రేవంత్‌రెడ్డి అరెస్ట్.. కాంగ్రెస్ కేడర్ ఫైర్.. సమరమే..
posted on Jul 16, 2021 @ 2:13PM
ఇక సమరమే అంటూ పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి.. అన్నట్టుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో యుద్ధానికి దిగారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ‘చలో రాజ్‌భవన్’కు పిలుపిచ్చారు. మొదట ఇందిరాపార్కు దగ్గర భారీ ధర్నా చేపట్టారు. అనంతరం ర్యాలీగా రాజ్‌భవన్‌కు బయలు దేరారు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ శ్రేణులు. ఈ క్రమంలో చలో రాజ్‌భవన్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇందిరాపార్కు దగ్గర మూడంచెల బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. వాటిని బ్రేక్ చేసుకుంటూ ముందుకు కదిలారు రేవంత్‌రెడ్డి. ఆయన వెనకాలే అనుచరులు. జై కాంగ్రెస్ నినాదాలతో ఇందిరాపార్కు ప్రాంతం మారుమోగిపోయింది.
రేవంత్‌రెడ్డిని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. గవర్నర్ అందుబాటులో లేనందున ఆన్‌లైన్‌లో వినతిపత్రం అందజేయాలని పోలీసులు సూచించారు. అయితే అంబేడ్కర్ విగ్రహం వరకు తమ ర్యాలీని అనుమంతించాలని రేవంత్‌రెడ్డి కోరారు. అందుకు పోలీసులు అంగీకరించలేదు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చేజారిపోతుండటంతో.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్కలతో పాటు మధుయాష్కీగౌడ్, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అంతకుముందు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి కేసీఆర్ రెండుసార్లు సీఎం అయ్యారని ఆరోపించారు. ఆయన పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. పెట్రో పన్నులతో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.105 ఉండగా.. అందుకే కేసీఆర్, మోదీలు రూ.60 పన్నుల రూపంలో దోచేస్తున్నారని ఆరోపించారు. పెట్రో పన్నులపై అన్ని చోట్లా ప్రజలు చర్చించాలని పిలుపునిచ్చారు.