తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. మోత్కుపల్లి గుడ్ బై ?
posted on Jun 27, 2021 @ 1:09PM
ఈటల రాజేందర్ చేరికలో జోష్ మీదున్న బీజేపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన కొందరు సీనియర్ నేతలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. ఇల్లంతకుంట మండలానికి చెందిన కొందరు నేతలు మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. మరికొందరు అదే దారిలో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగానే తాజాగా బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కమలానికి హ్యాండిచ్చారు.
ప్రగతి భవన్ లో ఆదివారం దళితుల సమస్యలపై సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. అన్ని పార్టీలు దళిత ప్రజాప్రతినిధులకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. అయితే సీఎం సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. తమ పార్టీ నుంచి ఎవరూ ప్రగతి భవన్ కు వెళ్లరని ప్రకటించింది. అదే సమయంలో కేసీఆర్ సమావేశానికి పోటీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దళిత నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే బీజేపీలో దళిత నేతగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు.. పార్టీ నిర్వహించిన సమావేశానికి కాకుండా సీఎం కేసీఆర్ సమావేశానికి హాజరయ్యారు. ఇదే ఇప్పుడు బీజేపీలో కాక రేపుతోంది. పార్టీ వద్దని చెప్పినా మోత్కుపల్లి ప్రగతి భవన్ వెళ్లారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
కొంత కాలంగా బీజేపీలో మోత్కుపల్లి నర్సింహులు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు కూడా సరిగా హాజరు కావడం లేదు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ లోనూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు, రాజేందర్ పేదల భూములు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆటలను మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని మోత్కుపల్లి సమర్ధించారు. అంతేకాదు మాములు కార్యకర్తగా ఉన్న ఈటలను ఎన్నో పదవులు ఇచ్చిన కేసీఆర్ చాలా గొప్పవాడని చెప్పారు. ఈటలపై చేసిన వ్యాఖ్యలు, తాజాగా ప్రగతి భవన్ సమావేశానికి మోత్కుపల్లి హాజరు కావడంతో... ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. మోత్కుపల్లిని తమ పార్టీలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించారని తెలుస్తోంది.