మావోయిస్టు కీలక నేత లొంగుబాటు..
posted on Jul 14, 2021 @ 1:51PM
దండకారణ్యంలో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. దండకారణ్య స్పెషల్ జోన్ కార్యదర్శి రామన్న కుమారుడు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ లొంగిపోయారు. మావోయిస్టు, ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యుడిగా ఉన్న రావుల రంజిత్ తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. దండకారణ్యంలో రావుల రంజిత్ కీలక బాధ్యతలు చేపట్టారు. రెండు సంవత్సరాల క్రితం ఆనారోగ్య సమస్యతో రామన్న చనిపోయారు. రావుల రంజిత్ కూడా ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతుండటంతో ఆయన లొంగిపోయాడు. ఈ సందర్భంగా రంజిత్ కు రూ. 4 లక్షల రివార్డును అందజేశారు డీజీపీ మహేందర్ రెడ్డి.
మావోయిస్టు కార్యక్రమాలపై మావోయిస్టు నేత రామన్న కుమారుడు మావోయిస్టు రంజిత్ విరక్తి చెంది లొంగిపోవడానికి తనను ఆశ్రయించారని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. పాఠశాల వయసు నుంచే మావోయిస్టు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. ప్రస్తుతం మావోయిస్టు భావజాలంతో ఎలాంటి ప్రయోజనం లేదనే అభిప్రాయంతో రంజిత్ ఉన్నారన్నారు. రంజిత్ తల్లి సావిత్రి సైతం మావోయిస్టు కీలక సభ్యురాలిగా ఉందని, ఆమెకు విషయం తెలిపే రంజిత్ లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు. మిగితా మావోయిస్టులు సైతం మన్యం వీడి జనాల్లోకి రావాలని డీజీపీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 14 మంది కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారని వారంతా లొంగిపోవాలని ఆయన సూచించారు. వీరిలో 11 మంది తెలంగాణకు చెందిన వారు కాగా.. మరో ముగ్గురు ఏపీకి చెందిన వారు ఉన్నట్లు తెలిపారు. మావోయిస్టులో చాలా మంది ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు.
రావుల రంజిత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ముగ్దుర్ మండలం బెక్కల్ గ్రామం. 2010 లో ఆయన నిజామాబాద్ లో పదో తరగతి పూర్తి చేశాడు. 1998 లో రావుల రంజిత్ జన్మించాడు. చిన్నప్పటి నుండి మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ.. 2017లో రామన్న సలహా మేరకు సెకండ్ బెటాలియన్ లో రంజిత్ చేరాడు. 2017 నుంచి 2019 ఆమ్స్ బెటాలియన్ లో పని చేసిన రంజిత్ 2018 కాసారం దాడి, 2021లో జీరం అటాక్‌లో సైతం పాల్గొన్నట్లు డీజీపీ వెల్లడించారు.