అయ్యో షర్మిల.. అడ్డంగా బుక్కైపోయావా..? 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన షర్మిల దూకుడుగా వెళుతోంది. టీఆర్ఎస్ సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్న షర్మిల.. కేసీఆర్ కుటుంబంపైనా  విరుచుకుపడుతోంది. దొర పాలనంటూ విమర్శలు చేస్తూ.. పంచ్ డైలాగులు విసురుతోంది. జిల్లాలు కూడా చుట్టేస్తున్న షర్మిల.. ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ ను కడిగిపారేస్తోంది. అయితే ఆమె దూకుడే ఇప్పుడామెకు ఇబ్బందిగా మారిందనే చర్చ జరుగుతోంది. శుక్రవారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. షర్మిలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. టీఆర్ఎస్ వర్గాలతో పాటు తెలంగాణ వాదులు కూడా షర్మిలపై కామెంట్లు చేస్తున్నారు. ఏపీకి చెందిన వారు కూడా కేటీఆర్ కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. దీంతో కేటీఆర్ విషయంలో షర్మిల తొందరపడ్డారని, అడ్డంగా బుక్కయ్యారనే చర్చ సాగుతోంది.  మీడియా సమావేశంలో కేటీఆర్ అంటే ఎవరు  అని వెటకారంగా ప్రశ్నించింది షర్మిల. ఆ తర్వాత కేసీఆర్ వాళ్ల అబ్బాయి కేటీఆర్ అని చెబితే.. ‘ఓహో అవునా.. కేసీఆర్ వాళ్ల అబ్బాయి కేటీఆరా’ అంటూ షర్మిల పరువు తీసేలా వ్యంగ్యంగా స్పందించింది. ఈ డైలాగులే వైరల్ అయ్యాయి.  ఈ వ్యాఖ్యలపైనే షర్మిలను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. షర్మిల గతంలో కేటీఆర్ ను ఉద్దేశించి చేసిన పాజిటివ్ వ్యాఖ్యల వీడియోలను నెటిజన్లు, టీఆర్ఎస్ మద్దతుదారులు బయటకు తీశారు. షర్మిలను ట్యాగ్ చేస్తూ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు.  షర్మిల గతంలో లోకేష్ ను కించపరచడానికి కేటీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. ఆ వీడియోను బయటకు తీసి ‘కేటీఆర్ తెలియదా? షర్మిలమ్మా’ అంటూ ట్రోల్ చేస్తున్నారుగతంలో లోకేష్ ను విమర్శించడానికి కేటీఆర్ ను వాడుకొని ఇప్పుడు తెలియదంటావా? అని షర్మిలను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను షర్మిల సోషల్ మీడియా ఖాతాకు ట్యాగ్ చేస్తూ నెటిజన్లు భారీగా ట్రోల్ చేస్తున్నారు. అప్పట్లో కేటీఆర్ ను అంతగా పొగిడిన షర్మిల ఇప్పుడు కేటీఆర్ ఎవరో తెలియదంటావా? అని ఎద్దేవా చేస్తున్నారు. షర్మిలకు వ్యతిరేకంగా  గతంలో తెలంగాణలో చేసిన అశ్లీల పోస్టులను తొలగించాలని ఇదే కేటీఆర్ మంత్రిగా నాడు ఆదేశించాడని.. షర్మిలకు ఈ విషయాన్ని తాము గుర్తు చేయాలనుకుంటున్నామని  కొందరు టీఆర్ఎస్ నేతలు పోస్టులు పెట్టారు.  మొత్తంగా కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కు గురవుతున్నారు షర్మిల. అయితే ఈ విషయంపై టీఆర్ఎస్ నేతలు అధికారికంగా మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు.   

మ‌ల్ల‌న్న మ‌హా పాద‌యాత్ర‌.. కొత్త పార్టీకి ఆరంభ‌మా?

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. మాస్ మ‌ల్ల‌న్న‌. ఏడేళ్లుగా కేసీఆర్ స‌ర్కారుపై పోరాడుతున్న మ‌ల్ల‌న్న‌. యూట్యూబ్ ఛానెల్‌తో కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మ‌ల్ల‌న్న‌. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీకి చుక్క‌లు చూపించిన మ‌ల్ల‌న్న‌. ఇంత‌మంది మ‌ల్ల‌న్న‌ల ప్ర‌తిరూపం ఒకే ఒక్క‌డు.. అత‌నే చింత‌పండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్న‌. తెలంగాణ‌లో ఇప్పుడత‌ను ఓ వ్య‌క్తి కాదు..శ‌క్తి. కేసీఆర్‌లాంటి కొండ‌ను పిండి చేసేంత ధైర్యం ఉన్న సామాన్యుడు. జ‌నంలో ఒక్క‌డు. ఆ మ‌ల్ల‌న్న ఇప్పుడు రాజ‌కీయ పార్టీ ఏర్పాటు దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు ఎప్ప‌టినుంచో స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. పార్టీకంటే ముందుగా.. పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల‌ను క‌లిసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  తెలంగాణలో రాజకీయ వేడి స‌ల‌స‌ల కాగుతోంది. సీఎం కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా పార్టీల‌న్నీ కొత్త రెక్క‌లు తొడుక్కుంటున్నాయి. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో కాంగ్రెస్‌, ఈట‌ల రాజేంద‌ర్ చేరిక‌తో బీజేపీ.. మ‌రింత బ‌లోపేత‌మ‌య్యాయి. మ‌రోవైపు, తెలంగాణ కోడ‌లినంటూ వైఎస్ ష‌ర్మిల కొత్త‌పార్టీతో ఒక్క ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఇలా తెలంగాణ రాజ‌కీయం కీల‌క అంచెకు చేరుకుంది. పొలిటిక‌ల్ జంక్ష‌న్‌లో నిల‌బ‌డి పాత, కొత్త పార్టీల‌న్నీ త‌మ ల‌క్ష్యం దిశ‌గా దూసుకుపోతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో నేనుసైత‌మంతూ ముందుకొస్తున్నారు తీన్మార్ మల్ల‌న్న‌. పాద‌యాత్ర‌తో మంచి ప్లాట్‌ఫామ్ రెడీ చేసుకుంటున్నారు.  తెలంగాణ‌లో త్వ‌ర‌లో పాద‌యాత్ర చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు తీన్మార్ మ‌ల్ల‌న్న‌. అందుకు టైమ్‌, ప్లేస్ కూడా డిసైడ్ చేసుకున్నారు. ఆగస్టు 29న జోగులాంబ గద్వాల్‌ జిల్లా ఆలంపూర్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తెలిపారు. పాదయాత్రకు ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్‌ కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తాన‌ని చెప్పారు. మ‌రోవైపు, మ‌ల్ల‌న్న టీమ్‌ల రాష్ట్ర‌, జిల్లా స్థాయి క‌మిటీల‌ను కూడా ప్ర‌క‌టించారు. ఈ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుండ‌టంతో తీన్మార్ మ‌ల్ల‌న్న ప‌క్కా వ్యూహంతోనే ముందుకు పోతున్నార‌ని అంటున్నారు.  పాద‌యాత్ర ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు కూడా చేశారు తీన్మార్ మ‌ల్ల‌న్న‌. తమ పార్టీలో చేరాలంటూ కొందరు నేతలు ఆహ్వానించారని చెప్పారు. అయితే, ఇప్ప‌టికైతే తాను ఏ పార్టీలో చేర‌బోవ‌టం లేద‌ని తెలిపారు. అంటే, త్వ‌ర‌లోనే కొత్త పార్టీ పెట్ట‌బోతున్నార‌నేగా అర్థం? అంటున్నారు ఆయ‌న అభిమానులు. అదే స‌మ‌యంలో, తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు ఎక్కడ ఉందో చెప్పాలని మల్లన్న డిమాండ్ చేయ‌డం చూస్తుంటే.. వైఎస్సార్‌టీపీ టార్గెట్‌గానే మ‌ల్ల‌న్న ముందుకొస్తున్నార‌ని కూడా అంటున్నారు. కేసీఆర్‌-జ‌గ‌న్‌లు కుమ్మ‌క్కై.. రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగా ష‌ర్మిల‌తో రాజ‌కీయ పార్టీని పెట్టించార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీంతో, ష‌ర్మిల పార్టీకి కౌంట‌ర్‌గా తీన్మార్ మ‌ల్ల‌న్న పార్టీ పెట్ట‌బోతున్నార‌నే అనుమాన‌మూ వ్య‌క్త‌మ‌వుతోంది. కార‌ణం ఏదైనా, ఇప్ప‌టికైతే పాద‌యాత్ర‌కే ప‌రిమిత‌మైనా, పార్టీ ఏర్పాటుపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయినా.. త్వ‌ర‌లో చేయ‌బోయే పాద‌యాత్ర‌, భ‌విష్య‌త్‌లో పార్టీ ఆవిర్భావానికి దారి తీస్తుంద‌ని అంటున్నారు.  తీన్మార్ మ‌ల్ల‌న్న పార్టీ పెడితే కేసీఆర్‌కు మ‌రింత డ్యామేజీ త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ఇటీవ‌ల జ‌రిగిన వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో కొద్ది తేడాతో రెండో స్థానంలో నిలిచి.. దాదాపు గెలిచినంత ప‌ని చేశారు. గులాబీ పార్టీకి గ‌ట్టి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ముందు ఈ మూడు జిల్లాల ప‌రిధిలో పాద‌యాత్ర చేశారు మ‌ల్ల‌న్న‌. ప్ర‌జ‌ల‌ను నేరుగా క‌లిసి మాట్లాడారు. అందుకే, ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీ బ‌రిలో నిలిచి.. అంత ప్ర‌భావం చూపించ‌గ‌లిగారు. ఇప్పుడిక తెలంగాణ‌వ్యాప్తంగా సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టి.. రాజ‌కీయ పార్టీతో ముందుకొస్తే ఇంకెంత ఎఫెక్ట్ ఉంటుందో ఊహించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌లు పార్టీలు బ‌లంగా కొట్లాడుతుండ‌గా.. ఇప్పుడిక మ‌ల్ల‌న్న ఎంట్రీతో కేసీఆర్‌కు తీన్మార్ త‌ప్ప‌క‌పోవ‌చ్చు అంటున్నారు.    

ఆ ఊళ్లో అంతా సంస్కృతమే..

