కరివేపాకు అధికారులా? ముఖ్యమంత్రిదే తప్పిదమా?
posted on Jul 14, 2021 @ 12:36PM
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ముఖ్యమంత్రి కార్యాలయం. ఈ రెండు వ్యవస్థలు సమన్వయంతో పని చేసినప్పుడే సుపరిపాలన. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా.. ఆధిపత్య పోరు తప్పదు. ఇక ముఖ్యమంత్రే తాను చెప్పినట్టు చేసే అధికారిని నెత్తిన పెట్టుకోవడం.. తనకు కావలసిన పనులు చేయించుకోవడం.. చేస్తుంటే ఇక ఆ ఆఫీసర్‌కు అడ్డూఅదుపు ఏముంటుంది? ఆయన ఎవరి మాట లెక్క చేస్తారు? సీఎం తర్వాత తానే సీఎం అన్నంతగా బిల్డప్ కొట్టరూ? ఏపీ సీఎంవోలో అదే జరుగుతోందని అంటున్నారు. ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్‌కు సీఎం జగన్‌రెడ్డి ఓవర్ ప్రయారిటీ ఇవ్వడం.. ఆయనిప్పుడు ఏకు మేకై కూర్చోవడం.. తనదే రాజ్యమన్నట్టు.. ఏకంగా సీఎస్‌నే లెక్క చేయకపోవడం జరుగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను సైతం ఇలానే కేర్ చేయకపోవడం.. సీఎం జగన్ సైతం ప్రవీణ్‌ప్రకాశ్‌కే సపోర్ట్ చేయడంతో.. ఎల్వీ ఆకస్మికంగా సీఎస్ పదవి వీడాల్సి వచ్చింది. రెండేళ్లుగా జగన్ సపోర్ట్‌తో సీఎంవోలో హవా చెలాయించిన ప్రవీణ్ ప్రకాశ్ యాక్షన్.. ఓవరాక్షన్‌గా మారడమే ఆయన అధికారాలకు కోత పడటానికి కారణమని అంటున్నారు. సీఎం జగన్ సైతం ఇన్నాళ్లూ ప్రవీణ్‌ప్రకాశ్‌ను నెత్తిన పెట్టుకొని.. నిబంధనలు వర్తించకున్నా.. తనకు నచ్చిన పనులన్నీ చేయించుకొని.. ఇప్పుడిక పక్కన పెట్టేయడానికి సిద్ధమవుతున్నారని అంటున్నారు.
సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) బాధ్యతల నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌ని తప్పించింది ప్రభుత్వం. ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తూనే, చాలాకాలంగా జీఏడీ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి పోస్టునూ పూర్తి అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నారు.
సాధారణంగా సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులెవరికీ ఇతర శాఖల బాధ్యతలు ఇవ్వరు. కానీ, ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌గా ఉన్నప్పుడు కొన్ని రకాల ఉత్తర్వులు జారీచేయడానికి అంగీకరించలేదట. బహుషా గత చేదు అనుభవంతో ఆయన అలాంటి జీవోలు ఇవ్వడానికి నిరాకరించి ఉంటారు. దీంతో సీఎస్ జారీ చేయాల్సిన ఆదేశాలను సీఎం అనుమతితో జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ఇవ్వవొచ్చంటూ ప్రవీణ్‌ప్రకాశ్‌తో ఓ జీవో జారీచేయించి తన పనులు చక్కబెట్టుకున్నారట సీఎం జగన్.
అప్పటి సీఎస్ ఎల్వీతో విభేదించిన ప్రవీణ్‌ప్రకాశ్ ఆయన తొలగింపులో కీలకపాత్ర వహించారని చెబుతారు. ఆ తర్వాత సీఎస్ నీలం సాహ్ని.. ప్రవీణ్ ప్రకాశ్‌కు దారికి అడ్డురాకపోవడంతో సమస్య తలెత్తలేదు. సీఎం కనుసన్నల్లో నడుస్తూ ఇతర అధికారులను వేధింపులకు గురిచేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారశైలి బొత్తిగా నచ్చలేదట. సీఎంకు పలుమార్లు ఫిర్యాదు కూడా చేశారని తెలుస్తోంది.
కీలక బాధ్యతల్లో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రి జగన్‌కు కూడా ఆగ్రహం తెప్పించాయని అంటున్నారు. వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ విభాగాల్ని... రెవెన్యూ శాఖ నుంచి ఆర్థికశాఖకు మార్చే విషయంలో ప్రవీణ్ ప్రకాష్ సొంత నిర్ణయాలు తీసుకోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయా విభాగాల అధికారులతో చర్చించకుండా, సీఎస్ అభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకోకుండా... ప్రవీణ్ ప్రకాష్ ఆ జీవో విడుదలయ్యేలా చేసినట్టు సమాచారం. ఆ అంశంపై సీఎస్ అభిప్రాయాన్ని తన దృష్టికి తేకుండానే, ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేయించారన్న విషయం సీఎం దృష్టికి రావడంతో, ఆయనను తక్షణం జీఏడీ ముఖ్యకార్యదర్శి పోస్టు నుంచి తప్పించాలని ఆదేశించారని అంటున్నారు.
జీఏడీ పొలిటికల్ సెక్రటరీ హోదాలో ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్నింటిని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తప్పుబట్టినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట కోర్టుల్లో ప్రతిసారీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్న వైనంపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో కూడా ప్రవీణ్ ప్రకాశ్ నిర్ణయాలపై అధికారుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. దీంతో ఆయన అధికారాలకు కత్తెర వేయాల్సిందేనని సీఎస్ పట్టుబట్టడంతో ముఖ్యమంత్రి వేటు వేశారని చెబుతున్నారు.
ఇన్నాళ్లూ ముఖ్యమంత్రే ప్రవీణ్‌ప్రకాశ్‌కు అదనపు అధికారాలు కట్టబెట్టి.. అవసరానికి వాడేసుకొని.. ఆ చనువుతో ప్రవీణ్ ప్రకాశ్ సైతం హద్దు మీరడంతో.. ఇప్పుడు కరివేపాకులా ఆ సీనియర్ అధికారిని పక్కన పెట్టేశారని అంటున్నారు. ప్రస్తుతం ఏపీభవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అభయ్ త్రిపాఠి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన స్థానంలో ప్రవీణ్‌ప్రకాశ్‌ను ఢిల్లీలోని ఏపీభవన్‌కు పంపేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇలా అవసరం ఉన్నన్నాళ్లూ చంకన ఎక్కించుకోవడం.. ఆ తర్వాత కిందపడేయడం జగన్‌రెడ్డికి కామనే అంటున్నారు.