రాజ్ భవన్ కు కాంగ్రెస్ జెండా.. ఇందిరాపార్క్ దగ్గర హై టెన్షన్
posted on Jul 16, 2021 @ 11:04AM
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజ్ భవన్ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలు స్పష్టిస్తోంది. ఇందిరా పార్క్ దగ్గర సభకు మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు.. ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు. రాజ్ భవన్ దగ్గర ఆంక్షలు విధించారు. రాజ్ భవన్ కు వెళ్లే అన్ని మార్గాల్లోనూ భారీగా బలగాలను మోహరించారు. పోలీసులు అనుమతి ఇవ్వనప్పటితి ‘చలో రాజ్ భవన్’ ర్యాలీ తీస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపిచ్చారు. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు నగరానికి భారీగా తరలివస్తున్నారు.
రాజ్ భవన్ గేటుకి అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. అయినా పోలీసులకు షాకిచ్చారు ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు. ఉదయాన్నే రాజ్ భవన్ కు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ గేట్లకు కాంగ్రెస్ జెండాలు కట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు లేని సమయంలో రాజ్ భవన్ గేట్లకు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ జెండాలు కట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు కట్టిన వీడియో వైరల్ గా మారింది. అన్నట్లుగానే ఛలో రాజ్ భవన్ నిర్వహించామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉదయం గం.10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 200 మందితో ఇందిరాపార్క్ దగ్గర సమావేశం నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. అయితే, ఇందిరాపార్క్ నుంచి రాజ్‌భవన్ వరకు ప్రదర్శనగా వచ్చి గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు టీ కాంగ్రెస్ నేతలకు అనుమతి ఇవ్వలేదు. అయితే చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లనే ముట్టడిస్తామని ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మరోవైపు చలో రాజ్ భవన్ కు వెళ్లకుండా జిల్లాల్లోనే కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్తకర్తలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.