కేసీఆర్ మెడలు వంచిన విపక్షం.. జాబ్ క్యాలెండర్‌కు సర్కారు సమాయత్తం..
posted on Jul 13, 2021 @ 10:03PM
నీళ్లు, నిధులు. నియామకాలు. ఈ మూడింటి కోసమే తెలంగాణ ఉద్యమం ఎగిసింది. స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది. కేసీఆర్ అందలమెక్కారు. ఇక అంతే. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ మూడింటిలో ఏ ఒక్క కల కూడా నెరవేరలేదు. ఒక్క ఎకరాకు కూడా అదనంగా సాగునీరు రాలేదు. నిధులు కల్వకుంట్ల కుటుంబానికే చేరాయనే విమర్శ. ఇక, నియామకాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కేవలం కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌కే రాజకీయ నియామకాలు జరిగాయి గానీ.. ఏడేళ్లుగా సరైన నియామకాలు లేక నిరుద్యోగుల గోస అంతాఇంతా కాదు. ఎన్ని పోరాటాలు.. ఎన్ని దీక్షలు చేసినా.. సర్కారులో కదలిక కనబడలేదు. నిరుద్యోగుల ఆత్మహత్యలూ ఆగలేదు.
తిడితే పడుతున్నారు.. నిలదీస్తే నోరుమూసుకుంటున్నారు.. అంతేకానీ, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలైతే చేపట్టడం లేదనేది కేసీఆర్ ప్రభుత్వంపై ప్రధాన విమర్శ. నిరుద్యోగులు ఎంతగా వేడుకుంటున్నా.. నోటిఫికేషన్ల ఊసే వినిపించడం లేదు. అలాంటిది, సడెన్‌గా కేసీఆర్ సర్కారులో కదలిక వచ్చింది. హడావుడిగా కేబినెట్ మీటింగ్ పెట్టి మరీ ఇకపై ఏటేటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. సీఎం కేసీఆర్‌లో ఆకస్మికంగా ఇంతటి మార్పు రావడానికి కారణమేంటి? కేసీఆర్‌కు ఇంతలా కనువిప్పు ఎందుకు కలిగింది? ఇప్పుడే నిరుద్యోగులు గుర్తుకొచ్చారా? వారిపై సడెన్‌గా కేసీఆర్‌కు ప్రేమ ఎందుకు పొంగింది? అంటే.. ప్రతిపక్షాల దూకుడే జాబ్ కేలండర్ భర్తీకి కారణమంటున్నారు...
సీఎం కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దూకుడు మామూలుగా లేదు. ప్రభుత్వంపై తన మొదటి దండయాత్ర నిరుద్యోగ సమస్యపైనే చేయబోతున్నారు. నిరుద్యోగ దీక్షకు దిగబోతున్నారు. వన్స్ రేవంత్ స్టెప్ ఇన్.. ఇక సర్కారు సంగతి గోవిందా. ఈ విషయం తెలిసే కేసీఆర్ అలర్ట్ అయ్యారని అంటున్నారు.
అటు, ఇటీవల టీఆర్ఎస్‌ను వీడిన ఈటల సైతం నిరుద్యోగ సమస్యపై కేసీఆర్‌ను గట్టిగా నిలదీశారు. తెలంగాణలో లక్షల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నా.. భర్తీ చేయడం లేదంటూ ఆరోపణలు చేశారు. ఇక బీజేపీ సైతం జాబ్ నోటిఫికేషన్స్ కోసం నిత్యం పోరాడుతూనే ఉంది. మరోవైపు, ఇటీవలే కొత్త పార్టీతో రాజకీయ దుకాణం తెరిచిన షర్మిల అయితే.. నిరుద్యోగ సమస్యపైనే తన పార్టీ పునాదులు నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే ఇందిరాపార్క్ దగ్గర నిరుద్యోగ సమస్యలపై దీక్ష చేసి.. జాకెట్ చినిగి.. అరెస్ట్ అయి.. బాగానే మైలేజ్ పొందారు షర్మిల. ఇక ఉద్యోగాలు లేవంటూ ఆత్మహత్య చేసుకుంటున్న నిరుద్యోగుల ఇంటికెళ్లి మరీ పరామర్శిస్తున్నారు. వరుస దీక్షలు, పరామర్శలతో నిరుద్యోగ సమస్యలపై షర్మిల మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు.
ఇలా, రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్, షర్మిల.. కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్‌టీపీ పార్టీలు సీఎం కేసీఆర్‌ను మూడువైపుల నుంచి ముట్టడించడం.. తెలంగాణలో లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేక కడుపుమంటతో రగిలిపోతుండటం.. ఆ ఆగ్రహ జ్వాలలో కేసీఆర్ సర్కారు కాలి బూడిదయ్యే ప్రమాదం పొంచి ఉండటంతో సీఎం కేసీఆర్ అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. అందుకే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఏడేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా.. ఉద్యోగ ఖాళీల భర్తీ కోసమే ప్రత్యేకంగా మంత్రిమండలి సమావేశం నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ఇదంతా ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత ఫలితమేనని.. కేసీఆర్ మెడలు వంచిన ఘనత వారిదేనని అంటున్నారు. అయితే, జాబ్ క్యాలెండర్‌కైతే రెడీ అవుతున్నారు.. మరి, పబ్బం గడిచాక మరోసారి నిరుద్యోగులను మోసం చేయరుగా? అని అనుమానిస్తున్నారు కేసీఆర్ నైజం బాగా తెలిసిన తెలంగాణ ప్రజానికం.