ఆ ఊళ్లో ఏ ఇంట్లోకి వెళ్లినా.. ఎవరి నోటి నుంచి విన్నా సంస్కృత భాషా సుగంధాలే విరజిమ్ముతాయి. గుడ్ మాణింగ్ లు, గుడ్ నైట్ లాంటి ఇంగ్లిష్ భాషా పదాలు మచ్చుకైనా కనిపించవు. కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో గల మత్తూర్ లో శతాబ్దాలుగా ఇదే పరిమళం గుబాళిస్తోంది. శిమోగా నుంచి మత్తూర్ 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 5 వేల జనాభా గల మత్తూర్ లో ప్రజలందరూ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ తమ కార్యకలాపాలు, ఆచార వ్యవహారాలు, వ్యాపార విషయాలు అన్నీ కూడా సంస్కృతంతోనే ముడివడి ఉంటాయి. ప్రతి వ్యక్తీ 8, 9 ఏళ్ల వయసు నుంచే సంస్కృత శ్లోకాలు వల్లె వేస్తూ ఉంటాడు. అలాగని ఇతర భాషలు నేర్చుకోరని కాదు. పాఠశాలలో ఎన్ని సబ్జెక్టులు నేర్చుకున్నా అవన్నీ సబ్జెక్టు వరకే. సంస్కృతం అనేది వారి మాతృభాషగా మారింది. కాబట్టి వారి అమ్మ భాషలోనే అన్ని వ్యవహారాలూ పూర్తి చేస్తారు. జీన్స్ ప్యాంట్స్ వేసుకునే యూత్ అయినా సరే... ఊళ్లో ఉన్నారంటే సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. ఊళ్లోకి వేరే ప్రాంతపు అతిథులు ఎవరైనా వస్తే వారితో కన్నడంలో లేదా అవసరమైనవారికి ఇంగ్లిష్ లో జవాబిస్తారు. అయితే సంస్కృతం మీద వీరికి గల ప్రేమాప్యాయతలు, వారి మర్యాదల కారణంగా ఊళ్లోకి వచ్చిన అతిథులు సైతం గీర్వాణంలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తూంటారు. ఇక ఈ గ్రామానికున్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. సంస్కృతంతో పాటు వీరు ఇతర సబ్జెక్టుల్లో కూడా నూటికి నూరు శాతం మెరిట్స్ సాధించడం. అంటే సంస్కృత అభ్యాసం కారణంగా ధారణ శక్తి పెంపొందుతుందన్న మన పెద్దల మాటలు నిజమేనని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. దాదాపు 600 ఏళ్ల క్రితం కేరళ నుంచి బ్రాహ్మల్లోని సంకేతి అనే తెగకు చెందినవారు మత్తూర్ కు వలస వచ్చారు. అప్పట్నుంచీ వాళ్లు సంస్కృతాన్నే వారసత్వంగా కొనసాగిస్తున్నారు. వీరితోపాటు ఇతర వర్గాల ప్రజలు కూడా సంస్కృతంలోనే వ్యవహరించడం విశేషం.  ఇక మత్తూర్ కు సమీపంలోనే కవల పల్లె లాంటి మరో ఊరుంది. అదే హోసహళ్లి. తుంగ నది ఒడ్డున గల హోసహళ్లి.. మత్తూర్ తో స్ఫూర్తి పొందింది. కొన్నేళ్లుగా ఇక్కడ కూడా ప్రజలంతా సంస్కృతంలోనే మాట్లాడుతున్నారు. సంస్కృతం నేర్చుకొని అమల్లో పెట్టిన తరువాత తమ భాషా వ్యవహారాలు పరిణతి చెందాయని, ఆచారపరంగా ఎంతో గొప్పనైన ఫీలింగ్ కలుగుతుందని హోసహళ్లి ప్రజల సామూహిక అభిప్రాయం.

మూడు రాజధానులు చెల్లవు.. అమిత్ షాకు రఘురామ లేఖ..

వైసీపీ రెబెల్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తన లేఖల పరంపరను కొనసాగిస్తున్నారు. రోజుకో అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తున్న రఘురామ రాజు.. తాజాగా మూడు రాజధానులు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పార్లమెంటులో ఆమోదించిన విభజన చట్టానికి అసెంబ్లీలో సవరణ చేశారని, అది చెల్లదని తన లేఖలో తెలిపారు రఘురామ రాజు.  ఏపీకి మూడు రాజధానులు కావాలంటే మళ్ళీ పార్లమెంట్‌లోనే చట్టం చేయాలన్నారు. విభజన చట్టంలో లేని విధంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని రఘురామ రాజు తెలిపారు పార్లమెంటులో చట్టాన్ని సవరించినప్పుడే మూడు రాజధానులకు చట్టబద్ధత వస్తుందని ఎంపీ రఘురామ రాజు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గమనించే ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందని భావిస్తున్నానని అమిత్ షాకు రాసిన లేఖలో రఘురామ వివరించారు. ఇటీవల జలవివాదాన్ని పరిష్కరించినట్టే, 3 రాజధానుల అంశాన్ని కూడా కేంద్రమే పరిష్కరించాలని కోరారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి వివరిస్తూ... రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితి వచ్చిందని రఘు రామ తెలిపారు. 15వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని వెల్లడించారు. గతంలో ఎప్పుడూ లేనంత ఆర్థిక దుస్థితి ఏపీలో ఉందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆ చర్చికి వ్యతిరేకంగా గ్రామసభ తీర్మానం

కర్నూలు జిల్లా గురజాల అనే గ్రామంలో గల చర్చికి వ్యతిరేకంగా ఓ ఉద్యమం మొదలైంది. విశృంఖలంగా జరుగుతున్న మతమార్పిళ్లతో అనేక సమస్యలు ఉత్పన్నమై, అవి కాస్తా పెరిగి పెద్దవవుతూ సామాజిక అశాంతికి దారి తీస్తున్నాయని గ్రామసభ తీర్మానించింది. తమకు గల విశేషాధికారాలు ఉపయోగించి ఈ సమస్యకు శాంతియుతమైన పరిష్కారం కోసం వినూత్నంగా యత్నించారు గ్రామసభ సభ్యులు.  పంచాయితీరాజ్ శాఖ వారి జీవో నెంబర్ 376కు విరుద్ధంగా,  జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా గ్రామంలో నిర్మించిన ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు (ఐఎంబీ) అనే విదేశీ సంస్థకు చెందిన చర్చిని తొలగించాలంటూ గురజాల గ్రామసభలో తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి గ్రామంలోని దాదాపు 750 మంది ఓటర్లు ఆమోదం తెలపడం విశేషం. అమెరికాకు చెందిన ఐఎంబీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిధులు వస్తున్నాయని, ఆ నిధుల సాయంతోనే గ్రామంలో అక్రమంగా ఓ భారీ చర్చి నిర్మాణం జరిగిందని, దాని ఆధ్వర్యంలో గ్రామంలోని పలు సామాజికవర్గాలను ప్రభావితం  చేస్తూ మతమార్పిళ్లు జరుగుతున్నాయని గ్రామస్తులు అంటున్నారు. మతం మార్చుకున్నవారికి ఎస్సీ ధ్రువీకరణ పత్రాలు అందేలా చేస్తూ... ఎవరైనా మత మార్పిళ్లపై ప్రశ్నిస్తే అలాంటివారిపై అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నారని గ్రామసభ ఆందోళన వ్యక్తం చేసింది. ఇక చర్చి నిర్మాణం తరువాత కొత్తగా దానికి ప్రహరీ గోడ కడుతున్నారని, అందుకోసం 10 అడుగులు ముందుకు వచ్చి రోడ్డును ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, దీనివల్ల పబ్లిక్ ప్లేస్ ఆక్రమణకు గురై రోడ్డు ఇరుకైపోతుందని గ్రామసభ అభ్యంతరం చెబుతోంది. అదీగాక చర్చికి దగ్గర్లోనే ఓ శివాలయం ఉందని, శివరాత్రి, ఉగాది వంటి పండుగలు వచ్చినప్పుడు ఊరేగింపులు, రథయాత్రలు వచ్చినప్పుడు ఆటంకంగా మారుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  ఇకపై మతపరమైన ఎలాంటి నిర్మాణాలకైనా గ్రామసభ ఆమోదం తప్పనిసరి అంటూ వినూత్నంగా తీర్మానం చేయడం విశేషం. ఇందులో ఐదు తీర్మానాలు చోటు చేసుకున్నాయి.  1) గ్రామంలో జరిగే సామాజిక, సాంస్కృతిక ఉత్సవాలలో ఎస్సీలకు పెద్దపీట వేయాలి. వారి భాగస్వామ్యాన్ని పెంపొందించాలి. గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాల్లో ఎస్సీలను ప్రత్యేక ఆహ్వానితులుగా చేయాలి. 2) గ్రామంలో అక్రమంగా, పంచాయితీరాజ్ శాఖ వారి జీవో నెంబర్ 376కు విరుద్ధంగా,  జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా గ్రామంలో నిర్మించిన ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు (ఐఎంబీ) అనే విదేశీ సంస్థకు చెందిన చర్చిని తొలగించాలి. 3) ఇకపై గ్రామంలో ఏవిధమైన మతపరమైన కట్టడం నిర్మించాలన్నా గ్రామసభలో కనీసం 51 శాతం మంది ప్రజల ఆమోదం కలిగివుండాలి. 4) గ్రామంలో ఎవరు హిందువులు, ఎవరు ముస్లిములు, ఎవరు క్రెస్తవులు అనే అంశంపై సమగ్రమైన సర్వే చేపట్టి ఆయా మతానికి చెందినవారి వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయాలి. 5) రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాల) ఉత్తర్వు 1950 ప్రకారం ఎస్సీ సామజిక వర్గానికి చెంది, క్రైస్తవ ఆచార వ్యవహారాలను పాటిస్తున్న వారి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు రద్దు చేసి, వారికి బీసీ-సీ కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి. ఈ విషయాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ప్రశంసిస్తూ ట్విట్టర్లో పెట్టింది. అలాగే ఇదే స్ఫూర్తితో మిగతా గ్రామాల్లో కూడా ఎల్.ఆర్.పి.ఎఫ్. ఆధ్వర్యంలో మత మార్పిళ్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని, సామాజిక సామరస్యం ఏర్పడేందుకు కృషి చేస్తామని అంటున్నారు.

ఈటల రాజేంద‌ర్‌ హ్యాండ్సప్! భ‌య‌మా? వ్యూహ‌మా?

