కాంగ్రెస్’ కు కమల్ సారధ్యం ?
posted on Jul 16, 2021 @ 12:33PM
కాంగ్రెస్ పార్టీలో కదలిక వచ్చింది. పూర్వ వైభవ స్థితి దిశగా అడుగులు పడుతున్నాయి. వచ్చే సంవత్సరం జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా, 2024 లోక్ సభ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు ప్రశాంత్ కిశోర్ రచించిన కొత్త వ్యూహంతో హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. వరస ఓటములు, నాయకత్వ సంక్షోభం నుంచి బయట పడేందుకు కొత్త ఎత్తులతో ముందుకు సాగుతోంది.
గత లోక్ సభ ఎన్నిక ఓటమి తర్వాత, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకు, అధ్యక్ష పీఠం ఖాళీగా వుంది. సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.అయితే, వయసు,ఆరోగ్యం సహకరించక పోవడంతో ఆమె పార్టీ అధ్యక్ష బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేక పోతున్నారు. ఈ సంవత్సరం (2021) ఆరంభంలో జరిగిన జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఏ ఒక్క రాష్ట్రంలోనూ ప్రచారంలో పాల్గొనలేదు.రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఇద్దరే ప్రచార బాధ్యలు స్వీకరించారు.
మరో వంక, సంవత్సరాల తరబడి పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేక పోవడంతో పార్టీ ఇంటా బయట కూడా విమర్శలు, అవమానాలు ఎదుర్కుంటోంది. ఓ వంక పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి,పూర్తి స్థాయి అధ్యక్షుని ఎన్నుకోవాలని, పార్టీ సీనియర్ నాయకులు (జీ 23) సంవత్సరం పైగా డిమాండ్ చేస్తున్నారు. మరో వంక ప్రత్యర్ధి పార్టీలు, అధ్యక్షుడు లేని పార్టీ అంటూ అవహేళన చేస్తున్నాయి. అలాగే, నాయకత్వ లేమితో, పార్టీ నాయకులు, కార్యకర్తలలో నైతిక స్థైర్యం కొంత క్షీణించింది. మరో వంక వరస ఓటములతో పార్టీ కుదేలై పోయింది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రల శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేక పోయింది. అందివచ్చిన అవకాశాలను సైతం జారవిడుచుకుంది.
ఈ నేపద్యంలో, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు, సోనియా గాంధీ పార్టీలో సంస్థాగత మార్పులు అవసరమని గుర్తించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు సహా సంస్థాగతంగా తీసుకోవలసిన చర్యలపై దృష్టిని కేంద్రీకరించారు.అయితే కరోనా కారణంగా అందుకు పరిస్థితులు అనుకూలించక పోవడంతో, పార్టీ పక్షాళన ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. అధ్యక్ష ఎన్నిక ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది.
ఈ పరిస్థితిలో మరో ఆరేడు నెలలలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, సోనియా గాంధీ పార్టీ నాయకత్వంలో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.పార్టీ సీనియర్ నాయకుడు, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్’కు పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే, ఆయనకు అధ్యక్ష పదివిని ఇస్తారా లేక వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించి, సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారా, అనే విషయంలో ఇంకా కొంత క్లారిటీ రావలసి ఉందని అంటున్నారు.
ఇదిలా ఉండగా, కమల్‌నాథ్ గురువారం (జులై`15) సోనియా గాంధీతో సమావేసమయ్యారు.దీంతో తొమ్మిది సార్లు పార్లమెంట్ సభ్యునిగా, పలు మార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవమున్న కమల్ నాథ్ రాగల రోజుల్లో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించడం ఖామని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, కాంగ్రెస్ పార్టీ పునర్జీవనానికి కమల్‌నాథ్ సరైన ఎంపిక అవుతారని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. ఏకంగా తొమ్మిది సార్లు పార్లమెంట్ సభ్యునిగా, అనేక సంవత్సరాలపాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయనకు ఢిల్లీ (జాతీయ)రాజకీయలు కొట్టిన పిండి. అంతే కాకుండా ఆయనకు, అన్నిరాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో పార్టీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ మంచి పరిచయాలున్నాయి. అదే విధంగా, జతీయ స్థాయిలో చక్రం తిప్పగల ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకుల అందరితోనూ కమల్‌నాథ్ కు సన్నిహిత సంబంధాలు, పరిచయాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో పీకే పళన ప్రకారం పార్లమెంట్ లోపల వెలుపలా బీజేపే వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే సామర్ధ్యం ఆయనకు మాత్రమే ఉందని సోనియా గాంధీ భావిస్తునట్లు సమాచారం.
ఇదలా ఉంటే, కొద్దిరోజుల క్రితం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాతో జరిపిన చర్చల్లో రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటుగా పంజాబ్’ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్టీ పునర్జీవన దీర్ఘకాల ప్రణాళిక గురించి కూడా చర్చించారని పార్టీ వర్గాల సమాచారం. ఈ దీర్ఘ కాలిక ప్రణాళికలో భాగంగానే కమల్‌నాథ్’ కు కాంగ్రెస్ బాధ్యలు అప్పగించాలనే నిర్ణయం జరిగిందని తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే కాంగ్రెస్’ కొత్త అధ్యక్షుని నియామకం ఉంటుందని అంటున్నారు. నిజానికి కమల్‌నాథ్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలన్న నిర్ణయాన్ని కొన్ని రోజుల క్రితమే తీసుకున్నట్టు సమాచారం. అయితే, కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడింది’ అన్నట్లు కొత్త సమస్యలు తలెత్తకుండా సోనియా గాంధీ, ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు ఆచితూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు.