పార్లమెంట్ లో మోడీకి ఉక్కపోత తప్పదా ?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 19 నుంచి ఆగష్టు 13 వరకు జరుగుతాయి. కరోనా కారణంగా గత మూడు నాలుగు సెషన్స్’గా పార్లమెంట్ ఉభయ సభలు ఉదయం, సాయంతం వేర్వేరు సమయాల్లో సమావేశమయ్యాయి. అయితే, ఈ సారి ఉభయ సభలు పాత పద్దతిలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు జరుగుతాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం తెలిపారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశామని స్పీకర్ వివరించారు.
వర్షాకాల సమవేశాలలో మోడీ ప్రభుత్వం పై ఉరుములు, మెరుపులే కాదు పిడుగులు దాడి కూడా తప్పదని విపక్షాల నుంచి స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. కరోనా కారణంగా దేశంలో గత కొంత కాలంగా రాజకీయ కార్యకలాపాలు కొంత స్థబ్దుగా ఉన్నా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ప్రభుత్వం పై విరుచుకు పడేందుకు విపక్షాలు ఉమ్మడి వ్యూహరచనకు సిద్డమవుతున్నాయి. గత నెలలో ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో వరస సమావేశాలు జరిపినప్పటి నుంచి, విపక్షాల మద్య ఐక్యత సాధించేందుకు ప్రశాంత్ కిశోర్ డైరెక్షన్’లో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రశాంత్ కిశోర్ క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీనీ కలిశారు.సుమారు గంట సేపు దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆమెతో చర్చించారు. అలాగే, ఈ మంగళవారం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనిమ ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాను కలిశారు. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయింది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహం, రాష్ట్ర కాంగ్రెస్’లో ఏర్పడిన సంక్షోభ పరిష్కారంపై చర్చించేందుకే అయినా, మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పార్లమెంట్’లో అనుసరించవలసిన వ్యూహం పై చర్చ జరిగి ఉంటుందని ఉహించడంలో తప్పులేదు.
బెంగాల్ విజయం తర్వాత, వ్యూహకర్త రోల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ కిశోర్ 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రతిపక్షాల ప్రదాని అభ్యర్ధిగా ప్రొజెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా అని ఆయన బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ అయన వేస్తున్న అడుగులు, చేస్తున్న ప్రకటనలు అయన ముందున్న మిషన్ అదే అని స్పష్టం చేస్తున్నాయి.ఈ మేరకు ఆయన ఎవరితో డీల్ కుదుర్చుకున్నారో ఏమో కానీ, రాహుల్ గాంధీ ఇమేజ్’ని పెంచేందుకు మిషన్ మూడ్’లో ప్రశాంత్ కిశోర్ పని చేస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా అంగీకరించాలని విపక్షాలకు బహిరంగంగానే విజ్ఞప్తి చేయడంతో పాటుగా యశ్వంత్ సిన్హా థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలను ప్రశాంత్ కిశోర్ మొగ్గలోనే తుంచేశారు. కాంగ్రెస్ లేని ఫ్రంట్ మోడీని ఎదుర్కోలేదని స్పష్టం చేయడం ద్వారా రాహుల్ నాయకత్వంలో మోడీ వ్యతిరేక శక్తులు అన్నిటినీ ఏకంచేసే పనిలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారనేది సుస్పష్టం.సో,పార్లమెంట్ సమావేశాలను ఇందుకోసంగా ప్రశాంత్ కిశోర్ సద్వినియోగం చేసుకుంటారు అనడంలో సందేహం లేదు.
రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని ఎండగట్టడంలో ముందు వరసలో ఉన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడిలో కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యాలు మొదలు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల వరకు ప్రతి అంశం మీద రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. ఒక దశలో, “ప్రధాని తప్పిపోయారు..(మిస్సింగ్) వాక్సిన్, మందులు పట్టుకుని ఎక్కడికో వెళ్లిపోయారు’” అనే అర్ధం వచ్చేల ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను ఎండగడుతూ, “మీ కారు పెట్రోల్, డీజిల్’తో నడుస్తుందేమో కానీ, మోడీ ప్రభుత్వం దోపిడీ ఇంధనంతో నడుస్తోంది” అంటూ మోడీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. అలాగే, మంత్రి మండలి విస్తరణను వాక్సినేషన్’తో ముడివేసి, “మోడీ మంత్రి మండలి సభ్యుల సంఖ్య పెరిగింది, కానీ, కొవిడ్ వాక్సిన్ నెంబర్ మాత్రం పెరగలేదు” అంటూ వ్యంగ బాణాలు విసిరారు. రాహుల్ గాంధీ,పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇదే దూకుడు ప్రదర్శిస్తారని, అందుకు అవసరమైన మందుగుండు సామగ్రిని ప్రశాంత్ కిశోర్ బృందం సిద్దం చేసిందని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోయే ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసిన పశ్చిం బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీతో సయోధ్య కోసం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఒకడుగు ముందు కేశారు. ఉభయ కాంగ్రెస్ పార్టీల మధ్య బంధానికి ప్రతిబంధకంగా నిలిచిన, లోక్ సభలో ప్రతి నాయుకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీరంజన్’పై వేటు వేసేందుకు కూడా సిద్దమయ్యారు.లోక్ సభ నాయకత్వ బాధ్యతల నుంచి ఆయన్ని తప్పించి శశిథరూర్ లేదా మనీష్ తివారీకి అప్పగించేందుకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇతర ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బెంగాల్లో బీజేపీని మట్టి కరిపించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ కేంద్రంపై కత్తులు దూస్తున్న విషయం తెలిసిందే. సో .. పార్లమెంట్ ఉభయసభల్లో తృణమూల్ దూకుడు ప్రదర్శించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల అనంతర హింస, గవర్నర్ తో విబేధాలు, చీఫ్ సెక్రటరీ పదేవీకాలం పొడిగింపు, ఇలా అనేక విషయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు అగ్ని కీలల్లా ఎగిసి పడుతున్నాయి.
మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ జులై 22న పార్లమెంట్ ఎదుట ఆందోళన చేపడతామని ప్రకటించారు.అలాగే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతి రేకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు కార్మిక సంఘాలు సిద్దమవుతున్నాయి. వచ్చే సంవత్సరం (2022) ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన జనాభా నియంతణ బిల్లు, రోజు రోజుకు జారి పోతున్న దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మంటలు పుట్టిస్తున్న వంటనూనెలు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు,పై పైకి పరుగులు తీస్తున్న నిరుద్యోగ సమస్య, మూత పడుతున్న పరిశ్రమలు, ఇలా ఒకటని కాదు, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు, విపక్షాల అంబుల పొదిలో అస్త్ర్ర, శస్త్రాలు పుష్కలంగా ఉన్నాయి. సో.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో మోడీ ప్రభుత్వానికి ఉక్కపోత తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.