుంచి తప్పు కుంటున్నట్లు  ప్రశాంత్ కిషోర్, ఇప్పడు మరింత విస్తృత స్థాయిలో అదే బాధ్యతను మరో రూపంలో బుజానికి ఎత్తుకున్నారు.  ప్రస్తుత పరిస్థితిలో బెజీపీని ఓడించడం, కాంగ్రెస్ సహా ఏ ఒక్క పార్టీతోనూ అయ్యే పని కాదు. ఇది అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు అన్నీ అంగీకరిస్తున్నదే. అన్ని పార్టీలను, కనీసం ఎన్డీఎ యేతర పార్టీలను ఏకం చేస్తేనే కానీ, బీజేపీని ఓడించడం సాధ్యం కాదు. ఇది కూడా, సో కాల్డ్ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తున్నదే. అలాగే, అన్నీ పార్టీలు ఏకం కావాలని, ఇంచుమించుగా అన్ని పార్టీలు కోరుకుంటూనే ఉన్నాయి. ఎటొచ్చి పిల్లి మెడలో గంట కట్టేదెవరు?అన్న దగ్గరే ఇంతవరకు అందరి ఆలోచనలు మిగిలి పోయాయి. గతంలో చేసిన అలాంటి ప్రయత్నాలు కూడా మూడు నాళ్ళ ముచ్చటగానే ముగిసి పోయాయి. ఈ నేపధ్యంలోనే, బీజేపీ, మోడీ పట్ల వ్యతిరేక పెరికి పరిస్థితులు అనుకూలిస్తున్న సమయంలో, పిల్లి మెడలో గంట  ప్రశ్న మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఆ ప్రశ్న  చుట్టూనే ప్రాంతీయ, జాతీయ పార్టీల  నాయకులు చక్కర్లు కొడుతున్న సమయంలో, నేనున్నానంటూ ముందు కొచ్చారు, ప్రశాంత్ కిశోర్.  ఇప్పుడు ఆయన మార్గ దర్శకత్వంలో, ది మోస్ట్ ఎలిజిబుల్ లీడర్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సారధ్యంలో, జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒక పక్షం  రోజుల క్రితం జూన్ 11 వతేదీన, రాజకీయ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్, ముంబైలో శరద్ పవార్’ను కలవడంతో ఊహాగానంగా మొదలైన బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు, మళ్ళీ నిన్న ఢిల్లీలో పవార్, ప్రశాంత్ సెకండ్ రౌండ్ టాక్స్’తో మరింత కాంక్రీట్ షేప్ తీసుకుంది. ప్రశాంత్ కిషోర్, పవార్ ముంబై సమావేశం తర్వాత ఎలాంటి ప్రకటన లేదు.కానే, ఢిల్లీ రౌండ్ టాక్స్ తర్వాత ఎన్సీపీ అధికార ప్రతినిధి, నవాబ్ మాలిక్ మీడియా ముందుకొచ్చి, శరద్ పవార్ ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరినీ ఏకం చేసే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారన్న శుభ వార్తను చెప్పారు.   మంగళవారం జరుగతున్న ఎన్సీపీ కార్యవర్గ సమావేశంలో ఈ విషయమ పై మరింత లోతుగా చర్చించే అవకాశం ఉందని నవాబ్ మాలిక్ సూచనప్రాయంగా చెప్పారు. అలాగే, మంగళవారం సాయత్రం, పవార్ దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితిని చర్చించేందుకు,వివిధ  పార్టీల నాయకులతో సమావేశం అవుతున్నారని చెప్పారు. ఈ సమావేశంలో  తృణమూల్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా, ఆర్జేడీ నాయకుడు మనోజ్ ఝా, ఆప్ ప్రతినిధి సంజయ్ సింగ్, ఇతర పార్టీలకు చెందినా పవన్ వర్ర్మ, సంజయ్  సింగ్, డి.