హుజురాబాద్ రంగంలోకి రేవంత్ రెడ్డి.. ఇక తీన్మారే..!
posted on Jul 14, 2021 @ 10:36AM
తెలంగాణ రాజకీయాలన్ని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగానే సాగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాల్ గా మారింది. బీజేపీలో చేరిన ఈటల.. తన నియోజకవర్గంలో సత్తా చాటి గులాబీ బాస్ కు షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే ఆయన నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికను అత్యంత కీలకంగా భావిస్తున్న టీఆర్ఎస్ బాస్.. మండలానికో ఇంచార్జ్ ని నియమించి నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. మంత్రి హరీష్ రావుకు హుజురాబాద్ బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు దూకుడుగా వెళుతుండగా.. కాంగ్రెస్ మాత్రం హుజురాబాద్ లో ఇప్పటివరకు కొంత సైలెంట్ గానే ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హుజురాబాద్ పై ఫోకస్ చేయడం లేదనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగారు రేవంత్ రెడ్డి.
హుజురాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహను నియమించారు. నియోజక ఎన్నికల సమన్వయ కర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను నియమించారు. మండలాల వారీగా పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు రేవంత్ రెడ్డి. వీణవంక మండల ఇంచార్జులుగా ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండలానికి విజయ రమణ రావ్, రాజ్ ఠాగూర్.. జమ్మికుంట టౌన్ బాధ్యతలు మాజీ ఎంపీ రాజయ్య, ఈర్ల కొమురయ్యకు అప్పగించారు.
హుజురాబాద్ మండలానికి టి. నర్సారెడ్డి, లక్షన్ కుమార్.. హుజురాబాద్ టౌన్ కు బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు ఇంచార్జులుగా ఉండనున్నారు. ఇల్లంతకుంట మండలం బాధ్యతలను నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి అప్పగించారు. కమలపూర్ మండలంలో పార్టీ వ్యవహారాలను మాజీ మంత్రి కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య పర్యవేక్షించనున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కంట్రోల్ రూమ్ సమన్వయ కర్తగా కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణను నియమించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. తనకు టీఆర్ఎస్ టికెట్ వచ్చిందంటూ కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో పీసీసీ సీరియస్ గా స్పందించింది. ఇంతలోనే తనే పార్టీకి రాజీనామా చేశారు కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి. ఈటల రాజేందర్ కు అమ్ముడుపోయిన రేవంత్ రెడ్డి.. హుజురాబాద్ ఉప ఎన్నికను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీవీ ఇంట్వర్యూల్లో హుజురాబాద్ లో కాంగ్రెస్ గెలవదని చెబుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి ధమ్ముంటే హుజురాబాద్ లో డిపాజిట్ తీసుకురావాలని కూడా కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి... ఇంచార్జులను నియమించారని అంటున్నారు. కాంగ్రెస్ కూడా రేసులోకి రావడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఇక తీన్మార్ జరగనుందనే చర్చ సాగుతోంది.