హుజురాబాద్ ఉప ఎన్నిక‌. ఈట‌ల రాజేంద‌ర్ స‌త్తాకు ప్ర‌తీక‌. హుజురాబాద్‌లో గెలిచి ప్ర‌గ‌తి భ‌వ‌న్ గోడ‌లు బ‌ద్ద‌లు కొట్టాల‌నేది ఆయ‌న టార్గెట్‌. అయితే, ఈట‌ల‌ను ఓడించి.. అసెంబ్లీలో అడుగుపెట్ట‌కుండా చేయాల‌నేది కేసీఆర్ పంతం. అందుకే, కేసీఆర్‌-ఈట‌ల‌లు నువ్వా-నేనా అన్న‌ట్టు త‌ల‌బ‌డుతున్నారు. రాజేంద‌ర్ బీజేపీలో చేరి.. వెయ్యి ఏనుగుల బ‌లం స‌మీక‌రించుకున్నారు. కేసీఆర్ త‌న అధికార‌బ‌లాన్నంతా హుజురాబాద్‌లో మోహ‌రించి ఈట‌ల‌ను క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌ధ్య‌లో కాంగ్రెస్ ఇంకా యాక్టివ్ కాక‌పోయినా.. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి రాక‌తో రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది. ఇక‌, హుజురాబాద్‌లో హోరాహోరీ త‌ప్ప‌దంటూ సంకేతాలు. ఇంత‌టి కీల‌క స‌మ‌యంలో ఈట‌ల రాజేంద‌ర్ స‌తీమ‌ణి జ‌మునారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మాట‌లు ఇప్పుడు రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇంత‌కీ ఆమె ఏమ‌న్నారంటే... "పోటీలో నేను ఉన్నా.. రాజేంద‌ర్ ఉన్నా ఒక్క‌టే. ఎవ‌రు పోటీ చేయాల‌న్న‌ది ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. ఎవ‌రికి అవ‌కాశం వ‌స్తే వారు పోటీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నాం. ఎవ‌రు పోటీ చేసినా.. గుర్తు అదే ఉంటుంది". జ‌మునా చేసిన ఈ కామెంట్లే ఇప్పుడు రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారాయి. హుజురాబాద్ పోటీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ త‌ప్పుకుంటున్నారా? రాజేంద‌ర్‌కు బ‌దులు ఆయ‌న భార్య జ‌మున బ‌రిలో దిగుతున్నారా? బీజేపీ అందుకు స‌రేనంటుందా? అదే జ‌రిగితే.. అలానే ఎందుకు? ఇదంతా భ‌య‌మా? లేక‌, బీజేపీ వ్యూహ‌మా? ఇలా అనేక ప్ర‌శ్న‌లు, అంత‌కుమించి అనుమానాలు. జ‌మున స్టేట్‌మెంట్స్‌పై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.  ఈటల బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే దుబ్బాక ఉప ఎన్నిక మాదిరిగా టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య నువ్వా..నేనా అన్నట్లు పోటీ జరిగే అవకాశమున్నదని భావిస్తున్నారు. ఈటలకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని భావిస్తున్న గులాబీ బాస్ ... ఇప్పటికే హుజురాబాద్ పై ఫోకస్ చేశారు. ఈటల వెంట టీఆర్ఎస్ నేతలు ఎవరూ వెళ్లకుండా ముఖ్యనేతలను రంగంలోకి దింపారు. మంత్రి గంగుల కమలాకర్ పూర్తిగా ఈటల నియోజకవర్గంపైనే దృష్టి సారించగా.. ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా రంగంలోకి దిగారు. పార్టీ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, తనకు అత్యంత సన్నిహితుడైన హరీష్ రావును మోహరించడంతో.. పోటీపై ఈటల వెనుకాడుతున్నారని తెలుస్తోంది.  తన రాజీనామా తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో గెలవకపోతే తన రాజకీయ జీవితం సమాధి అయినట్లేనని రాజేందర్ కుడా భయపడుతున్నారట. ఉప ఎన్నికల్లో గులాబీ బాస్ వ్యూహాలు అద్బుతంగా ఉంటాయని చెబుతారు. గతంలో జరిగిన చాలా ఉప ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాల ముందు విపక్షాలు నిలవలేకపోయాయి. ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ బై పోల్ లోనూ కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని చిత్తుగా ఓడించింది అధికార పార్టీ. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు రాజేందర్ కు తెలుసు కాబట్టే ఆయన వెనుకాడుతున్నారని చెబుతున్నారు. అందుకే తనకు రాజకీయంగా ఇబ్బంది లేకుండా చూసుకోవడంతో పాటు జమునను పాలిటిక్స్ లోకి అరంగ్రేటం చేసే యోచనలో రాజేందర్ ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహాల ముందు జమున గెలిస్తే ఓకే.. ఓడినా.. పెద్దగా నష్టం ఉండదనే ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.  హుజురాబాద్ లో పోటీపై తన అభిప్రాయాన్ని బీజేపీ పెద్దలకు కూడా రాజేందర్ చెప్పారని.. వాళ్లు కూడా సానుకులంగా స్పందించారని తెలుస్తోంది. ఈటల సూచనతో నియోజకవర్గంలో ఇప్పటికే జమున యాక్షన్ మొదలు పెట్టారని చెబుతున్నారు. గతంలోనూ హుజురాబాద్ పార్టీ కార్యక్రమాలను జమున చూసేవారు. మంత్రిగా ఈటల బిజీగా ఉండటంతో.. నియోజకవర్గ పనులను ఆమె చక్కపెట్టేవారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే జమునను పోటీ చేయించాలని రాజేందర్ ప్రయత్నించారు కూడా. అప్పుడు కుద‌ర‌క‌పోవ‌డంతో.. ఇప్పుడు త‌న త‌ర‌ఫున జ‌మున‌ను రంగంలోకి దించాల‌ని చూస్తున్నార‌ని తెలుస్తోంది. ఈట‌ల నేరుగా బ‌రిలో దిగితే.. ఈట‌ల వ‌ర్సెస్ కేసీఆర్‌గా పోటీ మారుతుంద‌ని.. టీఆర్ఎస్ మ‌రింత క‌సిగా ట్రై చేస్తుంద‌ని.. అదే జ‌మున దిగితే.. అధికారపార్టీని క‌న్ఫ్యూజ‌న్‌లో ప‌డేసి.. మ‌రింత దెబ్బ‌తీయ‌డంతో పాటు.. మ‌హిళ కార్డు కూడా బాగా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అటు, బీజేపీ సైతం అందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈట‌ల అయితే, గెలుపంతా ఆయ‌న ఖాతాలోనే ప‌డుతుంద‌ని.. అదే జ‌మునా అయితే, బీజేపీకి కూడా క్రెడిట్ బాగా వ‌స్తుంద‌ని లెక్క‌లేస్తోంది. అలా, బీజేపీ, ఈట‌ల ఫ్యామిలీ కలిసి.. హుజురాబాద్‌లో రాజేంద‌ర్ కాకుండా జ‌మునతో పోటీ చేయించాల‌ని వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు. ఇది భ‌యంతో కూడిన వ్యూహ‌మంటున్నారు.   

రోజా రాజీనా? రాలిపోయేనా? బ‌తుకు జ‌ట్కాబండి!

ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు నిత్యం రోజా ఏదో ఒక‌ర‌కంగా వార్త‌ల్లో ఉండేవారు. ఇప్పుడు అధికార‌ప‌క్షంలోనూ టాక్ ఆఫ్ ది న్యూస్ ఆమెనే ఉంటున్నారు. ప్ర‌తిప‌క్షంలో ప‌లు అవ‌మానాలు భ‌రించారు. అధికారప‌క్షంలో అంత‌కుమించి అవ‌మానాలు ఎదుర్కొంటున్నారు. ప్ర‌తిప‌క్షంలో నోరేసుకుని విరుచుకుప‌డేవారు. అధికార‌ప‌క్షంలో అన్నీమూసుకుని క‌న్నీళ్లు పెడుతున్నారు. తిడ‌దామంటే జ‌గ‌న‌న్న ఏమ‌నుకుంటాడోన‌నే భ‌యం. గట్టిగా అరుద్దామంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వ‌స్తుందోరాదోన‌నే టెన్ష‌న్‌. మంత్రి ప‌ద‌వి రాక ఇప్ప‌టికే త‌ల ఎక్క‌డ పెట్టుకోవాలో తెలీని ప‌రిస్థితి ఉంటే.. ఇప్పుడిక ఇప్ప‌టిదాకా ఉన్న ఏపీఐఐసీ ఛైర్‌ప‌ర్స‌న్ పోస్టు కూడా పీకేయ‌డంతో.. క‌న్నెర్ర చేయ‌లేక‌, క‌న్నీళ్లు దిగ‌మింగుకోలేక‌.. న‌గ‌రి ఎమ్మెల్యే రోజా ఓ రేంజ్‌లో ర‌గ‌లిపోతున్నార‌ట‌. రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో త‌న‌కు మంత్రి పద‌వి వ‌స్తుంద‌ని ఇన్నాళ్లూ ఆశ‌గా ఎదురుచూసినా.. ఇప్పుడు ఆ అవ‌కాశ‌మూ రాక‌పోవ‌చ్చ‌ని తాడేప‌ల్లి నుంచి లీకులు వ‌స్తుండ‌టంతో.. రోజా ఆవేద‌న‌తో కుమిలిపోతున్నార‌ట‌. త‌న ప‌రిస్థితి ఏంటంటూ తెగ ఇదైపోతున్నార‌ట‌. ఇటు, జిల్లాలో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయ‌ణ‌స్వామిల‌తో జ‌గ‌డం.. అటు న‌మ్ముకున్న జ‌గ‌న‌న్న న‌ట్టేట ముంచ‌డంతో.. రోజా ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డిగా మారిందంటున్నారు.  వైసీపీలో రోజాకు వ‌రుస అవ‌మానాలు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్టీ కోసం ఎంతో చేశారు. జ‌గ‌న‌న్న దాదాపు రెండేళ్లు జైల్లో ఉంటే.. ఆ స‌మ‌యంలో పార్టీ వాయిస్‌ను బ‌లంగా వినిపిస్తూ.. ఏదోఒక హాట్ కామెంట్ చేస్తూ.. నిత్యం వైసీపీ పేరు ప్ర‌జ‌ల్లో నానేలా చేశారు. అసెంబ్లీలోనూ, బ‌య‌టా జ‌గ‌న‌న్న వెంటే నిలిచారు. అందుకే, జ‌గ‌న్ సీఎం కాగానే దేవుడిచ్చిన చెల్లెలికి కీల‌క‌మైన ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్నారంతా. ఓ ద‌శ‌లో రోజాకు హోంశాఖ ఇస్తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. తీరా, కేబినెట్ కూర్పు ప్ర‌క‌టిస్తే.. అందులో రోజ‌మ్మ పేరు లేనే లేదు. జ‌గ‌నన్న కోసం అంత చేస్తే.. త‌న‌ను ఇంత‌లా ప‌క్క‌న పెట్టేస్తారా? అంటూ అన్న‌పై అలిగి.. కొన్నిరోజుల పాటూ ఎవ‌రికీ అంద‌కుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జ‌గ‌న‌న్న అతిక‌ష్టం మీద ఆమెకు న‌చ్చ‌జెప్పడంతో అల‌క వీడారు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు ఏపీఐఐసీ పద‌వి క‌ట్ట‌బెట్టి.. కాస్త ఓదార్చారు. ఇప్పుడు ఆ తొక్క‌లో ప‌ద‌వి కూడా పీకేసీ.. మ‌రింత హ‌ర్ట్ చేశారు. గుండెప‌గిలిన రోజ‌మ్మ‌.. రోద‌న‌.. అర‌ణ్య‌రోద‌న‌గా మారింది.  రోజాను ఏపీఐఐసీ ఛైర్‌ప‌ర్స‌న్ నుంచి తీసేయ‌డానికి పార్టీ వ‌ర్గాలు చెబుతున్న కార‌ణం.. ఒక‌టే. ఎమ్మెల్యేల‌కు రెండు ప‌ద‌వులు ఉండొద్ద‌ని జ‌గ‌న్ భావించార‌ని.. అందుకే కార్పొరేష‌న్ ప‌ద‌వుల్లో ఉన్న మిగ‌తా ఎమ్మెల్యేల‌ను కూడా తొల‌గించార‌ని అంటున్నారు. అయితే, అలా ప‌ద‌వులు అనుభ‌విస్తున్న‌ది రోజాతో పాటు మ‌రో ఇద్ద‌రు మాత్ర‌మే. ఇంకా చెప్పాలంటే, రోజాను ఆ సీటు నుంచి దించేయ‌డానికే ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌ని చెబుతున్నారు. రెండేళ్లుగా లేని ఇబ్బంది.. ఇప్పుడే వ‌చ్చిందా? అని ప్ర‌శ్నిస్తున్నారు.  న‌గ‌రి ఎమ్మెల్యే రోజా.. ఇప్పుడు జ‌స్ట్ ఎమ్మెల్యే మాత్ర‌మే. అయితే, రెండున్న‌రేళ్ల త‌ర్వాత ప‌నితీరు ఆధారంగా కేబినెట్‌ను మారుస్తానంటూ గ‌ద్దెనెక్కిన స‌మ‌యంలో జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు మ‌రోసారి తెర‌మీద‌కు వ‌స్తోంది. ఆ మంత్రివ‌ర్గ మార్పులో రోజాకు మంత్రిప‌ద‌వి వ‌స్తుంద‌నేది కొంద‌రి మాట‌. అయితే, ఆ అదృష్ట‌మూ లేద‌ని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అప్ప‌ట్లో ఏదో అన్నారు కానీ, ఇప్ప‌ట్లో కేబినెట్ మార్పులు లేవంటూ జ‌గ‌న్ అనుకూల మీడియాలో ఇటీవ‌ల వ‌రుస క‌థ‌నాలు వ‌చ్చాయి. ఏడాదిగా క‌రోనా క‌ల్లోలం కార‌ణంగా మంత్రులు స‌రిగా ప‌ని చేయ‌లేక‌పోయార‌ని.. కాబట్టి వారికి మ‌రింత స‌మ‌యం ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు ఆ మీడియా ద్వారా లీకులిచ్చారు. సో, ఇప్ప‌ట్లో కేబినెట్ విస్త‌ర‌ణ లేన‌ట్టే. అంటే, రోజ‌మ్మకు కూడా మంత్రిప‌ద‌వి ఫ‌స‌క్కే. ఇక‌, ఏ ఎల‌క్ష‌న్ల‌ ఏడాదో మంత్రుల‌ను మార్చే సాహ‌సం జ‌గ‌న్ చేయ‌క‌పోవ‌చ్చు. ఒక‌వేళ చేసినా.. రోజాకు మినిస్ట‌ర్ పోస్ట్ రాకుండా అడ్డుకునేందుకు, ఆమెకు బ‌ద్ద విరోధులు, వైసీపీలో బ‌ల‌మైన నేత‌లైన మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామిలు ఉండ‌నే ఉండే. పెద్దిరెడ్డి మాటను కాద‌నే ధైర్యం జ‌గ‌న్‌కు కూడా లేద‌ని అంద‌రికీ తెలిసిందే. రోజాకు మొద‌ట్లోనే మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డానికి.. ఇప్పుడు ఉన్న ఏపీఐఐసీ ప‌ద‌వి కూడా పోవ‌డానికి.. పెద్దిరెడ్డి, నారాయ‌ణ‌స్వామిలే కార‌ణ‌మ‌నేది ఓపెన్ సీక్రెట్‌. వాళ్లిద్ద‌రి కోసం.. దేవుడిచ్చిన చెల్లెలిని జ‌గ‌న్‌రెడ్డి బ‌లి చేయ‌డం దారుణం అంటున్నారు. పెద్దిరెడ్డి బెదిరింపుల‌తోనే జ‌గ‌న్‌ రోజాను ఇంత‌లా అవ‌మానిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. ఇంత‌కుముందే మంత్రిప‌ద‌వి ఇవ్వ‌కుండా ఇన్స‌ల్ట్ చేయ‌డం.. ఇప్పుడు ఉన్న ప‌ద‌విని కూడా పీకేయ‌డం.. భ‌విష్య‌త్తులోనూ ఎలాంటి ప‌ద‌వి వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో.. ఇక వైసీపీలో రోజాకు దారుల‌న్నీ మూసుకుపోయాయ‌ని అంటున్నారు.. ఇక‌, రోజా రాజ‌కీయ భ‌విష్య‌త్తు ర‌చ్చ‌బండేనా? బ‌తుకు జ‌ట్కాబండేనా? వైసీపీ నుంచి రోజా పువ్వు రాలిపోవ‌ట‌మో.. లేక‌, రాజీ ప‌డ‌ట‌మో.. చివ‌ర‌కు మిగిలేది..?  

కాంగ్రెస్ గూటికి దేవేందర్ గౌడ్? రేవంత్ పిలుపుతో ఏకమవుతున్న లీడర్లు.. 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పీసీసీ చీఫ్ గా వరుస కార్యక్రమాలతో కేడర్ లో జోష్ నింపుతున్న రేవంత్ రెడ్డి.. పార్టీ బలోపేతానికి పావులు కదుపుతున్నారు. బలమైన నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో పని చేసి.. ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న లీడర్లు తిరిగి సొంత గూటికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా నేతలను కలుస్తూ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. అంతేకాదు ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలకు గాలం వేస్తున్నారు రేవంత్ రెడ్డి.  తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి దేవెందర్ గౌడ్ ను కాంగ్రెస్ లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  ఆదివారం సాయంత్రం దేవేందర్ గౌడ్‌తో ఆయన భేటి కాబోతున్నారు. తక్కుగూడలోని ఆయన నివాసానికి వెళ్లనున్నారు. రేవంత్‌తోపాటు ప్రచార కమిటి చైర్మన్ మధుయాస్కి గౌడ్, ఎఐసీసీ కార్యక్రమాల కమిటి చైర్మన్ మహేశ్వర్ రెడ్డిలు వెళ్లనున్నారు. దేవేందర్ గౌడ్ ను కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ రెడ్డి టీమ్ సాదరంగా ఆహ్వానించబోతోంది.  దేవేందర్ గౌడ్ తో పాటు ప్రస్తుతం బీజేపీలో ఉన్నఆయన తనయుడు వీరేందర్ గౌడ్, పెద్ద కుమారుడు విజయేందర్ గౌడ్‌లను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరేందర్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్- టీడీపీ పొత్తులో భాగంగా ఉప్పల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు. వీరేందర్ గౌడ్ కు మొదటి నుంచి రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో వీరేందర్ గౌడ్ బీజేపీకి గుడ్ బై చెప్పి... కాంగ్రెస్ లో చేరవచ్చని అనుకుంటున్నారు. దేవేందర్ గౌడ్ కుటుంబం కాంగ్రెస్ లోకి వస్తే బీసీ వర్గం నుంచి తమకు భారీగా మద్దతు పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.  కేసీఆర్ కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాలని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు. కేసీఆర్ గద్దే దింపేందుకు తమతో కలిసి రావాలని కోరుతున్నారు. రేవంత్ ఆహ్వానంతో ఇప్పటికే కొందరు నేతలు కాంగ్రెస్ లో చేరడానికి ముందుకు వచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్, వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన సీనియర్ నేత గండ్ర సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ తనయుడు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ సోదరుడు సంజయ్ రేవంత్ ను కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. కొంత కాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా సొంత గూటికి చేరడానికి ఆసక్తి చూపారు. 

టీఆర్ఎస్ కు మాజీ మంత్రి గుడ్ బై? క్లారిటీ ఇచ్చిన మహేందర్ రెడ్డి... 

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేయడంతో మొదలైన రాజకీయ వేడి.. రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ఈటల బీజేపీలో చేరడంతో.. కమలం పార్టీలో జోష్ కనిపించింది. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్  నుంచి కొందరు నేతలు కాషాయ గూటికి చేరారు. ఇంతలోనే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంతో పొలిటికల్ అటెన్షన్ అంతా ఆయన వైపు మళ్లింది. రేవంత్ కు పగ్గాలు రావడంతో హస్తం పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచడంతో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా అప్రమత్తమైంది. మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు సీఎం కేసీఆర్. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కారు ఎక్కేశారు. త్వరలోనే మరికొందరు నేతలు గులాబీ గూటికి చేరుతారని చెబుతున్నారు.  అధికార, విపక్షాలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తుండటంతో తెలంగాణ రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఏ లీడర్ ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో తెలియకుండా పోయింది. తమకు ఏ నాయకుడు హ్యాండిస్తారో అన్న ఆందోళన ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే  సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ నేత పార్టీ మారుతున్నారని, ఇంకో లీడర్ ఫలానా పార్టీలో చేరబోతున్నారనే కథనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్ రెడ్డితో ఆయ‌న‌కు ఉన్న విభేదాలే ఇందుకు కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరులో  కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పైలెట్ రోహిత్ రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. పట్నం మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు కేసీఆర్. తర్వాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి తాండూరు నియోజకవర్గంలో పట్నం, పైలెట్ వర్గాల మధ్య ఆదిపత్య పోరు సాగుతోంది. చాలా సార్లు బహిరంగంగానే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. నియోజకవర్గంలోని అధికారులు కూడా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డైరెక్షన్ లోనే పని చేస్తున్నారని చెబుతున్నారు. పార్టీ హైకమాండ్ నుంచి తనకు సపోర్ట్ లేదని మహేందర్ రెడ్డి తన అనుచరులతో చెప్పారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే  కొంత కాలంగా అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న పట్నం.. పార్టీ మారుతారని చాలా మంది అనుకుంటున్నారు.  అయితే తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు. తాను టీఆర్‌ఎస్‌ను వీడుతున్నాన‌ని త‌న ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం చేస్తున్న ప్రచారం నిజం కాద‌ని వ్యాఖ్యానించారు. త‌న‌పై కొందరు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి విష ప్రచారం చేస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. తాను పార్టీ మార‌బోన‌ని తెలిపారు. తాను పార్టీ మారుతున్న‌ట్లు అసత్య ప్రచారం చేస్తున్న వారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నాన‌ని పట్నం స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా తాను టీఆర్ఎస్ లో సంతృప్తిగానే ఉన్నానని చెప్పారు పట్నం మహేందర్ రెడ్డి.   

ఉప ఎన్నికలకు జగన్ ప్లాన్ ? వైసీపీ నేతల్లో టెన్షన్.. 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరోసారి జనంలోకి వెళ్లి  తమ బలాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా? అందుకోసంగా ఉప ఎన్నికల పథకాన్ని సిద్ధం చేస్తున్నారా? అంటే ... అవుననే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. జగన్ రెడ్డి రెండేళ్ళ పాలనలో చంద్రబాబు ఐదేళ్ళు కష్టపడి గాడిలో  పెట్టిన  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా స్థితికి చేరుకుంది.అప్పుల భారం ఇంతై ఇంతింతై .. అన్నట్లుగా కొండలా  పెరిగింది. అప్పుల భారానికి ఏక్షణంలో అయినా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి అధః పాతాళంలోకి కూరుకు పోవడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులే పేర్కొంటున్నారు. కొత్తగా అప్పులు పుట్టే దారులు కూడా ఒకటొకటిగా మూసుకు పోతున్నాయి. ఈ నేపధ్యంలో ఇంతకాలం జగన్ రెడ్డి పంపకాలకు మురిసిపోయిన మాములు జనం కూడా.. ముందు ముందు కష్టాలు తప్పవని, కడుపు చేతపట్టుకుని వలసలు పోవలసిన పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు.  రాష్ట్ర  ఆర్థిక పరిస్థితి ఆధారంగా విపక్షాలు  చేస్తున్న ఆరోపణలు గుప్పిస్తున్నాయి.  ఇతరత్రా అంశాల్లోనూ ప్రభుత్వం పట్ల వ్యతిరేక పెరుగుతున్నసంకేతాల కనిపిస్తున్నాయి.ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సర్వేల ద్వారా కాకుండా నేరుగా జనంలోకి వెళ్ళి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతలను బేరీజు వేసుకునేందుకు సిద్దమవుతున్నారని సమాచారం. ఉప ఎన్నికలకు వెళితే జనం నాడిని పట్టుకోవచ్చని ముఖ్యమంత్రి భావిస్తున్నారని ఇదే విషయాన్ని ఆయన తమ సన్నిహితుల వద్ద చర్చించారని పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడంతో, ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక ఆ స్థానంతో పాటు మరో ఐదు చోట్ల జగన్ ఉపఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. బెంగాల్ సహా పలు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఏర్పడిన ఖాళీలకు రానున్న ఒకటి రెండు నెలల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్దమవుతోందని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని  కలిసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు వెంటనే ఉప ఎన్నిక నిర్వహించాలని వినతి పత్రం సమర్పించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదవి నిలబడాలంటే అర్జెంటుగా ఉప ఎన్నిక జరగడం అవసరం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి,ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నవంబర్ 4 వ తేదీలోగా ఎమ్మెల్యేగా ఎన్నిక అయితేనే, పదవిలో కొనసాగుతారు.కాదంటే ఆమె రాజీనామా చేసి మరొకరికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించవలసి వస్తుంది. ఈ నేపధ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘంపై వత్తిడి తెస్తోంది. ముందు ముందు వత్తిడి మరింత పెంచుతుంది.  ఎన్నికల సంఘం కూడా ఏ కారణంగా అయినా  ఖాళీ అయిన స్థానానికి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే తప్ప ఉప ఎన్నికను ఆరు నెలలకు మించి వాయిదా వేసే అవకాశం ఉండదు. కాబట్టి రానున్ను రెండు మూడు  నెలలో బెంగాల్ తదితర రాష్ట్రాలతో పాటుగా రాష్ట్రంలోని బద్వేల్ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందని జగన్ రెడ్డి బృదం భావిస్తోంది. ఈ నేపద్యంలో పనిలో పనిగా, తెలుగు దేశం టికెట్ పై గెలిచి, దొడ్డిదారిన వైసీపీలో చేరిన  నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరి చేత రాజీనామా చేయించి, ఆ నాలుగు స్థానాలకు, అదే విధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు  చేసి న రాజీనామాను ఆమోదించి  ఆ స్థానాన్ని ఉప జాబితాలో కలిపి  మొత్తం ఆరు స్థానాలకు ఒకే సారి ఉప ఎన్నికలు జరిపితే ప్రజల నాడి  తెలిసిపోతుందని జగన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఉప ఎన్నికలలో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదని ఆ పార్టీ నాయకులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్లో నివురుగప్పిన నిప్పుల ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఉప ఎన్నికల్లో భగ్గుమంటే, కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని పార్టీలో కొందరు హెచ్చరించినట్లు సమాచారం. అయితే  జగన్ రెడ్డి, ఎవరి మాటా వినని సీతయ్యలా ముదుకు పోతారా? లేక ... కీడెంచి మేలెంచడం మంచిదని వెనకడుగు వేస్తారా.. చూడవలసి వుంది. 

పెత్తనం రెడ్డిగారికి.. ఊడిగం వెనకబడినవారికి! జగనన్న.. నువ్ తోపన్నా..! 

మాట తప్పరు.. మడమ తిప్పరు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడతారు. చరిత్రలో లేని విధంగా బలహీనవర్గాలకు పదవులిస్తారు.  మహిళలకు అర్ధభాగం పైనే వాటా ఇస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డిగారి స్క్రిప్టు... కాని అదేంటో దేవుడు రాసిన స్క్రిప్టు వేరేగా ఉంది. మాట తప్పరు.. కాని ముసుగేస్తారు.. మడమ తిప్పరు.. కాని మెడే తిప్పేస్తారు.. విలువలకు, విశ్వసనీయతలను జాగ్రత్తగా ఫ్రిజ్ లో పెడతారు..అంటే వాటిని చావనీయరు.. బతకనీయరన్నమాట. బలహీనవర్గాలకు బలహీన పదవులిస్తారు.. మహిళలకు అర్ధభాగంపైనే నీటి మూటలిస్తారు. నామినేషన్ పదవుల పేరుతో చేసిన హంగామా చూసి ఏదో అనుకున్నవారికి.. మళ్లీ పాత చింతకాయ పచ్చడే అది కూడా రెడ్డిగారి పచ్చడే పెట్టారని అర్ధమైపోయింది. తెలుగుదేశం పాలనలో కమ్మవారికి చంద్రబాబునాయుడు దోచిపెట్టేశారని జగన్ వీధివీధిన అరిచి గోల పెట్టారు. జనం నిజమేనేమో అనుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగారు రెడ్డివార్లకు వడ్డిస్తున్న తీరు చూసి..కమ్మవారికి చంద్రబాబునాయుడు మీద కోపం నషాళానికి అంటుతోంది. ఏమన్నా అడిగితే వాళ్లేమంటారో.. వీళ్లేమంటారో అంటాడు.. జగన్ ను చూసి నేర్చుకోవాలి.. ఎంత చక్కగా తనవాళ్లకి ఎంత బాగా చేసుకుంటున్నాడో అని తిట్టుకుంటున్నారు.  అదేంటి..బలహీనవర్గాలకు అంత పర్సంటేజి, మహిళలకు ఇంత పర్సంటేజి ఇస్తే.. మీరేంటి ఇలా అంటారనుకోకండి. జాగ్రత్తగా మంచి పదవులన్నీ పొట్లాల్లో కట్టేసి...ఆ పదవులేమో రెడ్డివార్లకు ఇచ్చేసి... పొట్లాం కాగితాల్లాంటి పదవులేమో బలహీనవర్గాలకు, మహిళలకు ఇచ్చేశారు. పొట్లాల కాగితాలు ఎక్కువుండటంతో.. ఏదో చాలా ఇచ్చేశామని రచ్చ రంబోలా చేసేస్తున్నారు. అసలు సంగతి పదవులు తీసుకున్నోళ్లకు మాత్రమే కరెక్టుగా అర్ధమవుతుంది. ఆ లిస్టులో అసలు పని లేని పదవులు బోలెడన్ని ఉన్నాయి. అసలు పని ఉండి, నిధులున్న సంస్థలను లెక్కేసి లిస్టు సెపరేటుగా వేస్తే..99 శాతం రెడ్డిగార్లే కనపడతారు మనకి. కాని చిన్నా, చితక అన్నీ కలిపేసి లిస్టు పెద్దది చేసి.. దానికి పర్సంటేజీలు కట్టేసి.. చాలా ఉద్ధరించేశామని ఊదరగొడుతున్నారు. వైసీపీ రెడ్డిగార్లు కూడా జగన్ గారి ఈ చమత్కారానికి బహు ముచ్చట పడుతున్నారంట. ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేశారు సీఎం జగన్ రెడ్డి.  పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని గొప్పగా చెప్పారు మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించామని తెలిపారు. నామినేటెడ్ పదవుల లెక్క చూసిన వారు నిజమే అనుకునేలా కవరింగ్ ఇచ్చారు. తీరా ఏ పోస్టులు ఎవరికి దక్కాయో చూస్తే అసలు సంగతి బయటపడింది. జగనన్న ఎంత తోపే మరోసారి తెలిసిచ్చింది. నిధులు ఎక్కువగా ఉండే కార్పొరేషన్లను రెడ్లకు కట్టబెట్టి.. అసలు కార్యాలయాలే లేని కార్పొరేషన్లు, బడ్జెట్ ఎంతో తెలియని, ఆ పోస్టు అంటూ ఉందని కూడా తెలియని నామినేటెడ్ పోస్టులను బడుగు, బలహీన వర్గాలకు ఇచ్చారన్నది తేలిపోయింది. ఏపీఎస్‌ఆర్టీసీ, ఏపీఐఐసీ, పెద్ద దేవస్థానాలు, పర్యాటకం, స్పోర్ట్స్, మార్క్‌ఫెడ్‌, మారిటైం బోర్డ్‌, సివిల్‌ సప్లైస్‌, పోలీస్‌ హౌసింగ్‌, APCOB, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి వంటి కీలక పదవులన్ని రెడ్డి వర్గానికే ఇచ్చారు.  నామినేటెడ్ పోస్టుల్లో అత్యంత కీలకం ఏపీఎస్ ఆర్టీసీ. గతంలో మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ఈ పదవిని నిర్వహించారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ పోస్టును మల్లికార్జున రెడ్డికి ఇచ్చారు జగన్ రెడ్డి. మరో కీలక పోస్టు ఏపీఐఐసీ. మంత్రి పదవి ఆశించి భంగపడిన ఎమ్మెల్యే రోజా ఇప్పటివరకు ఈ పదవిని నిర్వహించారు. మంత్రి పదవి ఇవ్వలేకపోయిందుకు కీలకమైన ఈ పోస్టును కట్టబెట్టారు జగన్. ఇప్పుడు కూడా ఏపీఐఐసీ చైర్మన్ పోస్టును మెట్టు గోవిందరెడ్డికి కట్టబెట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డిని నియమించారు. నిధులు ఎక్కువగా ఉండే సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టును ద్వారంపూడి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు జగన్ రెడ్డి.  కీలకమైన ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డిని నియమించారు. బడ్జెట్ భారీగా ఉండే పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మెట్టుకూరు చిరంజీవిరెడ్డి అపాయింట్ అయ్యారు. స్పోర్ట్‌ అథారిటీ ఛైర్మన్‌ పదవిని బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి అప్పచెప్పారు జగన్ రెడ్డి. జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్ పోస్టులను వివిధ వర్గాలను పంచేసిన జగన్ సర్కార్.. రాష్ట్ర స్థాయిలో కీలకమైన అప్కాబ్ చైర్మెన్ పోస్టును మాత్రం మల్లెల ఝాన్సీరెడ్డికి, మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ పదవిని పమిరెడ్డిగారి పెద్దనాగిరెడ్డికి కట్టబెట్టారు. కీలకమైన పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఆరెమండ వరప్రసాద్‌రెడ్డి, రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కోడూరు అజయ్‌రెడ్డి, రాజమండ్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా ఎం.షర్మిలారెడ్డిని నియమించారు. కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్మన్‌గా కోట్ల హర్షవర్ధన్‌రెడ్డిని అపాయింట్ చేశారు జగన్ రెడ్డి.  ప్రభుత్వం వచ్చిననాటి నుంచి అన్ని కీలక పదవుల్లో రెడ్డిగార్లకు పెద్ద పీట వేసిన జగనన్న.. తన స్పీచ్ లో మాత్రం రెడ్డిగార్లను పక్కనపెట్టి బలహీనవర్గాలు, మహిళల గురించి వాయించేస్తున్నాడు. ఆఖరికి కీలకమైన అధికారిక పదవుల్లో కూడా వారినే ఏరికోరి వేయిస్తున్నారు.  పై నుంచి కింద వరకు కీలక పదవులన్నిటిలో వారే నిండిపోయారు. కింద పదవుల్లో మిగతావాళ్లుంటారు. మొత్తం కలిపి మనకు లెక్కలు చెబుతుంటారు. సూటిగా చెప్పాలంటే పెత్తనం చేసే పదవులున్నీ రెడ్డివార్లకే, ఊడిగం చేసే పదవులున్నీ బలహీనవర్గాలు, మహిళలకే. చూద్దాం మరి ఎన్నాళ్లు మోసం చేస్తారో..మోసపోయేవారు ఇంకెన్నాళ్లు మోసపోతారో.

కేసీఆర్ ను ఇరికించిన పల్లా.. రేవంత్ దెబ్బ మాములుగా లేదుగా!

రేవంత్ కు టీడీపీ వాసన పోలేదని కామెంట్ చేసి విమర్శల పాలైన కేటీఆర్ ను చూసి కూడా టీఆర్ఎస్ నాయకులకు కనువిప్పు కలగలేదు. తాజాగా ఆపార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ శ్రేణులే నవ్వుకుంటున్నారు. పదవులు అనుభవించి పార్టీ మారే వాళ్లకు బుద్ధి చెప్పాలని.. గ్రామాలకు వస్తే తరిమి కొట్టాలని ఈటల రాజేందర్ ను దృష్టిలో పెట్టుకొని పల్లా కామెంట్ చేశారు. దీంతో అరెరె.. పల్లా ఇలా ఎందుకు మాట్లాడావని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకంటే.. రేపు హుజూరాబాద్ అభ్యర్థి ఎల్ రమణో, కౌశిక్ రెడ్డో అయితే రివర్స్ అవుతుందనేది వారి బాధ. ప్రస్తుత పరిస్థితుల్లో ఆచితూచి మాట్లాడాలని ఏది పడితే అది మాట్లాడితే.. మనకే నష్టమని అంటున్నారు. నిజానికి కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో.. ఎవరిని పార్టీలోకి చేర్చుకుంటాడో.. ఎవరికి సీటు ఇస్తాడో తెలియని పరిస్థితి. అలాంటప్పుడు ఏదిబడితే అది మాట్లాడితే తర్వాతి రోజుల్లో చిక్కుల్లో పడతామని అంటున్నారు పార్టీ శ్రేణులు. పైగా ఇతర పార్టీల్లో పదవులు అనుభవించిన, అనుభవిస్తున్న వారిని చేర్చుకుంటూ పార్టీ మారే వాళ్లకు బుద్ధి చెప్పాలని అనడం ఏంటని గులాబీ దళమే నవ్వుకుంటోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న ఎల్ రమణను చేర్చుకుంటూ.. ఈటల పార్టీకి ద్రోహం చేశాడు.. ఆయనకు బుద్ది చెప్పాలని అనడం హాస్యాస్పదం కాదా..? అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తలసానిని మంత్రి వర్గంలోకి తీసుకున్నాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం.. ఇప్పుడు హుజూరాబాద్ లో పలు పార్టీల్లో గెలిచిన కౌన్సిలర్లను, ఇతర ప్రజాప్రతినిధులను లాగేశాం.. ఇలా చెప్పుకుంటే పోతే లిస్టు చాంతాడంత ఉంది. పార్టీలో ముప్పావు వంతు ఇతర పార్టీల నాయకులే ఉన్నారన్న సంగతి మర్చిపోయారా..? అని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు పదవులు అనుభవించి పార్టీకి ద్రోహం చేసిన వారిని తరిమికొట్టాలి అని పిలుపునివ్వడంలో అర్థం లేదని చర్చించుకుంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈటలపై చేసిన కామెంట్స్.. పలు పార్టీల్లో సుదీర్ఘ కాలం పదవులు అనుభవించి ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరిని వారికి కూడా వర్తిస్తాయని గుర్తు చేస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. ప్రజలు దీన్ని పట్టుకుని నిలదీస్తే ఏం సమాధానం చెబుతామని పల్లాను ప్రశ్నిస్తున్నారు. గతంలో జనరల్ నియోజకవర్గంగా ఉన్న డోర్నకల్ నుండి రెడ్యానాయక్ ను మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిపించి మంత్రిని చేసి, అయన కుమార్తెను సైతం గెలిపించిన కాంగ్రెస్ కు.. అధికారం పోగానే ఆయన కుటుంబం టీఆర్ఎస్ లో చేరింది. ఇది కాంగ్రెస్ కు ద్రోహం చేయడమే కదా.. అలాగే రమణను నమ్మి చంద్రబాబు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే రాజీనామా చేసి మన గూటికి చేరడమంటే ద్రోహం కాదా..? కౌశిక్ రెడ్డి చేసింది ద్రోహం కాదా..? ఇలా అనేక మంది ఆయా పార్టీల్లో అనేక పదవులు అనుభవించి అధికారం పొగానే టీఆర్ఎస్ లోకి చేరారని.. అలాంటివారిని దగ్గర పెట్టుకొని ఈటలకు బుద్దిచెప్పాలి.. తరిమికొట్టాలని అనడం గురిగింజ సామెతను గుర్తు చేస్తోందని అంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. 

యడ్డీ ఉద్వాసన  మళ్ళీ వాయిదా? ఆ వర్గం ఆయన్నే కాపాడిందా?

కర్ణాటక ముఖ్యమత్రి యడ్యూరప్ప మరో మారు పదవీ గండంనుంచి తప్పించుకున్నారా? బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనకు మరో అవకాశం ఇచ్చిందా? ఇంకొద్ది రోజులు అధికారంలో కొనసాగేందుకు ఒప్పుకుందా? అంటే స్పష్టమైన సమాదానం అయితే  రావడం లేదు,కానీ, ఆ మేరకు సంకేతాలు అయితే అందుతున్నాయి.  పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు జులై 16, శుక్రవారం హుటాహుటిన ఢిల్లీ చేరుకున్న యడ్యూరప్ప గత రాత్రే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని రాజకీయ అంశాల చర్చకు అవకాశం ఇవ్వలేదని. పరిపాలనపరమైన అంశాల వరకు చర్చించి, రాజకీయ అంశాలను,హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించమని సూచించినట్లు సమాచారం.  కాగ, యడ్యూరప్ప ఈ రోజు (శనివారం) రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు నడ్డాతో సమావేసమయ్యారు. అయితే సమావేసం అనంతరం, పార్టీ నాయకత్వం తనను రాజీనామా చేయమని కోరలేదని, పార్టీని బలోపేతం చేయాలని మాత్రమే నడ్డా చెప్పారని  యడ్యూరప్ప అన్నారు. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు గట్టిగా పనిచేస్తానని తాను హామీ ఇచ్చినట్లు కూడా యడ్యూరప్ప వివరించారు. అలాగే, “నేను రాజీనామా చేస్తునట్లు వస్తున్న వార్తల వాస్తవం కాదు .. నేనే సీఎంగా కొనసాగుతాను” అంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే అదే సమయంలో ఆగష్టు మొదటి వారంలో మళ్ళీ ఢిల్లీ వస్తున్నట్లు ఆయన చెప్పారు.  అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం పార్టీ అధినాయకత్వం కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో సందేహం లేదు. అయితే, ముఖ్యమంత్రి మార్పుతో సున్నితమైన కుల సమీకరణలు ముడిపడి ఉన్నందున, యడియూరప్పను గౌరవప్రదంగా పంపాలని పార్టీ నాయత్వం చూస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శివకుమార్, యడ్యూరప్ప పేరు చెప్పకుండా ఆయన కులానికి (లింగాయత్) చెందిన అనేక మంది బీజేపీ నాయకులు,ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయ బాంబు పేల్చారు. ఈ నేపధ్యంలో ఆయనను అగౌరవంగా బయటకు పంపిస్తే, గతంలో లాగా, మరోమారు రాజకీయంగా దెబ్బతినవలసి ఉంటుందని పార్టీ ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఈ నెల 26తో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు పూర్తవుతాయి. అంతవరకు అయనను పదవిలో కొనసాగించాలని, ఆగష్టు మొదటి వారంలో  మళ్ళీ మరోమారు చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే,  యడ్డీని తొలిగించడం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరద్ సింగ్ ని తీసేసినంత సులువు కాదని మాత్రం కమల త్రయానికి మరోమారు అర్థమైనట్లే వుంది. చివరకు ఏమి జరుగుతుందో .. చూడవలసి వుందని పార్టీ వర్గాలు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి .   