రాజా, ఫరూక్ అబ్దుల్లా, కొద్ది మంది మోడీ వ్యతిరేక మేథావులు, కేటీ తులసీ వంటి వారు హాజరావుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించక పోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకిస్తోంది. ప్రశాంత్  కిషోర్, ‘మిషన్ 2024’ప్రచారం రాహుల్ గాంధీని అభ్యర్ధిని చేద్దామనే, ట్వీట్ తోనే ప్రారంభమైంది. అలాంటిది ఇప్పుడు, కాంగ్రెస్’ను పక్కన పెట్టి, బీజేపే వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. (ఒక వేళ ఈ సమావేశం రాహుల్ గాంధీకి మద్దతు కూడ గట్టేన్డుకోనేమో అన్న సందేహలు వినవస్తున్నాయి.   అయితే, ప్రధానంగా బీజేపీ, మోడీని ఓడిచడం లక్ష్యంగా మొదలైన ప్రయత్నంగానే దీని చూడాలని, చివరకు ఇది ద్వితీయ ఫ్రంట్ అవుతుందా, తృతీయ ఫ్రంట్ అవుతుందా, అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతమని ఎన్సీపీ నాయకుడు ఒకరు చెప్పారు. కాబటి ఫ్రంట్ ‘లో కాంగ్రెస్ రోల్ గురించి ఇప్పుడే చర్చించడం అనవసరంగాన  రాజకీయ వర్గాలు చూస్తున్నాయి. అయితే, ఈ మొత్తం ప్రణాలిక వెనక ఉన్నది, నిన్న గాక మొన్న బెంగాల్, తమిళనాడులో మోడీ, షా ద్వయాన్ని చిత్తు చేసిన ప్రశాంత్ కిషోర్ కావడంతో, ఈ పరిణామాలు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్, ఏమైనా చేయగల ఘటన ఘటన సమర్ధుడు, సో.. ఊహాగానాలు వదిలి ... జరిగే పరిణామాలను  గమనించడమే  ప్రస్తుతానికి ఉభయతారకం.

ఘ‌నంగా బోనాలు.. మ‌రి, ప్రాణాలు? కేసీఆర్‌ జ‌ర సోచో...

అమ్మ బైలెల్లితే.. అంతా భ‌క్తి పార‌వ‌శ్య‌మే. ఆషాఢంలో బోనాల జాత‌ర‌. తెలంగాణ‌కే ప్ర‌త్యేకత‌. హైద‌రాబాద్‌లో బోనాల పండుగ మ‌రింత‌ హైలైట్. త‌ల్లికి బోనం స‌మ‌ర్పించేందుకు మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తారు. బోన‌మెత్తి.. మొక్కులు చెల్లించుకుంటారు. కాలికి గ‌జ్జ‌క‌ట్టి.. శివ‌శక్తులు ఆడిపాడ‌తారు. పులివేషాలు,. అమ్మ‌వారి పూన‌కాలు.. పోతురాజుల డ్యాన్సులు.. అబ్బో.. ఆ హంగామే వేరు.  భాగ్య‌న‌గ‌రంలో బోనాల జాత‌ర‌ చూసి తీరాల్సిందే. ఏటేటా ఘ‌నంగా జ‌రిగే బోనాల జాత‌ర‌ క‌రోనా కార‌ణంగా గ‌తేడాది సాదాసీదాగా జ‌రిగింది. కొవిడ్ ఆంక్ష‌ల‌తో, భ‌క్తుల నియంత్ర‌ణ‌తో బోనాలు బోసిపోయాయి. ఈసారి మ‌ళ్లీ ఘ‌నంగా బోనాల జాత‌ర నిర్వ‌హ‌ణ‌కు స‌ర్కారు సిద్ద‌మ‌వుతోంది. బోనాల నిర్వ‌హ‌ణ కోసం వివిధ‌ ఆల‌యాల‌కు 15కోట్లు మంజూరు చేసింది ప్ర‌భుత్వం. బోనాల ఏర్పాట్ల‌పై ఈ నెల 25న మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ నేతృత్వంలో ప్ర‌త్యేక స‌మావేశం జ‌ర‌గ‌నుంది.  ఈ ఏడాది జులై 11న గోల్కొండ బోనాలతో జంట నగరాల్లో సంద‌డి షురూ కానుంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం నిర్వహించ‌నున్నారు. 26న ఏనుగుపై ఉజ్జయిని మహంకాళీ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఆగస్టు 1న హైదరాబాద్ లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి.  