మళ్లీ ఎన్టీఆర్ స్లోగన్స్.. వద్దంటే వినట్లే.. అభిమానులు తగ్గట్లే..
posted on Jul 14, 2021 @ 1:41PM
వద్దు బ్రదర్.. అంటున్నా వినట్లే. ఇది సమయం కాదంటున్నా.. వదలట్లే. రామయ్యా.. రావాలయ్యా అంటూ ఒకటే గోల. రాను రాను.. నేను రాను అంటున్నా అభిమానులు ఎక్కడా తగ్గట్లే. మొన్న కుప్పం.. నిన్న సినిమా ఫంక్షన్.. ఇవాళ మచిలీపట్నం. ప్లేస్ మారుతోందే కానీ.. స్లోగన్స్ మాత్రం ఆగడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఓవైపు ఎన్టీఆర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నా.. అవన్నీ మాకు అనవసరం అంటూ.. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనంటూ.. ఏకంగా చంద్రబాబు ముందే స్లోగన్స్ చేయడం ఆసక్తికర అంశం.
తెలుగు తమ్ముళ్లు మళ్లీ తారకమంత్రం జపిస్తున్నారు. ఈసారి ప్లేస్ మచిలీపట్నంకు షిఫ్ట్ అయింది. మచిలీపట్నంలో ఇటీవలే చనిపోయిన టీడీపీ నేత కాగిత వెంకట్రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వచ్చారు. అధినేతకు ఘన స్వాగతం లభించింది. చంద్రబాబును తోడ్కొని రావడానికి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అయితే, టీడీపీ జెండాలతో పాటు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఉన్న భారీ జెండాను కూడా ప్రదర్శించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ చంద్రబాబుకు వినబడేలా నినాదాలు కూడా చేశారు.
మొన్నామధ్య చంద్రబాబు సొంత ఇలాఖా కుప్పంలో కూడా ఇలానే తారక్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. నినాదాలతో హోరెత్తించారు. అప్పుడు చంద్రబాబు ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, అదే సీన్ మళ్లీ ఇప్పుడు మచిలిపట్నంలో రిపీట్ కావడం పార్టీకి ఇబ్బందికర విషయమే. ఓవైపు ఎన్టీఆర్ తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. టీడీపీకి సైతం ఇప్పటికిప్పుడు జూనియర్‌తో పెద్దగా అవసరం కూడా లేదు. చంద్రబాబు ఇప్పటికీ యాక్టివ్‌గా పాలిటిక్స్ చేస్తున్నారు. అటు, నారా లోకేశ్ సైతం సమర్థవంతమైన నాయకుడిగా నిరూపించుకుంటున్నారు. చంద్రబాబు, లోకేశ్‌ల ఆధ్వర్యంలో పార్టీ పనితీరు భేషుగ్గానే ఉంది. కేవలం అధికారంలో లేకపోవడం ఒక్కటే మైనస్.
జగన్‌రెడ్డి అడ్డగోలు విధానాలతో వచ్చే టర్మ్ ఆయన ఎలాగూ ఓడిపోవడం ఖాయం. చంద్రబాబు నాయకత్వంలో మళ్లీ టీడీపీదే అధికారం. ఇక ఏపీ పాలిటిక్స్‌లో జూనియర్ ఎన్టీఆర్‌కు స్పేస్ ఎక్కడ ఉంది? అంత అర్జెంట్‌గా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం ఏముందనేది సీనియర్ల అభిప్రాయం. అయితే, అభిమానులకు ఈ లెక్కలన్నీ పడతాయా? అందుకే వారి పని వారు చేస్తున్నారు. అంతమంది సీనియర్లు ఉండగా.. జూనియర్ మాత్రం ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సే లేదు. ఫ్యాన్స్ హడావుడితో ఇటు టీడీపీకి, అటు ఎన్టీఆర్‌కి.. ఇద్దరికీ ఇబ్బందే. ఎందుకొచ్చిన గోల చెప్పండి? అంటూ ఎక్కడికక్కడ తమ్ముళ్లను శాంతపరుస్తున్నారు స్థానిక నాయకులు.