రేవంత్ ఫస్ట్ టార్గెట్ హుజురాబాద్!.. ఈటలకు తీన్మార్?
posted on Jun 27, 2021 @ 2:00PM
నెల రోజులుగా తెలంగాణలో ఈటల రాజేందర్ పేరు మారుమోగిపోతోంది. ఇప్పుడిక రేవంత్‌రెడ్డి పేరు డైనమైట్‌లా పేలుతోంది. ఇన్నాళ్లూ హుజురాబాద్ ఉప పోరుపై అనేక విశ్లేషణలు వినిపించాయి. ఈటల ఈజీగా గెలుస్తారా? కేసీఆర్‌దే పైచేయి అవుతుందా? ఈటలతో బీజేపీకి బూస్ట్ వస్తుందా? ఈటల కేసీఆర్‌కు ఏకు మేకవుతారా? ఇలా రకరకాల ఊహాగానాలు. ఇప్పుడు వాటన్నిటినీ మళ్లీ రీరైట్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇన్నాళ్లూ హుజురాబాద్‌లో వేసిన లెక్కల్లో కాంగ్రెస్ పాత్ర అతి తక్కువ. కానీ, రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కావడంతో లెక్కలన్నీ మారిపోయే పరిస్థితి రావొచ్చు అంటున్నారు. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై రేవంత్‌రెడ్డి మరో లీడ్ రోల్ ప్లే చేయనున్నారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక రేవంత్‌రెడ్డి ముందుకొచ్చే ఫస్ట్ టాస్క్--హుజురాబాద్ బైపోల్. ఇదే ఇప్పుడు రాజకీయంగా అత్యంత ఆసక్తికరం. హుజురాబాద్‌తో పాటు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే పరిణామం.
సెప్టెంబర్‌లోనే హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి సత్తాకు హుజురాబాద్ ఎలక్షన్ సవాల్‌గా నిలవనుంది. తనను పీసీసీ చీఫ్ చేయడం సరైన నిర్ణయమే అని నిరూపించుకోవాలంటే.. హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకు తీరాల్సిందే. హుజురాబాద్ గెలుపు.. ఈటల, కేసీఆర్‌కు ఎంత ముఖ్యమో ఇప్పుడిక రేవంత్‌రెడ్డికి సైతం అంతే ముఖ్యం. ఇదే ఇప్పుడు ఆసక్తికరం.
హుజురాబాద్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. రేవంత్ పేరు ఢిల్లీ స్థాయిలో రీసౌండ్ అవుతుంది. తెలంగాణలోనూ రేవంత్‌రెడ్డి మొనగాడనే ఇమేజ్ మరింత బలపడుతుంది. హుజురాబాద్‌లో ఈటలను, కేసీఆర్‌ను దెబ్బకొడితే.. మరో మూడేళ్ల వరకూ.. అసెంబ్లీ ఎన్నికల వరకూ.. ఆయనకు ఎదురులేకుండా పోతుంది. ఒక్క హుజురాబాద్ విజయం.. రేవంత్‌రెడ్డిని అటు కాంగ్రెస్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ హీరోని చేస్తుంది.
