జగన్ బెయిల్ కేసులో కొత్త ట్విస్ట్.. సీబీఐ యూటర్న్ తీసుకోనుందా?
posted on Jul 14, 2021 @ 2:28PM
అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో ఈనెల 8న జగన్, రఘురామ కృష్ణరాజు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు. సీబీఐ మాత్రం వాదించేది ఏదీ లేదని పిటిషన్ లోని అంశాలను చట్టపరిధిలో, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. అయితే బుధవారం జరిగిన విచారణలో మాత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది.
జగన్ బెయిల్ రద్దు చేయాలన్న కేసులో సీబీఐ లిఖితపూర్వక వాదనలు సమర్పించక పోవడాన్ని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కౌంటర్ ధాఖలు చేయడానికి 10 రోజులు గడువు కావాలని సీబీఐ కోరింది. ఇప్పటికే సీబీఐ అధికారులకు రెండు దఫాలు అవకాశమిచ్చారని, ఇప్పుడు మరో అవకాశం ఇవ్వొద్దని కోర్టుకి తెలిపారు పిటిషనర్. సీబీఐ అనేది దర్యాప్తు సంస్థ కాబట్టి చివరిగా ఒకసారి అవకాశం ఇస్తున్నామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను 26కి వాయిదా వేసింది. అయితే గతంలో వాదించేది ఏదీ లేదని పిటిషన్ లోని అంశాలను చట్టపరిధిలో, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరిన.. సీబీఐ ఈసారి మాత్రం యూటర్న్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే గతంలో చెప్పిన విషయాన్నే చెప్పకుండా 10 రోజుల గడువు కావాలని కోరారని అంటున్నారు. సీబీఐ తీరుతో కేసులో కీలక పరిణామాలు జరగవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్‌పై ఉన్న కేసుల్లో సాక్షులు, నిందితులుగా ఉన్న అధికారులు ప్రస్తుతం ఏపీలో మంచి హోదాలో పని చేస్తున్నారని వారిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏపీ సీఎం ప్రభావితం చేసే అవకాశం ఉందని లిఖిత పూర్వక వాదనల్లో పిటిషనర్ తెలిపారు. గతంలో ఐఏఎస్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌ను ఏపీ సీఎం వేధింపులకు గురిచేశాడని.. అలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల ట్రాక్ రికార్డ్ చూడాల్సిన బాధ్యత సీఎస్ పరిధిలో ఉంటుందని, కానీ ప్రత్యేక జీవో ద్వారా సీఎం జగన్ ఆ అధికారులను బదిలీ చేసుకున్నారన్నారు. దీంతో సాక్షులుగా ఉన్న అధికారులను పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని, ముమ్మాటికి ఏపీ సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి బెయిల్ షరతులను ఉల్లగించారన్నారు. దీంతో 10 రోజుల తర్వాత సీబీఐ దాఖలు చేయనున్న కౌంటర్ లో ఏం ఉండనుంది అన్నది ఇప్పుడు చర్చగా మారింది. వైసీపీలోనూ టెన్షన్ పుట్టిస్తోంది.