షర్మిల వెనకుంది ఆ ఇద్దరే ..
posted on Jul 14, 2021 @ 3:02PM
ఎవరేమనుకున్నా డోంట్ కేర్ ... సిపిఐ నారాయణ తాను చెప్పదలచుకున్నదేదో చెప్పేస్తారు..ఎలాంటి శషబిషలులేకుండా కుండ బద్దలు కొట్టేస్తారు. ఒక వేళ ఆయన చెప్పింది తప్పని తేలినా, ఆయనేమీ ఫీలై పోరు ... సారీ చెప్పేస్తారు. అప్పుడెప్పుడో గాంధీ జయంతి రోజున .. పొద్దున్నే లేచి ఇంచక్కా ఇడ్లీతో కోడి కూర లాగించేసి ...అ తర్వాత నాలుక కరుచుకున్నారు. అందుకు ప్రాయశ్చిత్తంగా సంవత్సరం పాటు, ‘నో చికెన్’ దీక్షను కూడా పాటించారు.అలాగే, జీహెచ్ఎంసీ ఎన్నికలలో తెరాసకు వంద సీట్లు వస్తే చెవి కోసుకుంటానన్నారు ... ఆ పని మాత్రం చేయలేదు. నవ్వేసి వదిలేశారు. ఇక అక్కడి నుంచి ఆయన ఆ తరహ, ‘హుమరసం’ వార్తలకు పెట్టింది పేరు .. పేటెంట్ అయిపోయారు.
కొద్ది రోజుల క్రితం సీపీఐ సహా వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే, అదంతా వేస్ట్ అని తేల్చేశారు నారాయణ. చిన్న చిట్కా చెప్పేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తలచుకుంటే ఒక్క క్షణంలో ప్రైవేటీకరణ ప్రయత్నాలకు బ్రేక్ పడిపోతుందని తేల్చేసారు.
ఇప్పుడు తాజాగా తెలంగాణలో వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ జెండా ఎగరేయడం వెనక ఎవరున్నారో ... ఒకే ఒక్క మాటతో తేల్చేసారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడానికి ఇంకెవరో కాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న జగన్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్న కేసీఆర్ ఉన్నారని, ఆ ఇద్దరే ఆమెను ఆడిస్తున్నారని తేల్చిచెప్పారు. ఎవరికీ అనుమానం అక్కరలేదు, షర్మిల ఇద్దరు ముఖ్యమంత్రుల ముద్దుల చెల్లి, లేదంటే తెలంగాణలో ఇంత స్వేచ్చగా, ధైర్యంగా రాజకీయం చేయగలరా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటును చీల్చేందుకే షర్మిలను తెలుగు ముఖ్యమంత్రులే రంగంలోకి దించారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.రెండు తెలుగు రాష్ట్రల మధ్య సాగుతున్న జల యుద్ధం, కూడా ఆ ఇద్దరు కలిసి రచించిన నాటకమే అన్న అర్థం వచ్చేలా చురకలు వేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు డ్రామాలు ఆపేస్తే జలవివాదం సమసిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు సీఎంలు డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు.
సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని రెబల్ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్‌పైన నారయణ తమదైన స్టైల్లో వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఉన్నంత కాలం జగన్ బెయిల్ రద్దు కాదని నారాయణ అన్నారు. జగన్‌కి అమిత్ షా అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. నిజంగా కూడా, బుధవారం సీబీఐ న్యాయస్థానంలో జరిగిన తంతు చూస్తే అదే నిజం అని పిస్తుంది. ఇంతవరకు, ఎలాంటి వాదనలు చేసేది లేదని, కోర్టు నిర్ణయానికి వదిలేసిన సిబిఐ ఈరోజు ... తమ వాదనలు లిఖిత పూర్వకంగా వినిపిస్తానని అందుకు పది రోజులు సమయం కావాలని కోరింది. ఈ సందర్భంగా విచారణను వాయిదా వేసేందుకే సీబీఐ తరచూ తమ వైఖరి మార్చుకుంటోందని రఘురామా కృష్ణం రాజు తరపు న్యాయవాది ఆరోపించారు. అయినా కేసు విచారణ చేస్తున్న సీబీఐ న్యాయస్థానం విచారణను జూలై 26 కు వాయిదా వేసింది.