జీతాల కోసం మాన్సస్ ఉద్యోగుల ధర్నా.. 

మాన్సస్ సంస్థ.. ఉత్తరాంధ్రలో వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన సంస్థ. లక్షలాది మందికి విద్యాజ్యోతులు అందించిన సంస్థ. కాని ఇప్పుడా సంస్థ కుట్ర రాజకీయాలకు బలై పీకల్లోతు చిక్కుల్లో పడింది. మాన్సస్ సంస్థ ఉద్యోగులు జీతాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. 15 నెలలుగా జీతాలు చెల్లించడంలేదంటూ మాన్సస్ సంస్థ ఉద్యోగులు ధర్నాకు దిగడం కలకలం రేపుతోంది.  మాన్సాస్ సారథ్యంలో నడుస్తున్న ఇంజినీరింగ్ కాలేజీ సిబ్బంది ఆందోళన నిర్వహించారు. ఎన్నడూ లేని విధంగా మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించారు. తీవ్రమైన నిరసన వ్యక్తం చేశారు. మాన్సస్ ఈవో వెంకటేశ్వరరావు ను దాదాపు రెండు గంటలుగా నిర్బంధించారు. తమకు పదహారు నెలలుగా జీతాలు నిలిపివేయడం అన్యాయం అని ఈవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో వ్యవహారంతోనే తమ జీతాలు నిలిచిపోయాయని ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  ఉద్యోగుల ఆందోళనతో అలర్ట్ అయిన కార్యాలయ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాన్సాస్‌లో ఉండేటువంటి దేవాదాయ  శాఖకు సంబంధించిన కార్యనిర్వహణాధికారి.. సిబ్బందికి జీతాలు చెల్లించకూడదని బ్యాంకుకు లిఖిత పూర్వకమైన ఆదేశాలు జారీ చేయడంతోనే వివాదం చెలరేగింది. మాన్సాస్ ఛైర్మన్ జీతాలు చెల్లించమని చైర్మన్ లిఖితపూర్వకమైన ఆదేశాలు జారీ చెప్పినప్పటికీ.. ఇష్యూ కోర్టులో ఉన్నందున ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేయమని ఈవో లేఖ రాయడంతో ఆందోళనలు చెలరేగాయి. ఛైర్మన్ మాటకు గౌరవం ఇవ్వకుండా ఈవో వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ మాన్సాస్ ఉద్యోగులు తీవ్రమైన ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు.   ఉద్యోగుల ధర్నాకు సంబంధించి  మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతి రాజుపై మాజీ చైర్ పర్సన్ సంచయిత సంచలన కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన సంచయిత.. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఈవో ని బెదిరించడానికి సిబ్బందిని ప్రేరేపించడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. మీ అన్నయ్య ఆనంద గజపతి రాజు జన్మదినం రోజున ఇలాంటి కార్యక్రమాలకు ప్రేరేపించడం మీకు సిగ్గుగా లేదా? అంటూ అశోక్ గజపతి రాజును ప్రస్తావిస్తూ సంచయిత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాన్సస్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి, దివంగత నాయకులు ఆనంద గజపతిరాజు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సుధా, ఊర్మిల గజపతిరాజు నివాళులర్పించారు. ఆయన సమాధి వద్ద పుష్ఫగుచ్చాలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఊర్మిళ గజపతిరాజు.. సింహాచలం భూముల వ్యవహారం విషయంలో ఏం జరుగుతుందో తమకు తెలియదన్నారు. తాను కూడా అందరిలాగే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నానని చెప్పారు. మాన్సస్ ట్రస్ట్ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉందన్నారు. ఈ వివాదం ముగింపు కోసం అందరి మాదిరిగానే తానూ ఎదురుచూస్తున్నానని అన్నారు. మాన్సస్ సంస్థలో తన తండ్రి చైర్మన్ గా ఉన్న సమయంలో ఆడిట్ జరిగినట్లు సమాచారం ఉందని, ఆయన తర్వాత ఎం జరిగిందో తెలియదని తెలిపారు. 

యూట్యూబ్ లో అశ్లీల కంటెంట్.. ప్రముఖ సింగర్‌కు వేధింపులు

యూట్యూబ్ కావచ్చు సోషల్ మీడియా ఏదైనా కావచ్చు కొంత మంది మందికి వాడుతుంటే ఇంకొంత మంది చెత్త కంటెంట్ కి వాడుతున్నారు. ఇంకొంత మందికి ఐతే సోషల్ మీడియా పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. వాళ్లకు నచ్చిన కంటెంట్ పెట్టి చదువుకునే పిల్లలను పక్కద్రోవ పట్టిస్తున్నారు. ఇది ఒక దందా ఐతే ప్రముఖుల పేర్ల మీద సోషల్ మీడియాలో అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఇబ్బందులు పడేట్టు చేస్తున్నారు. వాళ్ళు చేసే పనులకి అడ్డుఅదుపు లేకుండా పోతుంది. ఇక తాజాగా యూట్యూబ్  ఛానెల్‌లో అశ్లీల కంటెంట్.. ప్రముఖ సింగర్‌కు వేధింపులు.. వ్యక్తి అరెస్ట్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సింగర్‌ను గత కొంతకాలంగా నవీన్ కుమార్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేస్తున్నాడు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలలో ఆమె పేరుపై అకౌంట్‌ను ఓపెన్ చేయడమే కాకుండా.. ఏకంగా సదరు గాయని ఫోటోతో ఫిల్మ్ ప్రొడక్షన్‌ను సైతం మొదలుపెట్టాడు. అంతటితో ఆగిన ఆ కేటుగాడు ఓ యూట్యూబ్ ఛానెల్‌లో గాయనిపై అశ్లీల కంటెంట్ అప్‌లోడ్‌ చేసేవాడు. ఈ విషయం సింగర్ కుటుంబానికి సన్నిహితుల ద్వారా తెలియడంతో వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇక సింగర్ రంగం లోకి దిగింది పలు సార్లు వార్నింగ్ ఇచ్చింది ఐన వినిపించుకోలేదు..ఇదిలా ఉంటే సదరు వ్యక్తికి ఫోన్ చేసి సోషల్ మీడియాలో తన పేరుపై పెట్టిన ఖాతాలను తొలగించాలంటూ సింగర్ కోరింది. ఆమె మాటలను పట్టించుకోని అతడు.. తాను చేసే పనులకు ఎన్ఓసీ ఇవ్వాలంటూ సింగర్‌ను బెదిరించాడు. దీనితో ఆ సింగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు నిందితుడు నవీన్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

డాక్టర్స్ నిర్లక్ష్యం.. ఏడు నెలల గర్భిణీ మృతి..

సామాన్యుడి ప్రాణం అంటే అటు ప్రభుత్వాలకు, ఇటు హాస్పిటల్ సిబ్బందికి విలువలేకుండా పోయింది. పేదోడి డబ్బులు కావాలి కానీ వాడి ప్రాణం అవసరం లేదు అన్నంతలా తయారైయింది ఈ సమాజం.. సామాన్యుడి ప్రాణం తీయడం టీ మీద పడితే తుడుచుకున్నట్లు తుడుచుకోవడం అలవాటు అయిపోయింది. దీనికి నిదర్శనం  గతం లో హైదరాబాద్ లో విరించి, ఉప్పల్ లో ఉన్న ఆదిత్య హాస్పిటల్స్ అయితే తాజాగా ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా పేషేంట్ ప్రాణం తీసిన మరో హాస్పిటల్ బాగోతం బటయపడింది. అదేంటో తెలుసుకుందాం..  అది తెలంగాణ.  కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంజల్ రెడ్డి మెమోరియల్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఏడు నెలల గర్భిణీ మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన నౌశిక్ బేగం(23) అనే ఏడు నెలల గర్భిణీ స్త్రీ పరీక్షల నిమిత్తం అంజల్ రెడ్డి మెమోరియల్ ఆస్పత్రికి వచ్చారు. ఆమెకు బీపీ ఎక్కువగా ఉండటంతో వెనక ముందు ఆలోచించకుండా వైద్యులు టాబ్లెట్స్ ఇచ్చారు. కాసేపటికి నౌశిక్ మృతి చెందింది. దాంతో వైద్యులు నిర్లక్ష్యం వహించి బీపీ టాబ్లెట్ లు ఇవ్వడం కారణంగానే నౌశిక్ మృతి చెందిందని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో ఆస్పత్రికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతురాలి బంధువులు అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో మృతిరాలి కుటుంబ సభ్యులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాంతో హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. హాస్పిటల్ యజమాన్యం మృతురాలి పట్ల బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు. పోలీసులు కల్పించుకుని సర్దిచెప్పడంతో బంధువులు శాంతించారు. తమకు న్యాయం జరిపించాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు. 

ఒకే ఇంట్లో ఎన్నో జెండాలు.. కొత్తేమీ కాదు..

నేను ఏ పార్టీలో ఉన్నానో నాకే తెలియడం లేదు’ ఈమాట అన్నది ఎవరో చిన్నాచితక నాయకుడు కాదు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రెండు సార్లు పీసీసీ అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపిన ధర్మపురి శ్రీనివాస్. ధర్మపురి శ్రీనివాస్ అంటే, అందరికీ వెంటనే స్పురణకు రాక పోవచ్చును, కానీ, డీఎస్ అంటే అందరికీ గుర్తుకొస్తారు. అడుగులో అడుగేస్తూ  నెమ్మదిగా కదిలే భారీ రూపం కళ్ళ ముందు కదులుతుంది. అలాగే, ఎంత పెద్ద వివాదం అయినా  కోపతాపాలకు పోకుండా, మెల్లగా, మౌనంగా మాట్లాడే ఆయన  నైజం గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం అయన తెరాస రాజ్య సభ సభ్యునిగా ఉన్నారు. అయినా, పార్టీ ఆయన్ని పట్టించుకోవడంలేదు. “టీఆర్‌ఎస్‌ నుంచి నాకు ఆహ్వానాలు రావడం లేదు. నేను టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీనేనా? అన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌నే అడగాలి” అని అన్నారంటే ఆయన ఎలాంటి మానసిక క్షోభకు గురవుతున్నారో అర్థం చేకోవచ్చును. ఇంత వరకు తండ్రితో పాటుగా అవమానాలు భరిస్తూ కూడా తెరాసలో కొనసాగిన డీఎస్ పెద్ద కుమారుడు, నిజామాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ ధర్మపురి సంజయ్, ఇటీవల తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరోవంక ఇప్పటికే ఆయన మరో కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు.అంటే తండ్రి ఒక ప్రాంతీయ పార్టీలో, కుమారులు ఇద్దరూ చెరో జాతీయ పార్టీలో ఉన్నారు. ఇలా ఒకే ఫ్యామిలీలో మూడు పార్టీలు, మూడు జెండాలు ఏమిటని అనడిగినప్పుడు, ఆయన మరో అడుగు ఎనక్కి వేశారు, మీకు తెలియక పోవచ్చును కానీ,మా నాయన  జనసంఘ్ (బీజేపీ పూర్వ రూపం )లో ఉన్నారని గుర్తుచేశారు. అంతేకాదు, తండ్రీ కొదుకులే కాదు, బార్యాభర్తలు కూడా వేర్వేరు పార్టీల్లో ఉన్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయని  అన్నారు.  నిజమే చరిత్రలోనే కాదు,నడుస్తున్న చరిత్రలో కూడా అనేక ఉదంతాలు కనిపిస్థాయి, చెన్నమనేని రాజేశ్వర రావు,చెన్నమనేని విద్యాసాగర రావు. ఇద్దరు సొంత అన్నదమ్ములే. కానీ అందులో రాజేశ్వర రావు, ఒకప్పుడు కరుడుగట్టిన  కమ్యూనిస్ట్ (చివర్లో టీడీపీలో చేరారు) సోదరుడు విద్యాసాగరరావు చిన్నతనం నుంచే కాషాయధారి,బీజేపీలో కెలక నేతగా ఎదుగారు. కాషాయ జెండా నీడలోనే కేంద్ర మంత్రిగా మహారాష్ట్ర గవర్నర్’గా పనిచేశారు. ఇప్పుడు రాజేశ్వర రావు కుమారుడు చెన్నమనేని రమేష్ తెరాస ఎమ్మెల్యే.  ఎవరి దాకానో ఎందుకు కేసీఆర్ ఫ్యామిలీలోనే ఆయన ఇద్దరు మేనల్లుడలళ్ళలో  హరీష్ రావు మమవెంట నమ్మినబంటుగా తెరాసలో ఉన్నారు. ఆయన మరో మేనల్లుదు ఉమేష్ రావు కొంత కాలం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఇప్పటికీ అదే పార్టీలో ఉన్నాఋ కావచ్చు. ఇంకా కేసీఆర్ అన్నదమ్ముల బిడ్ద రమ్యా రావు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాగే, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఫ్యామిలీలో ఆయన, ఆయన కుమారుడు వైసీపీలో ఉన్నారు. అయన భార్య దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు.  జగన్‌ కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టుకున్నాక తన తల్లిని పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించిన సందర్భంలో ఆమెకు వ్యతిరేకంగా పోటీకి దిగింది మరెవరో కాదు.. స్వయానా వైఎస్‌ తమ్ముడే వివేకనంద రెడ్డి. వైఎస్ కుమారుడు జగన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నా, పెద్దాయన ఆత్మ మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్’లోనే వుంది. అలాగే, జగన్ సోదరీ షర్మిల ఏకంగా సరహద్దు దాటి తెలంగాణలో సొంత పార్టీనే పెట్టు కున్నారు. అన్నా చెల్లి నడుమ రక్త బందం మాటేమో గానీ జలవివాదం రాజుకుంటోంది.ఇలా చెప్పుకుంటూ పొతే రెండు, మూడు జెండాలున్న కుటుంబాలు ఇంకా అనేకం ఉన్నాయి, కర్నూల్ శిల్పా సోదరులు, పోట్టిశ్రీ రాములు జిల్ల్లాలో బీద మస్తాన్, బీద రవిచంద్ర సోదరులు వేర్వేర్రు పార్టీలలో ఉన్నారు. సో ... ఒకే ఇంట్లో మూడు కాదు ... ఇంకా ఎక్కువ జెండాలున్నా అశ్చర్య పోనవసరం లేదు. దేశంలో ఫస్ట్ పొలిటికల్ ఫ్యామిలీగా ముద్రవేసుకున్ననెహ్రూ గాంధీ ఫామిలీలో ఇందిరమ్మ పెద్ద కోడలు సోనియా కాంగ్రెస్ సారధి, చిన్నకోడలు మేనకా గాంధీ బీజేపీలో మాజీ మంత్రి. ఇద్దరూ ఎంపీలే పార్టీలే వేరే ..అలాగే .. రాహుల్ ... వరుణ్ గాంధీ..

షర్మిల పార్టీ హ్యాండ్సప్.. కారణం ఇదేనా?

వైఎస్ షర్మిల కొత్త పార్టీతో తెలంగాణలో హంగామా చేస్తోంది. వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ కాక రేపుతోంది. నిరుద్యోగ సమస్యలపై గతంలో నిరాహార దీక్ష చేసిన షర్మిల.. ఆత్మహత్యలకు పాల్పడిన యువత కుటుంబాలను పరామర్శిస్తోంది. ఇప్పటికే నాలుగైదు జిల్లాల్లో పర్యటించి బాధిత కుటుంబానికి బాసటగా నిలిచింది. అంతేకాదు ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ ప్రభుత్వంతో పాటు కేసీఆర్ కుటుంబాన్ని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తోంది వైఎస్ షర్మిల. శుక్రవారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైరైంది. కేటీఆర్ ఎవరని ప్రశ్నించి అందరిని ఆశ్చర్యపరిచింది. కేసీఆర్ టార్గెట్ గా దూసుకుపోతున్న షర్మిల ఒక్కసారిగా హ్యాండప్ అన్నారు. వీరలెవల్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే తుస్సుమనిపించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం సంచలన ప్రకటన చేశారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదంటూ ట్విట్టర్ ద్వారా  ఆమె ప్రకటించారు. ‘హుజూరాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా?’ అంటూ ఆమె ప్రశ్నించారు. ‘‘హుజూరాబాద్ ఉప ఎన్నికల వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా?, దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా? ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీచేస్తాం’’ అంటూ షర్మిల చెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలు పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నికలు మాత్రమేనంటూ షర్మిల అభిప్రాయపడ్డారు.  హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయబోమంటూ షర్మిల చేసిన ప్రకటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ పెట్టాక గెలుపోటములతో సంబంధం లేకుండా బరిలో నిలవాలని, పోటీ చేయకపోతే పారిపోయారనే సంకేతం వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు హుజురాబాద్ నుంచి హ్యాండప్ అన్నారు.. త్వరలో పార్టీ జెండాను కూడా పీకేస్తారని కొందరు కామెంట్ చేస్తున్నారు. షర్మిల పార్టీ పోటీ చేయకపోవడం వల్ల టీఆర్ఎస్ కు లాభం కల్గుతుందని. అందుకే ఆమె  ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా తన నిర్ణయంతో రాజకీయ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారారు వైఎస్ షర్మిల. 

కేసీఆర్ బినామీల వెయ్యి కోట్ల స్కాం.. రేవంత్ రెడ్డి సంచలనం..

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కోకాపేట భూముల వేలంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భూముల వేలంలో వెయ్యి కోట్ల గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపించారు. తన బినామీలకు భూములు కట్టబెట్టేందుకే కేసీఆర్ వేలం నిర్వహించారని  చెప్పారు. పారిశ్రామికవేత్త రామేశ్వరరావు కుమారులకు భూములు కట్టబెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రామేశ్వరరావు కంపెనీలకు కేసీఆర్‌ వందలకోట్ల లబ్ధిచేకూర్చారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేతల కుటుంబాల వారే భూములు కొన్నారని, కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని తెలిపారు. వేలంలో పాల్గొనవద్దని కొందరిని బెదిరించారని రేవంత్‌రెడ్డి చెప్పారు. సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి కూడా భూములు కొన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వెంకట్రామిరెడ్డికి చెందిన 2 కంపెనీలు తొమ్మిదిన్నర ఎకరాలు కొన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్ల నష్టం వాటిళ్లిందని.. ఐదుగురు కలిసి వెయ్యి కోట్లు కొల్లగొట్టారని తెలిపారు. దేశంలోని ప్రధాన కంపెనీలను టెండర్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.  భూములు అమ్ముకుంటూపోతే భవిష్యత్‌ తరాలకు ఇబ్బంది. 60 కోట్ల కంటే తక్కువ అమ్ముడుపోయిన భూముల వేలం రద్దు చేయాలని , స్విస్ ఛాలెంజ్ పద్దతిలో మళ్లీ టెండర్లు నిర్వహించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.  హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేటలోని అత్యంత ఖరీదైన 49.951 ఎకరాలను వేలం వేసింది. దీని ద్వారా రూ.2 వేల కోట్లను సమకూర్చుకోనుంది. ఎకరం రూ.25 కోట్ల వంతున అప్ సెట్ బిడ్ అమౌంట్ గా నిర్ణయించారు. వేలంలో రూ.31.2 కోట్ల నుంచి రూ.60.2 కోట్ల వరకు పలికింది. రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రెండు ప్లాట్లు(7.755 ఎకరాలు, 1.65 ఎకరాలు), అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ రెండు ప్లాట్లు(7.738 ఎకరాలు, 8.946 ఎకరాలు), హైమా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఒకటి(ఎకరం), మన్నె సత్యనారాయణరెడ్డి ఒక ప్లాటు(7.721 ఎకరాలు), వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ ఒకటి(7.575 ఎకరాలు) వంతున దక్కించుకున్నాయి. ఇవన్నీ తెలంగాణకు సంబంధించనవే. కేవలం ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఒక ప్లాటు(7.564 ఎకరాలు) దక్కించుకున్నది. ఇదొక్కటే ముంబాయి బేస్డ్ కంపెనీ ఈ వేలం పాటలోని కోకాపేట ఎనిమిది ప్లాట్లల్లో ఏడు లోకల్ వారికే దక్కాయి. అందులోనూ మైహోం సంస్థకు సంబంధించిన కంపెనీలే రెండు ఉన్నట్లు తెలుస్తోంది. అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆఫీసు చిరునామా మాదాపూర్‌లోని మై హోం హబ్‌లోనే ఉంది. దానికి డైరెక్టర్లుగా శ్రీనివాసరావు అరవపల్లి, వినోద్ జూపల్లి, శ్యాంరావు జూపల్లి ఉన్నారు. అలాగే హైమా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆఫీసు కూడా మాదాపూర్‌లోని మైహోం హబ్‌లోనే ఉంది. డైరెక్టర్లుగా శ్రీనివాసరావు అరవపల్లి, శ్యాంరావు జూపల్లి, వినోద్ జూపల్లి ఉన్నారు.