కేంద్రం గుప్పిట్లోకి కృష్ణా, గోదావరి బోర్డులు.. జల వివాదాలకు చెక్ పడేనా?
గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరుచూ తలెత్తుతున్న నీటి వివాదాలకు పుల్ స్టాప్ దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఎటూ తేలకుండా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా బోర్డు సమర్ధవంతంగా పనిచేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బ్యాంక్ అకౌంట్‌లోకి 60 రోజుల్లోగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చెరో రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని సూచించింది.
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిబ్బంది అంతా బోర్డుల పరిధిలోకి వచ్చాయి.ప్రాజెక్టుల నీటి నిర్వహణతో పాటు భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. ఈ నోటిఫికేషన్ జారీ చేసే నాటికి కేంద్రం ఆమోదించని ప్రాజెక్టుల పనులన్నింటిని ఇరు రాష్టాలు నిలిపివేయాలని పేర్కొంది. రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయించిన మేరకు అనుమతులు లేని ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్‌కు పంపి 6 నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని సూచించింది. ఆరు నెలల్లో అనుమతి పొందకపోతే ఆ ప్రాజెక్టులను రద్దు చేసుకోవాలని, వాటి ద్వారా ఎలాంటి నీటిని తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం వివరించింది.
కృష్ణా బోర్డు పరిధిలోని ప్రాజెక్టులు..
కృష్ణా బోర్డు పరిధి నోటిఫై కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ దాని పరిధిలోకి వెళ్లాయి. అందులో తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్‌ఎల్‌సీ(హైలెవల్ కెనాల్), ఎల్‌ఎల్‌సీ(లోలెవల్ కెనాల్), కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చు మర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, శ్రీలైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడిన కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్‌పీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి వచ్చాయి.
గోదావరి బోర్డు పరిధిలోని ప్రాజెక్టులు..
కాళేశ్వరం, దేవాదుల, నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ, లోయర్‌మానేరు, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీ, చింతలపూడి, పురుషోత్తపట్నం గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లాయి.
కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం.. బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే బోర్డులకు.. వాటి పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడంతో వీటికి ఎలాంటి అధికారాలు లేవు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నా బోర్డులు ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలో తమ పరిధిని ఖరారు చేసి ప్రాజెక్టులపై పెత్తనం ఇవ్వాలని బోర్డులు కోరాయి.
బోర్టుల ఏర్పాటుపై ముందు నుంది తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్‌లో ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదని, ఈ అంశంపై ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోందని పేర్కొంది. విభజన చట్టం సెక్షన్–87 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేశాకనే బోర్డు పరిధిని నోటిఫై చేయాలని.. 2016, సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ, 2020, అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమని చెబుతూ వచ్చింది. ఈ వైరుధ్యాలు ఉన్నా.. రెండో అపెక్స్ భేటీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బోర్డుల పరిధిని ఖరారు చేసే అధికారం తమకుందని స్పష్టం చేశారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై చర్చించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది.