రేవంత్‌రెడ్డి ఫోన్ ట్యాప్?.. కేసీఆర్ సర్కారు కుట్రేంటి?
posted on Jul 16, 2021 @ 4:29PM
సామ, దాన. భేద, దండోపాయాల్లో.. అన్ని ఉపాయాలూ ప్రయోగిస్తుంటారు పాలకులు. అధికారాన్ని సుస్థిరం చేసుకోడానికి, కలకాలం తమ గుప్పిట్లోనే అధికారం ఉంచుకునేందుకు.. అన్నిరకాల ఎత్తుగడలు అవలంభిస్తుంటారు. ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్నప్పుడు వారిలో అభద్రతా భావం మరింత పెరుగుతుంటుంది. తమ సింహాసనం ఎక్కడ కూలిపోతుందోననే టెన్షన్ వారిని తీవ్రంగా వేధిస్తుంటుంది. అందుకే, నిత్యం పదవిని కాపాడుకోడానికి ఏదోఒక కుతంత్రం చేస్తూనే ఉంటారు. సింహాసనంపై ఉన్నది కేసీఆర్‌లాంటి మాయలమరాఠీ అయితే.. ఇక చెప్పేదేముంటుంది? ఇక, తనకంటే బలమైన రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఇక కునుకేముంటుంది? అందుకే, నిత్యం రేవంత్‌రెడ్డిపై ఓ కన్నేసి ఉంచుతున్నారట సీఎం కేసీఆర్. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. తనను ప్రగతిభవన్ నుంచి బయటకు గుంజేయడం తప్పదనుకుంటున్నారో ఏమో.. రేవంత్ అడుగుజాడలపై నిఘా పెట్టారని అంటున్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి ఎవరెవరిని కలుస్తున్నదీ.. రేవంత్‌ను ఎవరెవరు కలుస్తున్నదీ.. అంతా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కేసీఆర్‌కు సమాచారం చేరుతోందని అంటున్నారు. ఇంతవరకూ ఓకే, అధికారంలో ఎవరున్నా అదే చేస్తారులే అనుకున్నా.. కేసీఆర్ మాత్రం ఇంకో అడుగు ముందుకేసి మరీ, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారనే ఆరోపణ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్. దేశంలోకే అతిపెద్ద నేరం. వ్యక్తి స్వేచ్ఛకే గొడ్డలిపెట్టి. ఫోన్ ట్యాపింగ్‌పై దేశంలో అత్యంత కఠిన చట్టాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ విషయంలో పలుమార్లు చాలా తీవ్రంగా హెచ్చరించింది. ఫోన్ ట్యాపింగ్ ఎంతటి ప్రమాదకర వ్యవహారమో.. అందరికంటే సీఎం కేసీఆర్‌కే బాగా తెలుసు. గతంలో ఆయనకు ఈ విషయంలో బాగా చేదు అనుభవమే ఉంది. అలాంటిది, చాన్నాళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వినిపిస్తుండటం కలకలం రేపుతోంది. అందులోనూ, తనతో పాటు తనవారి ఫోన్లను సైతం ట్యాప్ చేస్తున్నారంటూ.. స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగంగా ఆరోపించడం మరింత సంచలనంగా మారింది. రేవంత్‌రెడ్డి దూకుడు తట్టుకోలేక.. ప్రభుత్వ వర్గాలు ఆయన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నాయని ప్రజలు సైతం నమ్మే పరిస్థితి ఉంది. అందుకే, తాజాగా రేవంత్ చేసిన ఈ ఆరోపణ కేసీఆర్‌కు షాకింగ్ న్యూసే అంటున్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్‌ను తెగబడుతున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులు మూల్యం చెల్లిస్తారన్నారు. ఇంటెలిజన్స్ ఐజీ ప్రభాకర్‌రావు.. రజాకార్ల కాలంనాటి ఖాసిం రజ్వీ మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్‌రావుకు పోస్టింగ్ ఇచ్చారని.. ఆయన తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని.. ఆయన డైరెక్షన్‌లోనే ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఆరోపించారు. ఐజీ ప్రభాకర్‌రావుపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు రేవంత్‌రెడ్డి. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన ఈ ఆరోపణలు తెలంగాణలో కలకలంగా మారాయి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ నిజమే అయితే.. ఇక సర్కారుకు చుక్కలే.