హైదరాబాద్ కు రెడ్ అలర్ట్.. వరదలో వందలాది కాలనీలు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరోసారి నీట మునిగింది. బుధవారం సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు కుండపోతగా వర్షం కురవడంతో వరద పోటెత్తింది. వరద బీభత్సానికి వందలాది కాలనీలు నీట మునిగాయి. వేలాది ఇండ్లు మోకాళ్ల లోతు నీటిలో ఉన్నాయి. వరద ఉధృతంగా వస్తుండటంతో చాలా కాలనీల్లో జనాలు ఇంటి నుంచి బయటికి రాలేక నరకయాతన అనుభవిస్తున్నారు. మ్యాన్ హోల్స్ పొంగుతున్నాయి. నాలాల పై నుంచి వరద ప్రవహిస్తోంది.
హైదరాబాద్ పరిధిలో ఉప్పల్‌లో అత్యధికంగా 21.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్‌మెట్ 20, వనస్థలిపురం 19.2 సెం.మీ, హస్తినాపురం 19, పెద్ద అంబర్‌పేట్‌లో 18 సెం.మీ, సరూర్‌నగర్ 17.9, హయత్‌నగర్‌లో 17.2 సెం.మీ, రామంతాపూర్‌లో 17.1, హబ్సిగూడలో 16.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీటమునిగిన ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అంబర్ , రామంతాపూర్ ప్రాంతాల్లోనూ వరద బీభత్సం ఎక్కువగా ఉంది.
ఇప్పటికే వరదతో అల్లాడుతున్న హైదారాబాద్ కు వాతావరణ శాఖ తాజా హెచ్చరిక మరింత ఆందోళన కల్గిస్తోంది. గురువారం హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్డ్ జారీ చేసింది. మేడ్చల్, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి సంగారెడ్డి, యాదాద్రి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో నగరవాసులు వణికిపోతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు రెయిన్ టీమ్ లను అలర్ట్ చేశాయి. భారీ వర్షాలతో ఇవాళ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని ఐఎండీ హెచ్చరించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది. పంటలు కూడా నీట మునుగుతాయని.. జలాశయాల్లో నీటి మట్టం పెరుగుతుందని అంచనా వేసింది.
తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. వలిగొండ మండలం పరిధిలో ధర్మారెడ్డి పల్లి కాల్వ కు గండి పడింది. ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, కామరెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి.