ఈటల గెలిచేనా? ఆ ఒక్కటీ చేయకుండా ఉంటేనా..!
posted on Jun 24, 2021 @ 3:33PM
హుజురాబాద్‌లో ఉప ఎన్నికే రాలేదు.. అప్పుడే గెలుపోటములపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇంకా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలీదు.. అప్పుడే ఎవరు గెలుస్తారంటూ ఆసక్తి కనబరుస్తున్నారు.. అప్పట్లో కొడంగల్.. మళ్లీ ఇప్పుడు హుజురాబాద్.. అప్పుడు రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఈటల రాజేందర్. కేసీఆర్‌ను ఢీకొట్టి నిలబడి గెలవడం అంత ఈజీ కానే కాదు. కానీ, దుబ్బాక ఆ అభిప్రాయాన్ని మార్చేసింది. అందుకే, ఇప్పుడు హుజురాబాద్‌లో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈటల కేంద్రంగానే హుజురా..వార్ జరుగబోతోంది. ఆయన ప్రత్యర్థులు ఎవరనే దానితో పని లేదు. ఈటల గెలుస్తారా? ఓడతారా? అనేదే మెయిన్ పాయింట్. ఈటలకు అనుకూల అంశాలు, వ్యతిరేక అంశాలపై విశ్లేషణలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈటల గెలవచ్చు అనే లెక్కకు ఎంత బలముందో.. ఈటల ఓడిపోవచ్చు అని చెప్పడానికీ అన్నే కారణాలు కనిపిస్తున్నాయి. ఆ రెండు వాదనల్లోనూ పస ఉంది కాబట్టే ఉత్కంఠ మరింత పెరిగిపోతోంది.
హుజురాబాద్ ఈటల ఇలాఖా. ఆయన రాజకీయ అడ్డా. ఆయన ఆ ప్రాంత బిడ్డ. ముసలికి నీళ్లలో బలం ఉన్నట్టు.. ఈటలకు హుజురాబాద్‌లో గట్టి పట్టు ఉందనేది అందరూ ఒప్పుకునే విషయమే. ఊరూరా ఆయన అనుచరవర్గమే. ఇక కేబినెట్ నుంచి అవమానకరంగా వెళ్లగొట్టారనే సానుభూతి ఎలానూ ఉండనే ఉంది. ఆర్థికంగానూ బాగా బలమైన నేత కావడం.. ఎంత ఖర్చుకైనా వెనకాడకపోవడం అదనపు అంశాలు. బీజేపీ వల్ల అంతగా లాభం లేకపోయినా.. సొంత బలం, బలగమే ఈటలను గెలిపించాల్సి ఉంది. అయితే, గెలిచే అవకాశం ఉన్నా.. గెలవడం మాత్రం అంత ఈజీ కాదనే వాదనా వినిపిస్తోంది. ఈటల తొందరపడకుండా కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే బాగుండేదని అంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకత నిగూడంగా ఉంది. అది దుబ్బాక లాంటి చోట్ల బయటకు పెల్లుబుకుతోంది. హుజురాబాద్‌లోనూ అలానే జరిగే ఛాన్స్ ఉన్నా.. ఈటల చేజేతులారా ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నారని అంటున్నారు. రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరకుండా.. కాస్త చాణక్యం ప్రదర్శించి ఉంటే అవకాశాలు మరింత మెరుగ్గా ఉండేవని చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిఉంటే.. కేసీఆర్ మీద కోపంతో ఆయనకు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ సపోర్ట్ చేసే అవకాశం ఉండేదని అంటున్నారు. వివిధ ప్రజాసంఘాలు, వివిధ వర్గాలు సైతం ఆయనకు మద్దతుగా నిలిచేవి. అంతా కలిసి కట్టుగా కేసీఆర్‌ను ఓడించేందుకు ముందుకొచ్చేవారు. కోదండరాం సార్, కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం ఈటలకు ఈ విషయంలో నచ్చజెప్పారు. కాంగ్రెస్ సైతం ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే మద్దతు విషయం ఆలోచిస్తామని చెప్పింది.
ఇంత అడ్వాంటేజ్ ఉన్నా.. కేసులకు భయపడో, రక్షణ కోసమో.. మరే కారణమో కానీ.. బీజేపీ శిబిరంలో చేరిపోయారు ఈటల రాజేందర్. దీంతో, ఉన్న సానుభూతి పోయింది. కాంగ్రెస్‌కు ప్రత్యర్థి అయ్యారు. బీజేపీ అంటే గిట్టని మైనార్టీ తదితర వర్గాలకూ దూరమయ్యారు. బీజేపీలో చేరకుండా.. స్వతంత్రుడిగా బరిలో దిగి ఉంటే.. అందరివాడై.. అందరూ కలిసొచ్చి.. ఈటలను గెలిపించుకుని ఉండేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. బీజేపీలో చేరడం వల్ల.. కనీసం కోదండరాం సైతం సపోర్ట్ చేయలేని దుస్థితి.
బీజేపీలో చేరాలని ఈటల అంతలా కోరుకుంటే.. మరో విధంగా చేసుంటే బాగుండేదని అంటున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి.. అందరి మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత బీజేపీలో చేరడం సరైన ఎత్తుగడనే అభిప్రాయం వినిపిస్తోంది. స్వతంత్రంగా బరిలో దిగితే.. ఈటల గెలుపు సునాయాసంగా ఉండేది. ఆ తర్వాత తాను తలచినట్టే బీజేపీలో చేరి సేఫ్‌గానూ ఉండేవారు. ఇంత ఈజీ ఆప్షన్ వదిలేసి.. అప్పుడే బీజేపీలో చేరడం ఈటల తొందరపాటు నిర్ణయమే అంటున్నారు. ఎన్నకలకు ముందే బీజేపీలో చేరడం ఆయనకు కాస్త మైనస్సే అని భావిస్తున్నారు. అయితే, ఈ ఒక్క ఎన్నిక వరకూ బీజేపీ అని చూడకుండా.. అంతా ఈటల వైపు నిలుస్తారనేది మరో అంచనా. చూడాలి.. హుజురాబాద్‌లో ముందుముందు ఏం జరుగుతుందో.. ఎవరి లెక్క ఎవరిని విజయతీరాలకు చేరుస్తుందో...