కుక్కను నిలబెట్టినా.. కేసీఆర్ పై షర్మిల బాణాలు..
posted on Jul 16, 2021 @ 4:57PM
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రెస్ మీట్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ ను ఉతికారేసినంత పనిచేసింది. రానున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో మీరు పోటీ చేస్తారా అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు టీఆర్ఎస్ వర్గాలు దిమ్మతిరిగేలా తెలంగాణవాదులు సైతం శెభాష్ అనుకునేలా రియాక్టయ్యారు.
అసలు హుజూరాబాద్ ఎన్నిక ఎందుకు వచ్చిందో కాస్త చెప్పండని తన పక్కనున్న ఇందిరా శోభన్, కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న తదితరులను షర్మిల అడిగారు. ఇందిర, ఏపూరి నవ్వి ఊరుకుంటే.. అన్నామీరు చెప్పగలరా అంటూ రాఘవరెడ్డిని అడిగారు. తనను ప్రశ్నించే సాహసం ఎవరూ చేయొద్దని అందరికీ హెచ్చరికగా ఉండాలన్నఉద్దేశంతో ఈటలను బహిష్కరిస్తే... ఈటల రాజీనామా చేసినందువల్ల ఎన్నికలు వస్తున్నాయని రాఘవరెడ్డి చెప్పారు.
ఓ... అదా సంగతి.. పగలు, ప్రతీకారాల కోసమే హుజూరాబాద్ ఎన్నికలు తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదన్నమాట అంటూ షర్మిల చాలా తెలివిగా, సెటైరిగ్గా స్పందించింది. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిస్తే యువకులకు ఉద్యోగాలు వస్తాయా... నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందా... నిరుద్యోగుల, రైతుల ఆత్మహత్యలు ఆగుతాయా.. అంటూ కేసీఆర్ ను సెంటర్ పాయింట్ చేస్తూ షర్మిల తనదైన శైలిలో రియాక్టయ్యారు. ప్రజలకు ఏమాత్రం మేలు జరగని, ప్రజలకు అవసరం లేని ఈ ఎన్నికల్లో ఇంకా మేం పోటీ చేయాలా అంటూ పాత్రికేయులను ఎదురు ప్రశ్నించారు షర్మిల.
దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పమనండి.. 54 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గెలవమనండి చూద్దాం. అధికార పార్టీ వీటి మీద హామీలు ఇస్తే మేం కూడా పోటీ చేస్తాం.. పోటీ చేసి గెలుస్తాం.. అంటూ టీఆర్ఎస్ ను దిగ్విజయంగా ఇరుకున పెట్టారు షర్మిల. కుక్కను నిలబెట్టినా గెలుస్తామనే అహంకారంతో ఉన్నవాళ్లవల్ల వచ్చిన ఎన్నికల్లో, పగలు, ప్రతీకారాల కోసం వచ్చిన ఎన్నికల్లో మేం నిలబడాలా.. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా...ఈ ఎన్నికలతో ఎవరికి మేలు జరుగుతుందో చెప్పాలని ఇండైరెక్టుగా అధికార పార్టీకి భారీ సవాల్ విసిరారు షర్మిల.