పోలీస్ గ్రూపులో డాన్ కూతురు.. డ్రామా మామూలుగా లేదుగా...
posted on Jul 16, 2021 @ 12:00PM
అతనో డాన్. డాన్ అంటే అల్లాటప్పా డాన్ కాదు. మహా ఖతర్నాక్. చిక్కడు దొరకడు టైప్. పోలీసులు అతని కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నారు. అతను అసలే దొరకడం లేదు. అతని దందాను కూడా ఆపలేకపోతున్నారు. డాన్‌ను పట్టుకోవడం కోసం పలుమార్లు పక్కాగా స్కెచ్ వేశారు. ఈసారి పట్టేసుకుంటాం అనుకునేలోపు పరారీ అయిపోతున్నాడు. ఇలా ఒకటి, రెండు సార్లు కాదు.. అనేక మార్లు. అదేంటి.. అంత పక్కాగా స్కెచ్ వేసినా ఆ డాన్ ఎలా తప్పించుకుంటున్నాడు? పోలీసులకు ఎలా మస్కా కొడుతున్నాడు? అనే విషయం ఖాకీలకు ఏమాత్రం అంతుచిక్కడం లేదు. పోలీసుల్లో ఎవరైనా ఆ డాన్‌కు హెల్ప్ చేస్తున్నారా? అనే అనుమానం. లేక, పోలీసుల్లోనే ఆ డాన్ మనుషులు ఉన్నారా అనే డౌట్? ఎంత క్రాస్ చెక్ చేసుకున్నా.. ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆ డానూ దొరకలేదు. ఇదంతా నెల్లూరు జిల్లాలో పేరుమోసిన మట్కా డాన్ గురించి.
చివరాఖరికి ఆ డాన్ ఎలా తప్పించుకుంటున్నాడనే విషయం మాత్రం తెలుసుకున్నారు. ఆ మేటర్ తెలిసి ఖాకీలు అవాక్కయ్యారు. అయ్య బాబోయ్.. ఇంత ఘోరం జరిగిపోయిందా అని ఇప్పుడు తెగ ఇదై పోతున్నారు. ఆ సీక్రెట్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో డిపార్ట్‌మెంట్‌లో దడ మొదలైంది. ఇప్పుడిక ఇంటి దొంగలు, బయటి దొంగల కోసం గట్టిగా అన్వేషిస్తున్నారు. ఇంతకీ మట్కా డాన్ ఎలా తప్పించుకుంటున్నాడు? పోలీసులు కనుక్కొన్న ఆ సీక్రెట్ ఏంటి? ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయా డిటైల్స్....
కర్నూలు జిల్లా పోలీసులకు ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో ఎప్పటికప్పుడు పోలీసుల యాక్టివిటీస్, ఆపరేషన్స్ అప్‌డేట్ చేస్తుంటారు. ఆ డిటైల్స్ చూసి.. జిల్లా పోలీసులంతా వారి వారి పరిధిలో అలర్ట్ అవుతుంటారు. అయితే, ఎలా వచ్చిందో తెలీదు గానీ, కర్నూలు పోలీసు వాట్సాప్ గ్రూప్‌లో నంద్యాల మట్కా డాన్ కూతురు సెల్ నెంబర్ కూడా యాడ్ అయి ఉందట. ఆ విషయం తెలిసి ఖాకీలు కంగుతిన్నారని అంటున్నారు. పోలీస్ వాట్సాప్ గ్రూప్‌లో పెడుతున్న మెసేజ్‌లను చూసే.. ఆ మట్కా డాన్ ఎప్పటికప్పుడు ఎస్కేప్ అవుతున్నాడని నిర్థారణకు వచ్చారు. వెంటనే ఆ డాన్ కూతురు ఫోన్ నెంబర్ డిలీట్ చేసేశారనుకోండి అది వేరే విషయం.. ఇంతకీ, పోలీస్ గ్రూపుల్లోకి ఆమె నెంబర్ ఎలా వచ్చింది? ఎవరు యాడ్ చేశారు? గ్రూప్ అడ్మిన్స్ కూడా పోలీసులే కదా? వారి ప్రమేయం లేకుండా ఎలా వస్తుంది? లేక, పోలీసుల నెంబరే ఆ డాన్ సంపాదించి తన కూతురికి ఇచ్చాడా? ఇలా పోలీస్ స్టైల్‌లో అనేక ప్రశ్నలు.. అంతకుమించి అనుమానాలు...
మట్కా శిబిరాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీల కోసం వెళ్తుంటే ముందేగానే ఆ ఇన్ఫర్మేషన్ కేటుగాళ్లకు తెలియడానికి పోలీస్ వాట్సాప్ గ్రూపులో వాళ్ల నెంబర్ ఉండటమే కారణమని ఆలస్యంగా గుర్తించారు. మట్కా స్థావరంపై దాడులతో వెలుగులోకి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మట్కా డాన్ కుటుంబంతో కొందరు పోలీసులు సన్నిహితంగా ఉంటున్నారని కూడా తెలుస్తోంది. అయితే వారు ఎవరు అన్నదానిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విషయాలేవీ పోలీసులు అధికారికంగా బయటకు చెప్పడం లేదు గానీ, ఈ ఉదంతంపై డిపార్ట్‌మెంట్‌లో జోరుగా చర్చ జరుగుతోందని అంటున్నారు.
ఇటీవల మాట్కా డాన్ అసదుల్లాను కర్నూలు జిల్లా నంద్యాల త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాట్కా డాన్ కు ఆరుగురు పోలీసులు సహాకారం అందించినట్లుగా తెలుస్తోంది. పోలీసులే అసాంఘీక కార్యకపాలకు పాల్పడుతున్నారని..మట్కా నిర్వాహకులకు సహకారం అందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు వాట్సాప్ గ్రూపులో డాన్ కూతురు ఫోన్ నెంబర్ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలేస్తారా? లేక, తీగ లాగి డొంకంతా కదిలిస్తారా? చూడాలి..