స‌న్నాహ‌క ఏర్పాట్లు చూస్తుంటే.. కుంభ‌మేళా స్థాయిలో బోనాల జాత‌ర జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. సంతోష‌మే. అమ్మ‌కు బోనం ఈ స్థాయిలో జ‌ర‌గ‌డం ఆనంద‌మే. కాక‌పోతే ఇదంతా మామూలు ప‌రిస్థితుల్లో జ‌రిగుంటే అంతా వంద శాతం ఆహ్వానించే వారే. కానీ, ప్ర‌స్తుత క‌రోనా క‌ల్లోల ప‌రిస్థితుల్లో ఘ‌నంగా బోనాలు జ‌ర‌గ‌నుండ‌ట‌మే ఆందోళ‌న‌క‌రం అంటున్నారు.  కొవిడ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అన్‌లాక్ మొద‌లైపోయింది. తెలంగాణ‌లోనూ ఆంక్ష‌లు పూర్తిగా ఎత్తివేశారు. క‌ర్ఫ్యూ, లాక్‌డౌన్ ఏదీ లేదు. అయితే, అన్‌లాక్ స‌డ‌లింపుల‌కు తొంద‌ర వ‌ద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ‌ హెచ్చ‌రిస్తోంది. అయితే, ఆరోగ్యం కంటే ఆక‌లి బాధ దారుణ‌మంటూ తెలంగాణ స‌ర్కారు లాక్‌డౌన్‌ను కంప్లీట్‌గా ఎత్తేసింది. అక్టోబ‌ర్ వ‌ర‌కూ క‌రోనా రాదంటూ సీఎం కేసీఆర్ జోస్యం కూడా చెప్పేశారు. ఇక క‌రోనా పోయింది.. ఇప్ప‌ట్లో మ‌ళ్లీ రాదంటూ.. స‌ర్కారు ఫిక్స్ అయిపోయింది. అందుకే, జులై-ఆగ‌స్టులో బోనాల జాత‌ర ఘ‌నంగా నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ ఉద్దేశ్యం ఎలా ఉన్నా.. క‌రోనా పోయిందంటే.. మ‌ళ్లీ రాదంటే.. న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరు జ‌నాలు. కొవిడ్ భ‌యం ఇప్ప‌టికీ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది. వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ముమ్మ‌రంగా సాగుతున్నా.. ఇంకా మొద‌టి డోసు పావు మందికి కూడా పూర్తి కాలేదంటున్నారు. అంటే, కొవిడ్ నుంచి పూర్తి ర‌క్ష‌ణకు ఇంకా టైమ్ ప‌డుతుంద‌న్న మాట‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో బోనాలు నిర్వ‌హిస్తే......? బోనాలంటే జ‌న‌జాత‌ర‌. భ‌క్తులు తండోప‌తండాలుగా వ‌స్తారు. అమ్మ‌కు బోనం స‌మ‌ర్పించేందుకు భారీగా క్యూ క‌డ‌తారు. గుడి చుట్టూ కిలోమీట‌ర్ల దూరం జ‌న‌సందోహ‌మే. మ‌రి, ప్ర‌జ‌లు వేలాదిగా ఒకేచోట చేరితే.. ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా.. అది కొవిడ్ హాట్ స్పాట్‌గా మార‌కుండా ఉంటుందా? అనే ఆందోళ‌న వ్య‌క్తమ‌వుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన కుంభ‌మేళాలో అలానే జ‌రిగిందని గుర్తు చేస్తున్నారు. అస‌లే, ఆగ‌స్టు-అక్టోబ‌ర్ మ‌ధ్య‌లో థ‌ర్డ్ వేవ్ వస్తుంద‌నే హెచ్చ‌రిక‌లు ఓవైపు.. మూడో ముప్పు దారుణంగా ఉంటుంద‌నే భ‌యాందోళ‌న‌లు మ‌రోవైపు.. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. ఇప్పుడిప్పుడే కొవిడ్ కేసులు కంట్రోల్‌లోకి వ‌స్తున్న స‌మ‌యంలో.. బోనాల జాత‌ర ఘ‌నంగా నిర్వ‌హిస్తే మ‌ళ్లీ ప‌రిస్థితి మొద‌టికి వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోలేద‌ని జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు వైద్య‌నిపుణులు.