జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు.. షర్మిల సంచలన కామెంట్స్..
posted on Jul 16, 2021 @ 12:49PM
వైఎస్సార్ తెలంగాణ పార్టీ. వైఎస్సార్‌టీపీ. షర్మిల పెట్టిన కొత్త పార్టీ. అన్న మీద అలిగేసి వచ్చారని ఒకరు.. అన్న వదిలిన బాణమేనని ఇంకొకరు.. లేదు, లేదు.. మోదీ సంధించిన అస్త్రమంటూ మరికొందరు. ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తుండగానే.. అట్టహాసంగా పార్టీని ప్రారంభించేశారు. పాదయాత్రకూ సిద్ధమైపోతున్నారు. నిరుద్యోగ సమస్యలపై దీక్షలు చేస్తున్నారు. అయినా, ఇంకా ఏదో అనుమానం. షర్మిల కమిట్‌మెంట్‌పై సందేశం. తెలంగాణపై చిత్తశుద్ధి ఉందా? అని గుచ్చిగుచ్చి చూస్తున్నారు జనాలు.
అయితే, తాను అల్లాటప్పాగా పార్టీ పెట్టలేదని.. అన్నపై అలిగి పెట్టిన పార్టీ కాదంటూ మరోసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు షర్మిల. తాను పార్టీ పెట్టాల్సి వచ్చిన రాజకీయ పరిస్థితులను, తన రాజకీయ చిత్తశుద్ధిని మైకు ముందు ఏకరువు పెట్టారు. వైఎస్సార్ నామజపాన్ని ఎక్కడా ఆపకుండా.. తెలంగాణ సమస్యలపై ఏకరువు పెడుతూ.. తన పోరాట పథాన్ని మరోసారి స్పష్టం చేశారు.
అయితే, తెలంగాణ సంగతి తర్వాత.. మరి, ఏపీలో రాజన్నరాజ్యం అమలు అవుతుందా? అక్కడ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదా? ఇక్కడే ఎందుకు పెట్టారంటూ షర్మిలపై ప్రశ్నల వర్షం గుప్పించారు జర్నలిస్టులు. ఆ ప్రశ్నలకు షర్మిల ఆసక్తికర సమాధానాలు చెప్పారు. తాను జగన్‌పై అలిగితే.. పుట్టింటికి పోతాను కానీ, పార్టీ ఎందుకు పెడతానంటూ కౌంటర్ వేశారు షర్మిల. ఇక జగన్ సర్కారుపైనా కాక రేపే కామెంట్లు చేశారు.
ఏపీలో మంచి ప్రభుత్వం వస్తుందనే ఆశతోనే అక్కడి ప్రజలు జగన్‌ను ఎన్నుకున్నారని.. ఇప్పటికి రెండేళ్లు గడిచాయని.. ఆ ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే.. ప్రజలే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. షర్మిల మాటల ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారనే విధంగా ఉన్నాయంటున్నారు. అన్న పాలనపై చెల్లి చేసిన కామెంట్లపై ఏపీలో తెగ చర్చ జరుగుతోంది.