ఒకవేళ హుజురాబాద్‌లో కాంగ్రెస్ గెలవలేకపోతే.. పార్టీకి పెద్దగా నష్టం లేకపోయినా.. రేవంత్‌రెడ్డికి మాత్రం ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ ఎంపికపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే అధిష్టానానికి ఆయనపై అనేక ఫిర్యాదులు చేశారు. ఇక నుంచి మరింత కీన్‌గా రేవంత్‌రెడ్డిని అబ్జర్వ్ చేస్తుంటారు. ఏమాత్రం సందు దొరికినా.. హైకమాండ్ దృష్టికి తీసుకెళతారు. హుజురాబాద్‌లో కనుక కాంగ్రెస్ ఓడిపోతే.. సీనియర్స్ చేతికి అస్త్రం దొరికినట్టే. రేవంత్ పీసీసీ చీఫ్‌గా ఉన్నా.. ఏం చేయలేకపోయాడు.. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా రాలేదంటూ సోనియాగాంధీ చెవిలో ఊదరగొడతారు. ఇటు, తెలంగాణ సమాజంలోనూ రేవంత్‌రెడ్డి సత్తాపై అనుమానాలు మొదలయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కొడంగల్‌లో ఓటమి ప్రజలకు ఇంకా గుర్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కాంగ్రెస్‌కు ఊపు తీసుకొచ్చింది ఏమీ లేదనే విమర్శ ఉంది. అందుకే, హుజురాబాద్ బైపోల్ రూపంలో రేవంత్‌రెడ్డి సామర్థ్యానికి అగ్నిపరీక్ష రెడీగా ఉంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక సంథింగ్ డిఫరెంట్. అక్కడ ప్రస్తుతానికి ఈటల వర్సెస్ కేసీఆర్ నడుస్తోంది. హుజురాబాద్ ప్రజలు కూడా ఈటలనా? కేసీఆరా? తమకు ఎవరు కావాలో తేల్చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే, ఆ ఎన్నికను ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. హుజురాబాద్ గెలుపోటములను రేవంత్‌రెడ్డికి అంటగట్టలేమని అంటున్నారు. పీసీసీ చీఫ్‌గా నిరూపించుకునేందుకు రేవంత్‌రెడ్డికి కూడా కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే, ఇప్పటికిప్పుడు హుజురాబాద్ ఎలక్షన్‌లో రేవంత్‌రెడ్డి తలదూర్చి చేసేదేమీ ఉండకపోవచ్చు అంటున్నారు. అయితే, గట్టిగా ప్రయత్నిస్తే హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు కాస్త ఊపు వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి బరిలో దిగబోతున్న కౌశిక్‌రెడ్డి స్ట్రాంగ్ కేండిడేట్. ఆయనకు రేవంత్‌రెడ్డి మద్దతూ తోడైతే.. ప్రచారంలో కాక రేపొచ్చు. ఇప్పుడు ఎలాగైతే ఈటల, కేసీఆర్‌లు హుజురాబాద్‌ను సవాల్‌గా తీసుకున్నారో.. అలానే రేవంత్‌రెడ్డి సైతం గట్టిగా ట్రై చేస్తే.. గెలుపు అంచుల వరకూ చేరుకోవచ్చు. ఈ సమయంలో గట్టి పోటీ ఇచ్చినా.. అది రేవంత్‌రెడ్డి ఇమేజ్‌కు అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. గతంలో కంటే ఓ 10వేలు ఓట్లు ఎక్కువ వచ్చినా.. ఆ క్రెడిట్ రేవంత్ ఖాతాలోనే పడుతుంది. తగ్గితే మాత్రం రేవంత్‌కు వచ్చే ప్రాబ్లమ్ ఏమీ ఉండకపోవచ్చు. అంటే.. వస్తే కొండ.. పోతే వెంట్రుక.
మరి, రేవంత్‌రెడ్డి హుజురాబాద్ సవాల్‌ను స్వీకరిస్తారా? అంటే అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. ఎందుకంటే, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరు ప్రకటించగానే.. ఆయన మొదటి రియాక్షన్‌లో ఈటల ప్రస్తావనే తీసుకొచ్చారు. ఈటలను బీజేపీలో చేర్చింది కేసీఆరే అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు. అంటే, ఈటల వర్సెస్ కేసీఆర్ వార్‌లో రేవంత్‌రెడ్డి తలదూర్చినట్టేనని చెబుతున్నారు. ఇక, పీసీసీ చీఫ్‌గా హుజురాబాద్ ఎలక్షన్ తప్పకుండా ఆయనకు సవాల్‌గా నిలుస్తుందని.. రేవంత్‌రెడ్డి తన స్టామినా ఎంతో చూపించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అదే గనుక జరిగితే.. ఇటు కేసీఆర్‌ను అటు రేవంత్‌రెడ్డిని ఎదుర్కొని గెలవాల్సి ఉంటుంది ఈటల రాజేందర్. గత ఎన్నికల్లో ఈటలకు వచ్చిన 1.24లక్షల ఓట్లు ఈసారి ఎవరికి పడతాయో.. ఆ ఓట్లను చీల్చేదెవరో.. కొళ్లగొట్టేదెవరో.. అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి. ఇటు ఈటల, అటు కేసీఆర్.. మధ్యలో రేవంత్... హుజారాబాద్‌లో ఇక తీన్మార్.....