అక్కడ రెండే పార్టీలు.. ఇక్కడ పుట్టగొడుగులు!
ఆంధ్రప్రదేశ్ లో రెండే పార్టీలు, వైసీపీ, తెలుగు దేశం. మూడో పార్టీకి అక్కడ చోటు లేదు. అలాగని, కాంగ్రెస్, బీజేపీ, జన సేన, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లేవని కాదు. ఉన్నాయి, కానీ, ప్రస్తుతానికి ఆ పార్టీలు ఏవీ కూడా ప్రధాన పార్టీలకు పోటీగా నిలిచే స్థాయిలో లేవు. బీజేపీ, జనసేన కూటమి తృతీయ ప్రత్యాన్మాయంగా ఎదిగే ప్రయత్నం చేసినా ఇంతవరకు చెప్పుకోదగ్గ ముందగు పడలేదు. తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ విషయం మరోమారు రుజువై పోయింది. సో.. ఏపీలో ఇప్పటికైతే, ఇప్పటికే కాదు మరి కొంత కాలం వరకు, ఎదో జరగరానిది జరిగే తప్పించి ద్విపార్టీ (రెండు పార్టీల) వ్యవస్థ కొనసాగుతుందని అనుకోవచ్చును.
ఇక తెలంగాణలోకి వస్తే కొత్త రాష్ట్రం బహుళ పార్టీ వ్యవస్థ వైపుగా అడుగులు వేస్తోందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. రాష్ట్ర అవతరణ తర్వాత, సహజంగానే ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి, (తెరాస) ప్రధాన రాజకీయ శక్తిగా అధికార పీఠం ఎక్కి కూర్చుంది. అలాగే, రాజకీయ పునరేకీకరణ పేరున తెరాస అధినేత కేసీఆర్ కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలను మెల్లమెల్లగా నేల మట్టం చేశారు. తాజాగా, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ కూడా తెరాసలో చేరారు. అలాగని ఆ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిందని కాదు, అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాకతో లేచి కూర్చుంది. అధికార పార్టీకి సవాలు విసురుతోంది. మరోవంక బీజేపీ కూడా కాంగ్రెస్’కు పోటీగా తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది.
పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఉమ్మడి రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిల, తెలంగాణలో వైఎస్సార్ జెండా ఎగరేసారు. రాజన్న రాజ్యం తెస్తామంటూ, వైఎస్సార్ టీపే పార్టీని స్థాపించారు. ఆమె ధీమా ధైర్యం చూస్తుంటే, ఆమె ముందూ వెనక ఎవరున్నప్పటికీ, ఎవరు లేకున్నా ఆమె కూడా సీరియస్’గానే రాజకీయ పావులు కదుపుతున్నారు. అంటే, అక్కడికే చతుర్ముఘ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇవి కాక , తెలంగాణ ఉద్యమం నుంచి, తెరాస దురాగతాలకు వ్యతిరేకంగా పుట్టు కొచ్చిన కోదండ రామ్ పెట్టిన తెలంగాణ జన సమితి (టీజేఎస్), రాణి దుర్గమ పెట్టిన యువ తెలంగాణ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ లాంటి పార్టీలు మరికొన్ని ఉన్నాయి. మరో వంక తీన్మార్ మల్లన, మరి కొందరు కొత్త పార్టీలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సో.. తెలంగాణలో బహుళ పార్టీ వ్యవస్థ స్థిర పడడం ఖాయంగా కనిపిస్తోంది.
విభజనకు ముందు ఉభయ తెలుగు రాష్టాలు అరవై ఏళ్లకు పైగా కలిసున్నాయి. ప్రాంతీయ విబేధాలున్నా, రాజకీయ నడక నడత ఇంచుమించుగా ఒకలానే, సాగింది. ఒకప్పుడు కాంగ్రెస్, కమూనిస్ట్ పార్టీలు ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్నా, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ అవిర్భావంతో కాంగ్రెస్, టీడీపీ ప్రధాన ప్రత్యర్దులుగా కొనసాగినా ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా రెండు పార్టీల వ్యవస్థ కొనసాగింది. కానీ, ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ స్థానంలో వైసీపీ వచ్చినా రెండు పార్టీల వ్యవస్థే కొనసాగుతోంది. వైసీపీ, తెలుగు దేశం పార్టీలే ప్రాధాన ప్రత్యర్ధులుగా ఉన్నాయి.
తెలంగాణలో రూపు దిద్దుకుంటున్న బహుళ పార్టీవ్యవస్థ వలన ఏమి జరుగుతుంది? ఎవరికి లాభం చేకూరుతుంది, అంటే, దీర్ఘకాలంలో ఎలా ఉన్నా, తక్షణ ప్రయోజనం మాత్రం అధికార పార్టీకే ఉంటుదని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, కేవలం 20 శాతం ఓట్లతోనే అధికార పార్టీ రెండు సీట్లు ఎగరేసుకు పోయింది. మంది ఎక్కువైతే మజ్జిగ పలచ బడుతుంది, అన్నట్లుగా విపక్షాల ఓట్లు ఎంతగా చీలితే అధికార పార్టీకి అంత అడ్వాంటేజ్ అవుతుంది ... అలాగని అన్ని సందర్భాలలో అలాగే జరగాలని లేదు, కానీ, ఒక విధంగా చూస్తే బహుళ పార్టీ వ్యవస్థ మంచిది ..మరో కోణంలో రెండు పార్టీల వ్యవస్థ మంచిది. అయితే తెలంగాణ కాంటెస్ట్’లో చూస్తే బహుళ పార్టీ వ్యవస్థ అంత మంచికాదు. సంప్రదాయ జాతీయ పార్టీలు ఎలా ఉన్నా .. ఉద్యమ పార్టీలు ఏకమై ఉద్యమ ద్రోహులకు గుణ పాఠం చెప్పవలసిన అవసరం ఉందని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు కూడా సాగుతునట్లు తెలుస్తోంది ‘’ అయితే డి ఎంత వరకు సక్సెస్ అవుతుందన్నది ఇప్పుడే చెప్పలేము..