రూ. 83 లక్షలు నొక్కేశారు..
posted on Jun 25, 2021 @ 10:44AM
వాళ్ళు పధకం వేస్తే.. ఎంత పెద్ద వాడికైనా పంచర్ అవ్వాల్సిందే. వాళ్ళ కన్ను పడితే ఎవరి ఖజానాకైనా కన్నం పడాల్సిందే.. అలా అని వాళ్ళు ఇల్లు ఇల్లు తిరిగి కన్నాలు వేయరు. పథకాలు వేసి ప్రజల ఇండ్లు దోచుకోరు. వాళ్లకు లేనోడు ఉన్నవాడు అని తేడా ఉండదు ఒక రకంగా చెప్పనంటే కరోనా వైరస్ లాంటి వాళ్ళు దోచుకోవడం దాచుకోవడమే వాళ్ళ పని. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే మనీ లో మునిగి తేలుతారు. వాళ్ళు ఎవరో మీకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది . వాళ్ళే సైబర్ నేరగాళ్లు. వాళ్ళు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు, ఏం చేస్తుంటారో అసలు తెలీదు. కానీ వాళ్ళు కొట్టే దెబ్బ మాత్రం చాలా గట్టిగ ఉంటది. ఏదో ఒక సారి ఏదో ఒక రకంగా మన అకౌంట్ లో ఉన్న డబ్బులు గల్లంతు అవుతాయి. వాళ్ళు రంగంలోకి దిగితే మనకు కుచ్చుటోపి పడాల్సిందే.. హైదరాబాద్ లో ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖులు మోసపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ మణప్పురం గోల్డ్ సంస్థకు భారీ కుచ్చుటోపి పెట్టారు. దాదాపు ముప్పై లక్షలు టోకరా వేశారు. హిమాయత్ నగర్ మణప్పురం గోల్డ్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి హిమాయత్‌నగర్ మణప్పురం గోల్డ్ బ్రాంచ్ ఉద్యోగులకు ఫోన్ చేశాడు. తాను సంస్థ ఉన్నతాధికారినంటూ చెప్పాడు. అన్యాయం పుణ్యం ఎరుగని ఉద్యోగులు వారి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చారు. అలా సేకరించిన లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో సైబర్ నేరగాడు రూ. 30 లక్షలు కాజేశాడు. ఇలా ఇద్దరు ఉద్యోగులను బురిడీ కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. ఇరువురి ఐడీల నుంచి లాగిన్ అయి.. రూ. 15 లక్షలు చొప్పున మొత్తం రూ. 30 లక్షలు కాజేశారు. ఈ విషయాన్ని సంస్థ ఉన్నతాధికారులు గ్రహించి వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలాఉంటే.. మసాబ్ ట్యాంక్‌కు ప్రాంతానికి చెందిన నిమ్రా సెర్ గ్లాస్ టెక్రాలజీ సంస్థ ఎండీనీ సైతం ఇలాగే బురిడీ కొట్టించారు సైబర్ దొంగలు. నిమ్రా సంస్థ యజమాని ఖాదర్‌ను తప్పుదోవ పట్టించి రూ. 53 లక్షలు కొట్టేశారు. మెటీరియల్ కొనుగోలు కోసం ఒక ఇంటర్నేషనల్ సంస్థతో నిమ్రా సంస్థ యజమాని ఖాదర్ ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా డాలర్ల రూపంలో అడ్వాన్స్ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇక అంతే ఖాదర్ కదలికలపై కన్ను వేశారు నేరగాళ్లు. రెండవ విడత చెల్లింపు సమయంలో ఖాదర్‌ని సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేశారు. సంస్థ అధికారులమని, డబ్బును లండన్‌లో ఉన్న వేరే బ్యాంకు ఖాతాకు పంపించాలని స్పూఫ్ ఈమెయిల్ పంపించారు కేటుగాళ్లు. వారి మాటలు నమ్మిన ఖాదర్.. సమర్పించుకున్నాడు. దాదాపు మొత్తం రూ. 53 లక్షల 23 వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. మెటీరియల్ విషయమై సంస్థ అసలు అధికారులను సంప్రదించడంతో మోసం బయటపడింది. దాంతో బాధితుడు ఖాదర్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు కేసులను నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.