కేటీఆర్ పెద్ద మగాడైతే.. షర్మిల షాకింగ్ కామెంట్స్..
posted on Jul 16, 2021 @ 1:43PM
తానేమీ అల్లాటప్పా లీడర్‌ను కాదని.. మహిళే కదాని అండర్‌ఎస్టిమేట్ అస్సలు వేయొద్దని.. తాను నోరు తెరిస్తే మగ లీడర్లకు మించి మాట్లాడతానన్నట్టు.. ఖతర్నాక్ డైలాగులు వదిలారు వైఎస్ షర్మిల. షర్మిల నోటి నుంచి వచ్చిన ఒక్కో డైలాగ్.. మంత్రి కేటీఆర్ గుండెల్లో ఈటెల్లా గుచ్చుకునేలా ఉన్నాయి. కేటీఆర్ పెద్ద మగోడైతే... అనే వరకూ వెళ్లింది షర్మిల డైలాగ్ రేంజ్. ఇక కాస్కో సాంబా అన్న రేంజ్‌లో.. తెలంగాణలో ప్రభంజనం సృష్టిస్తా.. సింహం సింగిల్‌గా ఉందని భయపడదు.. మీరు రాస్కోండి అంటూ మీడియా ముందు గర్జించారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.
తానూ ఎవరికీ తీసిపోని స్థాయి నాయకురాలినే అనిపించేలా.. మీడియా ప్రశ్నలకు చాలా చాకచక్కంగా, సూటిగా, ఎలాంటి బెరుకు, తడబాటూ లేకుండా పదునైన సమాధానాలతో పాటు ప్రభుత్వంపై, మిగతా ప్రతిపక్షంపై ఘాటైన విమర్శలు చేశారు షర్మిల. ఆ సందర్భంలో కేటీఆర్‌ను ఉద్దేశించి షర్మిల వదిలిన డైలాగ్ కాక రేపుతోంది.
మహిళలు రోజుకో వ్రతం చేస్తారన్నట్టుగా షర్మిల సైతం రోజుకో సమస్యపై దీక్ష చేస్తున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల కామెంట్ ఏంటని ప్రశ్నించారు మీడియా ప్రతినిధులు. దీనికి, షర్మిల కేటీఆర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ, కేటీఆర్ అంటే ఎవరు..? అంటూ సెటైరికల్‌గా ఆన్సర్ స్టార్ట్ చేశారు. ఆయన ఎవరో తనకు తెలియదన్నట్లుగా షర్మిల మాట్లాడారు. కేటీఆరా.. అంటే ఆయనెవరు..? అని ప్రశ్నించారు. పక్కనున్న ఓ నేత.. ఆయనే మేడమ్.. కల్వకుంట్ల తారకరామారావు అని చెప్పగా.. ఓహ్.. కేసీఆర్ గారి కొడుకా అంటూ నవ్వారు. ఆ ఒక్క డైలాగ్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి అయిన కేటీఆర్ స్థాయిని.. కేసీఆర్ కొడుకు స్థాయికి దిగజార్చి.. షర్మిల తన మాటకారితనంతో ఔరా అనిపించారు.
కేసీఆర్‌కు మహిళలంటే గౌరవంలేదు. ఇక ఆయన కుమారుడు కేటీఆర్ గౌరవిస్తారా..? అసలు టీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది మహిళలున్నారు..? ఎంత మందిని పోటీలో నిలబెట్టారు..? ఎంతమందిని గెలిపించుకున్నారు..?. ఎంతమందిని మంత్రులను చేశారు..?. ఒక్క మహిళైనా మంత్రిగా ఉన్నారా..? అని ప్రశ్నించారు. పక్కనున్న వారు మంత్రి సబిత ఉన్నారని గుర్తు చేయగా.. ఒకరున్నారు సరే.. ఆమె టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారా..? లేకుంటే పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా..? అంటూ చాలా చాకచక్యంగా మాట్లాడారు షర్మిల. వీళ్లా మహిళల గురించి మాట్లాడేది. కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..? ఓ మీటింగ్‌కు మహిళా సర్పంచ్ వస్తే ఆమెకు కుర్చీ అయినా వేశారా..?. అసలు మనం ఏ శతాబ్ధంలో బతుకుతున్నాం? అంటూ కేసీఆర్, కేటీఆర్‌లను మాటలతో కుళ్లబొడిచారు వైఎస్ షర్మిల.
తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు..? కేసీఆరా.. లేకుంటే ఆయన కొడుకా..?. కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందని.. కేటీఆర్ పెద్ద మగాడైతే.. తెలంగాణలో వెంటనే నిరుద్యోగ సమస్య తీర్చాలని.. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేలా చూడాలని.. మహిళల ప్రాతినిథ్యం పెంచాలని.. ఫీజు రీయింబర్స్‌మెంట్ రిలీజ్‌చేయాలని.. డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. ఇలాంటి సమస్యలపై పోరాడేందుకు.. తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేందుకే పార్టీని స్థాపించామన్నారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల.