జగన్, కేసీఆర్ బండారం బయటపెడతా!
posted on Jul 16, 2021 @ 4:09PM
గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరుచూ తలెత్తుతున్న నీటి వివాదాలకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిబ్బంది అంతా బోర్డుల పరిధిలోకి వచ్చాయి.ప్రాజెక్టుల నీటి నిర్వహణతో పాటు భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. ఈ నోటిఫికేషన్ జారీ చేసే నాటికి కేంద్రం ఆమోదించని ప్రాజెక్టుల పనులన్నింటిని ఇరు రాష్టాలు నిలిపివేయాలని పేర్కొంది. రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయించిన మేరకు అనుమతులు లేని ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్‌కు పంపి 6 నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని సూచించింది.
కృష్ణా, గోదావరి బోర్డులను ఖరారు చేస్తూ కేంద్ర విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను ఏపీ సర్కార్ స్వాగతించగా.. తెలంగాణ సర్కార్ మాత్రం వ్యతిరేకిస్తోంది. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం కలిగేనా కేంద్రం నిర్ణయం ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. బోర్డును పరిధిని ఖరారు చేయడాన్ని సమర్ధించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్.. కృష్ణ జలాల పై సీఎం కేసీఆర్ వైఖరి స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులపై హాట్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. రెండు రాష్ట్రాల సీఎంలు కమిషన్ ల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఇద్దరు సీఎం ల బండారం బయట పడుతుందన్నారు. తెలంగాణ కి రావాల్సిన నీటి వాటా విషయంలో కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 2015 జూన్ 18, 19న అప్పటి మంత్రులు, అధికారులు నేతృత్వంలో తెలంగాణ 299 టీంఎంసిలు, ఆంధ్రాకి512 టీఎంసీలు కేటాయిస్తూ ఒప్పందం కుదిరందన్నారు సంజయ్. కృష్ణ పరివాహక ప్రాంతం 68 శాతం ఉంటే.. తెలంగా కి 575 టీఎంసీ నీరు రావాలని కాని 299 టిఎంసీలకే ఎలా ఒప్పుకున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారు. పునర్విభజన హామీలు ఉల్లఘించి రెండు రాష్ట్రాల సీఎం లు మోసం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రుల హైడ్రామా ఆడిస్తున్నారని బండి సంజయ్ అన్నారు.
సీఎం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి కేసీఆర్ లేఖ రాయడాన్ని సంజయ్ తప్పుపట్టారు. సుప్రీంలో కేసు వేస్తే ఎలా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని అన్నారు. 8 నెలల తరువాత కేసు వాపస్ తీసుకున్నారని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ సీఎం కేసీఆర్ .. సమయం లేదంటూ వాయిదా వేయించారని సంజయ్ మండిపడ్డారు. అడ్డగోలుగా అంచనాలు పెంచి కమిషన్లు తీసుకున్నారని, అవన్ని బయటపడుతాయనే ఇప్పుడు భయపడుతున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అన్యాయం జరిగితే తప్పకుండా బీజేపీ అండగా ఉంటుందన్నారు బండి సంజయ్.